హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 21 మార్చి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 21 మార్చి, 2027
ఆదివారం · పవిత్ర వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
మట్టల ఆదివారం — ప్రభువు శ్రమలు
ఆదివారం · ఆరాధన రంగు: ఎరుపు
ఈరోజు పఠనాలు
ఊరేగింపు సువార్త
లేదా: యోహా 12:12–16
1వారు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవల కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరుకున్నారు. అప్పుడు ఆయన తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఇలా అన్నాడు. 2“మీ ముందున్న గ్రామానికి వెళ్ళండి. దానిలో ప్రవేశించగానే కట్టి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. ఇంతవరకూ దాని మీద ఎవరూ ఎన్నడూ స్వారీ చెయ్యలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. 3అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ఇది ప్రభువుకు అవసరం’ అనండి. వెంటనే అతడు దాన్ని పంపిస్తాడు.” 4శిష్యులు వెళ్ళి, ఒక ఇంటి ముందు వీధిలో ఒక గాడిద పిల్ల ఉండడం చూసి, దాన్ని విప్పుతుండగా 5అక్కడ ఉన్న కొందరు వారితో, “మీరెందుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అని అడిగారు. 6శిష్యులు యేసు చెప్పమన్నట్టే వారికి చెప్పారు. వెంటనే ఆ మనుషులు వారిని వెళ్ళనిచ్చారు. 7వారు ఆ గాడిద పిల్లను యేసు దగ్గరికి తీసుకు వచ్చి తమ వస్త్రాలను దాని మీద పరిచారు. ఆయన ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడు. 8చాలామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరిచారు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారిన పరిచారు. 9ముందు, వెనక నడుస్తున్న వారు కేకలు వేస్తూ, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు! 10రానున్న మన తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అని బిగ్గరగా కేకలు వేశారు.
మొదటి పఠనం
4అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు. శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు. 5ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు. 6నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు. 7ప్రభువైన యెహోవా నాకు సాయం చేస్తాడు కాబట్టి నేనేమీ సిగ్గుపడలేదు. నాకు సిగ్గు కలగదని తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా చేసుకున్నాను.
ప్రతిస్పందన కీర్తన
7నన్ను చూసిన వాళ్ళందరూ నన్ను ఆక్షేపిస్తున్నారు. నన్ను వెక్కిరిస్తూ, నన్ను చూసి తలలు ఆడిస్తున్నారు. 8అతడు యెహోవాలో నమ్మకం పెట్టుకున్నాడు, యెహోవా అతన్ని రక్షించనివ్వండి. అతడు ఆయనలో ఆనందిస్తున్నాడు గనక యెహోవా అతన్ని రక్షించనివ్వండి, అని వాళ్ళు అంటున్నారు. 16కుక్కలు నన్ను చుట్టుముట్టాయి, దుష్టులు గుంపుగూడి నన్ను ఆవరించారు. వాళ్ళు నా చేతులను నా పాదాలను పొడిచారు. 17నా ఎముకలన్నీ నేను లెక్కపెట్టగలను. వాళ్ళు నా వైపు తేరి చూస్తున్నారు. 18నా వస్త్రాలు పంచుకుంటున్నారు. నా అంగీ కోసం చీట్లు వేస్తున్నారు. 19యెహోవా, దూరంగా ఉండకు. నా బలమా, త్వరపడి నాకు సహాయం చెయ్యి. 22నీ నామం నా సోదరులకు ప్రచారం చేస్తాను. సమాజం మధ్య నిన్ను స్తుతిస్తాను. 23యెహోవా పట్ల భయం ఉన్నవారలారా, ఆయన్ని స్తుతించండి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని ఘనపరచండి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయన్ని చూసి విస్మయం చెందండి.
రెండవ పఠనం
6ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు. 7అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం తీసుకున్నాడు. మానవుల పోలికలో కనిపించాడు. ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు. 8చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు. 9అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.
సువార్త
1రెండు రోజుల తరువాత పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ రాబోతున్నాయి. ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును రహస్యంగా బంధించి చంపాలని కుట్రలు పన్నుతున్నారు. 2అయితే ప్రజల్లో అల్లరి జరగవచ్చు అని భయపడి, పండగ సమయంలో వద్దు అని చెప్పుకున్నారు. 3ఆ సమయంలో యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఒక స్త్రీ అగరు చెట్ల నుండి చేసిన స్వచ్ఛమైన, ప్రశస్తమైన అత్తరును ఒక చలువరాతి సీసాలో తన వెంట తెచ్చింది. ఆమె ఆ సీసా పగలగొట్టి ఆ అత్తరును యేసు తల మీద పోసింది. 4అయితే ఇది చూసి అక్కడ ఉన్న కొందరు కోపం తెచ్చుకున్నారు. వారు, “అత్తరు ఇలా వృధా చేయడం ఎందుకు? 5ఈ అత్తరు అమ్మి ఉంటే మూడువందల దేనారాల కంటే ఎక్కువే వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు ఇచ్చి ఉండవలసింది” అని తమలో తాము చెప్పుకుని ఆ స్త్రీని గద్దించారు. 6అయితే యేసు, “ఆమె జోలికి వెళ్ళకండి! ఆమెను ఎందుకు కంగారు పెడుతున్నారు? ఈమె నా విషయంలో శ్రేష్ఠమైన పని చేసింది. 7పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు మీరు వారికి సహాయం చేయవచ్చు. కాని, నేను ఎల్లకాలం మీతో ఉండను. 8ఈమె తాను చేయగలిగింది చేసింది. ఈమె నా శరీరాన్ని భూస్థాపన కోసం ముందుగా అభిషేకించింది. 9మీతో నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటా సువార్త ప్రకటన జరిగే ప్రతిచోటా ఈమె చేసినది కూడా జ్ఞాపకం చేసుకుని ప్రశంసిస్తారు” అన్నాడు. 10ఆ తరువాత పన్నెండు మందిలో ఒకడైన యూదా ఇస్కరియోతు యేసును పట్టి ఇచ్చేందుకు ప్రధాన యాజకులతో మాట్లాడడానికి వారి దగ్గరికి వెళ్ళాడు. 11అది విని వారు చాలా సంతోషించి అతనికి కొంత సొమ్ము ముట్టజెపుతామని మాట ఇచ్చారు. అప్పటినుండీ యేసును వారికి అప్పగించడానికి తగిన అవకాశం కోసం యూదా ఎదురు చూస్తూ ఉన్నాడు. 12పొంగని రొట్టెల పండగ మొదటి రోజున పస్కా గొర్రె పిల్లను వధించే రోజు వచ్చినప్పుడు యేసు శిష్యులు, “పస్కా విందును ఎక్కడ సిద్ధం చేయమంటావు?” అని ఆయనను అడిగారు. 13యేసు తన శిష్యుల్లో ఇద్దరిని పంపుతూ, “మీరు ఊళ్ళోకి వెళ్ళండి. నీళ్ళ కుండ మోస్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. అతని వెంట వెళ్ళండి. 14అతడు ఏ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంటి యజమానితో, ‘నేను నా శిష్యులతో కలిసి పస్కాను తినడానికి విడిది గది ఎక్కడ ఉంది? అని బోధకుడు అడుగుతున్నాడు’ అని చెప్పండి. 15అతడు పూర్తి సామగ్రితో సిద్ధంగా ఉన్న విశాలమైన మేడ గది మీకు చూపిస్తాడు. మన కోసం అక్కడ పస్కా విందు ఏర్పాటు చేయండి” అని ఆదేశించాడు. 16ఆ శిష్యులు బయలుదేరి నగరంలోకి వెళ్ళారు. ఆయన తమతో చెప్పినట్టే అన్నీ జరిగాయి. వారు పస్కా పండగ భోజనం సిద్ధం చేశారు. 17సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. 18వారంతా బల్ల దగ్గర కూర్చుని భోజనం చేస్తుండగా యేసు, “మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, నాతో కలిసి భోజనం చేస్తూ ఉన్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు” అన్నాడు. 19వారికి దుఃఖం కలిగింది. ఒకరి తరవాత ఒకరు ఆయనతో, “నేను కాదు కదా!” అన్నారు. 20ఆయన వారితో, “అతడు ఈ పన్నెండు మందిలో ఒకడు, నాతో కలసి పాత్రలో చెయ్యి ముంచేవాడే! 21ఎందుకంటే మనుష్య కుమారుడి గురించి రాసి ఉన్నట్టే ఆయన చనిపోతాడు గాని, ఆయనను శత్రువులకు అప్పగించిన వాడికి శిక్ష తప్పదు. వాడు పుట్టకపోతే బాగుండేది” అన్నాడు. 22వారు భోజనం చేస్తూ ఉండగా యేసు రొట్టె తీసుకుని ఆశీర్వదించి, దాన్ని విరిచి వారికిచ్చి, “దీన్ని తీసుకుని తినండి. ఇది నా దేహం” అన్నాడు. 23తరువాత ఒక పాత్ర తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి వారికి ఇచ్చాడు. ఆ పాత్రలోనిది వారందరూ తాగారు. 24ఆయన వారితో, “ఇది నా రక్తం. అనేకుల కోసం చిందే నిబంధన రక్తం. 25నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి, కొత్త ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకూ ఇక నేను దాన్ని తాగను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను” అన్నాడు. 26అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు. 27అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’ 28కాని నేను తిరిగి సజీవంగా లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అని చెప్పాడు. 29అయితే పేతురు ఆయనతో, “అందరూ అలా చేసినా నేను మాత్రం నిన్ను విడిచి పెట్టను” అన్నాడు. 30అప్పుడు యేసు, “నీతో కచ్చితంగా చెప్పేదేమిటంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడు సార్లు నేనెవరో తెలియదని అబద్ధం ఆడతావు” అని అతనితో అన్నాడు. 31“నేను నీతో చావవలసి వచ్చినా నువ్వు తెలియదు అనను” అని పేతురు గట్టిగా చెప్పాడు. మిగిలిన శిష్యులు కూడా అదే విధంగా అన్నారు. 32అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు. 33అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు. 34ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి, 35ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు. 36ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు. 37ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా? 38మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు. 39ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు. 40ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు. 41మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు. 42వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.” 43ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి. 44ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, “నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి” అన్నాడు. 45అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, “రబ్బీ!” అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. 46అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు. 47అక్కడ నిలుచున్న వారిలో ఒకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని కొట్టి అతని చెవి నరికి వేశాడు. 48యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు కత్తులతో గదలతో వచ్చి బంధించడానికి నేను దోపిడీ దొంగనా? 49నేను ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశం చేస్తూ మీతో ఉన్నవాడినే కదా! అప్పుడు నన్ను ఎందుకు పట్టుకోలేదు? లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది.” 50అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. 51ఒక యువకుడు యేసును వెంబడిస్తున్నాడు. అతని శరీరం మీద నారబట్ట తప్ప ఇంకేమీ లేదు. వారు అతనిని కూడా పట్టుకున్నారు. 52కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు. 53వారు యేసుని ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకు వెళ్ళారు. అక్కడ ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు అందరూ సమావేశమయ్యారు. 54పేతురు యేసుకు దూరంగా ఉండి వెంబడిస్తూ ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా కూర్చుని మంట దగ్గర చలి కాచుకుంటూ ఉన్నాడు. 55ముఖ్య యాజకులు, యూదుల మహా సభలోని సభ్యులంతా యేసుకు మరణశిక్ష విధించడానికి తగిన సాక్ష్యం కోసం చూస్తూ ఉన్నారు గానీ అది వారికి దొరకలేదు. 56చాలామంది యేసుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పారు. కాని, వారి సాక్షాలు ఒకదానితో ఒకటి పొసగలేదు. 57అప్పుడు కొందరు లేచి ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెబుతూ, 58“ఇతడు ‘మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మనుషులు కట్టని మరో దేవాలయాన్ని నిర్మిస్తాను’ అని చెప్పడం మేము విన్నాం” అన్నారు. 59కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు. 60అప్పుడు ప్రధాన యాజకుడు లేచి అందరి సమక్షంలో యేసుతో, “నీవేమీ మాట్లాడవేంటి? వీరు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా!” అని యేసును ప్రశ్నించాడు. 61కాని యేసు మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడివైన క్రీస్తువా?” అని మళ్ళీ యేసును ప్రశ్నించాడు. 62అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు. 63ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకుని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? 64ఇతడు దేవ దూషణ చేయడం మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అన్నాడు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందరూ తీర్పు చెప్పారు. 65అప్పుడు కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అన్నారు. భటులు కూడా ఆయనను కొట్టారు. 66పేతురు ఇంటి లోగిట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని పనిపిల్ల అక్కడకు వచ్చింది. 67పేతురు చలి కాచుకుంటూ అక్కడ ఉండడం చూసి, “నజరేతు వాడైన యేసుతో నువ్వు కూడా ఉన్నావుగదా!” అని అతనితో అంది. 68పేతురు కాదన్నాడు. “నేను ఆయనను ఎరగను. నీవేం అంటున్నావో నాకు అర్థం కావడం లేదు” అని అన్నాడు. ఆ వెంటనే లేచి ఆవరణలోకి వెళ్ళాడు. వెంటనే కోడి కూసింది. 69ఆ పనిపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వారితో, “ఇతడు వారిలో ఒకడు” అంది. 70పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు. 71అయితే పేతురు, “మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో తెలియదు” అంటూ తనను తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. 72వెంటనే రెండోసారి కోడి కూసింది. ‘కోడి రెండు సార్లు కూసే ముందే నన్నెరుగనని మూడు సార్లు బొంకుతావు’ అని యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి. అతడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చాడు. 15:1తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందిన సభ్యులు కలసి సమాలోచన చేశారు. తరువాత వారు యేసును బంధించి తీసుకువెళ్ళి రోమా గవర్నర్ పిలాతుకు అప్పగించారు. 2పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని ప్రశ్నించాడు. అందుకు యేసు, “నువ్వే అంటున్నావుగా” అని అతనికి జవాబిచ్చాడు. 3ముఖ్య యాజకులు ఆయన మీద చాలా నేరాలు మోపారు. 4కనుక పిలాతు మరొకసారి ఆయనను ప్రశ్నిస్తూ, “వీళ్ళు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరారోపణలు చేస్తున్నారో చూడు! నీవేమీ జవాబు చెప్పవా?” అన్నాడు. 5అయినా యేసు మారు పలకలేదు. ఇది చూసి పిలాతుకు చాలా ఆశ్చర్యం వేసింది. 6పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఒక ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. 7బరబ్బ అనే ఒక ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఉన్నాడు. 8జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒకరిని విడుదల చేయమని పిలాతును కోరారు. 9పిలాతు, “యూదుల రాజును మీకు విడుదల చేయాలని కోరుతున్నారా?” అని అన్నాడు. 10ఎందుకంటే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును తనకు అప్పగించారని అతడు గ్రహించాడు. 11కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పారు. 12పిలాతు, “అలాగైతే ‘యూదుల రాజు’ అని పిలిచే ఈ యేసును ఏమి చేయమంటారు?” అని అడిగాడు. 13వారు కేకలు వేస్తూ, “సిలువ వేయండి” అన్నారు. 14పిలాతు, “ఎందుకు? అతడు చేసిన నేరమేంటి?” అన్నాడు. జనసమూహం, “సిలువ వేయండి” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. 15ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు. 16సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు. 17వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. 18ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. 19రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. 20ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 21కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. 22వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం. 23అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. 24ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. 25ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. 26“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. 27ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు. 28‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది. 29ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా! 30ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు. 31ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 32‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు. 33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం. 35దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 36ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు. 37అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. 38ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది. 39యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు. 40కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు. 41యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. 42అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధపడే రోజు. 43యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. 44యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. 45ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు. 46యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు. 47మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు