అన్వేషించండి › అంశాలు › హత్యలు
ఆశ్చర్యకరమైన వివరాలు
బైబిల్లో హత్యలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 23 భాగాలు, వాక్యం వాక్యంగా.
- చాటుగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడుద్వితీ 27:24
వచనాలు
ద్వితీ 27:24“రహస్యంగా తన పొరుగువాణ్ణి చంపేవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్” అనాలి.
- ఇష్బోషెతును చంపినవారికి దావీదు మరణశిక్ష వేయించాడు2 సమూ 4:9–12
వచనాలు
2 సమూ 4:9–12అప్పుడు దావీదు బెయేరోతీ నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో ఇలా చెప్పాడు, “మంచి కబురు తెస్తున్నానని భావించి ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు. వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచి పెట్టకుండా ఉంటానా? అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను” అని చెప్పి, దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరినీ చంపి వారి చేతులు, కాళ్లను నరికివేసి, వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.
ఉదాహరణలు
- ఏహూదు దాచిపెట్టిన కత్తితో మోయాబు రాజైన ఎగ్లోనును చంపాడున్యాయా 3:15–22
వచనాలు
న్యాయా 3:15–22ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టినప్పుడు బెన్యామీనీయుడైన గెరా కొడుకు ఏహూదు అనే న్యాయాధిపతిని వాళ్ళ కోసం యెహోవా నియమించాడు. అతడు ఎడమచేతి వాటం గలవాడు. అతని చేత ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పం పంపినప్పుడు ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల కత్తిని చేయించుకుని, తన వస్త్రంలో తన కుడి తొడమీద దాన్ని కట్టుకుని, ఆ కప్పం మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరికి తెచ్చాడు. ఈ ఎగ్లోను చాలా లావుగా ఉండే వాడు. ఏహూదు ఆ కప్పం తెచ్చి ఇచ్చిన తరువాత కప్పం మోసిన మనుషులను పంపివేసి గిల్గాలు దగ్గర ఉన్న పెసీలీము దగ్గర నుంచి తిరిగి వచ్చి “రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పాలి” అన్నాడు. అప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న వాళ్ళందరూ బయటకు వెళ్ళే వరకూ మాట్లాడవద్దని చెప్పాడు. ఏహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఏహూదు “నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉంది” అని చెప్పగా, రాజు తన సింహాసనం మీద నుంచి లేచాడు. అప్పుడు ఏహూదు తన ఎడమచేతిని చాపి తన కుడి తొడమీదనుంచి కత్తి తీసి అతడి కడుపులో బలంగా పొడిచాడు. ఆ కత్తితో పాటు దాని పిడి కూడా అతని కడుపులోకి దిగి పోయింది. ఆ కత్తి అతని వెనుకనుంచి బయటకు వచ్చింది. అతని క్రొవ్వు ఆ కత్తిని కప్పేసిన కారణంగా ఏహూదు ఆ కత్తిని అతని శరీరంలోనుంచి బయటకు తీయలేదు.
- అబీమెలెకు ఒకే రాతి మీద తన సోదరులను హత్య చేశాడు; యోతాము దాక్కున్నాడున్యాయా 9:5
వచనాలు
న్యాయా 9:5తరువాత అతడు ఒఫ్రాలో ఉన్న తన తండ్రి యింటికి వెళ్లి యెరుబ్బయలు కొడుకులు, తన సహోదరులు అయిన ఆ డెబ్భై మందిని ఒక్క బండ మీద చంపాడు. యెరుబ్బయలు చిన్న కొడుకు యోతాము మాత్రమే దాక్కుని తప్పించుకున్నాడు.
- యోవాబు హెబ్రోను ద్వారం దగ్గర అబ్నేరును పొడిచాడు2 సమూ 3:27
వచనాలు
2 సమూ 3:27అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు యోవాబు “విషయాలు ఎవరికీ వినబడకుండా రహస్యంగా మాట్లాడాలి” అని చెప్పి అతణ్ణి ద్వారం దగ్గరికి ఏకాంతంగా తీసుకు వచ్చాడు. అక్కడ తన సోదరుడు అశాహేలు ప్రాణం తీసినందుకు ప్రతీకారంగా అబ్నేరును కడుపులో పొడిచి చంపేశాడు.
- రేకాబు, బయనా మధ్యాహ్నం మంచం మీద ఉన్న ఇష్బోషెతును చంపారు2 సమూ 4:5–8
వచనాలు
2 సమూ 4:5–8రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు. గోదుమలు తీసుకువచ్చేవారి వేషం వేసుకుని ఇంట్లోకి వెళ్లి, ఇష్బోషెతు పడక గదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతణ్ణి కడుపులో పొడిచి చంపివేసి, అతని తల నరికి దాన్ని తీసుకుని తప్పించుకుని పారిపోయారు. రాత్రి అంతా ఎడారి గుండా పరుగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తల తీసుకువచ్చారు. వారు “దయచేసి విను. నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇష్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని, రాజువైన నీ తరపున సౌలుకు, అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు” అని చెప్పారు.
- అమ్నోను ద్రాక్షారసంతో సంతోషంగా ఉన్నప్పుడు అబ్షాలోము మనుషులు అతణ్ణి చంపారు2 సమూ 13:28–29
వచనాలు
2 సమూ 13:28–29ఈలోగా అబ్షాలోము తన పనివాళ్ళను పిలిచి “నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అమ్నోను బాగా ద్రాక్షారసం తాగి మత్తెక్కి ఉన్న సమయంలో అతణ్ణి చంపమని నేను మీకు చెప్పినప్పుడు మీరు భయపడకుండా అతణ్ణి చంపివేయండి. ధైర్యం తెచ్చుకుని పౌరుషం చూపించండి” అని చెప్పాడు. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు అమ్నోనును చంపేశారు. రాజకుమారులంతా భయపడి లేచి తమ కంచరగాడిదెలు ఎక్కి పారిపోయారు.
- యోవాబు అమాశా గడ్డం పట్టుకుని అతణ్ణి పొడిచాడు2 సమూ 20:9–10
వచనాలు
2 సమూ 20:9–10అప్పుడు యోవాబు అమాశాను చూసి “నా సోదరా, క్షేమంగా ఉన్నావా?” అని అడుగుతూ, అమాశాను ముద్దు పెట్టుకొంటున్నట్టు తన కుడి చేత్తో అతని గడ్డం పట్టుకున్నాడు. యోవాబు చేతిలో ఉన్న కత్తిని అమాశా చూడలేదు కనుక తనను కాపాడుకోలేక పోయాడు. యోవాబు కత్తి తీసి అతని కడుపులో బలంగా పొడిచాడు. కత్తి కడుపులో దిగిన వెంటనే అతని పేగులు జారి నేలపై పడడంతో ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. తరువాత యోవాబు, అతని సోదరుడు అబీషైలు బిక్రి కొడుకు షెబను తరమడానికి వెళ్ళిపోయారు.
- బయెషా గిబ్బెతోను దగ్గర రాజైన నాదాబును చంపాడు1 రాజులు 15:27–28
వచనాలు
1 రాజులు 15:27–28ఇశ్శాఖారు గోత్రీకుడూ అహీయా కొడుకు బయెషా నాదాబుపై కుట్ర చేశాడు. నాదాబు, ఇశ్రాయేలు వారంతా ఫిలిష్తీయులకు చెందిన గిబ్బెతోనును ముట్టడిస్తూ ఉన్న సమయంలో గిబ్బెతోనులో బయెషా అతన్ని చంపాడు. రాజైన ఆసా పాలన మూడో ఏట బయెషా అతన్ని చంపి అతనికి బదులు రాజయ్యాడు.
- రాజైన ఏలా మత్తులో ఉన్నప్పుడు జిమ్రీ అతణ్ణి చంపాడు1 రాజులు 16:9–10
వచనాలు
1 రాజులు 16:9–10తిర్సాలో తన కార్యనిర్వాహకుడు అర్సా ఇంట్లో అతడు తాగి మత్తులో ఉన్నప్పుడు యుద్ధ రథాల సగభాగం మీద అధికారి జిమ్రీ అతని మీద కుట్ర పన్ని లోపలికి వెళ్లి అతన్ని కొట్టి చంపి, అతనికి బదులు రాజయ్యాడు. ఇది యూదారాజు ఆసా పాలనలో 27 వ ఏట జరిగింది.
- యెహూ రాజైన యెహోరామును భుజాల మధ్య బాణంతో కొట్టాడు2 రాజులు 9:24
వచనాలు
2 రాజులు 9:24అప్పుడు యెహూ బాణం తీసి తన శక్తి కొద్దీ ఎక్కుపెట్టి యెహోరాము భుజాల మధ్య గురి చూసి కొట్టాడు. ఆ బాణం అతని గుండెల్లోకి దూసుకు వెళ్ళింది. అతడు తన రథంలోనే కుప్పగూలిపోయాడు.
- యెహూ మనుషులు యూదా రాజైన అహజ్యాను అతని రథంలో బాణంతో కొట్టారు2 రాజులు 9:27
వచనాలు
2 రాజులు 9:27జరిగిందంతా చూసిన యూదా రాజు అహజ్యా బేత్ హగ్గాన్ పట్టణం దారిలో తన రథం పై పారిపోయాడు. కానీ యెహూ అతణ్ణి తరిమాడు. “ఆ రథంలోనే అతణ్ణి చంపండి” అంటూ తన సేనానులకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి వారు ఇబ్లెయాముకు సమీపంలో ఉన్న గూరుకు వెళ్ళే దారిలో అతనిపై బాణాలు వేసి కొట్టారు. అహజ్యా తన రథంలోనే మెగిద్దోకు వెళ్ళి అక్కడ చనిపోయాడు.
- యోవాషును అతని సేవకులు బెత్ మిల్లో దగ్గర చంపారు2 రాజులు 12:20–21
వచనాలు
2 రాజులు 12:20–21అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లాకు దిగి వెళ్ళే దారిలో మిల్లో అని పేరున్న అంతఃపురంలో యోవాషును చంపారు. షిమాతు కొడుకు యోజాకారు షోమేరు కొడుకు యెహోజాబాదు అనే అతని సేవకులు అతనిపై దాడి చేయగా అతడు మరణించాడు. ప్రజలు దావీదు పురంలో అతని పూర్వీకుల సమాధిలో అతణ్ణి పాతిపెట్టారు. అతని కుమారుడు అమజ్యా అతని స్థానంలో రాజయ్యాడు.
- కుట్రదారులు అమజ్యాను లాకీషు వరకు వెంటాడి చంపారు2 రాజులు 14:19
వచనాలు
2 రాజులు 14:19ప్రజలు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని, వారు అతనివెంట కొందరిని లాకీషుకు పంపారు.
- ఇశ్రాయేలులో షల్లూము, మెనహేము, పెకహు, హోషేయ ఒక్కొక్కరూ ఒక రాజును చంపారు2 రాజులు 15:10, 2 రాజులు 15:14, 2 రాజులు 15:25, 2 రాజులు 15:30
వచనాలు
2 రాజులు 15:10యాబేషు కొడుకు షల్లూము అతని మీద కుట్రచేసి, ప్రజలు చూస్తూ ఉండగా అతని మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
2 రాజులు 15:14గాదీ కొడుకు మెనహేము తిర్సాలో నుంచి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో ఉండే యాబేషు కొడుకు షల్లూము మీద దాడి చేసి అతన్ని చంపి అతని స్థానంలో రాజయ్యాడు.
2 రాజులు 15:25ఇతని కింద ఉన్న అధిపతీ రెమల్యా కొడుకూ అయిన పెకహు కుట్ర చేసి, తన దగ్గరున్న 50 మంది గిలాదు వారితోనూ, అర్గోబుతోనూ, అరీహేనుతోనూ చేతులు కలిపి షోమ్రోనులో ఉన్న రాజ నగరులోని అంతఃపురంలో పెకహ్యాను చంపి, అతని స్థానంలో రాజయ్యాడు.
2 రాజులు 15:30అప్పుడు ఇశ్రాయేలు రాజు, రెమల్యా కొడుకు అయిన పెకహు మీద ఏలా కొడుకు హోషేయ కుట్ర చేసి, అతనిపై దాడి చేసి చంపి అతని స్థానంలో తాను రాజయ్యాడు. ఇది యూదా రాజు ఉజ్జియా కొడుకు యోతాము పరిపాలనలో 20 వ సంవత్సరంలో జరిగింది.
- రాజైన ఆమోనును అతని సేవకులు అతని రాజభవనంలో చంపారు2 రాజులు 21:23
వచనాలు
2 రాజులు 21:23ఆమోను సేవకులు అతని మీద కుట్రచేసి అతన్ని రాజనగరులో చంపారు.
- సన్హెరీబు పూజ చేస్తుండగా అతని కుమారులు అతణ్ణి చంపారు2 రాజులు 19:37, యెష 37:38
వచనాలు
2 రాజులు 19:37అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.
యెష 37:38ఆ తరవాత అతడు నిస్రోకు అనే తన దేవత మందిరంలో పూజలు చేస్తూ ఉన్నప్పుడు అద్రమ్మెలెకు, షెరెజెరు అనే అతని కొడుకులు అతణ్ణి కత్తితో చంపి అరారాతు దేశంలోకి పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతనికి బదులుగా రాజయ్యాడు.
- నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు గెదల్యాను చంపాడు2 రాజులు 25:25
వచనాలు
2 రాజులు 25:25అయితే ఏడో నెలలో రాజ కుటుంబానికి చెందిన ఎలీషామాకు పుట్టిన నెతన్యా కొడుకు ఇష్మాయేలు పదిమంది మనుషులను పిలుచుకొచ్చి గెదల్యా మీద దాడి చేసినప్పుడు అతడు చనిపోయాడు. ఇంకా మిస్పాలో అతని దగ్గరున్న యూదులనూ, కల్దీయులనూ, అతడు హతం చేశాడు.
- అహష్వేరోషును చంపడానికి ఇద్దరు నపుంసకులు పన్నిన కుట్రను మొర్దెకై బయటపెట్టాడుఎస్తే 2:21–23
వచనాలు
ఎస్తే 2:21–23ఆ రోజుల్లో మొర్దెకై రాజ భవన ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో రాజుగారి కొలువులో ఉన్న ఇద్దరు నపుంసకులు బిగ్తాను, తెరెషు అనే ద్వారపాలకులు అహష్వేరోషు రాజుపై కోపంతో అతనిని చంపాలని కుట్ర పన్నారు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసి అతడు దాన్ని ఎస్తేరురాణితో చెప్పాడు. ఎస్తేరు మొర్దెకై పేరున దాన్ని రాజుకు తెలియజేసింది. ఈ సంగతిని గూర్చి విచారణ జరిపినప్పుడు అది నిజమని తేలింది. అందువల్ల వారిద్దరినీ ఒక చెట్టుకు ఉరి తీశారు. రాజు సమక్షంలో ఈ వివరం రాజ్య వృత్తాంత గ్రంథంలో రాశారు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు