Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › సంఖ్యాకాండం › 30

IRV · అధ్యాయం 30 / 36

సంఖ్యాకాండం 30

1మోషే ఇశ్రాయేలు గోత్రాల నాయకులతో ఇలా అన్నాడు,

2“ఇది యెహోవా ఆజ్ఞ. ఒకడు యెహోవాకు మొక్కుకుంటే లేక ప్రమాణం చేసి ఉంటే, అతడు మాట తప్పకూడదు. తన నోటినుండి వచ్చిన దానంతటినీ అతడు నెరవేర్చాలి.

3తన తండ్రి ఇంట్లో ఉన్న ఒక స్త్రీ యెహోవాకు చేసిన మొక్కుబడి గురించి ఆమె తండ్రి ఎరిగి, ఏమీ మాట్లాడకపోతే ఆమె మొక్కుబడి నిలిచి ఉంటుంది.

4ఆమె ప్రమాణాలు అన్నీ నిలిచి ఉంటాయి.

5అయితే ఆమె చేసిన ప్రమాణాలను ఆమె తండ్రి విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, ఏవీ నిలబడవు.

6ఆమె తండ్రి దానికి ఆక్షేపణ తెలిపాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.

7ఆమె వివాహిత అయితే, ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త ఎరిగి ఏమీ మాట్లాడకపోతే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు ఆమెపై నిలిచి ఉంటాయి.

8అయితే ఆమె మొక్కుబడులు, తొందరపాటులో చేసిన ప్రమాణాలు ఆమె భర్త విని వాటి విషయంలో ఆక్షేపణ తెలిపి ఉంటే, అతడు ఆమె మొక్కుబడులను, తొందరపాటుగా చేసిన ప్రమాణాలను రద్దు చేసిన వాడవుతాడు. యెహోవా ఆమెను క్షమిస్తాడు.

9వితంతువు గాని విడాకులు ఇచ్చిన స్త్రీ గాని చేసిన మొక్కుబడులు అన్నీ ఆమె మీద నిలిచి ఉంటాయి.

10ఆమె తన భర్త ఇంట్లో ఉన్నప్పుడు మొక్కుబడులు, ప్రమాణాలు చేసి ఉంటే,

11వాటిని గురించి ఆమె భర్త విని ఏ ఆక్షేపణా చేయకుండా ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు, అన్నీ నిలిచి ఉంటాయి.

12ఆమె భర్త వాటి గురించి విన్న రోజునే వాటిని పూర్తిగా రద్దు చేసి ఉంటే, ఆమె మొక్కుబడులు, ప్రమాణాలు గురించిన ఆమె మాటలు ఏవీ నిలబడవు. ఆమె భర్త వాటిని రద్దుచేశాడు కాబట్టి యెహోవా ఆమెను క్షమిస్తాడు.

13ఒక స్త్రీ చేసిన ప్రతి మొక్కుబడిని, ప్రమాణపూర్వకంగా తన మీద మోపుకొన్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చు, రద్దు చేయవచ్చు.

14అలా కాక ఆమె భర్త ఎప్పటికప్పుడు దాని విషయం మౌనంగా ఉంటూ వస్తే, అతడు ఆమె చేసిన మొక్కుబడులనూ ప్రమాణాలనూ స్థిరపరచిన వాడవుతాడు. అతడు వాటిని విన్న రోజు మౌనంగా ఉండడం ద్వారా వాటిని స్థిరపరిచాడు.

15అతడు వాటిని గురించి విన్న చాలా కాలం తరువాత వాటిని రద్దుచేస్తే, అతడు ఆమె దోషశిక్షను తానే భరిస్తాడు.”

16ఇవి భర్తను గూర్చీ భార్యను గూర్చీ, తండ్రిని గూర్చీ బాల్యంలో తన తండ్రి ఇంట్లో ఉన్న కుమార్తెను గూర్చీ యెహోవా మోషేకిచ్చిన ఆజ్ఞలు.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org