Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › యేసు శ్రమలు

సువార్తలు పక్కపక్కనే · యేసు శ్రమలు

గేత్సేమనే

మత్తయి 26:36–46 · మార్కు 14:32–42 · లూకా 22:39–46

మత్తయి

మత్తయి 26:36–46

36ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు.

37పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు.

38అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు.

39ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు.

40శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?

41మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు.

42యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు.

43ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి.

44ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు.

45అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.

46ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.”

మార్కు

మార్కు 14:32–42

32అందరూ గేత్సేమనే అనే చోటికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థన చేసి వచ్చే వరకూ మీరు ఇక్కడే ఉండండి” అన్నాడు.

33అప్పుడాయన పేతురు, యాకోబు, యోహానులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, నిస్పృహలో మునిగిపోసాగాడు.

34ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి,

35ఇంకా కొంత ముందుకు వెళ్ళి నేల మీద పడి, సాధ్యమైతే ఈ సమయం తన నుండి దాటిపోవాలని ప్రార్థన చేశాడు.

36ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. ఈ గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.

37ఆయన వచ్చి తన శిష్యులు నిద్రపోతూ ఉండడం చూసి, “సీమోనూ! నిద్రపోతున్నావా? ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేకపోయావా?

38మీరు పరీక్షకు గురి కాకుండా ఉండేలా మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది” అన్నాడు.

39ఆయన మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు పలికిన మాటలే పలుకుతూ ప్రార్థించాడు.

40ఆయన తిరిగి వచ్చి వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆయనకు ఏమి జవాబు చెప్పాలో శిష్యులకు తోచలేదు.

41మూడవ సారి ఆయన వచ్చి వారితో ఇలా అన్నాడు, “మీరింకా నిద్రపోతూ ఉన్నారా? ఇక చాలు. ఆ సమయం వచ్చింది. ఇదిగో చూడండి. మనుష్య కుమారుణ్ణి పాపులు బంధించబోతున్నారు.

42వెళ్దాం రండి. నన్ను అప్పగించబోతున్న వాడు దగ్గరలోనే ఉన్నాడు.”

లూకా

లూకా 22:39–46

39భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.

40వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు.

41వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు.

42“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.”

43అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.

44ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.

45ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు.

46వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు