Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › అంశాలు › వితంతువులు

దైనందిన జీవితం

బైబిల్‌లో వితంతువులు

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగులోని 37 భాగాలు, వాక్యం వాక్యంగా.

ధర్మశాస్త్రంలో

  • ఏ వితంతువునూ అనాథనూ బాధపెట్టవద్దునిర్గ 22:22–24
    వచనాలు
    నిర్గ 22:22–24విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు. వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను. నా కోపాగ్ని రగులుకొంటుంది. నా కత్తివేటుతో నిన్ను హతం చేస్తాను. మీ భార్యలు విధవరాళ్ళు అవుతారు. మీ పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు.
  • మిగిలిన పనలు, ఒలీవ పండ్లు, ద్రాక్షలు వితంతువు కోసం విడిచిపెట్టాలిద్వితీ 24:19–21
    వచనాలు
    ద్వితీ 24:19–21మీ పొలంలో మీ పంట కోస్తున్నప్పుడు పొలంలో ఒక పన మర్చిపోతే దాన్ని తెచ్చుకోడానికి మీరు తిరిగి వెనక్కి వెళ్ళకూడదు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే పనులన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీ ఒలీవ పండ్లను ఏరుకునేటప్పుడు మీ వెనక ఉన్న పరిగెను ఏరుకోకూడదు. అవి పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి. మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.
  • ప్రతి మూడో సంవత్సరపు దశమభాగం వితంతువుకూ అనాథకూ పరదేశికీ ఆహారంద్వితీ 14:28–29
    వచనాలు
    ద్వితీ 14:28–29మీ దేవుడు యెహోవా మీరు చేసే పని అంతటిలో మిమ్మల్ని ఆశీర్వదించేలా మూడు సంవత్సరాల కొకసారి, ఆ సంవత్సరం మీకు కలిగిన పంటలో పదో వంతుని బయటికి తెచ్చి మీ ఇంట్లో ఉంచాలి. అప్పుడు మీ మధ్యలో వంతు గాని, స్వాస్థ్యం గాని లేని లేవీయులు, మీ ఇంట్లో ఉన్న పరదేశులు, అనాథలు, విధవరాళ్ళు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుతారు.”
  • పండగల ఆనందంలో వితంతువులు కూడా పాలుపంచుకుంటారుద్వితీ 16:11, ద్వితీ 16:14
    వచనాలు
    ద్వితీ 16:11అప్పుడు మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ పట్టణాల్లో ఉన్న లేవీయులు, మీ మధ్య ఉన్న పరదేశులు, అనాథలు, వితంతువులు మీ యెహోవా దేవుడు తన నామాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేసుకున్న స్థలం లో ఆయన సన్నిధిలో సంతోషించాలి.
    ద్వితీ 16:14ఈ పండగలో మీరు, మీ కొడుకులు, కూతుళ్ళు, దాసదాసీలు, మీ ఆవరణలో నివసించే లేవీయులు, పరదేశులు, అనాథలు, వితంతువులు సంతోషించాలి.
  • వితంతువు పైవస్త్రాన్ని తాకట్టుగా తీసుకోవద్దుద్వితీ 24:17
    వచనాలు
    ద్వితీ 24:17పరదేశులకు గానీ తండ్రి లేనివారికి గానీ అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. విధవరాలి దుస్తులు తాకట్టుగా తీసుకోకూడదు.
  • వితంతువు చేసిన మొక్కుబడి ఆమెకు కట్టుబాటుసంఖ్యా 30:9
    వచనాలు
    సంఖ్యా 30:9వితంతువు గాని విడాకులు ఇచ్చిన స్త్రీ గాని చేసిన మొక్కుబడులు అన్నీ ఆమె మీద నిలిచి ఉంటాయి.
  • సంతానం లేని, భర్త చనిపోయిన యాజకుని కుమార్తె తన తండ్రి బల్ల దగ్గర తినవచ్చులేవీ 22:13
    వచనాలు
    లేవీ 22:13యాజకుని కుమార్తెల్లో వితంతువుగానీ, విడాకులు తీసుకున్నది గానీ పిల్లలు పుట్టక పోవడం వల్ల ఆమె తన బాల్యప్రాయంలో వలె తన తండ్రి యింటికి తిరిగి చేరితే తన తండ్రి ఆహారాన్ని తినవచ్చు. అన్యుడు మాత్రం దాన్ని తినకూడదు.
  • ప్రధాన యాజకుడు వితంతువును పెళ్ళి చేసుకోకూడదులేవీ 21:14
    వచనాలు
    లేవీ 21:14వితంతువును గానీ విడాకులు తీసుకున్న స్త్రీని గానీ వేశ్యను గానీ అలాటి వారిని కాక తన ప్రజల్లోని కన్యనే పెళ్లాడాలి.
  • సోదరుడు సంతానం లేకుండా చనిపోయిన తన సోదరుని భార్యను పెళ్ళి చేసుకుంటాడుద్వితీ 25:5–10
    వచనాలు
    ద్వితీ 25:5–10సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి. చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్దకొడుకు, చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి. అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య, పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల దగ్గరికి వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని ధర్మం నాపట్ల జరిగించడం లేదు, అని చెప్పాలి. అప్పుడు అతని ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి, అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి ‘ఆమెను పెళ్ళిచేసుకోవడం నా కిష్టం లేదు’ అంటే, అతని సోదరుని భార్య ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి ‘చెప్పు ఊడ దీసినవాడి ఇల్లు’ అని పేరు వస్తుంది.

సూక్తులు

  • దేవుడు “వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు”కీర్త 68:5, కీర్త 146:9
    వచనాలు
    కీర్త 68:5తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
    కీర్త 146:9ఇతర జాతుల ప్రజలను యెహోవా కాపాడతాడు. తండ్రిలేని అనాథలను, విధవరాళ్ళను ఆదరించేవాడు ఆయనే. దుష్టులను ఆయన వ్యతిరేకిస్తాడు.
  • ప్రవక్తలు: వితంతువు పక్షాన వాదించండియెష 1:17, యిర్మీ 22:3, జెక 7:10
    వచనాలు
    యెష 1:17మంచి చెయ్యడం నేర్చుకోండి. న్యాయం కోరుకోండి. పీడిత ప్రజలకు సాయం చెయ్యండి. తండ్రిలేని వారికి న్యాయం చెయ్యండి. వితంతువు పక్షాన నిలబడండి.
    యిర్మీ 22:3యెహోవా ఇలా చెబుతున్నాడు, ‘మీరు నీతి న్యాయాలను అనుసరించి ప్రవర్తించండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. విదేశీయులనూ తండ్రిలేని వారినీ విధవరాళ్ళనూ బాధించవద్దు. వాళ్ళ మీద హింసాకాండ చేయవద్దు. ఈ స్థలంలో నిరపరాధుల రక్తం చిందింపవద్దు.
    జెక 7:10వితంతువులను, తండ్రిలేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకండి. మీ సోదరులకు హృదయంలో కీడు తలపెట్టకండి.”
  • యోబు: “వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను”యోబు 29:13, యోబు 31:16
    వచనాలు
    యోబు 29:13నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారి దీవెన నా మీదికి వచ్చింది. వితంతువుల హృదయాన్ని సంతోషపెట్టాను.
    యోబు 31:16పేదలు కోరిన దాన్ని నేను బిగబట్టినట్టయితే, ఏడుపు మూలంగా వితంతువుల కళ్ళు క్షీణింపజేసినట్టయితే,
  • వితంతువుల ఇళ్ళను దోచుకునే వారి గురించి యేసు హెచ్చరిస్తాడుమార్కు 12:40
    వచనాలు
    మార్కు 12:40వారు విధవరాళ్ళ ఇళ్ళను దోచుకుంటూ పైకి మాత్రం నటనగా గంటల తరబడి ప్రార్థనలు చేస్తారు. అలాంటి వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
  • పౌలు: కుటుంబాలు తమ సొంత వితంతువులను పోషించాలి1 తిమో 5:3–5, 1 తిమో 5:16
    వచనాలు
    1 తిమో 5:3–5నిజమైన వితంతువులను గౌరవించు. అయితే ఏ వితంతువుకైనా పిల్లలు గాని, మనవలు గాని ఉంటే, వీరు మొదట తమ ఇంటివారి పట్ల తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవునికి ఎంతో ఇష్టం. నిజంగా వితంతువు ఒక్కతే ఉండి, దేవుని మీదనే తన నమ్మకం పెట్టుకుని, ఆయన సాయం కోసం రేయింబగళ్ళు ప్రార్ధిస్తూ, విన్నపాలు చేస్తూ ఉంటుంది.
    1 తిమో 5:16ఏ విశ్వాసురాలి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి లేకుండా ఆమె తానే వారికి సహాయం చేయాలి.
  • సహాయం కోసం పేరు నమోదు చేయించుకునే వితంతువుకు కనీసం అరవై ఏళ్ళు ఉండాలి1 తిమో 5:9–10
    వచనాలు
    1 తిమో 5:9–10అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వయస్సు ఉండి, గతంలో ఒక్క పురుషుడికే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే విధవరాలిగా నమోదు చెయ్యి. ఆమె మంచి పనుల్లో పేరు పొంది ఉండాలి. అంటే, పిల్లలను పెంచడం, ఆతిథ్యం ఇవ్వడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం, లేదా ప్రతి మంచి పనీ చేయడానికి పూనుకుని ఉండడం. అలాటి వారిని విధవరాళ్ళ జాబితాలో చేర్చవచ్చు.
  • వితంతువు మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంది1 కొరింతీ 7:39
    వచనాలు
    1 కొరింతీ 7:39భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.

ఉదాహరణలు

  • తామారు విధవరాలి బట్టలు వేసుకుని తన తండ్రి ఇంట్లో వితంతువుగా జీవిస్తుందిఆది 38:11, ఆది 38:14, ఆది 38:19
    వచనాలు
    ఆది 38:11అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల్లాగా చనిపోతాడేమో అని భయపడి “నా కుమారుడు షేలా పెద్దవాడయ్యే వరకూ నీ తండ్రి ఇంట్లో విధవరాలుగా ఉండు” అని తామారుతో చెప్పాడు. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట్లో నివసించింది.
    ఆది 38:14షేలా పెద్దవాడైనప్పటికీ తనను అతనికి భార్యగా తీసుకోకుండా ఉండడం చూసి తామారు తన విధవరాలి బట్టలు తీసివేసి, ముసుగు వేసుకుని, శరీరమంతా కప్పుకుని, తిమ్నాతుకు వెళ్ళే మార్గంలో ఏనాయిము అనే ద్వారం దగ్గర కూర్చుంది.
    ఆది 38:19అప్పుడామె లేచి వెళ్లిపోయి ముసుగు తీసేసి తన విధవరాలి వస్త్రాలు ధరించింది.
  • నయోమి మోయాబులో తన భర్తనూ ఇద్దరు కుమారులనూ పోగొట్టుకుంటుందిరూతు 1:3–5
    వచనాలు
    రూతు 1:3–5నయోమి తన భర్త ఎలీమెలెకు చనిపోయిన తరువాత తన ఇద్దరు కొడుకులతో అక్కడే ఉండిపోయింది. వాళ్ళిద్దరూ మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. ఒకామె పేరు ఓర్పా, రెండవ ఆమె పేరు రూతు. సుమారు పదేళ్లు గడచిన తరువాత మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. నయోమి భర్త, కొడుకులను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది.
  • నయోమిని పోషించడానికి రూతు పొలాల్లో పరిగె ఏరుకుంటుందిరూతు 2:2–3
    వచనాలు
    రూతు 2:2–3మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది. ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.
  • తెకోవకు చెందిన ఒక స్త్రీ దావీదు ఎదుట వితంతువులా నటిస్తుంది2 సమూ 14:2–5
    వచనాలు
    2 సమూ 14:2–5తెకోవ పట్టణం నుండి ఒక తెలివిగల స్త్రీని పిలిపించాడు. ఆమెతో “చాలాకాలం నుండి ఏడుస్తూ ఉన్నట్టు నటించు, విలాప దుస్తులు వేసుకో. నూనె రాసుకోకుండా ఎంతోకాలంగా విచారంగా ఉన్నట్టు నటిస్తూ నీవు రాజు దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన విధంగా రాజును వేడుకో” అని చెప్పాడు. అప్పుడు ఆ తెకోవ స్త్రీ రాజు దగ్గరికి వచ్చింది. రాజుకు సాగిలపడి సమస్కారం చేసి “రాజా, నన్ను కాపాడు” అంది. రాజు “నీకేం ఇబ్బంది కలిగింది?” అని అడిగాడు. ఆమె “నా భర్త చనిపోయాడు. విధవరాలిని.
  • సొలొమోను కంచు పనివాడైన హీరాము ఒక వితంతువు కుమారుడు1 రాజులు 7:14
    వచనాలు
    1 రాజులు 7:14ఇతడు నఫ్తాలి గోత్రానికి చెందిన విధవరాలి కొడుకు. ఇతని తండ్రి తూరు పట్టణానికి చెందిన ఇత్తడి పనివాడు. ఈ హీరాము గొప్ప నైపుణ్యం, జ్ఞానం గలవాడు, ఇత్తడితో చేసే పనులన్నిటిలో బాగా ఆరితేరిన వాడు, అనుభవజ్ఞుడు. అతడు సొలొమోను దగ్గరికి వచ్చి అతని పని అంతా చేశాడు.
  • యరొబాము తల్లి జెరూహా ఒక వితంతువు1 రాజులు 11:26
    వచనాలు
    1 రాజులు 11:26సొలొమోను సేవకుడు యరొబాము కూడా రాజు మీద తిరుగుబాటు చేశాడు. ఇతడు జెరేదాకు చెందిన ఎఫ్రాయీము గోత్రికుడు నెబాతు కొడుకు. ఇతని తల్లి పేరు జెరూహా. ఆమె విధవరాలు.
  • సారెపతు వితంతువు దగ్గర గుప్పెడు పిండి, కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి1 రాజులు 17:10–16
    వచనాలు
    1 రాజులు 17:10–16కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది. అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు.
  • ఎలీషా నూనెతో ఒక వితంతువు కుమారులను అప్పులవాని నుంచి కాపాడతాడు2 రాజులు 4:1–7
    వచనాలు
    2 రాజులు 4:1–7ఆ తరువాత ప్రవక్తల సమాజంలో ఒకడి భార్య ఏడ్చుకుంటూ ఎలీషా దగ్గరికి వచ్చింది. “నీ సేవకుడైన నా భర్త చనిపోయాడు. అతనికి యెహోవాపై భయమూ, భక్తీ ఉన్నాయని నీకు తెలుసు. ఇప్పుడు మాకు అప్పు ఇచ్చిన వాడు నా ఇద్దరు కొడుకులనూ తనకు బానిసలుగా తీసుకు వెళ్ళడానికి వచ్చాడు” అని చెప్పింది. దానికి ఎలీషా ఆమెతో “నీకు నేనేం చేయగలను? నీకు ఇంట్లో ఏమున్నాయో చెప్పు” అన్నాడు. అప్పుడు ఆమె “నీ సేవకురాలి ఇంట్లో ఓ జాడీలో నూనె తప్పించి ఇంకేమీ లేదు” అంది. అప్పుడు ఎలీషా “నీవు వెళ్ళి నీ పొరుగు వాళ్ళ దగ్గర ఉన్న పాత్రలు అరువు తెచ్చుకో. ఎన్ని తేగలవో అన్ని తెచ్చుకో. అప్పుడు నువ్వూ, నీ కొడుకులూ లోపలికి వెళ్ళి తలుపులు మూసుకోండి. అన్ని పాత్రల్లో నూనె పోయండి. నూనెతో నిండిన పాత్రలు ఒక పక్కన ఉంచండి” అని ఆమెతో చెప్పాడు. ఆమె ఎలీషా దగ్గరనుండి వెళ్ళింది. తన కొడుకులతో లోపలికి వెళ్ళి తలుపులు మూసింది. తన కొడుకులు తెచ్చిన పాత్రలను నూనెతో నింపింది. ఆ విధంగా తెచ్చిన పాత్రలన్నీ నూనెతో నిండిపోయాయి. ఆమె “ఇంకో పాత్ర పట్రండి” అంది. కానీ ఆమె కొడుకు “ఇక పాత్రలేమీ లేవు” అన్నాడు. దాంతో జాడీలోని నూనె ప్రవాహం నిలిచిపోయింది. అప్పుడు ఆమె వచ్చి దేవుని మనిషికి ఈ విషయం చెప్పింది. దానికతడు “వెళ్ళు, ఆ నూనె అమ్మి ఆ డబ్బుతో నీ అప్పులు తీర్చు. మిగిలిన దాంతో నువ్వూ నీ పిల్లలూ జీవించండి” అన్నాడు.
  • ఎనభై నాలుగేళ్ళ వరకు వితంతువుగా ఉన్న అన్నా దేవాలయాన్ని విడిచి వెళ్ళలేదులూకా 2:36–38
    వచనాలు
    లూకా 2:36–38దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె కూడా అక్కడ ఉంది. ఆమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె. ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో, ఎనభై నాలుగేళ్ళ వయసు వరకూ వితంతువుగా ఉండిపోయింది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది. ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
  • ఒక పేద వితంతువు కానుకల పెట్టెలో రెండు చిన్న రాగి నాణేలు వేస్తుందిమార్కు 12:41–44
    వచనాలు
    మార్కు 12:41–44యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు. అప్పుడు ఒక పేద వితంతువు వచ్చి రెండు నాణాలు ఆ పెట్టెలో వేసింది. ఆయన తన శిష్యులను దగ్గరికి పిలిచి, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది. మిగతావారు తాము దాచుకున్న ధనంలో కొంత మాత్రమే వేశారు కాని, ఈమె పేదదైనా తన దగ్గర ఉన్నదంతా వేసింది” అన్నాడు.
  • యేసు నాయీనులో ఒక వితంతువు ఏకైక కుమారుణ్ణి బతికిస్తాడులూకా 7:11–15
    వచనాలు
    లూకా 7:11–15ఇది జరిగిన తరువాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు. ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి మోసుకుపోతూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె వితంతువు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు. ప్రభువు ఆమెను చూసి ఆమెపై జాలిపడి, “ఏడవ వద్దు” అని ఆమెకు చెప్పి, దగ్గరికి వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దాన్ని మోసేవారు నిలబడి పోయారు. ఆయన, “అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే!” అన్నాడు. ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
  • రోజువారీ ఆహార పంపిణీలో గ్రీకు భాష మాట్లాడే వితంతువులను పట్టించుకోలేదుఅపొ.కా 6:1
    వచనాలు
    అపొ.కా 6:1ఆ రోజుల్లో శిష్యుల సంఖ్య పెరుగుతున్నపుడు రోజువారీ భోజనాల వడ్డనల్లో తమలోని విధవరాళ్ళను చిన్నచూపు చూస్తున్నారని గ్రీకు భాష మాట్లాడే యూదులు హీబ్రూ భాష మాట్లాడే యూదుల మీద ఫిర్యాదు చేశారు.
  • దోర్కా కుట్టిన బట్టలను వితంతువులు పేతురుకు చూపిస్తారుఅపొ.కా 9:39
    వచనాలు
    అపొ.కా 9:39పేతురు లేచి వారితో కూడా వెళ్ళాడు. అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోకి అతనిని తీసుకొచ్చారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దోర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అతని పక్కనే నిలబడ్డారు.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు