అన్వేషించండి › అంశాలు › అప్పులు, రుణాలు
దైనందిన జీవితం
బైబిల్లో అప్పులు, రుణాలు
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 28 భాగాలు, వాక్యం వాక్యంగా.
- ఒకరినొకరు ప్రేమించడం తప్ప ఎవరికీ ఏమీ బాకీ ఉండవద్దురోమా 13:8
వచనాలు
రోమా 13:8ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.
- అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చినవానికి దాసుడుసామె 22:7
వచనాలు
సామె 22:7ఐశ్వర్యవంతుడు పేదలపై పెత్తనం చేస్తాడు. అప్పుచేసిన వాడు అప్పిచ్చిన వాడికి బానిస.
- అప్పులకు జామీను ఉండవద్దు, లేకపోతే నీ మంచం కూడా పోవచ్చుసామె 22:26–27, సామె 11:15
వచనాలు
సామె 22:26–27అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు. ఆ అప్పు తీర్చడానికి నీ దగ్గర ఏమీ లేకపోతే వాడు నువ్వు పడుకునే పరుపు తీసుకు పోకుండా ఆపడం ఎలా?
సామె 11:15పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు.
- పొరుగువాని కోసం జామీను ఉన్నావా? వెంటనే వెళ్ళి విడిపించుకోసామె 6:1–5
వచనాలు
సామె 6:1–5కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు, నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు. కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో. నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో. వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.
ధర్మశాస్త్రంలో
- పేదవాడైన స్వదేశీయుని దగ్గర వడ్డీ తీసుకోకూడదు; విదేశీయుని దగ్గర తీసుకోవచ్చునిర్గ 22:25, ద్వితీ 23:19–20
వచనాలు
నిర్గ 22:25నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
ద్వితీ 23:19–20మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు. పరదేశులకు వడ్డీకి అప్పు ఇవ్వవచ్చు. మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో మీ ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా నీ తోటి ఇశ్రాయేలు ప్రజలకు దేనినీ వడ్డీకి ఇవ్వకూడదు.
- తాకట్టుగా తీసుకున్న పైవస్త్రాన్ని సూర్యాస్తమయానికి తిరిగి ఇవ్వాలినిర్గ 22:26–27, ద్వితీ 24:12–13
వచనాలు
నిర్గ 22:26–27మీరు ఒకవేళ ఎప్పుడైనా మీ పొరుగువాడి దుస్తులు తాకట్టు పెట్టుకుంటే సూర్యుడు అస్తమించే సమయానికి వాటిని వాళ్లకు తిరిగి అప్పగించాలి. వాళ్ళు ఏమి కప్పుకుని పండుకుంటారు? వాళ్ళ దేహాలు కప్పుకొనే దుస్తులు అవే కదా. వాళ్ళు నాకు మొర పెట్టినప్పుడు నేను వింటాను. నేను దయగల వాణ్ణి.
ద్వితీ 24:12–13అతడు పేదవాడైన పక్షంలో నువ్వు అతని తాకట్టు వస్తువు నీదగ్గరే ఉంచుకుని నిద్రపోకూడదు. అతడు తన దుప్పటి కప్పుకుని నిద్రబోయేముందు నిన్ను దీవించేలా సూర్యాస్తమయంలోగా తప్పకుండా ఆ తాకట్టు వస్తువును అతనికి తిరిగి అప్పగించాలి. అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది.
- తాకట్టు వస్తువు బయటికి తెచ్చే వరకు అప్పిచ్చినవాడు బయటే కనిపెట్టాలిద్వితీ 24:10–11
వచనాలు
ద్వితీ 24:10–11మీ పొరుగువాడికి ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు అతని దగ్గర తాకట్టు వస్తువు తీసుకొనేందుకు అతని ఇంటి లోపలికి వెళ్లకూడదు. ఇంటి బయటే నిలబడాలి. అప్పు తీసుకునేవాడు బయట నిలబడి ఉన్న నీ దగ్గరికి ఆ తాకట్టు వస్తువు తీసుకు వస్తాడు.
- తిరగలి రాళ్ళను తాకట్టుగా తీసుకోకూడదుద్వితీ 24:6
వచనాలు
ద్వితీ 24:6తిరగలిని, తిరగటి పైరాతిని తాకట్టు పెట్టకూడదు. అలా చేస్తే ఒకడి జీవనాధారాన్ని తాకట్టు పెట్టినట్టే.
- ప్రతి ఏడో సంవత్సరం అప్పులు రద్దవుతాయిద్వితీ 15:1–3
వచనాలు
ద్వితీ 15:1–3ప్రతి ఏడవ సంవత్సరం అంతంలో అప్పులన్నీ రద్దు చేయాలి. అది ఎలాగంటే, తన పొరుగువాడికి అప్పు ఇచ్చిన ప్రతివాడూ దాన్ని రద్దు చేసి వారిని విడిచిపెట్టాలి. అది యెహోవా ప్రకటించిన గడువు కాబట్టి అప్పు ఇచ్చినవాడు తన పొరుగువాడిపై లేక తన సోదరునిపై ఒత్తిడి తేకూడదు. ఇశ్రాయేలీయుడు కాని వ్యక్తి పై ఒత్తిడి తేవచ్చు గాని మీ సోదరుని దగ్గర ఉన్న మీ సొమ్మును విడిచిపెట్టాలి.
- తనను తాను అమ్ముకున్న స్వదేశీయుడు కూలివానిలా పనిచేస్తాడులేవీ 25:39–41
వచనాలు
లేవీ 25:39–41నీ స్వజాతి వాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడిచేత బానిసలా ఊడిగం చేయించుకో కూడదు. వాడు సేవకునిలాగా పరదేశిలాగా నీ దగ్గర ఉండి సునాద సంవత్సరం వరకూ నీ దగ్గర సేవకుడుగా పని చేస్తాడు. అప్పుడతడు తన పూర్వీకుల ఆస్తిని మళ్లీ అనుభవించేలా తన పిల్లలతో సహా నీ దగ్గర నుండి బయలు దేరి తన వంశం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి.
- అరువు తెచ్చిన జంతువు చనిపోతే పూర్తిగా చెల్లించాలినిర్గ 22:14
వచనాలు
నిర్గ 22:14ఒక వ్యక్తి తన పొరుగువాని దగ్గర ఏదైనా బదులు తీసుకుంటే, దాని యజమాని దాని దగ్గర లేనప్పుడు దానికి హాని కలిగినా, లేదా అది చనిపోయినా ఆ నష్టాన్ని తప్పకుండా పూరించాలి.
ఉదాహరణలు
- యూదా తన ముద్ర, దారం, కర్రను తాకట్టుగా ఇస్తాడుఆది 38:17–18
వచనాలు
ఆది 38:17–18అందుకు అతడు “నా మందలో నుండి ఒక మేక పిల్లను పంపుతాను” అన్నాడు. ఆమె “అది పంపే వరకూ ఏమైనా తాకట్టు పెడితే సరే” అని అంది. అతడు “ఏమి తాకట్టు పెట్టమంటావ్?” అని ఆమెను అడిగాడు. ఆమె “నీ ముద్ర, దాని దారం, నీ చేతికర్ర” అని చెప్పింది. అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో వెళ్ళాడు. ఆమె అతని వలన గర్భవతి అయ్యింది.
- అప్పుల్లో ఉన్నవారంతా దావీదు దగ్గర చేరతారు1 సమూ 22:2
వచనాలు
1 సమూ 22:2ఇబ్బందుల్లో ఉన్నవారు, అప్పుల పాలైన వాళ్ళు, అసంతృప్తిగా ఉన్నవాళ్ళంతా అతని దగ్గరికి వచ్చి చేరారు. అతడు వారికి నాయకుడయ్యాడు. అతని దగ్గర దాదాపు 400 మంది చేరారు.
- అప్పులవాడు ఒక వితంతువు ఇద్దరు కుమారులను బానిసలుగా తీసుకువెళ్ళడానికి వస్తాడు2 రాజులు 4:1–7
వచనాలు
2 రాజులు 4:1–7ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు” అని చెప్పింది. దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది. అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు. ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది. అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.
- “అది అరువు తెచ్చిన గొడ్డలి” — గొడ్డలి యొర్దానులో పడిపోతుంది2 రాజులు 6:4–6
వచనాలు
2 రాజులు 6:4–6కాబట్టి అతడు వాళ్ళతో వెళ్ళాడు. అందరూ యొర్దానుకి వెళ్ళి చెట్లు నరకడం ప్రారంభించారు. ఒకడు కొమ్మ కొడుతున్నప్పుడు వాడి గొడ్డలి ఊడి కింద నీళ్ళలో పడిపోయింది. వాడు “అయ్యో, నా ప్రభూ, అది అరువు తెచ్చిన గొడ్డలి” అంటూ కేకలు పెట్టాడు. అప్పుడు దేవుని మనిషి “అదెక్కడ పడింది?” అని అడిగాడు. వాడు అతనికి అది పడిన ప్రాంతం చూపించాడు. అప్పుడతడు ఒక చిన్న కొమ్మని కొట్టి దాన్ని నీళ్ళలో వేశాడు. అప్పుడు ఆ ఇనుప గొడ్డలి నీళ్ళలో తేలి పైకి వచ్చింది.
- కరువు: ప్రజలు పొలాలనూ ఇళ్ళనూ తాకట్టు పెడతారు; నెహెమ్యా వడ్డీని ఆపిస్తాడునెహె 5:3–5, నెహె 5:10–12
వచనాలు
నెహె 5:3–5మరి కొంతమంది “కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను, మా ఇళ్ళను తాకట్టు పెట్టాం, కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి” అన్నారు. మరికొందరు “రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను, ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాం. మా కొడుకులను, కూతుళ్ళను బానిసలుగా పంపించ వలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటివారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు, ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు” అని చెప్పారు.
నెహె 5:10–12నేనూ నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం. ఈ రోజే వాళ్ళ దగ్గరనుండి మీరు ఆక్రమించుకొన్న భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చెయ్యాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి.” అప్పుడు వాళ్ళు “నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం” అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళచేత ప్రమాణం చేయించాను.
- అప్పు కోసం ఒక పేద కుటుంబపు చంటిబిడ్డను లాక్కుంటారుయోబు 24:9
వచనాలు
యోబు 24:9తండ్రి లేని పిల్లను తల్లి రొమ్ము నుండి లాగేసే వారు ఉన్నారు. వారు దరిద్రుల దగ్గర తాకట్టు పుచ్చుకుంటారు.
- తాకట్టుగా తీసుకున్న బట్టలుయోబు 22:6, ఆమో 2:8
- ఉపమానం: పదివేల తలాంతులు బాకీ ఉన్న సేవకుడుమత్తయి 18:23–34
వచనాలు
మత్తయి 18:23–34కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది. అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు. ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్నదంతా అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు. అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, ‘రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేశాడు. అయితే ఆ పనివాడు బయటికి వెళ్ళి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి ‘నా బాకీ తీర్చు’ అని అతని గొంతు పట్టుకున్నాడు. అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, ‘కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను’ అని వేడుకున్నాడు. కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకూ అతణ్ణి ఖైదులో పెట్టించాడు. “అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు. అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, ‘నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేశానే! నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోటి పనివాణ్ణి క్షమించాలి కదా’ అని చెప్పి అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
- ఉపమానం: ఐదు వందల, యాభై దేనారాలు బాకీ ఉన్న ఇద్దరులూకా 7:41–42
వచనాలు
లూకా 7:41–42అప్పుడు యేసు, “అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు. ఆ అప్పు తీర్చడానికి వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వారిద్దరినీ క్షమించేశాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?” అని అడిగాడు.
- న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే నీ ప్రత్యర్థితో రాజీపడుమత్తయి 5:25–26
వచనాలు
మత్తయి 5:25–26నీపై నేరం ఆరోపించేవాడితో న్యాయస్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీపడు. లేకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాల్లో వేయిస్తాడేమో. చెల్లించాల్సి ఉన్నదంతా చెల్లించే వరకూ నీవు అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.
- తిరిగి ఏమీ ఆశించకుండా అప్పు ఇవ్వండిలూకా 6:34–35
వచనాలు
లూకా 6:34–35మీ అప్పు తిరిగి తీరుస్తారు అనుకున్న వారికే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మళ్లీ వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా. మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానంగా ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడుగా ఉన్నాడు.
- ఫిలేమోనుతో పౌలు: “దాన్ని నా లెక్కలో వెయ్యి… ఆ బాకీ నేనే తీరుస్తాను”ఫిలే 1:18–19
వచనాలు
ఫిలే 1:18–19ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దాన్ని నా లెక్కలో వెయ్యి. పౌలు అనే నేను నా స్వదస్తూరీతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ నేనే తీరుస్తాను. అయినా అసలు నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ పడి ఉన్నావని నేను ప్రస్తావించడం లేదు.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు