అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › యేసు శ్రమలు
సువార్తలు పక్కపక్కనే · యేసు శ్రమలు
సమాధి చేయడం
మత్తయి 27:57–61 · మార్కు 15:42–47 · లూకా 23:50–56 · యోహా 19:38–42
మత్తయి 27:57–6157ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.
58అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.
59యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.
60తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు.
61మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
మార్కు 15:42–4742అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు.
43యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు.
44యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు.
45ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు.
46యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు.
47మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.
లూకా 23:50–5650యూదుల మహాసభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.
51మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
52అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.
53తరువాత ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్న నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.
54అది సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది.
55అప్పుడు గలిలయ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి
56తిరిగి వెళ్ళి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
యోహా 19:38–4238ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు.
39మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు.
40వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం.
41ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.
42ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.
గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.
మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు