Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › యెరూషలేములో

సువార్తలు పక్కపక్కనే · యెరూషలేములో

ద్రాక్షతోట కౌలుదారుల ఉపమానం

మత్తయి 21:33–46 · మార్కు 12:1–12 · లూకా 20:9–19

మత్తయి

మత్తయి 21:33–46

33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు.

34కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు.

35ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు.

36అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు.

37చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు.

38అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు.

39వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు.

40ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు.

41వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు.

42అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?

43“కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.

44ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవరి మీద పడుతుందో వాణ్ణి అది నలిపి పొడి చేస్తుంది” అన్నాడు.

45ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ముఖ్య యాజకులు, పరిసయ్యులు గ్రహించారు.

46వారు ఆయనను పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారుగానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.

మార్కు

మార్కు 12:1–12

1ఆ తరువాత ఆయన వారితో ఉదాహరణలతో మాట్లాడసాగాడు. “ఒకడు ద్రాక్షతోట వేసి చుట్టూ గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు తొక్కడానికి గానుగ తొట్టి కట్టించి, అక్కడే ఒక కావలి గోపురం కూడా కట్టించాడు. ఆ తరువాత ఆ ద్రాక్షతోటను రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై దూర దేశానికి వెళ్ళాడు.

2పంటకాలం వచ్చినప్పుడు ఆ ద్రాక్షపండ్లలో తనకు రావలసిన భాగం తీసుకురమ్మని ఒక సేవకుణ్ణి వారి దగ్గరికి పంపాడు.

3అయితే ఆ రైతులు ఆ సేవకుణ్ణి పట్టుకుని కొట్టి, వట్టి చేతులతో పంపివేశారు.

4అతడు మళ్ళీ ఇంకొక సేవకుణ్ణి పంపాడు. వారు అతని తలపై గాయపరచి, అవమానించి పంపివేశారు.

5అతడు ఇంకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వారు అతణ్ణి చంపేశారు. అతడింకా చాలా మందిని పంపాడు. కాని, ఆ రైతులు వారిలో కొందరిని కొట్టి, ఇంకొందరిని చంపారు.

6వారి దగ్గరికి పంపడానికి ఇక తన ప్రియ కుమారుడు ఒక్కడే మిగిలాడు. వారు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకుని చివరిగా అతడు తన కుమారుణ్ణి పంపాడు.

7కాని ఆ కౌలుదారులు ‘ఇతడే వారసుడు! ఇతన్ని చంపుదాం. అప్పుడు వారసత్వం మనది అవుతుంది’ అని తమలో తాము మాట్లాడుకున్నారు.

8వారు అతన్ని పట్టుకుని, చంపి ఆ ద్రాక్షతోట అవతల పారవేశారు.

9అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతులను చంపి, ఆ ద్రాక్షతోటను ఇతరులకు కౌలుకిస్తాడు.

10మీరు ఈ లేఖనం చదవలేదా? ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.

11అది ప్రభువు మూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’”

12ఈ ఉపమానం తమ గురించే చెప్పాడని వారు గ్రహించారు. కనుక ఆయనను బంధించాలని చూశారు కాని, ప్రజల గుంపును చూసి జంకారు. అందువల్ల ఆయనను వదిలి వెళ్ళిపోయారు.

లూకా

లూకా 20:9–19

9ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తరువాత వేరే దేశానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉన్నాడు.

10కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.

11మళ్ళీ అతడు మరో పనివాణ్ణి పంపాడు. వారు వాణ్ణి కూడా కొట్టి, అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు.

12మళ్ళీ అతడు మూడవ వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు.

13అప్పుడా ద్రాక్షతోట యజమాని ఇలా అనుకున్నాడు, “ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో.”

14అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి, “ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.

15వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు?

16అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు.” వారు అది విని, “అలా ఎన్నటికీ కాకూడదు” అన్నారు.

17ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి?

18ఈ రాయి పైన పడే ప్రతి వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది.”

19ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు