Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › యూదా రాజులు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · యూదా రాజులు

అతల్యా, బాలుడైన యోవాషు

2 రాజులు 11:1–21 · 2 దిన 22:10–12; 23:1–21

2 రాజులు

2 రాజులు 11:1–21

1అహజ్యా తల్లి అతల్యాకి తన కొడుకు చనిపోయాడని తెలిసింది. అప్పుడు ఆమె రాకుమారులనందరినీ హతమార్చింది.

2యెహోరాము రాజు కూతురూ అహజ్యాకి సోదరి అయిన యెహోషెబ అహజ్యా కొడుకుల్లో ఒకడైన యోవాషును హతమైన రాకుమారులతో కూడా చావకుండా వేరు చేసి అతని ఆయాతో సహా అతణ్ణి దాచిపెట్టింది. ఆమె వారిని పడక గదిలో అతల్యా కంటపడకుండా ఉంచింది.

3దేశాన్ని అతల్యా పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆరు సంవత్సరాలు యెహోవా మందిరంలో రహస్యంగా అతణ్ణి దాచి ఉంచారు.

4ఏడో సంవత్సరంలో యాజకుడైన యెహోయాదా కాపలాదారుల పైనా, కెరీతీయులు అని పిలిచే సంరక్షకుల పైనా ఉండే అనేకమంది శతాధిపతులను పిలిపించాడు. వారు వచ్చినప్పుడు వాళ్ళను యెహోవా మందిరం లోకి తీసుకువెళ్ళాడు. అతడు వాళ్ళతో ఒప్పందం చేసుకుని యెహోవా మందిరంలో వాళ్ళతో ఒక ప్రమాణం చేయించాడు. ఆ తరువాత వాళ్ళకు యువ రాజును చూపించాడు.

5వాళ్ళతో ఇలా అన్నాడు. “మీరు చేయాల్సిందేమిటంటే మీలో విశ్రాంతి దినం పరిచర్య కోసం వచ్చే వారు మూడు బృందాలై ఒక బృందం రాజు ఇంటికి కాపలాగా ఉండాలి.

6మరో బృందం సూర్ గుమ్మం దగ్గరా మరో బృందం మందిరం వెనుక ఉన్న ద్వారం దగ్గరా ఉండాలి. ఇలా మీరు మందిరాన్ని భద్రపరచాలి.

7ఇక విశ్రాంతి దినం పరిచర్య లేని వారు రెండు బృందాలుగా రాజు ఉన్న యెహోవా మందిరానికి కాపలా కాయాలి.

8మీలో ప్రతి ఒక్కరూ చేతిలో ఆయుధాలు పట్టి రాజు చుట్టూ కంచెలా ఉండాలి. ఎవడైనా మీ పంక్తుల్లోకి చొచ్చుకుని వస్తే, వాణ్ణి చంపేయండి. రాజు ఇంటా బయటా సంచరిస్తున్నప్పుడు మీరు అతని దగ్గర ఉండాలి.”

9యాజకుడైన యెహోయాదా శతాధిపతులకు ఇచ్చిన ఆదేశాలను వారు తుచ తప్పక పాటించారు. ప్రతి ఒక్కరూ తన మనుషులను తీసుకుని యాజకుడైన యెహోయాదా దగ్గరికి వచ్చారు. పరిచర్య చేసేవాళ్ళూ, విశ్రాంతి దినం పరిచర్యను ఆపి వేసిన వాళ్ళూ వారిలో ఉన్నారు.

10యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరంలో ఉన్న దావీదు ఈటెలనూ, డాళ్లనీ శతాధిపతులకు అందించాడు.

11కాబట్టి కాపలా కాసే వారు తమ చేతుల్లో ఆయుధాలతో నిలిచారు. వారు రాజు చుట్టూ మందిరం కుడి వైపునుండి ఎడమ వైపు వరకూ మందిరానికీ బలిపీఠం వేదికకీ సమీపంలో నిలబడ్డారు.

12అప్పుడు యెహోయాదా యువ రాజు యోవాషుని బయటకు తీసుకు వచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేసారు. అంతా చప్పట్లు కొట్టి “రాజు చిరకాలం జీవించాలి” అంటూ నినాదాలు చేశారు.

13కాపలా కాసే వాళ్ళూ, ఇంకా ప్రజలందరూ చేస్తున్న శబ్దాలు అతల్యాకు వినిపించాయి. అప్పుడు ఆమె యెహోవా మందిరం దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.

14రాజు సంప్రదాయ పద్ధతిలో స్తంభం పక్కన నిలబడి ఉండటమూ, అధికారులూ, బూరలు ఊదేవాళ్ళూ రాజు దగ్గర నిలబడి ఉండటమూ చూసింది. దేశ ప్రజలందరూ బూరలు ఊదుతూ సంబరాల్లో మునిగి ఉండటం చూసింది. అప్పుడామె తన బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజ ద్రోహం!” అంటూ కేకలు పెట్టింది.

15అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యంలోని శతాధిపతులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు. “ఆమెను సైనికుల వరుసల్లోనుండి బయటకు తీసుకు రండి. ఆమె సహాయకులెవరైనా ఆమెతో వస్తే వాళ్ళను కత్తితో చంపండి.” అతడు అంతకుముందు “యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు” అని వాళ్ళను ఆదేశించాడు.

16కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చారు. రాజ గృహంలోకి గుర్రాలు వచ్చే దారిగుండా ఆమెను పోనిచ్చారు. ఆమె బయటకు రాగానే ఆమెను పట్టుకుని చంపేశారు.

17అప్పుడు యెహోయాదా “ప్రజలు యెహోవాకి చెందిన వారు” అంటూ దేవుని పేర రాజుతో, ప్రజలతో నిబంధన చేయించాడు. అలాగే రాజుకీ ప్రజలకీ మధ్య ఒక నిబంధన చేయించాడు.

18కాబట్టి దేశంలోని ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్ళారు. దాన్ని ధ్వంసం చేసారు. బయలు గుడిలో బలిపీఠం వేదికలనూ, విగ్రహాలనూ నేలమట్టం చేశారు. బయలు దేవుడికి పూజారి అయిన మత్తాను అనేవాణ్ణి బలిపీఠం ఎదుట చంపి వేశారు. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరాన్ని కాపలా కాయడానికి మనుషులను నియమించాడు.

19యెహోయాదా శతాధిపతులనూ, కేరేతీయులనూ, కావలి వారిని ఇంకా ప్రజలందర్నీ పిలిపించాడు. వారు యెహోవా మందిరంలో ఉన్న రాజుకు కావలిగా ఉన్న వారి ద్వారం గుండా రాజగృహానికి తీసుకు వచ్చారు. అప్పుడు రాజు సింహాసనంపై కూర్చున్నాడు.

20కావలి వారు అతల్యాను రాజగృహం దగ్గర కత్తితో చంపారు. చంపిన తరువాత పట్టణం అంతా ప్రశాంతంగా ఉంది. దేశంలో ప్రజలంతా సంతోషించారు.

21యోవాషు పరిపాలన ప్రారంభమైనప్పుడు అతని వయస్సు ఏడేళ్లు.

2 దినవృత్తాంతాలు

2 దిన 22:10–12; 23:1–21

22:10అహజ్యా తల్లి అతల్యా తన కొడుకు చనిపోయాడని విని, యూదావారి సంబంధులైన రాజ వంశస్తులందరినీ చంపేసింది.

22:11అయితే రాజైన యెహోరాము కుమార్తె యెహోషబతు అహజ్యా కొడుకు యోవాషును, మరణమైన రాకుమారుల్లోనుండి రహస్యంగా తెచ్చి, అతనిని, అతని దాదిని ఒక పడకగదిలో దాచింది. యెహోరాము రాజు కుమార్తె, యెహోయాదా అనే యాజకుని భార్య యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతణ్ణి దాచిపెట్టింది గనక అతల్యా ఆ పసివాణ్ణి చంపలేకపోయింది. ఈ యెహోషబతు అహజ్యాకు సోదరి.

22:12ఆరు సంవత్సరాలు అతణ్ణి వారితో కూడా దేవుని మందిరంలో దాచారు. అప్పుడు అతల్యా దేశాన్ని పరిపాలించింది.

23:1ఏడవ సంవత్సరంలో యెహోయాదా, బలం కూడదీసుకున్నాడు. అతడు యెరోహాము కొడుకు అజర్యా, యెహోహానాను కొడుకు ఇష్మాయేలూ, ఓబేదు కొడుకు అజర్యా, అదాయా కొడుకు మయశేయా, జిఖ్రీ కొడుకు ఎలీషాపాతూ అనే శతాధిపతులను ఎంపిక చేసుకుని వారితో ఒడంబడిక చేసుకున్నాడు.

23:2వారు యూదా దేశమంతా తిరిగి యూదావారి పట్టణాలన్నిటిలో నుంచి లేవీయులనూ, ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలనూ సమకూర్చారు. వారంతా యెరూషలేముకు వచ్చారు.

23:3ప్రజలంతా సమాజంగా కూడి దేవుని మందిరంలో రాజుతో నిబంధన చేసుకున్నారు. యెహోయాదా వారితో ఇలా అన్నాడు. “యెహోవా దావీదు కుమారులను గురించి చెప్పిన మాట ప్రకారం, రాజు కుమారుడు పరిపాలన చేయాలి.”

23:4“కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే, విశ్రాంతి దినాన సేవచేయడానికి వచ్చే మీలోని యాజకుల్లోనూ లేవీయుల్లోనూ మూడవ భాగం, ద్వారం దగ్గర కాపలా కాయాలి.

23:5మరొక మూడవ భాగం రాజభవనం దగ్గర ఉండాలి. మిగిలిన మూడవ భాగం పునాది గుమ్మం దగ్గర ఉండాలి. ప్రజలంతా యెహోవా మందిర ఆవరణం దగ్గర ఉండాలి.

23:6యాజకులు, లేవీయుల్లో సేవ చేసేవారు తప్ప యెహోవా మందిరం లోపలికి ఇంకెవ్వరూ రాకూడదు. వారు ప్రతిష్టితులు కాబట్టి వారు లోపలికి రావచ్చు గాని ప్రజలంతా యెహోవా ఆజ్ఞ ప్రకారం బయటే ఉండాలి.

23:7లేవీయులంతా తమ తమ ఆయుధాలను చేత పట్టుకుని రాజు చుట్టూ ఉండాలి. మందిరం లోపలికి ఇంకెవరైనా వస్తే, వారిని చంపేయండి. రాజు లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మీరు అతనితో ఉండాలి.”

23:8కాబట్టి లేవీయులు, యూదావారంతా యాజకుడైన యెహోయాదా ఆజ్ఞాపించినట్టు చేశారు. యాజకుడైన యెహోయాదా ఏ వంతు వారికీ సెలవియ్యలేదు కాబట్టి యాజకులంతా విశ్రాంతి దినాన సేవ చేయాల్సిన వారిని, సేవ చేసి బయటికి వెళ్లవలసిన వారిని తీసుకు వచ్చారు.

23:9యాజకుడైన యెహోయాదా దేవుని మందిరంలో రాజైన దావీదుకు చెందిన ఈటెలనూ, పెద్ద డాళ్ళనూ, చిన్న డాళ్లనూ శతాధిపతులకు అప్పగించాడు.

23:10అతడు ఆయుధాలు పట్టుకున్న మనుషులందరినీ మందిరపు కుడివైపు నుంచి ఎడమవైపు వరకూ బలిపీఠం పక్కన, మందిరం పక్కన, రాజు చుట్టూ ఉంచాడు.

23:11అప్పుడు వారు రాకుమారుడిని బయటికి తెచ్చి, అతని తలపై కిరీటం పెట్టి, ధర్మశాస్త్రాన్ని అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేశారు. యెహోయాదా, అతని కొడుకులూ అతనిని అభిషేకించి “రాజు చిరంజీవి అగు గాక” అన్నారు.

23:12రాజును పొగుడుతూ పరుగులు పెడుతున్న ప్రజల శబ్దం అతల్యా విని, యెహోవా మందిరంలో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చింది.

23:13ప్రవేశ స్థలం దగ్గర అతనికి ఏర్పాటు చేసిన స్తంభం దగ్గర రాజు నిలబడడం ఆమె చూసింది. అధికారులూ, బాకాలు ఊదేవారూ రాజు దగ్గర ఉండి, దేశంలోని ప్రజలంతా సంతోషిస్తూ, బాకాలతో శబ్దాలు చేస్తూ, గాయకులు సంగీత వాద్యాలతో స్తుతిపాటలు పాడుతూ ఉండడం చూసి బట్టలు చించుకుని “రాజ ద్రోహం! రాజద్రోహం!” అని అరిచింది.

23:14అప్పుడు యాజకుడైన యెహోయాదా సైన్యం మీద అధికారులుగా ఉన్న శతాధిపతులను పిలిపించి “యెహోవా మందిరంలో ఆమెను చంపవద్దు. సైనిక పంక్తుల అవతలకు తీసుకెళ్ళి ఆమె పక్షాన ఉన్న వారిని, ఆమెను కత్తితో చంపాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.

23:15కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి, రాజ భవనం దగ్గరున్న గుర్రపు ద్వారం ప్రవేశస్థలానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను అక్కడ చంపేశారు.

23:16వారంతా యెహోవా ప్రజలుగా ఉండాలని ప్రజలందరితోనూ రాజుతోనూ యెహోయాదా అప్పుడు నిబంధన చేశాడు.

23:17అప్పుడు ప్రజలంతా బయలు దేవుడి గుడికి వెళ్లి దాన్ని పడగొట్టారు. బయలు బలిపీఠాలను విగ్రహాలను ముక్కలు ముక్కలు చేసి, బయలు యాజకుడు మత్తానును బలిపీఠం ఎదుట చంపేశారు.

23:18యెహోవా మందిరంలో దావీదు నియమించినట్టుగానే పనిచేసే వారిని బలులు అర్పించే వారిని లేవీయులైన యాజకుల పర్యవేక్షణలో యెహోయాదా నియమించాడు. వీరు మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టే దావీదు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సంతోషంతో సంగీతాలతో సేవ జరిగించారు.

23:19యెహోవా మందిరంలో ఏ విధంగానైనా మైలబడిన వారు ప్రవేశించకుండా అతడు గుమ్మాల దగ్గర ద్వారపాలకులను ఉంచాడు.

23:20అతడు శతాధిపతులనూ ప్రధానులనూ ప్రజల అధికారులనూ దేశ ప్రజలందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరంలో నుంచి రాజును తీసుకుని వచ్చాడు. వారు ఎత్తయిన గుమ్మం ద్వారా రాజభవనానికి వెళ్లి రాజ్యసింహాసనం మీద రాజును కూర్చోబెట్టారు.

23:21దేశ ప్రజలంతా ఎంతో ఆనందించారు. పట్టణం నెమ్మదిగా ఉంది. వారు అతల్యాను కత్తితో చంపేశారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు