అష్షూరు చివరి గొప్ప రాజైన అషుర్బనిపాల్ నీనెవెలో పదుల వేల మట్టి పలకలను సేకరించాడు; వాటిలో జలప్రళయ కథ ఉన్న గిల్గమేష్ ఇతిహాసం కూడా ఉంది. క్రీ.పూ. 612లో ఆ పట్టణం కాలిపోయినప్పుడు శిథిలాల కింద పాతుకుపోయిన అవి బతికి బయటపడి, 1800ల మధ్యలో తవ్వి తీయబడ్డాయి.
విజ్ఞాన సర్వస్వం › ఇదే సమయంలో లోకంలో
బైబిల్లో · సుమారు క్రీ.పూ. 622 · యెరూషలేము
యోషీయా సంస్కరణ
దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికిన తరువాత, యోషీయా రాజు దాన్ని ప్రజలకు చదివి వినిపించి, యూదా నుండి విగ్రహాలను తొలగిస్తాడు.
అప్పుడు రాజు యూదా పెద్దలనందర్నీ, యెరూషలేము పెద్దలనందర్నీ తన దగ్గరికి పిలిపించి, యూదా వాళ్ళందర్నీ, యెరూషలేము కాపురస్థులందర్నీ, యాజకులను, ప్రవక్తలను, తక్కువ వాళ్లైనా, గొప్ప వాళ్లైనా, ప్రజలందర్నీ పిలిచి, యెహోవా మందిరానికి వచ్చి వారు వింటూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో దొరకిన నిబంధన గ్రంథంలో ఉన్న మాటలన్నీ చదివించాడు. రాజు ఒక స్తంభం దగ్గర నిలబడి, యెహోవా మార్గాల్లో నడచి, ఆయన ఆజ్ఞలను, కట్టడలను శాసనాలను పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో పాటించి, ఈ గ్రంథంలో రాసి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ నెరవేరుస్తామని యెహోవా సన్నిధిలో నిబంధన చేశాడు. ప్రజలందరూ ఆ నిబంధనకు సమ్మతించారు. రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు. ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు. యెహోవా మందిరంలో ఉన్న అషేరాదేవి రూపాన్ని యెరూషలేము బయట ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి, కిద్రోను వాగు ఒడ్డున దాన్ని కాల్చి, తొక్కి, బూడిద చేసి, ఆ బూడిదను సామాన్య ప్రజల సమాధుల మీద చల్లాడు. ఇంకా యెహోవా మందిరంలో ఉన్న స్వలింగ సంపర్కుల గదులను పడగొట్టించాడు. అక్కడ స్త్రీలు అషేరాదేవికి వస్త్రాలు అల్లుతున్నారు. యూదా పట్టణంలో ఉన్న యాజకులందర్నీ అతడు బయటకు వెళ్లగొట్టాడు. గెబా మొదలు బెయేర్షెబా వరకూ యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలాలను అతడు అపవిత్రం చేసి, పట్టణ ద్వారానికి ఎడమ వైపు పట్టణపు అధికారి అయిన యెహోషువ గుమ్మం దగ్గర ఉన్న ఉన్నత స్థలాలను పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాలమీద యాజకులుగా ఉన్న వారు యెరూషలేములో ఉన్న యెహోవా బలిపీఠం దగ్గర సేవ చెయ్యడానికి అనుమతి లేకపోయినా, తమ ఇతర యాజక సోదరుల్లా వారు కూడా పులియని రొట్టెలు తినే అవకాశం దొరికింది. ఎవరూ తన కొడుకునైనా, కూతుర్నైనా మొలెకుకు దహనబలి ఇవ్వకుండా బెన్ హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ఆ ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు. ఇదే కాకుండా, అతడు యూదా రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రాలను మంటపంలో నివసించే పరిచారకుడైన నెతన్మెలకు గది దగ్గర, యెహోవా మందిరపు ద్వారం దగ్గర నుంచి వాటిని తీసివేసి, సూర్యునికి ప్రతిష్ఠించిన రథాలను అగ్నితో కాల్చేశాడు. ఇంకా యూదా రాజులు చేయించిన ఆహాజు మేడ గది మీద ఉన్న బలిపీఠాలనూ, యెహోవా మందిరపు రెండు ప్రాంగణాల్లో మనష్షే చేయించిన బలిపీఠాలనూ, రాజు పడగొట్టించి ముక్కలు ముక్కలుగా చేయించి ఆ చెత్త అంతా కిద్రోను వాగులో పోయించాడు. యెరూషలేము ఎదుట ఉన్న నాశనం అనే పర్వతపు కుడివైపు అష్తారోతు దేవత అనే సీదోనీయుల విగ్రహానికీ, కెమోషు అనే మోయాబీయుల విగ్రహానికీ, మిల్కోము అనే అమ్మోనీయుల విగ్రహానికీ ఇశ్రాయేలు రాజు సొలొమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రం చేశాడు. ఆ రూపాలను ముక్కలుగా కొట్టించి, అషేరాదేవి రూపాన్ని పడగొట్టించి వాటి స్థానాలను మనుషుల ఎముకలతో నింపాడు. బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఉన్నత స్థలాన్ని, అంటే, ఇశ్రాయేలువారు పాపం చెయ్యడానికి కారకుడైన నెబాతు కొడుకు యరొబాము కట్టించిన ఆ ఉన్నత స్థలం, బలిపీఠం అతడు పడగొట్టించాడు. ఆ ఉన్నత స్థలాన్ని కాల్చి పొడి అయ్యేలా తొక్కించి, అషేరాదేవి రూపాన్ని కాల్చేశాడు. యోషీయా అటు తిరిగి, అక్కడ పర్వత ప్రాంతంలో సమాధులను చూసి, కొందరిని పంపి, సమాధుల్లో ఉన్న ఎముకలను తెప్పించి, దైవజనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారం వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రం చేశాడు. అప్పుడు అతడు “నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిది?” అని అడిగాడు. పట్టణం వారు “అది యూదా దేశం నుంచి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన పనులు ముందుగా తెలిపిన దైవ ప్రవక్త సమాధి” అని చెప్పారు. అందుకతడు “దాన్ని తప్పించండి. ఎవరూ అతని ఎముకలను తీయకూడదు” అని చెప్పాడు. వారు అతని ఎముకలను, షోమ్రోను పట్టణం నుంచి వచ్చిన ప్రవక్త ఎముకలను ముట్టుకోలేదు. ఇంకా, ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణాల్లో ఏ ఉన్నతస్థలాల్లో మందిరాలు కట్టించి యెహోవాకు కోపం పుట్టించారో, ఆ మందిరాలన్నిటినీ యోషీయా తీసేసి, తాను బేతేలులో చేసినట్టే వాటికీ చేశాడు. అక్కడ అతడు ఉన్నతస్థలాలకు నియామకం అయిన యాజకులు అందరినీ బలిపీఠాల మీద చంపించి, వాటిమీద మనుషుల ఎముకలను తగలబెట్టించి, యెరూషలేముకు తిరిగి వచ్చాడు. అప్పుడు రాజు “నిబంధన గ్రంథంలో రాసి ఉన్న ప్రకారంగా మీ దేవుడైన యెహోవాకు పస్కా పండగ ఆచరించండి” అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చిన న్యాయాధిపతులున్న రోజుల నుంచి, ఇశ్రాయేలు రాజుల కాలం, యూదా రాజుల కాలం వరకూ ఎన్నడూ జరగనంత వైభవంగా ఆ సమయంలో పస్కా పండగ జరిగింది. ఈ పండగ రాజైన యోషీయా పరిపాలన 18 వ సంవత్సరంలో యెరూషలేములో యెహోవాకు జరిగింది. ఇంకా మృతులతోనూ ఆత్మలతోనూ మాట్లాడే వాళ్ళను, సోదె చెప్పే వాళ్ళను, గృహ దేవుళ్ళను, విగ్రహాలను, యూదాదేశంలో, యెరూషలేములో, కనబడిన విగ్రహాలన్నిటినీ యోషీయా తీసేసి, యెహోవా మందిరంలో యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథంలో రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచడానికి ప్రయత్నం చేశాడు. అతనికి పూర్వం పరిపాలించిన రాజుల్లో అతని వలే పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం ప్రకారం చేసిన వాడు ఒక్కడూ లేడు. అతని తరువాత కూడా అతని వంటివాడు ఒక్కడూ లేడు.అదే సమయంలో లోకంలో
రాజు యోషీయా పాలనలో పద్దెనిమిదో సంవత్సరంలో, సుమారు క్రీ.పూ. 622లో, యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది (2 రాజులు 22:8). అదే సంవత్సరాల్లో మూడు శతాబ్దాలుగా సమీప ప్రాచ్యాన్ని పాలించిన అష్షూరు ముక్కలవుతోంది; దాని రాజధాని నీనెవె క్రీ.పూ. 612లో పడిపోయింది. క్రీ.పూ. 7వ శతాబ్దపు చివరి భాగపు ప్రపంచం ఇదిగో.
నబోపొలస్సర్ నాయకత్వంలోని బబులోనీయులు, మాదీయులు నీనెవెను ముట్టడించి మూడు నెలల తరువాత దాన్ని వశపరచుకున్నారు. ఒక బబులోను వృత్తాంతం ఆ సంవత్సరాన్ని నమోదు చేస్తుంది; కొన్ని సంవత్సరాల్లోనే అష్షూరు సామ్రాజ్యం అంతరించింది.
ఏతెన్సులో డ్రేకో మొదటిసారిగా నగర చట్టాలను రాతలో పెట్టాడు; అలా న్యాయాధిపతులు ఇక కేవలం ఆచారం ప్రకారం తీర్పు చెప్పలేకపోయారు. అవి ఎంత కఠినమైనవంటే, “డ్రేకోనియన్” అనే మాటకు ఇప్పటికీ అతి కఠినమైన అనే అర్థం.
డెల్టాలోని సాయిస్కు చెందిన రాకుమారుడు మొదటి సామ్టిక్ ఐగుప్తును అష్షూరు అధీనం నుండి విడిపించి దేశాన్ని మళ్ళీ ఏకం చేశాడు. అతడు గ్రీకు, కారియా సైనికులను కిరాయికి తీసుకున్నాడు; త్వరలోనే గ్రీకు వర్తకులు నైలు నది ఒక పాయ దగ్గర నౌక్రాటిస్లో స్థిరపడుతున్నారు.
తన మంత్రి గ్వాన్ ఝోంగ్ సలహాతో చి రాజ్యపు డ్యూక్ హ్వాన్ చిని చైనాలో బలమైన రాజ్యంగా చేసి, బలహీనుడైన ఝౌ రాజు పేరిట పోటీ రాజ్యాల మధ్య శాంతిభద్రతలను కాపాడిన “ఆధిపత్య రాజుల్లో” మొదటివాడయ్యాడు.
నీపర్, దక్షిణ బగ్ నదుల ముఖద్వారం దగ్గర ఉన్న చిన్న బెరెజాన్ దీవిలో మిలేతు నుండి వచ్చిన గ్రీకులు నల్ల సముద్రపు ఉత్తర తీరంలో మొదటి గ్రీకు నివాసాన్ని స్థాపించారు.
మూలాలు: Theographic Bible Metadata, CC BY-SA 4.0 · OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు