హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 21 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 8 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 21 మార్చి, 2027
ఆదివారం · స్వరం 1
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా ఉపవాస కాలం మొదటి ఆదివారం
ఆర్థడాక్సీ ఆదివారం
మహా ఉపవాస కాలం
ఉపవాసం: నూనెతో
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఉదయ ప్రార్థన 9వ సువార్త
19ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 20ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు. 21అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు. 24పన్నెండుమంది శిష్యుల్లో ఒకడైన తోమా యేసు వచ్చినప్పుడు వారితో లేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25మిగిలిన శిష్యులు, “మేము ప్రభువును చూశాం” అని అతడితో చెప్పారు. అప్పుడు అతడు, “నేను ఆయన మేకుల గుర్తును చూడాలి. నా వేలు ఆ గాయం రంధ్రంలో ఉంచాలి. అలాగే నేను నా చేతిని ఆయన పక్కలో ఉంచాలి. అప్పుడే నేను నమ్ముతాను” అన్నాడు. 26ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, “మీకు శాంతి కలుగు గాక!” అన్నాడు. 27తరువాత ఆయన తోమాను చూసి, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. అలాగే నీ చెయ్యి చాచి నా పక్కలో పెట్టు. విశ్వాసిగా ఉండు. అవిశ్వాసివి కావద్దు” అన్నాడు. 28దానికి జవాబుగా తోమా, “నా ప్రభూ, నా దేవా” అన్నాడు. 29అప్పుడు యేసు, “నువ్వు నన్ను చూసి నమ్మావు. అయితే నన్ను చూడకుండానే నమ్మిన వారు ధన్యులు” అన్నాడు. 30యేసు క్రీస్తు ఇంకా అనేక అద్భుతాలను తన శిష్యుల ఎదుట చేశాడు. వాటన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు. 31కానీ యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని మీరు నమ్మడానికీ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికీ ఇవన్నీ రాయడం జరిగింది.
పత్రిక
24విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడయ్యాక ఫరో కుమార్తెకు కొడుకును అనిపించుకోడానికి నిరాకరించాడు. 25కొద్ది కాలం పాపంలోని సుఖాలు అనుభవించడానికి బదులు దేవుని ప్రజలతో హింసలు అనుభవించడం మంచిదని తలంచాడు. 26ఐగుప్తులోని సంపదల కంటే క్రీస్తును అనుసరించడం వల్ల కలిగే అవమానంలో గొప్ప ఐశ్వర్యం ఉందని భావించాడు. ఎందుకంటే తన దృష్టిని భవిష్యత్తులో కలగబోయే బహుమానంపై ఉంచాడు. 32ఇంకా ఏమి చెప్పను? గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ఇంకా ప్రవక్తలను గురించి చెప్పాలంటే సమయం చాలదు. 33విశ్వాసం ద్వారా వీళ్ళు రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు, న్యాయాన్ని జరిగించారు, వాగ్దానాలు పొందారు. సింహాల నోళ్ళు మూయించారు. 34అగ్నికున్న బలాన్ని చల్లార్చారు. కత్తి పోటులను తప్పించుకున్నారు. వ్యాధుల్లో స్వస్థత పొందారు. యుద్ధ సమయంలో బలవంతులయ్యారు. విదేశీ సైన్యాలను తరిమి కొట్టారు. 35స్త్రీలు చనిపోయిన తమ వారిని బతికించుకున్నారు. ఇతరులు చిత్రహింసలు అనుభవించారు. వీళ్ళు మరింత మెరుగైన పునరుజ్జీవం కోసం విడుదల కావాలని కోరుకోలేదు. 36ఇంకా కొందరు వెక్కిరింతలనూ, కొరడా దెబ్బలనూ సహించారు. నిజమే, సంకెళ్లనూ ఖైదునూ సైతం సహించారు. 37వీళ్ళను రాళ్ళతో కొట్టారు, రంపాలతో కోశారు. కత్తులతో చంపారు. వీళ్ళు గొర్రెల, మేకల చర్మాలు కట్టుకుని తిరిగారు. అనాథల్లాగా వేదన పడ్డవారుగా ఉన్నారు. అవమానాలకు గురి అయ్యారు. 38అడవుల్లో పర్వతాల పైనా గుహల్లో భూమి కింద సొరంగాల్లో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైనది కాదు. 39వీళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వీళ్ళందరినీ స్వీకరించాడు. కానీ ఆయన వాగ్దానం చేసింది వారు పొందలేదు. 40మనం లేకుండా వారు పరిపూర్ణులు కాకుండా దేవుడు మనకోసం మరింత మెరుగైన దాన్ని ముందే సిద్ధం చేశాడు. 12:1మన చుట్టూ ఇంత పెద్ద సాక్షుల సమూహం ఉంది కాబట్టి మనలను సులభంగా ఆటంకపరిచే ప్రతిదాన్నీ ప్రతి భారాన్నీ మనలను గట్టిగా బంధించి ఉంచే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. మన ముందున్న పరుగు పందెంలో సహనంతో పరుగెడదాం. 2మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.
సువార్త
43మర్నాడు యేసు గలిలయకు వెళ్ళాలని బయలుదేరినప్పుడు ఫిలిప్పును చూశాడు. ఫిలిప్పుతో, “నా వెనకే రా” అన్నాడు. 44ఫిలిప్పు సొంత ఊరు బేత్సయిదా. అంద్రెయ, పేతురుల సొంత ఊరు కూడా అదే. 45ఫిలిప్పు నతనయేలును చూసి, “ధర్మశాస్త్రంలో మోషే, ప్రవక్తలూ ఎవరి గురించి రాశారో ఆ వ్యక్తిని మేము చూశాం. ఆయన నజరేతు వాడూ, యోసేపు కుమారుడూ అయిన యేసు” అని చెప్పాడు. 46దానికి నతనయేలు, “నజరేతులో నుండి మంచిదేమన్నా రాగలదా?” అన్నాడు. ఫిలిప్పు, “నువ్వే వచ్చి చూడు” అన్నాడు. 47నతనయేలు తన దగ్గరికి రావడం యేసు చూసి, “చూడండి. ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఇతనిలో ఎలాంటి కపటమూ లేదు” అన్నాడు. 48అప్పుడు నతనయేలు, “నేను నీకెలా తెలుసు?” అన్నాడు. అందుకు యేసు, “ఫిలిప్పు నిన్ను పిలవక ముందు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను” అన్నాడు. 49దానికి నతనయేలు, “బోధకా, నువ్వు దేవుని కుమారుడివి! ఇశ్రాయేలు రాజువి నువ్వే” అని ఆయనకు బదులిచ్చాడు. 50అందుకు యేసు, “ఆ అంజూరు చెట్టు కింద నిన్ను చూశానని చెప్పినందుకే నువ్వు నమ్మేస్తున్నావా? దీని కంటే గొప్ప విషయాలు చూస్తావు” అన్నాడు. 51తరువాత యేసు ఇలా అన్నాడు, “నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఆకాశం తెరుచుకోవడం, దేవుని దూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కడం, దిగడం చేస్తూ ఉండడం మీరు చూస్తారు.”
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 8 మార్చి పౌర కాలెండర్లో 21 మార్చి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు