Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › గలిలయలో

సువార్తలు పక్కపక్కనే · గలిలయలో

సూచన అడగడం; పరిసయ్యుల పులిసిన పిండి

మత్తయి 16:1–12 · మార్కు 8:11–21

మత్తయి

మత్తయి 16:1–12

1అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయనను పరీక్షించడానికి తమ కోసం పరలోకం నుండి ఒక అద్భుతం చెయ్యమని అడిగారు.

2ఆయన వారితో ఇలా అన్నాడు, “సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ,

3అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెబుతారు కదా. ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.

4సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు.” ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడు.

5అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు.

6అప్పుడు యేసు, “పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసే పిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో అన్నాడు.

7అయితే శిష్యులు “మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు” అని తమలో తాము చర్చించుకున్నారు.

8యేసుకు అది తెలిసి, “అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకు రాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?

9“మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో,

10ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా?

11నేను మీతో మాట్లాడింది రొట్టెలను గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పొంగజేసేపిండిని గురించి జాగ్రత్త పడండి” అని వారితో చెప్పాడు.

12అప్పుడు రొట్టెల్లో వాడే పొంగజేసే పదార్థాన్ని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.

మార్కు

మార్కు 8:11–21

11పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను పరీక్షించడం కోసం తమకు ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు.

12దానికి ఆయన ఆత్మలో పెద్దగా నిట్టూర్చి, “ఈ తరం వారు ఎందుకు సూచక క్రియలను చూపమని అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు” అని వారితో చెప్పాడు.

13తరువాత ఆయన వారిని విడిచిపెట్టి, మళ్ళీ పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరుకున్నాడు.

14శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక రొట్టె తప్ప ఏమీ లేదు.

15యేసు వారితో, “పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి!” అన్నాడు.

16శిష్యులు, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.

17అది కనిపెట్టి యేసు, “రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా?

18మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?

19ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగాడు. వారు, “పన్నెండు” అని జవాబు చెప్పారు.

20“మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?” అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు.

21ఆయన వారితో, “ఇంకా మీకు అర్థం కాలేదా?” అన్నాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు