అన్వేషించండి › అంశాలు › ఆతిథ్యం
దైనందిన జీవితం
బైబిల్లో ఆతిథ్యం
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 45 భాగాలు, వాక్యం వాక్యంగా.
- పరదేశిని ప్రేమించండి, ఎందుకంటే మీరు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారునిర్గ 22:21, నిర్గ 23:9, లేవీ 19:33–34, ద్వితీ 10:19
వచనాలు
నిర్గ 22:21పరాయి దేశస్థులను పీడించకూడదు. మీరు ఐగుప్తు దేశంలో పరాయివాళ్ళుగా ఉన్నారు గదా.
నిర్గ 23:9విదేశీయులను ఇబ్బందుల పాలు చేయకూడదు. మీరు ఐగుప్తు దేశంలో విదేశీయులుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు.
లేవీ 19:33–34మీ దేశంలో పరదేశి ఎవరైనా మీ మధ్య నివసించేటప్పుడు అతణ్ణి బాధ పెట్టకూడదు, మీ మధ్య నివసించే పరదేశిని మీలో పుట్టినవాడి లాగానే ఎంచాలి. నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే అతణ్ణి ప్రేమించాలి. ఐగుప్తులో మీరు పరదేశులుగా ఉన్నారు గదా. నేను మీ దేవుడైన యెహోవాను.
ద్వితీ 10:19మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి.
- పేదలనూ ఇల్లు లేనివారినీ మీ ఇంటికి తీసుకురండియెష 58:7
వచనాలు
యెష 58:7ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం. దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.
- మీ విందుకు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలవండిలూకా 14:12–14
వచనాలు
లూకా 14:12–14తరువాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, “నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనూ నీ సోదరులనూ నీ బంధువులనూ ధనికులైన నీ పొరుగువారినీ పిలవకు. ఎందుకంటే నువ్వు వారిని పిలిచావు కాబట్టి వారు నిన్ను తిరిగి పిలవవచ్చు. కాబట్టి ఆ విధంగా వారు నీ రుణం తీర్చుకుంటారు. అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు. నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారి దగ్గరేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది” అని చెప్పాడు.
- ప్రతి ముద్దకూ ఖర్చు లెక్కించే పిసినారి ఆతిథేయుని విషయంలో జాగ్రత్తసామె 23:6–8
వచనాలు
సామె 23:6–8దుష్టుని ఆహారం భుజించ వద్దు. అతడు నీవు తింటున్నదాన్ని అదే పనిగా చూస్తుంటాడు. వాడి రుచిగల పదార్థాలను ఆశించవద్దు. ఇలాంటి వాడు లోలోపల ఖరీదు లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. నీతో “తినండి, తాగండి” అంటూ ఉంటాడు గానీ అది హృదయపూర్వకంగా అనే మాట కాదు. నీవు తిన్న కొద్ది ఆహారాన్ని కూడా కక్కి వేస్తావు. నీవు పలికిన యింపైన మాటలు అనవసరంగా మాట్లాడినట్టు అవుతుంది.
- సణుక్కోకుండా అతిథి సత్కారం చేయండిరోమా 12:13, 1 పేతు 4:9
వచనాలు
రోమా 12:13పవిత్రుల అవసరాల్లో సహాయం చేస్తూ, అతిథులను శ్రద్ధగా ఆదరించండి.
1 పేతు 4:9ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి.
- కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారుహెబ్రీ 13:2
వచనాలు
హెబ్రీ 13:2అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు.
- సంఘ నాయకులు అతిథి సత్కారం చేసేవారై ఉండాలి1 తిమో 3:2, తీతు 1:8
వచనాలు
1 తిమో 3:2కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి.
తీతు 1:8అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు,
- పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి, పాదాలు కడిగినందుకు పేరుపొందిన వితంతువు1 తిమో 5:10
వచనాలు
1 తిమో 5:10ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
ఉదాహరణలు
- మెల్కీసెదెకు అబ్రాముకు రొట్టె, ద్రాక్షారసం తెస్తాడుఆది 14:18
వచనాలు
ఆది 14:18అంతేగాక షాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.
- అబ్రాహాము ముగ్గురు అపరిచితులను ఎదుర్కోవడానికి పరుగెత్తి వారికి భోజనం వడ్డిస్తాడుఆది 18:1–8
వచనాలు
ఆది 18:1–8మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు. “ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి. నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి. మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు. అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు. తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు. తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
- సొదొమలో లోతు ఇద్దరు అతిథులను తన ఇంట్లోకి తీసుకువెళ్తాడుఆది 19:1–3
వచనాలు
ఆది 19:1–3ఆ సాయంత్రం ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరుకున్నారు. ఆ సమయంలో లోతు సొదొమ పట్టణ ప్రధాన ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు. లోతు దేవదూతలను చూడగానే వారిని కలుసుకోవడానికి వారికి ఎదురు వెళ్ళి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. వారితో ఇలా అన్నాడు “నా ప్రభువులారా, దయచేసి మీ దాసుడైన నా ఇంటికి రండి. వచ్చి కాళ్ళు కడుక్కోవాలనీ, ఈ రాత్రి గడపాలనీ వేడుకుంటున్నాను. తిరిగి తెల్లవారే లేచి మీ ప్రయాణం కొనసాగించవచ్చు.” అన్నాడు. అందుకు వాళ్ళు “అలా కాదు. మేము వీధిలోనే ఈ రాత్రి గడుపుతాం.” అన్నారు. కానీ అతడు వాళ్ళను చాలా బలవంతపెట్టాడు. వారు అతనితో కలసి అతని ఇంటికి వెళ్ళారు. అతడు వారికి విందు చేశాడు. అతడు వారి కోసం పొంగని రొట్టెలు కాల్చి ఇచ్చాడు. వారు భోజనం చేశాడు.
- అబ్రాహాముతో అబీమెలెకు: “నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో”ఆది 20:14–15
వచనాలు
ఆది 20:14–15అబీమెలెకు గొర్రెలనూ ఎద్దులనూ దాసులనూ దాసీలనూ రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు. తరువాత అబీమెలెకు “చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకో” అని అబ్రాహాముతో అన్నాడు.
- లాబాను ఇల్లూ ఒంటెలకు స్థలమూ సిద్ధం చేస్తాడుఆది 24:31–33
వచనాలు
ఆది 24:31–33అతణ్ణి చూసి లాబాను ఇలా అన్నాడు. “యెహోవా ఆశీర్వదించిన వాడా. లోపలికి రండి. మీరు బయటే ఎందుకున్నారు? నేను ఇంటినీ, మీ ఒంటెలకు స్థలాన్నీ సిద్ధం చేశాను” అన్నాడు. ఆ వ్యక్తి తన ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఆ ఒంటెల జీను ఊడదీసి వాటికి గడ్డీ మేతా పెట్టాడు. అబ్రాహాము సేవకునికీ అతనితో కూడా వచ్చిన వారికీ కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు ఇచ్చాడు. భోజనం చేయమని అతని ముందు ఆహారం పెట్టారు. కానీ అతడు “నేను చెప్పాల్సిన విషయం ఒకటుంది. అది చెప్పే వరకూ నేను భోజనం చేయను” అన్నాడు. అందుకు “చెప్పండి” అన్నాడు.
- లాబాను యాకోబును ఎదుర్కోవడానికి పరుగెత్తి ఇంటికి తీసుకువెళ్తాడుఆది 29:13–14
వచనాలు
ఆది 29:13–14లాబాను తన సోదరి కుమారుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతణ్ణి ఎదుర్కోడానికి పరుగెత్తుకుని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. యాకోబు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పాడు. అప్పుడు లాబాను “నిజంగా నువ్వు నా ఎముకవీ నా మాంసానివీ” అన్నాడు. యాకోబు నెల రోజులు అతని దగ్గర నివసించిన తరువాత,
- ఇస్సాకు అబీమెలెకుకూ అతని మనుషులకూ విందు చేస్తాడుఆది 26:26–30
వచనాలు
ఆది 26:26–30ఆ సమయంలో గెరారు నుండి అబీమెలెకు తన స్నేహితుడైన ఆహుజ్జతునూ తన సైన్యాధిపతి అయిన ఫీకోలునూ వెంటబెట్టుకుని ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. వారితో ఇస్సాకు “మీరు నామీద కక్ష కట్టి మీ దగ్గరనుండి పంపివేశారు. ఇప్పుడు దేనికోసం నా దగ్గరికి వచ్చారు?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు ఇలా జవాబిచ్చారు. “యెహోవా కచ్చితంగా నీకు తోడుగా ఉండటం మేము స్పష్టంగా చూశాం. కాబట్టి మన మధ్య ఒక నిబంధన ఉండాలని అంటే నీకూ మాకూ మధ్య నిబంధన ఉండాలని కోరుతున్నాం. మేము నీకు ఎలాంటి హానీ చేయలేదు. నీకెలాంటి అపకారం చేయకుండా నిన్ను గౌరవంగా మా మధ్యనుండి పంపించాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా మాకు ఎలాంటి అపకారం చేయకుండా నీతో ఒక శాంతి ఒప్పందం చేసుకోవాలని అనుకున్నాం. నువ్వు నిజంగానే యెహోవా ఆశీర్వాదం పొందావు.” కాబట్టి ఇస్సాకు వాళ్ళకు విందు చేశాడు. వాళ్ళు చక్కగా తిని తాగారు.
- యోసేపు ఐగుప్తులో తన అన్నదమ్ములతో భోజనం చేస్తాడుఆది 43:31–34
వచనాలు
ఆది 43:31–34అతడు తన ముఖం కడుక్కుని బయటికి వచ్చాడు. అతడు తన్ను తాను సముదాయించుకుని “భోజనం వడ్డించండి” అని చెప్పాడు. అతనికీ వారికీ అతనితో భోజనం చేస్తున్న ఐగుప్తీయులకు వేర్వేరుగా వడ్డించారు. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తీయులకు అసహ్యం. పెద్దవాడు మొదలుకుని చిన్నవాడి వరకూ వారు అతని ముందు తమ తమ వయసు ప్రకారం కూర్చున్నారు. వారంతా ఆశ్చర్యపోయారు. అతడు తన దగ్గర నుంచి వారికి పళ్ళేల్లో భోజనం వంతులెత్తి పంపాడు. బెన్యామీను వంతు వారందరి వంతులకంటే అయిదంతలు ఎక్కువగా ఉంది. వారంతా తాగి, యోసేపుతో విందారగించి ఉల్లాసంగా గడిపారు.
- ఫరో యాకోబు కుటుంబానికి దేశంలో శ్రేష్ఠమైన భాగం ఇస్తాడుఆది 45:17–20, ఆది 47:11–12
వచనాలు
ఆది 45:17–20అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు “నీ సోదరులతో ఇలా చెప్పు, ‘మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు. మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు.
ఆది 47:11–12ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే, యోసేపు తన తండ్రికీ తన సోదరులకూ ఐగుప్తు దేశంలో రామెసేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు. యోసేపు తన తండ్రినీ తన సోదరులనూ తన తండ్రి కుటుంబం వారినందరినీ పోషిస్తూ వారి పిల్లల లెక్క ప్రకారం ఆహారమిచ్చి సంరక్షించాడు.
- యిత్రో: “అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి”నిర్గ 2:20
వచనాలు
నిర్గ 2:20అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు.
- రాహాబు ఇద్దరు వేగులవారిని తన మిద్దె మీద దాచిపెడుతుందియెహో 2:1–6
వచనాలు
యెహో 2:1–6నూను కుమారుడు యెహోషువ ఇద్దరు గూఢచారులను పిలిచి “మీరు వెళ్ళి ఆ దేశాన్ని, మరి ముఖ్యంగా యెరికో పట్టణం చూడండి” అని వారితో చెప్పి, షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాడు. వారు వెళ్లి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళి అక్కడ బస చేశారు. దేశాన్ని వేగుచూడటానికి ఇశ్రాయేలీయుల దగ్గర నుండి ఎవరో రాత్రివేళ ఇక్కడికి వచ్చారని యెరికో రాజుకు సమాచారం వచ్చింది. అతడు తన మనుషులను పంపి “నీ దగ్గరికి వచ్చి నీ ఇంట్లో ప్రవేశించిన ఆ మనుషులను బయటికి తీసుకురా, వారు ఈ దేశాన్ని వేగు చూడటానికి వచ్చారు” అని రాహాబుకు కబురు పంపాడు. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తీసుకెళ్ళి దాచిపెట్టి, ఆ వచ్చిన వారితో “మనుషులు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే, వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది. అంతకుముందు ఆమె ఆ ఇద్దరినీ తన మిద్దె మీదికి ఎక్కించి దాని మీద రాశివేసి ఉన్న జనపకట్టల్లో వాళ్ళని దాచి పెట్టింది.
- గిబియాలో ఒక ముసలివాడు ప్రయాణంలో ఉన్న ఒక లేవీయుణ్ణి ఇంట్లో చేర్చుకుంటాడున్యాయా 19:16–21
వచనాలు
న్యాయా 19:16–21అక్కడి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంత్రం ఒక వృద్ధుడు పొలంలో తన పని ముగించుకుని వచ్చాడు. అతడు ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం నుండి వచ్చి గిబియాలో నివసిస్తున్నాడు. ఆ వృద్ధుడు తల ఎత్తి ఆ ఊరి మధ్యలో ప్రయాణమవుతూ కూర్చుని ఉన్న ఆ వ్యక్తిని చూశాడు. “నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుండి వస్తున్నావు?” అని అడిగాడు. అందుకతడు “మేము యూదా ప్రాంతంలోని బేత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల కొండ ప్రాంతం అవతల ఉన్న ఒక మారుమూల ప్రాంతానికి వెళ్తున్నాం. మా సొంత ఊరు అదే. యూదా ప్రాంతం లోని బేత్లెహేముకు వెళ్ళి వస్తున్నాము. ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్తున్నాను. అయితే ఇక్కడ మాకెవరూ ఆతిథ్యం ఇవ్వలేదు మా గాడిదలకు గడ్డీ, దాణా ఉన్నాయి. నాకూ, మీ సేవకురాలైన ఈమెకూ, మీ సేవకులతో సమానుడైన ఈ యువకుడికీ ఆహారం, ద్రాక్షారసం ఉన్నాయి. ఆ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బందీ లేదు.” అన్నాడు. ఆ వృద్ధుడు “మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను అయితే రాత్రి ఇలా వీధిలో గడపకూడదు” అన్నాడు. అలా చెప్పి అతణ్ణి తన ఇంటికి ఆహ్వానించి తీసుకు వెళ్ళాడు. అతని గాడిదల కోసం మేత సిద్ధం చేశాడు. వాళ్ళు కాళ్ళు కడుక్కుని భోజనం చేశారు.
- ఫరో యువకుడైన హదదుకు ఇల్లూ భూమీ ఇస్తాడు1 రాజులు 11:17–19
వచనాలు
1 రాజులు 11:17–19అప్పుడు హదదు చిన్నవాడు. అతడూ అతనితో పాటు అతని తండ్రి సేవకుల్లో కొంతమంది ఎదోమీయులూ ఐగుప్తు దేశానికి పారిపోయారు. వాళ్ళు మిద్యాను దేశం నుండి బయలు దేరి పారాను ప్రాంతానికి వచ్చి, అక్కడినుంచి కొందరిని వెంటబెట్టుకుని ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో అతనికి ఇల్లు, భూమి ఇచ్చి ఆహారం ఏర్పాటు చేశాడు. హదదు ఫరో దృష్టిలో చాలా మెప్పు పొందాడు. ఫరో తన భార్య తహపనేసు సోదరిని అతనికిచ్చి పెళ్లి చేసాడు.
- సారెపతు వితంతువు తన చివరి పిండినీ నూనెనూ ఏలీయాతో పంచుకుంటుంది1 రాజులు 17:10–16
వచనాలు
1 రాజులు 17:10–16కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది. అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
- షూనేము స్త్రీ ఎలీషా కోసం ఒక గది కట్టిస్తుంది2 రాజులు 4:8–10
వచనాలు
2 రాజులు 4:8–10ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి రమ్మని ప్రాధేయపడిన ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు. ఆమె ఒకసారి తన భర్తతో ఇలా అంది. “ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఈ వ్యక్తి పవిత్రుడూ, దేవుని మనిషీ అని నాకు తెలుసు. కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరూ ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అందులో ఉంటాడు.”
- పట్టుబడిన అరాము సైనికులకు ఎలీషా భోజనం పెట్టించి ఇంటికి పంపిస్తాడు2 రాజులు 6:22–23
వచనాలు
2 రాజులు 6:22–23అప్పుడు ఎలీషా “నీవు వాళ్ళని చంపకూడదు. నీ వింటినీ, కత్తినీ ప్రయోగించి బందీలుగా పట్టుకున్న వాళ్ళను ఎలా చంపుతావు? వాళ్లకు రొట్టె, నీళ్ళూ ఇవ్వు. వారు తిని తాగి తమ రాజు దగ్గరికి తిరిగి వెళ్ళిపోతారు” అన్నాడు. కాబట్టి రాజు వాళ్ళ కోసం విందు చేయించి అనేక రకాల భోజన పదార్థాలను తయారు చేయించాడు. వారు తిని తాగిన తరువాత వాళ్ళను తిరిగి తమ రాజు దగ్గరికి పంపించి వేశాడు. ఆ తరువాత సిరియా సైన్యం చాలా కాలం వరకూ ఇశ్రాయేలు దేశంలో అడుగు పెట్టలేదు.
- యోబు: “బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి”యోబు 31:32
వచనాలు
యోబు 31:32(పరదేశి ఎప్పుడూ ఆరుబయట ఉండే పరిస్థితి రాలేదు. బాటసారుల కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉన్నాయి).
- మార్త యేసును ఆహ్వానిస్తుంది; బేతనియలో ఆయన కోసం విందులూకా 10:38, యోహా 12:1–2
వచనాలు
లూకా 10:38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది.
యోహా 12:1–2పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే. అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు.
- ఒక పరిసయ్యుడు యేసును భోజనానికి పిలుస్తాడులూకా 11:37
వచనాలు
లూకా 11:37ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయనను ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజనం వరసలో కూర్చున్నాడు.
- జక్కయ్య సంతోషంతో యేసును ఆహ్వానిస్తాడులూకా 19:5–6
వచనాలు
లూకా 19:5–6యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి, “జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి” అన్నాడు. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకువెళ్ళాడు.
- పేతురు యొప్పేలో చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉంటాడుఅపొ.కా 9:43, అపొ.కా 10:6
వచనాలు
అపొ.కా 9:43పేతురు యొప్పేలో సీమోను అనే చర్మాలు బాగు చేసే వాని దగ్గర చాలా రోజులున్నాడు.
అపొ.కా 10:6అతడు సీమోను అనే ఒక చర్మకారుని దగ్గర ఉన్నాడు. అతని ఇల్లు సముద్రం పక్కనే ఉంది” అని చెప్పాడు.
- పేతురు కొర్నేలి పంపిన మనుషులను అతిథులుగా లోపలికి పిలుస్తాడుఅపొ.కా 10:23
వచనాలు
అపొ.కా 10:23తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు.
- లూదియ పౌలునూ అతని సహచరులనూ తన ఇంట్లో ఉండమని బలవంతం చేస్తుందిఅపొ.కా 16:15
వచనాలు
అపొ.కా 16:15ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది.
- మెలితే: ద్వీపవాసులు మంట వేస్తారు; పొప్లి మూడు రోజులు ఆతిథ్యం ఇస్తాడుఅపొ.కా 28:2, అపొ.కా 28:7
వచనాలు
అపొ.కా 28:2అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన సపర్య అంతా ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు.
అపొ.కా 28:7పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు.
- ఒనేసిఫోరు తరచుగా పౌలుకు సేదదీర్చాడు2 తిమో 1:16
వచనాలు
2 తిమో 1:16ప్రభువు ఒనేసిఫోరు కుటుంబంపై కనికరం చూపు గాక.
- గాయి తనకు తెలియని ప్రయాణికులైన విశ్వాసులను ఆదరిస్తాడు3 యోహా 1:1, 3 యోహా 1:5–8
వచనాలు
3 యోహా 1:1ప్రియమైన గాయికి, పెద్దనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది.
3 యోహా 1:5–8ప్రియ సోదరా, నీవు సోదరుల కోసం అపరిచితుల కోసం చేస్తున్నది నమ్మకంగా చేస్తున్నావు. వారు సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు. వారు దేవుని నామం కోసం వెళ్తున్నారు. యూదేతరుల నుండి వారు ఏమీ తీసుకోవడం లేదు. కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి.
- మాట ఇచ్చినట్టే యెరికోలో రాహాబునూ ఆమె కుటుంబాన్నీ కాపాడతారుయెహో 6:22–25
వచనాలు
యెహో 6:22–25అయితే యెహోషువ “ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణం చేసిన విధంగా ఆమెను, ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తీసుకు రండి” అని ఆ దేశాన్ని వేగు చూసిన ఆ ఇద్దరు మనుషులతో చెప్పాడు. వారు వెళ్ళి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె బంధువులందరిననీ బయటికి తోడుకుని వచ్చారు. వారందరినీ తెచ్చి ఇశ్రాయేలీయుల శిబిరం బయట వారికి నివాసం ఏర్పాటు చేశారు. తరువాత వారు ఆ పట్టణాన్ని, దానిలో ఉన్నవాటన్నిటినీ అగ్నితో కాల్చివేశారు. వెండి, బంగారు, ఇత్తడి పాత్రలు, ఇనపపాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారంలో ఉంచారు. రాహాబు అనే వేశ్య యెరికోను వేగు చూడ్డానికి యెహోషువ పంపిన గూఢచారులను దాచిపెట్టింది కాబట్టి అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటివారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బతకనిచ్చాడు. ఆమె ఇప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలోనే నివసిస్తూ ఉంది.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు