Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 25 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 12 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 25 ఏప్రిల్, 2027

ఆదివారం

పండుగలు మరియు పరిశుద్ధులు

మట్టల ఆదివారం. మన ప్రభువు యెరూషలేము ప్రవేశం

మహా ఉపవాస కాలం

చేపలు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 49:1–2, 8–12

1యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను. 2యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. 8యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. 9యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు? 10షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి. 11ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు. 12అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.

సాయంకాల ప్రార్థన: పఠనం

జెఫ 3:14–19

14సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. 15మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. 16ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు. యెరూషలేమూ, భయపడకు. సీయోనూ, ధైర్యం తెచ్చుకో. 17నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిశాలి. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన బహు ఆనందంతో నీ విషయం సంతోషిస్తాడు. నీ పట్ల తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ విషయమైన సంతోషము మూలంగా ఆయన హర్షిస్తాడు. 18నీ నియామక కాలపు పండగలకు రాలేక చింతపడే నీ బంధువులను నేను సమకూరుస్తాను. వారు గొప్ప అవమానం పొందిన వారు. 19ఆ కాలమున నిన్ను హింస పెట్టే వారినందరినీ నేను శిక్షిస్తాను. కుంటుతూ నడిచే వారిని నేను రక్షిస్తాను. చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. ఏ యే దేశాల్లో వారు అవమానం పాలయ్యారో అలాటి ప్రతి చోటా నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేస్తాను.

సాయంకాల ప్రార్థన: పఠనం

జెక 9:9–15

9సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు. 10నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను. యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను. యుద్ధపు విల్లు లేకుండా పోతుంది. నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు. 11నీవు చేసిన నిబంధన రక్తాన్ని బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపిస్తాను. 12బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ గల మీరంతా మీ కోటలో మళ్ళీ ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేస్తానని ఈ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను. 13యూదా వారిని నాకు విల్లుగా వంచుతున్నాను. ఎఫ్రాయిము వారిని బాణాలుగా చేస్తున్నాను. సీయోనూ, నీ కుమారులను రేపుతున్నాను. శూరుడు కత్తి ఝలిపించినట్టు నేను నిన్ను ప్రయోగిస్తాను. గ్రీసు దేశవాసులారా, సీయోను కుమారులను మీ మీదికి రేపుతున్నాను. 14యెహోవా వారికి పైగా ప్రత్యక్షమౌతాడు. ఆయన బాణాలు మెరుపువలె వెలువడుతాయి. ప్రభువగు యెహోవా శంఖం పూరిస్తూ దక్షిణ దిక్కునుండి వచ్చే గొప్ప సుడిగాలితో బయలు దేరుతాడు. 15సేనల ప్రభువు యెహోవా వారిని కాపాడుతాడు గనక వారు భక్షిస్తూ వడిసెలరాళ్లను అణగ దొక్కుతూ వస్తారు. ద్రాక్షారసం తాగుతూ, తాగడం మూలంగా సింహనాదాలు చేస్తూ, బలిపీఠపు మూలల్లో పెట్టి ఉన్న పాత్రలు రక్తంతో నిండినట్లు నిండిపోతారు.

ఉదయ ప్రార్థన: సువార్త

మత్తయి 21:1–11, 15–17

1వారు యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, 2“మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్ళగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరికి తోలుకుని రండి. 3ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, ‘అవి ప్రభువుకు కావాలి’ అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు” అని చెప్పి వారిని పంపించాడు. 4దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు నెరవేరేలా ఇది జరిగింది, ఆ మాటలు ఏవంటే, 5“ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.” 6అప్పుడా శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. 7వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు. 8జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు. 9జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, “దావీదు కుమారుడికి జయం! ప్రభువు పేరిట వచ్చేవాడికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం” అని కేకలు వేస్తూ వచ్చారు. 10ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, “ఎవరీయన?” అని కలవరంతో నిండిపోయింది. 11ఆయనతో వచ్చిన జనసమూహం, “ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త” అని వారికి జవాబిచ్చారు. 15ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు. 16“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి 17ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.

పత్రిక

ఫిలిప్పీ 4:4–9

4ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి. 5మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు. 6దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. 7అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది. 8చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి. 9మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.

సువార్త

యోహా 12:1–18

1పస్కాకు ఆరు రోజుల ముందు యేసు బేతనియ వచ్చాడు. మరణించిన లాజరును యేసు మళ్ళీ బతికించిన గ్రామం ఇదే. 2అక్కడ ఆయన కోసం భోజనం ఏర్పాటు చేశారు. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో భోజనం బల్ల దగ్గర కూర్చున్నవారిలో లాజరు కూడా ఒకడు. 3అప్పుడు మరియ, అరకిలో బరువు ఉన్న స్వచ్చమైన జటామాంసి చెట్లనుంచి తీసిన ఖరీదైన అత్తరును యేసు పాదాల మీద పోసి అభిషేకించి, ఆయన పాదాలు తన తలవెంట్రుకలతో తుడిచింది. ఇల్లంతా ఆ అత్తరు సువాసనతో నిండిపోయింది. 4ఆయనను అప్పగించ బోతున్నవాడు, ఆయన శిష్యుల్లో ఒకడు అయిన ఇస్కరియోతు యూదా, 5“ఈ అత్తరు మూడువందల దేనారాలకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు గదా?” అన్నాడు. 6అతనికి పేదవాళ్ళ పట్ల శ్రద్ధ ఉండి ఇలా అనలేదు. అతడు దొంగ. అతని ఆధీనంలో ఉన్న డబ్బు సంచిలో నుండి కొంత సొమ్ము తన సొంతానికి తీసుకుంటూ ఉండేవాడు. 7యేసు, “ఈమెను ఇలా చెయ్యనివ్వండి, నా సమాధి రోజు కోసం ఈమె దీన్ని సిద్ధపరచింది. 8పేదవారు ఎప్పుడూ మీతో ఉంటారు, కాని నేను ఎప్పుడూ మీతో ఉండను కదా” అన్నాడు. 9అప్పుడు పెద్ద యూదుల సమూహం యేసు అక్కడ ఉన్నాడని తెలుసుకుని, యేసు కోసమే కాక, యేసు చావు నుంచి తిరిగి లేపిన లాజరును కూడా చూడాలని అక్కడికి వచ్చారు. 10లాజరును బట్టి చాలా మంది యూదులు వెళ్ళి యేసు మీద నమ్మకం ఉంచారు. కాబట్టి ముఖ్య యాజకులు లాజరును కూడా చంపాలని అనుకున్నారు. 12ఆ తరువాతి రోజున పండగకి వచ్చిన గొప్ప జనసమూహం అక్కడ పోగయ్యింది. యేసు యెరూషలేముకు వస్తున్నాడని విన్నప్పుడు, 13వారంతా ఖర్జూరం మట్టలు తీసుకుని ఆయనకు ఎదురుగా వెళ్ళి, “హోసన్నా! ప్రభువు పేరిట వస్తున్న ఇశ్రాయేలు రాజుకు స్తుతి కలుగు గాక!” అని కేకలు వేశారు. 14“సీయోను కుమారీ, భయపడకు! నీ రాజు గాడిద పిల్ల మీద కూర్చుని వస్తున్నాడు” అని రాసి ఉన్న విధంగా యేసు చిన్న గాడిదను చూసి దాని మీద కూర్చున్నాడు. 16ఆయన శిష్యులు ఈ సంగతులు మొదట్లో గ్రహించలేదు గాని యేసు మహిమ పొందిన తరువాత, ఈ సంగతులు ఆయన గురించి రాసినవనీ, వారు ఆయనకు ఈ విధంగా చేశారనీ గుర్తు చేసుకున్నారు. 17ఆయన లాజరును సమాధిలో నుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. 18ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెళ్ళారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 12 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 25 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు