Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › యెరూషలేములో

సువార్తలు పక్కపక్కనే · యెరూషలేములో

మహా శ్రమ దినాలు

మత్తయి 24:15–28 · మార్కు 13:14–23 · లూకా 21:20–24

మత్తయి

మత్తయి 24:15–28

15“కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),

16యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.

17మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లో నుండి దేనినైనా తీసుకుపోవడానికి దిగి రాకూడదు.

18పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.

19అయ్యో, ఆ రోజులు గర్భవతులకూ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.

20అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.

21ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకూ రాలేదు, ఇక ముందు రాదు.

22ఆ రోజులను దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. అయితే, ఆయన ఎన్నుకున్న వారి నిమిత్తం ఆ రోజులను దేవుడు తక్కువ చేస్తాడు.

23“ఆ కాలంలో ఎవరైనా, ‘ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు’ అని చెబితే నమ్మవద్దు.

24కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.

25ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.

26కాబట్టి ఎవరైనా ‘ఇదిగో, క్రీస్తు అరణ్యంలో ఉన్నాడు’ అని చెప్పినా, ‘ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు’ అని చెప్పినా మీరు నమ్మవద్దు. వారి వెంట వెళ్ళవద్దు.

27“మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మనుష్య కుమారుడి రాక కూడా ఉంటుంది.

28శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు పోగవుతాయి.

మార్కు

మార్కు 13:14–23

14“వినాశకారి అయిన హేయ వస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం మీరు చూసినప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలో ఉన్నవారు కొండల్లోకి పారిపోవాలి.

15మిద్దె మీద ఉన్న వారు కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు.

16పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు.

17గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం.

18ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఉండాలని ప్రార్థన చేయండి.

19ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి. అవి ఇక ముందు రావు కూడా.

20దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు.

21ఆ రోజుల్లో ఎవరైనా మీతో, ‘ఇదుగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, ఇదుగో అక్కడ ఉన్నాడు’ అంటే నమ్మకండి.

22కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు.

23అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను.

లూకా

లూకా 21:20–24

20యెరూషలేమును సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.

21అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.

22ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.

23ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.

24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు