10తరువాత శిష్యులు వచ్చి, “నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు?” అని అడిగారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు,
11“పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.
12కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేని వాని నుంచి అతని దగ్గర ఉన్న కొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది.
13ఇందుకోసమే నేను వారికి ఉపమానాలతో బోధిస్తున్నాను. వారు చూస్తున్నారు గానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.
14యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయంలో నెరవేరింది. ‘మీరు వినడానికి వింటారు గాని గ్రహించనే గ్రహించరు. చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.
15ఈ ప్రజల హృదయం బండబారి పోయింది. వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది. వారి కళ్ళు మూసుకుపోయాయి. వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకుని నా వలన బాగుపడే వీలు లేకుండా అయిపోయింది.’
16“అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.
17చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్న వాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.