హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 20 మార్చి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 20 మార్చి, 2027
శనివారం · తపస్సు కాలం ఐదవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
తపస్సు కాలం ఐదవ వారపు శనివారం
వారపు రోజు · ఆరాధన రంగు: ఊదా
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
21వాళ్ళతో ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులు చెదరిపోయిన రాజ్యాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. చుట్టుపక్కల ప్రాంతాలనుంచి నేను వాళ్ళను తెస్తాను. వాళ్ళ సొంత దేశంలోకి నేను వాళ్ళను తెస్తాను. 22వాళ్ళిక మీదట ఎన్నటికీ రెండు రాజ్యాలుగా రెండు జనాలుగా ఉండకుండాా చేస్తాను. ఆ ప్రాంతంలో ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వాళ్ళను ఒకే రాజ్యంగా చేసి, వాళ్ళందరికీ ఒక్క రాజునే నియమిస్తాను. 23తమ విగ్రహాల వలన గానీ తాము చేసిన నీచకార్యాల వలన గానీ ఎలాంటి పాపాల వలన గానీ తమను అపవిత్రం చేసుకోరు. వాళ్ళు పాపాలు చేస్తూ వచ్చిన ప్రతి చోటు నుంచి నేను వాళ్ళను విడిపించి శుద్ధి చేస్తాను. అప్పుడు వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను. 24నా సేవకుడు, దావీదు వాళ్ళకి రాజుగా ఉంటాడు. వాళ్ళందరికీ ఒకే ఒక కాపరి ఉంటాడు. వాళ్ళు నా విధుల ప్రకారం నడుస్తారు. నా కట్టడలను పాటించి ఆచరిస్తారు. 25నేను నా సేవకుడు, యాకోబుకు ఇచ్చిన దేశంలో మీ పూర్వీకులు నివసించిన దేశంలో వాళ్ళు నివసిస్తారు. వాళ్ళ పిల్లలూ వాళ్ళ పిల్లల పిల్లలూ అక్కడ ఎప్పుడూ నివసిస్తారు. నా సేవకుడు దావీదు ఎప్పటికీ వాళ్ళకి అధిపతిగా ఉంటాడు. 26నేను వాళ్ళతో శాంతి ఒడంబడిక చేస్తాను. అది వాళ్ళతో నా నిత్య నిబంధనగా ఉంటుంది. వాళ్ళ సంఖ్య పెరిగేలా చేస్తాను. వాళ్ళ మధ్య నా పవిత్ర స్థలాన్ని ఎప్పటికీ ఉండేలా చేస్తాను. 27నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను. 28వాళ్ళ మధ్య నా పరిశుద్ధస్థలం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడినని ఇతర రాజ్యాలు తెలుసుకుంటారు.
ప్రతిస్పందన కీర్తన
10ప్రజలారా, యెహోవా మాట వినండి. దూరంగా తీరం వెంబడి ఉన్న ప్రాంతాలకు నివేదిక అందించండి. “ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి, గొర్రెల కాపరి తన మందను కాపాడేలా కాపాడుతున్నాడు” అని చెప్పండి. 11ఎందుకంటే, మూల్యం చెల్లించి, తనకు మించిన బలం ఉన్న వాడి చేతిలోనుంచి యెహోవా యాకోబును విమోచించాడు. 12వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు. 13అప్పుడు కన్యలు నాట్యమాడి ఆనందిస్తారు. యువకులూ వృద్ధులూ కలిసి ఉంటారు. “ఎందుకంటే, వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను. వాళ్ళ మీద కనికరం చూపించి దుఃఖానికి బదులుగా వాళ్ళు ఆనందించేలా చేస్తాను.
సువార్త
45అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు. 46కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు. 47అప్పుడు ముఖ్య యాజకులు, పరిసయ్యులు, మహా సభను సమావేశపరిచి, “మనం ఏం చేద్దాం? ఈ మనిషి అనేక సూచక క్రియలు చేస్తున్నాడే, 48మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు. 49అయితే, వారిలో ఒకడు, ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప వారితో, “మీకేమీ తెలియదు. 50మన జాతి అంతా నాశనం కాకుండా ఉండాలంటే ఒక్క మనిషి ప్రజలందరి కోసం చనిపోవడం మీకు లాభం అన్నది మీరు అర్థం చేసుకోవడం లేదు” అన్నాడు. 51అతడు తనంతట తానే ఈ విధంగా చెప్పలేదు గానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి, జాతి అంతటి కోసం యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. 52ఆ జాతి కోసం మాత్రమే కాకుండా, వివిధ ప్రాంతాల్లోకి చెదరిపోయిన దేవుని పిల్లలను ఒకటిగా సమకూర్చేలా యేసు చనిపోవాలని అతడు ప్రవచించాడు. 53కాబట్టి, ఆ రోజు నుండి యేసును ఎలా చంపాలా అని వారు ఆలోచన చేస్తూ వచ్చారు. 54అందుచేత యేసు అప్పటినుంచి యూదుల్లో బహిరంగంగా తిరగకుండా, అక్కడనుంచి వెళ్ళి అరణ్య ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామంలో తన శిష్యులతో కలిసి ఉన్నాడు. 55యూదుల పస్కా పండగ దగ్గర పడింది. చాలా మంది ప్రజలు తమను తాము శుద్ధి చేసుకోడానికి పండగకు ముందే గ్రామాలనుంచి యెరూషలేముకు వచ్చారు. 56వారు యేసు కోసం చూస్తున్నారు. దేవాలయంలో నిలబడి, ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు, “మీరేమంటారు? ఆయన పండగకు రాడా?” 57యేసు ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిస్తే, తాము ఆయనను పట్టుకోవడం కోసం, వారికి తెలియజేయాలని ముఖ్య యాజకులు, పరిసయ్యులు, ఒక ఆజ్ఞ జారీ చేశారు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు