Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › బోధ

సువార్తలు పక్కపక్కనే · బోధ

విత్తనాలు చల్లేవాని ఉపమానం

మత్తయి 13:1–9 · మార్కు 4:1–9 · లూకా 8:4–8

మత్తయి

మత్తయి 13:1–9

1ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్ళి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు.

2ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరినపుడు ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు.

3ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. ఆయన వారితో, “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.

4అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి.

5కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మట్టి లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయిగానీ,

6ఎండ వచ్చినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.

7కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. ముళ్ళ కంపలు ఎదిగి వాటిని అణిచి వేశాయి.

8మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఫలించాయి.

9చెవులున్నవాడు విను గాక!” అన్నాడు.

మార్కు

మార్కు 4:1–9

1మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.

2ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు. ఆయన వారితో ఇలా అన్నాడు.

3“వినండి! ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.

4విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.

5మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. అవి త్వరగానే మొలకెత్తాయి.

6కాని వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి.

7ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.

8మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వచ్చాయి.”

9యేసు ఇలా చెప్పి, “వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక” అన్నాడు.

లూకా

లూకా 8:4–8

4ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా యేసు దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు.

5“విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడి మనుషుల కాళ్ళ కింద నలిగిపోయాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగివేశాయి.

6మరి కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండిపోయాయి.

7మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి.

8మరి కొన్ని మంచి నేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి.” ఆయన ఇలా చెప్పి, “వినడానికి చెవులున్నవాడు విను గాక” అని బిగ్గరగా అన్నాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు