Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 26 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 13 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 26 ఏప్రిల్, 2027

సోమవారం · పవిత్ర వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

మహా పవిత్ర సోమవారం

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సువార్త (పెండ్లికుమారుని ఉదయ ప్రార్థన)

మత్తయి 21:18–43

18తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 19అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, “ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!” అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది. 20అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి, “ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!” అని చెప్పుకున్నారు. 21అందుకు యేసు, “మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దాన్ని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది. 22మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు” అని వారితో చెప్పాడు. 23ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరికి వచ్చి, “ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు. 24యేసు, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను. 25యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా? లేక మనుషుల నుండి వచ్చిందా?” అని వారిని అడిగాడు. అప్పుడు వారు, “మనం పరలోకం నుండి, అని చెబితే, ‘మీరెందుకు యోహానును నమ్మలేదు?’ అంటాడు. 26మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది అని తమలో తాము చర్చించుకుని, 27“మాకు తెలియదు” అన్నారు. అప్పుడాయన “అలాగైతే నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో కూడా చెప్పను” అన్నాడు. 28ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు. 29అతడు, ‘నేను వెళ్ళను’ అని జవాబిచ్చాడుగానీ తరవాత మనసు మార్చుకుని వెళ్ళాడు. 30అప్పుడా తండ్రి తన రెండవ కొడుకు దగ్గరికి వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, ‘నేను వెళతాను’ అన్నాడుగానీ వెళ్ళలేదు. 31ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. 32యోహాను నీతి మార్గంలో మీ దగ్గరికి వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడ లేదు, అతనిని నమ్మలేదు. 33“ఇంకో ఉపమానం వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దాన్ని కౌలుకిచ్చి దూరదేశం వెళ్ళాడు. 34కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసుకు రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరికి తన దాసులను పంపాడు. 35ఆ రైతులు అతని దాసులను పట్టుకుని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకణ్ణి రాళ్ళతో కొట్టి చంపారు. 36అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసులను పంపాడు. కానీ వారు వీరిని కూడా ముందు వారికి చేసినట్టే చేశారు. 37చివరికి ఆ యజమాని ‘నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు’ అనుకుని, తన కుమారుణ్ణి వారి దగ్గరికి పంపాడు. 38అయితే ఆ కౌలుదారులు అతణ్ణి చూసి, ‘అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి’ అని తమలో తాము చెప్పుకున్నారు. 39వారు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు. 40ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతులను ఏం చేస్తాడు?” అని వారిని అడిగాడు. 41వారు “అతడు ఆ దుర్మార్గులను నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అని ఆయనకు జవాబిచ్చారు. 42అప్పుడు యేసు వారితో, “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా? 43“కాబట్టి దేవుని రాజ్యాన్ని మీ నుండి తీసివేసి, దాని ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.

ఆరవ ఘడియ

యెహె 1:1–20

1నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను. 2అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున 3కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది. 4అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది. 5దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి. 6ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి. 7వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. 8అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి. 9వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి. 10వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి. 11వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి. 12అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి. 13ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి. 14ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి. 15తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి. 16ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి. 17అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు. 18వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి. 19ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి. 20ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

నిర్గ 1:1–20

1యాకోబుతోబాటు ఐగుప్తుకు వెళ్ళిన అతని కొడుకులు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను, 2దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 3యాకోబుకు పుట్టిన సంతానం మొత్తం 70 మంది. 4యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సమయంలో 5వీళ్ళంతా తమ తమ కుటుంబాలతో సహా ఐగుప్తులో నివసించారు. 6యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు. 7ఇశ్రాయేలు ప్రజలు వారు నివసిస్తున్న ప్రాంతమంతటా తమ సంతానంతో బాగా విస్తరించి అభివృద్ధి పొందారు. ఆ ప్రాంతమంతా ఇశ్రాయేలు ప్రజలతో నిండిపోయింది. 8కొంతకాలానికి యోసేపు ఎవరో తెలియని కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలు పెట్టాడు. 9అతడు తన ప్రజలతో ఇలా అన్నాడు “ఇశ్రాయేలు ప్రజలను చూడండి. వీళ్ళు మనకంటే సంఖ్యలో ఎక్కువగా, శక్తిమంతులుగా ఉన్నారు. 10వాళ్ళ విషయంలో మనం తెలివిగా ఏదన్నా చేద్దాం. లేకపోతే వాళ్ళ జనాభా పెరిగిపోతుంది. ఒకవేళ యుద్ధం గనక వస్తే వాళ్ళు మన శత్రువులతో చేతులు కలిపి మనకి వ్యతిరేకంగా యుద్ధం చేసి ఈ దేశం నుండి వెళ్లిపోతారేమో” అన్నాడు. 11అందుచేత వారు ఇశ్రాయేలు ప్రజలచే కఠిన బాధ చేయించి కఠినులైన అధికారులను వారి మీద నియమించాడు. ఆ అధికారులు ఫరో రాజు కోసం పీతోము, రామెసేసు అనే గిడ్డంగుల పట్టణాలను కట్టించారు. 12ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు. 13ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు. 14బంకమట్టి పని, ఇటుకల పని, పొలంలో చేసే ప్రతి పనీ కఠినంగా చేయించుకుని వారి ప్రాణాలు విసిగిపోయేలా చేశారు. వారు ఇశ్రాయేలు ప్రజలతో చేయించుకొనే అన్ని పనులూ కఠిన బాధతో కూడి ఉండేవి. 15ఐగుప్తు రాజు హీబ్రూ మంత్రసానులతో మాట్లాడాడు. వారి పేర్లు షిఫ్రా, పూయా. 16“మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోస్తున్నప్పుడు జాగ్రత్తగా కనిపెట్టి చూడండి. మగ పిల్లవాడు పుడితే ఆ బిడ్డను చంపివేయండి, ఆడ పిల్ల అయితే బతకనియ్యండి” అన్నాడు. 17అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయలేదు. మగపిల్లలను చంపకుండా బతకనిచ్చారు. 18ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి “మీరు ఇలా ఎందుకు చేశారు? మగపిల్లలను చంపకుండా ఎందుకు బతకనిచ్చారు?” అని అడిగాడు. 19అప్పుడు ఆ మంత్రసానులు “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలలాంటి వాళ్ళు కాదు. తెలివైనవాళ్ళు. మంత్రసాని వాళ్ళ దగ్గరికి వెళ్లకముందే ప్రసవిస్తున్నారు” అని ఫరోతో చెప్పారు. 20మంత్రసానులు దేవునికి భయపడినందువల్ల దేవుడు వారిని దీవించాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వారి సంతానం విస్తరించింది.

సాయంకాల ప్రార్థన: పఠనం

యోబు 1:1–12

1ఊజు దేశంలో యోబు అనే ఒక మనిషి ఉండేవాడు. అతడు దేవునిపట్ల భయభక్తులు కలిగి, యథార్థమైన ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అసహ్యించుకునేవాడు. 2అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. 3అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశుసంపద ఉంది. అనేకమంది పనివాళ్ళు అతని దగ్గర పని చేసేవారు. ఆ కాలంలో తూర్పున ఉన్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పవాడుగా ఎంచారు. 4అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్ళలో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ ముగ్గురు అక్కచెల్లెళ్ళను కూడా ఆహ్వానించేవాళ్ళు. 5వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించే వాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతి రోజూ యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. 6ఒకరోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. 7యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని సాతానును అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని జవాబిచ్చాడు. 8అప్పుడు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థ వర్తనుడు. నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు” అన్నాడు. 9అందుకు సాతాను “యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? 10నువ్వు యోబునూ, అతని సంతానాన్నీ, అతని ఆస్తి అంతటినీ కంచె వేసి కాపాడుతున్నావు గదా? నువ్వు అతడు చేస్తున్న ప్రతిదాన్నీ దీవిస్తున్నావు గనక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. 11అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు” అని యెహోవాతో అన్నాడు. 12అప్పుడు యెహోవా “ఇదిగో, అతనికి ఉన్నదంతా నీ ఆధీనంలో ఉంచుతున్నాను. అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు” అని అపవాదికి చెప్పాడు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్ళిపోయాడు.

సువార్త (ముందుగా పవిత్రపరచిన కానుకల ఆరాధన)

మత్తయి 24:3–35

3ఆయన ఒలీవ కొండమీద కూర్చుని ఉండగా శిష్యులు ఆయన దగ్గరికి ఏకాంతంగా వచ్చి, “నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు” అని అడిగారు. 4యేసు వారితో ఇలా అన్నాడు, “ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. 5చాలామంది నా నామంలో వచ్చి ‘నేనే క్రీస్తుని’ అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు. 6అంతే గాక మీరు యుద్ధాల గురించి వింటారు. వాటి గురించిన వార్తలు వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు. 7జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి. 8ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే. 9“అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా నామం కారణంగా మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు. 10ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకుని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు. 11అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు. 12అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది. 13కానీ అంతం వరకూ ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది. 14రాజ్యం గురించిన సువార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది. 15“కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక), 16యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి. 17మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు. 18పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు. 19అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం. 20అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి. 21ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు. 22ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు. 23“ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు. 24కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు. 25ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను. 26కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు. 27“మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది. 28శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి. 29“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి. 30అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు. 31ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకూ నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్న వారిని సమకూర్చుతారు. 32“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు. 33అదే విధంగా ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి. 34ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 35ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 13 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 26 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు