Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › యెరూషలేములో

సువార్తలు పక్కపక్కనే · యెరూషలేములో

ఏ అధికారంతో?

మత్తయి 21:23–27 · మార్కు 11:27–33 · లూకా 20:1–8

మత్తయి

మత్తయి 21:23–27

23ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.

24యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.

25యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు.

26మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని,

27“మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు.

మార్కు

మార్కు 11:27–33

27యేసు, ఆయన శిష్యులు యెరూషలేము చేరుకున్నారు. ఆయన దేవాలయంలో నడుస్తూ ఉండగా ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి

28ఆయనతో, “నీవు ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావు? ఈ పనులు చేయడానికి అధికారం నీకెవరిచ్చారు?” అని అడిగారు.

29యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి. అప్పుడు నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో మీకు చెబుతాను.

30యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుంచి వచ్చింది? పరలోకం నుండా మనుషుల నుండా? చెప్పండి” అన్నాడు.

31వారు ఆ విషయాన్ని గురించి తమలో తాము ఈ విధంగా చర్చించుకున్నారు. “‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదు?’ అంటాడు.

32‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు మన మీద కోపం వస్తుంది” అనుకున్నారు. ఎందుకంటే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అని అందరూ నమ్మేవారు.

33కనుక వారు, “మాకు తెలియదు” అని జవాబు చెప్పారు. యేసు, “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అదీ మీకు చెప్పను” అన్నాడు.

లూకా

లూకా 20:1–8

1ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి,

2“నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు” అని ఆయనను అడిగారు.

3దానికి ఆయన, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి.

4యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల్లో నుండి కలిగిందా?” అని వారినడిగాడు.

5వారు ఇలా ఆలోచించారు, “మనం ‘పరలోకం నుండి కలిగింది’ అంటే, ‘అలాగైతే మీరెందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు.

6‘మనుషుల్లో నుండి కలిగింది’ అంటే జనం మనలను రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు.”

7ఇలా ఆలోచించుకుని వారు, “అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు” అని జవాబిచ్చారు.

8దానికి యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను” అన్నాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు