18:13హిజ్కియా రాజు పరిపాలనలో 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో ఉన్న ప్రాకారాలున్న పట్టాణాలన్నిటి మీద దాడి చేసి వాటిని చేజిక్కించుకున్నాడు.
18:14యూదారాజు హిజ్కియా, లాకీషు పట్టణంలో ఉన్న అష్షూరు రాజు దగ్గరికి వార్తాహరులను పంపి “నావల్ల తప్పు జరిగింది. నా దగ్గర నుంచి నీవు వెనక్కి వెళ్ళిపోతే నీవు నా మీద మోపిన దాన్ని నేను భరిస్తాను” అని వార్త పంపించాడు. అష్షూరురాజు 600 మణుగుల వెండి, 60 మణుగుల బంగారం యూదా రాజు హిజ్కియా చెల్లించాలని విధించాడు.
18:15కాబట్టి హిజ్కియా యెహోవా మందిరంలో, రాజనగరంలో, వస్తువుల రూపంలో ఉన్న వెండి అంతా అతనికి ఇచ్చేశాడు.
18:16ఇంకా ఆ కాలంలో హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారం, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారం తీయించి అష్షూరు రాజుకిచ్చాడు.
18:17కాని, అష్షూరు రాజు తర్తాను, రబ్సారీసు, రబ్షాకేనులను లాకీషు పట్టణం నుంచి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజుపైకి పెద్ద సైన్యంతో పంపాడు. వారు యెరూషలేముపై దండెత్తి చాకిరేవు మార్గంలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గర ప్రవేశించి, అక్కడ ఉండి రాజును పిలిపించాడు.
18:18హిల్కీయా కొడుకూ, గృహ నిర్వాహకుడూ అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధికారి అయిన ఆసాపు కొడుకు యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.
18:19అప్పుడు రబ్షాకే వాళ్ళతో అష్షూరురాజు హిజ్కియాతో చెప్పమన్నది ఈ విధంగా వినిపించాడు. “నీకున్న ఈ ధైర్యానికి ఆధారం ఏంటి?
18:20యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం అన్నీ వట్టి మాటలే. నా మీద తిరుగుబాటు చెయ్యడానికి నీకు ధైర్యం ఇచ్చింది ఎవరు?
18:21నలిగిన రెల్లులాంటి ఈ ఐగుప్తును నమ్ముకుంటున్నావు. కాని, ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుని లోపలికి దిగుతుంది. అతన్ని నమ్ముకున్న వాళ్ళందరికీ ఐగుప్తురాజు ఫరో అలాంటివాడే.
18:22మా దేవుడు యెహోవాను మేము నమ్ముకుంటున్నాము, అని ఒకవేళ మీరు నాతో చెప్తారేమో. యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వాళ్ళకూ, యెరూషలేము వాళ్ళకూ ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవరి ఉన్నత స్థలాలూ, బలిపీఠాలూ పడగొట్టాడో ఆయనే గదా యెహోవా?
18:23కాబట్టి, నా యజమాని అష్షూరు రాజు పక్షంగా నిన్ను సవాలు చేస్తున్నాను. చాలినంత మంది రౌతులు నీ దగ్గర ఉంటే రెండువేల గుర్రాలు నేను నీకిస్తాను.
18:24అలా ఐతే నీవు నా యజమాని సేవకుల్లో అతి తక్కువ వాడైన ఒక్క అధిపతినైనా ఎలా ఎదిరించగలవు? రథాలూ, రౌతులూ పంపుతాడని ఐగుప్తురాజును నీవు ఆశ్రయించావు గదా!
18:25యెహోవా ఇష్టం లేకుండానే ఈ దేశంపై యుద్ధం చేసి నాశనం చెయ్యడానికి నేను వచ్చానా? ‘ఆ దేశంపై దాడి చేసి నాశనం చెయ్యి’ అని యెహోవాయే నాకు ఆజ్ఞ ఇచ్చాడు” అన్నాడు.
18:26రబ్షాకేతో హిల్కీయా కొడుకు ఎల్యాకీము, షెబ్నా, యోవాహు ఇలా అన్నారు. “నీ దాసులమైన మాకు సిరియా భాష తెలుసు గనుక ఆ భాషలో మాట్లాడండి. ప్రాకారాల మీద ఉన్న ప్రజలకు తెలిసిన యూదుల భాషలో దయచేసి మాట్లాడొద్దు” అన్నారు.
18:27రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికి నీ యజమాని దగ్గరకూ, నీ దగ్గరికి మాత్రమేనా నా యజమాని నన్ను పంపింది? త్వరలో మీతో పాటు తమ మలం తిని తమ మూత్రం తాగాల్సిన ఈ ప్రాకారాల మీద కూర్చున్న వాళ్ళ దగ్గరికి కూడా నన్ను పంపాడు గదా” అని చెప్పాడు.
18:28అతడు పెద్ద స్వరంతో యూదుల భాషలో “మహారాజైన అష్షూరురాజు చెప్పిన మాటలు వినండి. రాజు చెప్పదేమంటే,
18:29హిజ్కియా వల్ల మోసపోకండి. నా చేతిలోనుంచి మిమ్మల్ని విడిపించడానికి అతనికి శక్తి చాలదు.
18:30యెహోవా పేరట మిమ్మల్ని నమ్మించి, ‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరురాజు చేతికి చిక్కదు’ అని హిజ్కియా చెప్తున్నాడు.
18:31హిజ్కియా చెప్పిన మాట మీరు నమ్మవద్దు. అష్షూరురాజు చెప్పేదేమంటే, నాతో సంధి చేసుకుని మీరు బయటికి నా దగ్గరికి వస్తే, మీలో ప్రతి మనిషీ తన సొంత ద్రాక్షచెట్టు ఫలం, తన అంజూరపు చెట్టు ఫలం తింటూ, తన సొంత బావిలో నీళ్లు తాగుతాడు.
18:32ఆ తరువాత మీరు చనిపోకుండా బ్రతికేలా మేము వచ్చి మీ దేశం లాంటి దేశానికీ, అంటే గోదుమలు, ద్రాక్షారసం ఉన్న దేశానికీ, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికీ, ఒలీవ నూనె, తేనె ఉన్న దేశానికీ మిమ్మల్ని తీసుకు పోతాము. అక్కడ మీరు సుఖంగా ఉంటారు. కాబట్టి, యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని హిజ్కియా మీకు బోధించే మాటలు వినొద్దు.
18:33వివిధ ప్రజల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని అష్షూరురాజు చేతిలోనుంచి విడిపించారా?
18:34హమాతు దేవుళ్ళు ఏమయ్యారు? అర్పాదు దేవుళ్ళు ఏమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళు ఏమయ్యారు? హేన ఇవ్వా అనే వాళ్ళ దేవుళ్ళు ఏమయ్యారు? (షోమ్రోను దేశపు) దేవుళ్ళు మా చేతిలోనుంచి షోమ్రోనును విడిపించారా?
18:35మా చేతిలోనుంచి యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనడానికి, వివిధ దేశాల దేవుళ్లలో ఎవరైనా తమ దేశాన్ని మా చేతిలోనుంచి విడిపించిన సందర్భం ఉందా?” అన్నాడు.
18:36అయితే అతనికి జవాబు ఇవ్వొద్దని రాజు చెప్పిన కారణంగా ప్రజలు ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు.
18:37గృహ నిర్వాహకుడైన హిల్కీయా కొడుకు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్య లేఖనాల అధిపతి ఆసాపు కొడుకు యోవాహు, బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి, రబ్షాకే పలికిన మాటలన్నీ తెలియజేశారు.
19:1వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు.
19:2గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు.
19:3వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు.
19:4జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.”
19:5రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు,
19:6యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు.
19:7అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు.
19:8అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు.
19:9అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు.
19:10“యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు.
19:11చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా?
19:12నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా?
19:13హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు.
19:14హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి,
19:15యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు.
19:16యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు.
19:17యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి
19:18వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు.
19:19యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు.
19:20అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను.
19:21అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది.
19:22నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు?
19:23ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను.
19:24నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను.
19:25నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది.
19:26కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు.
19:27నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు.
19:28నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను.
19:29హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు.
19:30యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు.
19:31ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది.
19:32కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు.
19:33ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు.
19:34నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.”
19:35ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు.
19:36అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు.
19:37అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.