నెబుకద్నెజరు బబులోనును గొప్పగా తిరిగి కట్టించాడు. నీలి మెరుపు ఇటుకలతో, ఎద్దులు, డ్రాగన్ల వరుసలతో అలంకరించిన దాని ఇష్తార్ ద్వారాన్ని తవ్వకాల్లో దొరికిన ముక్కలతో బెర్లిన్లో తిరిగి నిర్మించారు.
విజ్ఞాన సర్వస్వం › ఇదే సమయంలో లోకంలో
బైబిల్లో · క్రీ.పూ. 587/586 · యెరూషలేము
యెరూషలేము పతనం
నెబుకద్నెజరు బబులోను సైన్యం యెరూషలేములోకి చొరబడి, దేవాలయాన్ని కాల్చివేసి, ప్రజలను చెరపట్టి తీసుకుపోతుంది.
సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు. ఈ విధంగా సిద్కియా రాజు పరిపాలనలో 11 వ సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉన్నప్పుడు, నాలుగో నెల తొమ్మిదో రోజు అదే సంవత్సరం పట్టణంలో ఘోరమైన కరువు వచ్చింది. దేశ ప్రజలకు ఆహారం లేదు. కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు. అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్ళే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి, అతని సైన్యం అతనికి దూరంగా చెదరిపోయిన కారణంగా యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు. సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు. ఇంకా బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో 19 వ సంవత్సరంలో ఐదో నెల ఏడో రోజున రాజ దేహసంరక్షకుల అధిపతీ, బబులోనురాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చి యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు. ఇంకా నెబూజరదాను దగ్గరున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టారు. పట్టణంలో మిగిలి ఉన్న వాళ్ళనూ, బబులోనురాజు పక్షం చేరిన వాళ్ళనూ, సామాన్య ప్రజల్లో మిగిలిన వాళ్ళనూ నెబూజరదాను బందీలుగా తీసుకెళ్ళాడు గాని, పొలాల్లో, ద్రాక్షతోటల్లో పనిచెయ్యడానికి అందరికన్నా పేదవాళ్లను అక్కడే ఉంచాడు. ఇంకా యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి సరస్సును, కల్దీయులు ముక్కలుగా కొట్టి, ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి తీసుకెళ్ళిపోయారు. సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకారణాలన్నీ వారు తీసుకుపోయారు. అగ్నిపాత్రలు, గిన్నెలు, మొదలైన వెండి వస్తువులనూ, బంగారు వస్తువులనూ నెబూజరదాను తీసుకెళ్ళిపోయారు. ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన రెండు స్తంభాలనూ, సముద్రాన్నీ, పీటలనూ తీసుకెళ్లిపోయాడు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది. ఒక్కొక స్తంభం ఎత్తు 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది, పైపీట ఎత్తు మూడు మూరలు. ఇంకా ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలూ, దానిమ్మ పళ్ళూ ఇత్తడివి. రెండో స్తంభం కూడా మొదటి దాని లాంటిదే. నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు. ఇంకా, సైన్యం మీద అధికారిగా ఉన్న వాణ్ణి, పట్టణంలో ఇంకా ఉంటూ రాజుకు సలహాలు ఇచ్చే ఐదుగురినీ, అతడు పట్టుకున్నాడు. రాజు అధికారుల్లో సైన్యాన్ని నియమించే అధికారినీ, ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులైన 60 మందినీ బందీలుగా పట్టుకున్నాడు. నెబూజరదాను వీళ్ళను రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తెచ్చాడు. బబులోను రాజు హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో వాళ్ళను చంపించాడు. ఈ విధంగా శత్రువులు యూదా వాళ్ళను వారి దేశంలోనుంచి తీసుకెళ్ళిపోయారు.అదే సమయంలో లోకంలో
బబులోను రాజు నెబుకద్నెజరు క్రీ.పూ. 597లో యెరూషలేమును వశపరచుకుని, క్రీ.పూ. 587 లేదా 586లో దాన్ని నాశనం చేశాడు (ఆధారాలు రెండింటికీ అవకాశం ఇస్తాయి). ఒక బబులోను వృత్తాంత పలక మొదటి స్వాధీనపు రోజును కూడా చెబుతుంది: అదారు నెల 2వ రోజు, క్రీ.పూ. 597 మార్చి మధ్యలో. ఆ సంవత్సరాల ప్రపంచం ఇదిగో.
లిడియనులకు, మాదీయులకు మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపిన సూర్యగ్రహణాన్ని మిలేతుకు చెందిన తత్వవేత్త థేల్స్ ముందే చెప్పాడని హెరోడోటస్ చెబుతాడు; ఖగోళ శాస్త్రవేత్తలు దాన్ని క్రీ.పూ. 585 మే 28గా నిర్ణయిస్తారు. థేల్స్ నిజంగా దాన్ని ముందే చెప్పాడా అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
నేటి పశ్చిమ టర్కీలోని లిడియాలో బంగారం, వెండి సహజంగా కలిసిన ఎలక్ట్రం నుండి సింహం తల ముద్రతో మొదటి నాణేలు ముద్రించబడ్డాయి. అంతకుముందు వెండిని తూచి ఇచ్చేవారు; “తూకం” అనే అర్థం గల షెకెల్ అనే మాట దాన్ని గుర్తు చేస్తుంది.
మెగిద్దో దగ్గర రాజు యోషీయాను చంపిన ఫరో రెండవ నెకో (2 రాజులు 23:29) నైలు నుండి ఎర్ర సముద్రం వరకు ఒక కాలువ తవ్వడం మొదలుపెట్టాడు. అతడు పంపిన నావికులు ఆఫ్రికా చుట్టూ ప్రయాణించారని కూడా హెరోడోటస్ నివేదిస్తాడు.
మిలేతు నుండి వచ్చిన గ్రీకులు నల్ల సముద్రపు ఉత్తర తీరంలో వర్తక పట్టణాలు స్థాపించారు: సుమారు క్రీ.పూ. 600లో పాంటికాపేయం — నేటి క్రిమియాలోని కెర్చ్ — నేటి ఉక్రెయిన్లో దక్షిణ బగ్ నది ముఖద్వారం దగ్గర ఓల్బియా. ధాన్యానికి, చేపలకు బదులుగా వారు ద్రాక్షారసం, ఒలీవ నూనె అమ్మారు.
ఉత్తర భారతదేశంలో గంగా, దాని ఉపనదుల ఒడ్డున ఏర్పడిన కొత్త నగరాల చుట్టూ పదహారు రాజ్యాలు, గణరాజ్యాలు — మహాజనపదాలు — ఎదిగాయి. వాటిలో ఒకటైన మగధ తరువాత భారతదేశపు తొలి గొప్ప సామ్రాజ్యాలకు కేంద్రమైంది.
మూలాలు: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు