హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › సెప్టెంబర్ 2027 › 26 సెప్టెంబర్
ఆర్థడాక్స్ కాలెండర్ · సెప్టెంబర్ 13 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 26 సెప్టెంబర్, 2027
ఆదివారం · స్వరం 5
పండుగలు మరియు పరిశుద్ధులు
పెంతెకొస్తు తర్వాత 14వ ఆదివారం
ఔన్నత్య పండుగకు ముందు ఆదివారం
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
22ఇశ్రాయేలీయుల సమాజమంతా చూస్తుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి ఇలా అన్నాడు, 23“యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, పైన ఉన్న ఆకాశంలో, కింద ఉన్న భూమిపై నీలాంటి దేవుడు ఒక్కడూ లేడు. పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలంగా నడిచే నీ దాసుల విషయంలో నీవు నీ నిబంధనను నెరవేరుస్తూ కనికరం చూపుతూ ఉంటావు. 27వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది? 28అయినప్పటికీ, యెహోవా, నా దేవా, నీ దాసుడినైన నా ప్రార్థననూ మనవినీ అంగీకరించి, ఈ రోజు నీ దాసుడినైన నేను చేసే ప్రార్థననూ నా మొర్రనూ ఆలకించు. 29నీ దాసుడినైన నేను చేసే ప్రార్థనను దయతో అంగీకరించేలా ‘నా నామం అక్కడ ఉంటుంది’ అని ఏ స్థలం గురించి నీవు చెప్పావో ఆ ఈ మందిరం వైపు నీ కళ్ళు రాత్రీ, పగలూ తెరచుకుని ఉంటాయి గాక. 30నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.
సాయంకాల ప్రార్థన: పఠనం
19తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు. 20ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి. 21కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు. 22జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి. 23అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు. 24పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు. 25అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు. 26యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు. 27అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు. 28నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు. 29నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు. 30నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు. 31దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు. 32కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు. 33దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు. 34ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. 2పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది. 3తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది. 4“జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది. 5తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి. 6ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.” 7ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది. 8ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. 9జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. 10జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. 11నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.
ఉదయ ప్రార్థన మూడవ సువార్త
9వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు. 10ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది. 11యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు. 12ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు. 13వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గానీ వారు నమ్మలేదు. 14ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు. 15యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి. 16దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు. 17“నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు. 18తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.” 19ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. 20ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.
పత్రిక (సిలువ ఔన్నత్యానికి ముందు ఆదివారం కోసం)
11నా సొంత దస్తూరీతో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి. 12శరీర విషయంలో చక్కగా కనిపించాలని కోరే వారు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు. 13అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వారు మీ శరీర విషయంలో గొప్పలు చెప్పుకోవడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు. 14అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. 15కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు. 16ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక. 17నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. 18సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్.
పత్రిక
21క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి 22మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు. 23మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి. 24మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము. 2:1నేను బాధ కలిగించేలా మీ దగ్గరికి తిరిగి రాకూడదని నా అంతట నేనే నిశ్చయించుకున్నాను. 2నేను మీకు బాధ కలిగిస్తే బాధ పొందినవాడు తప్ప ఇంకెవరు నన్ను సంతోషపరచగలరు? 3నేను వచ్చేటప్పుడు ఎవరి వలన నాకు సంతోషం కలగాలో వారి వలన నాకు దుఃఖం కలగకుండా ఉండాలని ఈ సంగతి మీకు రాశాను. నా సంతోషమే మీ అందరి సంతోషమని నా నమ్మకం. 4మీకు బాధ కలగాలని కాదు, మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళు కారుస్తూ రాశాను.
పత్రిక (పరిశుద్ధ సమాధి దేవాలయ ప్రతిష్ఠ కోసం)
1కాబట్టి, పరలోక సంబంధమైన పిలుపులో భాగస్థులూ, పరిశుద్ధులూ అయిన సోదరులారా, మన ఒప్పుకోలుకు అపొస్తలుడూ, ప్రధాన యాజకుడూ అయిన యేసును గూర్చి ఆలోచించండి. 2దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. 3మోషే కంటే ఎక్కువ కీర్తి యశస్సులకు ఈయన యోగ్యుడిగా లెక్కలోకి వచ్చాడు. ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దాన్ని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం. 4ప్రతి ఇంటినీ ఎవరో ఒకరు నిర్మిస్తారు. కానీ సమస్తాన్నీ నిర్మించిన వాడు దేవుడే.
సువార్త (సిలువ ఔన్నత్యానికి ముందు ఆదివారం కోసం)
13పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు. 14అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలా పైకి ఎత్తాడో, 15అలాగే విశ్వసించే ప్రతి ఒక్కరూ నశించకుండా ఆయన వల్ల నిత్యజీవం పొందడానికి మనుష్య కుమారుడు కూడా పైకి ఎత్తబడాలి. 16“దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అందుకే ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు. తద్వారా ఆయనలో విశ్వాసం ఉంచే ప్రతి వాడూ నశించకుండా నిత్యజీవం పొందుతాడు. 17తన కుమారుడి వల్ల లోకం రక్షణ పొందడానికే దేవుడు ఆయనను పంపాడు గానీ లోకానికి శిక్ష విధించడానికి కాదు.
సువార్త
1యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు, 2“పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది. 3ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు. 4అప్పుడు ఆ రాజు, ‘ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి’ అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు. 5కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి, మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు. 6మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు. 7కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు. 8అప్పుడతడు, ‘పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు. 9కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి’ అని తన దాసులతో చెప్పాడు. 10ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారిని, మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది. 11“రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్ళి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు. 12రాజు అతనితో, ‘మిత్రమా, పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?’ అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు. 13కాబట్టి రాజు, ‘ఇతని కాళ్ళు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి’ అని తన పరిచారకులతో చెప్పాడు. 14ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికైన వారు కొద్దిమందే.”
సువార్త (పరిశుద్ధ సమాధి దేవాలయ ప్రతిష్ఠ కోసం)
13యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యులను ఇలా అడిగాడు, “మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకుంటున్నారు?” 14వారు, “కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు” అన్నారు. 15“అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?” అని వారిని అడిగాడు. 16వెంటనే సీమోను పేతురు, “నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!” అని చెప్పాడు. 17అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు. 18ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 13 సెప్టెంబర్ పౌర కాలెండర్లో 26 సెప్టెంబర్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు