హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 27 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 14 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 27 ఏప్రిల్, 2027
మంగళవారం · పవిత్ర వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా పవిత్ర మంగళవారం
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సువార్త (పెండ్లికుమారుని ఉదయ ప్రార్థన)
15అప్పుడు పరిసయ్యులు వెళ్ళి, ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు. 16వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు. వారు ఆయనతో, “బోధకా, నీవు యథార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ, ఎలాటి పక్షపాతం చూపవనీ మాకు తెలుసు. 17సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు” అని అడిగారు. 18యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, “కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు? 19ఏదీ, సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి” అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు. 20ఆయన, “దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని వారినడిగాడు. వారు, “అవి సీజరు చక్రవర్తివి” అన్నారు. 21ఆయన వెంటనే, “అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి” అని వారితో చెప్పాడు. 22వారీమాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. 23అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి, 24“బోధకా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్ళి చేసికుని తన సోదరునికి సంతానం కలిగించాలి’ అని మోషే చెప్పాడు గదా. 25మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు. 26ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాడి వరకూ అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు. 27వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది. 28చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా?” అని అడిగారు. 29అందుకు యేసు, “మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు. 30పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు. 31చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, ‘నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి’ అని చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు, చనిపోయిన వారికి కాదు” అని వారితో చెప్పాడు. 33ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు. 34ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు. 35వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి, 36“బోధకా, ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని అడిగాడు. 37అందుకు యేసు, “‘నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి’ అనేదే. 38ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ. 39‘మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి’ అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే. 40ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం” అని అతనితో చెప్పాడు. 41మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని, 42“క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?” అని ప్రశ్నించాడు. వారు, “ఆయన దావీదు కుమారుడు” అని చెప్పారు. 43అందుకు యేసు, “అయితే, ‘నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ 44నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు’ అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు? 45దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?” అని వారిని అడిగాడు. 46ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. 23:1అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, 2“ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. 3కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. 4మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు. 5వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. 6విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు. 7సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం. 8మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. 9ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. 10అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. 12తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది. 13“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు. 14మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించనియ్యరు. 15అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు. 16“అయ్యో, అంధ మార్గదర్శులారా, ‘ఒకడు దేవాలయం తోడు అని ఒట్టు పెట్టుకున్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి’ అని మీరు చెబుతారు. 17బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయమా? 18అలాగే ‘బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలి’ అని మీరు చెబుతారు. 19అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దాన్ని పవిత్రపరిచే బలిపీఠమా? 20బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 21అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 22ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాడి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు. 23“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదవ వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదవ వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి. 24అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమలను వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు. 25అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారుగానీ అవి లోపలంతా దోపిడీతో, అత్యాశతో నిండి ఉన్నాయి. 26గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది. 27అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలతో, సమస్త కల్మషంతో నిండి ఉంటాయి. 28అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీరు లోపల కపటంతో, దుష్టత్వంతో నిండి ఉంటారు. 29“అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు. 30‘మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసే వాళ్ళం కాము’ అని చెప్పుకొంటారు. 31నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు. 32ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి. 33“సర్పాల్లారా, పాము పిల్లలారా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు. 34కాబట్టి వినండి! నేను మీ దగ్గరికి ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు. సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు. 35నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీ పైకి వస్తుంది. 36అదంతా ఈ తరం వారి మీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను. 37“యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరికి పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకుని దాచిపెడుతుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు. 38ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను 39ఇప్పటి నుండి మీరు ‘ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతులు పొందుతాడు గాక’ అని చెప్పే వరకూ మీరు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను.”
ఆరవ ఘడియ
21ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి. 22ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది. 23ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి. 24ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి. 25అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది. 26వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది. 27అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. 28అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.
సాయంకాల ప్రార్థన: పఠనం
5ఫరో చక్రవర్తి కూతురు స్నానం చేయడానికి నది దగ్గరికి వచ్చింది. ఆమె దాసీలు నది ఒడ్డున విహరిస్తూ ఉన్నారు. ఆమె రెల్లు గడ్డిలో ఉన్న ఆ పెట్టెను చూసి, తన దాసిని పంపి దాన్ని తెప్పించింది. 6పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది. 7అప్పుడు దూరంగా నిలబడి ఉన్న పిల్లవాడి అక్క వచ్చి ఫరో కూతురితో “నీ కోసం ఈ పిల్లవాణ్ణి పెంచడానికి నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక ఆయాని తీసుకు రమ్మంటారా?” అని అడిగింది. 8ఫరో కూతురు “వెళ్లి తీసుకు రా” అంది. ఆ బాలిక వెళ్లి ఆ బిడ్డ తల్లిని తీసుకు వచ్చింది. 9ఫరో కూతురు ఆమెతో “ఈ పిల్లవాణ్ణి తీసుకు పోయి నా కోసం పాలిచ్చి పెంచు. నేను నీకు జీతం ఇస్తాను” అని చెప్పింది. ఆమె పిల్లవాణ్ణి తీసుకు పోయి పాలిచ్చి పెంచింది. 10ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత ఆమె అతణ్ణి ఫరో కూతురి దగ్గరికి తీసుకు వచ్చింది. అతడు ఆమెకు కొడుకు అయ్యాడు. ఆమె “నీళ్ళలో నుండి నేను ఇతన్ని బయటకు తీశాను, కాబట్టి ఇతని పేరు మోషే” అని చెప్పింది.
సాయంకాల ప్రార్థన: పఠనం
13ఒక రోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు, కూతుళ్ళు భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు. 14అతడు వాళ్ళతో “ఎద్దులు నాగలి దున్నుతున్నాయి. గాడిదలు ఆ పక్కనే మేత మేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో సేబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు. 15పనివాళ్ళను కత్తులతో చంపివేశారు. నేనొక్కడినే తప్పించుకుని జరిగిందంతా మీకు చెప్పడానికి వచ్చాను” అని చెప్పాడు. 16ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. “దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసింది. ఆ అగ్ని వల్ల గొర్రెలు, పనివాళ్ళు తగలబడిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు. 17అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతడు “కల్దీయ జాతి వారు మూడు గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని, పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు. 18అదే సమయంలో మరో సేవకుడు వచ్చి “నీ కొడుకులు, కూతుళ్ళు నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ, ద్రాక్షరసం తాగుతూ ఉన్నారు. 19అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళున్న ఇల్లు నాలుగు వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువతీయువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేనొక్కడినే తప్పించుకుని వచ్చాను” అని చెప్పాడు. 20అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. 21“నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.” 22జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.
సువార్త (ముందుగా పవిత్రపరచిన కానుకల ఆరాధన)
36“అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గానీ ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారుడికి కూడా తెలియదు. 37నోవహు రోజుల్లో ఎలా ఉండేదో మనుష్య కుమారుడి రాకడ కూడా అలా ఉంటుంది. 38జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు. 39జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకునిపోయే వరకూ వారికి తెలియలేదు. ఆ విధంగానే మనుష్య కుమారుడి రాకడ ఉంటుంది. 40ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు. 41ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది. 42ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండండి. 43దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకుని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా! 44మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి. 45“ఒక యజమాని తన ఇంట్లో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుడు ఎవరు? 46యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు. 47ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను. 48కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, ‘నా యజమాని ఆలస్యంగా వస్తాడులే’ అని తన మనసులో అనుకుని 49తన సాటి సేవకులను కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే, 50అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వస్తాడు. 51వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు. అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.” 25:1“పరలోక రాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి కాగడాలు పట్టుకుని బయలుదేరారు. 2వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు. 3తెలివి తక్కువ వారు తమ దీపాలు పట్టుకున్నారు గాని తమతో నూనె తీసుకుని పోలేదు. 4తెలివైన వారు తమ దీపాలతో బాటు సీసాల్లో నూనె తీసుకుని వెళ్ళారు. 5పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రపోయారు. 6అర్థరాత్రి, ‘ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి’ అనే పిలుపు వినిపించింది. 7అప్పుడు ఆ కన్యలంతా లేచి తమ దీపాలు సరిచేసుకున్నారు. 8అయితే తెలివి తక్కువవారు, ‘మా దీపాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?’ అని తెలివైన వారిని అడిగారు. 9అందుకు వారు, ‘మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి’ అని చెప్పారు. 10వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్ళారు. వెంటనే తలుపు మూశారు. 11ఆ తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ‘ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి’ అని అడిగారు. 12కాని ఆయన, ‘నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు’ అన్నాడు. 13ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి. 14“పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు. 15వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు. 16ఐదు తలాంతులు తీసుకున్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు. 17అదే విధంగా రెండు తలాంతులు తీసుకున్న వాడు ఇంకో రెండు సంపాదించాడు. 18అయితే ఒక తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు. 19“చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు. 20అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి ‘అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. 21అతని యజమాని, ‘ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. 22అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, ‘అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను’ అని చెప్పాడు. 23యజమాని, ‘ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో’ అన్నాడు. 24తరువాత ఒక్క తలాంతు తీసుకున్నవాడు వచ్చాడు. అతడన్నాడు, ‘అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు. 25కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసుకోండి’ అన్నాడు. 26అందుకు ఆ యజమాని అతనితో, ‘నీవు సోమరివాడివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసేవాడిని అని నీకు తెలుసు గదా! 27అలాంటప్పుడు నీవు నా డబ్బును వడ్డీ వ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దాన్ని వడ్డీతో కలిపి తీసుకుని ఉండేవాణ్ణి’ అని చెప్పి, 28‘ఆ తలాంతును వాడి దగ్గర నుండి తీసుకుని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి. 29ఉన్న ప్రతివాడికీ మరింత ఇవ్వడం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది. 30పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి. 31“మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. 32మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. 34తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు. 37అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు. 41“తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు. 44అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.” 26:1యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో, 2“రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 14 ఏప్రిల్ పౌర కాలెండర్లో 27 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు