Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › సెప్టెంబర్ 2027 › 25 సెప్టెంబర్

ఆర్థడాక్స్ కాలెండర్ · సెప్టెంబర్ 12 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 25 సెప్టెంబర్, 2027

శనివారం · పెంతెకొస్తు తర్వాత 14వ వారం · స్వరం 4

పండుగలు మరియు పరిశుద్ధులు

ఔన్నత్య పండుగకు ముందు శనివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక (సిలువ ఔన్నత్యానికి ముందు శనివారం కోసం)

1 కొరింతీ 2:6–9

6ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. 7అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు. 8దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. 9దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది.

పత్రిక

1 కొరింతీ 4:1–5

1కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి. 2నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం. 3మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను. 4నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు. 5కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.

పత్రిక (దైవజనని కోసం)

ఫిలిప్పీ 2:5–11

5క్రీస్తు యేసుకున్న ఇలాంటి ప్రవృత్తినే మీరూ కలిగి ఉండండి. 6ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు. 7అయితే, దానికి ప్రతిగా తనను తాను ఖాళీ చేసుకున్నాడు. బానిస రూపం తీసుకున్నాడు. మానవుల పోలికలో కనిపించాడు. ఆకారంలో ఆయన మనిషిగా కనిపించాడు. 8చావు దాకా, అంటే, సిలువ మీద చావుకైనా సరే, తనను తాను తగ్గించుకుని, లోబడ్డాడు. 9అందుచేత పరలోకంలోనూ, భూమి మీదా, భూమి కిందా ఉన్న ప్రతి ఒక్కరి మోకాలు యేసు నామంలో వంగేలా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమ కోసం యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించేలా, దేవుడు ఆయనను ఎంతో ఉన్నతంగా హెచ్చించి, అందరికంటే ఉన్నతమైన నామాన్ని ఆయనకు ఇచ్చాడు.

సువార్త (సిలువ ఔన్నత్యానికి ముందు శనివారం కోసం)

మత్తయి 10:37–11:1

37నా కంటే ఎక్కువగా తండ్రినిగానీ తల్లినిగానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకునుగానీ కూతురునుగానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. 38తన సిలువను భుజాన వేసుకుని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు. 39తన ప్రాణం దక్కించుకొనేవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు. 40మిమ్మల్ని చేర్చుకొనేవాడు నన్ను చేర్చుకొంటాడు. నన్ను చేర్చుకొనేవాడు నన్ను పంపిన ఆయనను చేర్చుకొంటాడు. 41ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు. 42శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్ళు తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.” 11:1యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.

సువార్త

మత్తయి 23:1–12

1అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు, 2“ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు. 3కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటినీ ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు. 4మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు. 5వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్న రక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు. 6విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాల్లో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు. 7సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత ‘బోధకా, బోధకా’ అని పిలిపించుకోవడం వారికి ఇష్టం. 8మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు. 9ఇంకా, భూమిమీద ఎవరినీ ‘తండ్రి’ అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి. 10అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11మీలో అందరికంటే గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి. 12తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.

సువార్త (దైవజనని కోసం)

లూకా 10:38–42; 11:27–28

38వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది. 39ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది. 40మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందరపడుతూ ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు” అంది. 41అందుకు ప్రభువు, “మార్తా, మార్తా, నువ్వు బోలెడన్ని పనులను గురించి తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే. 42మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు” అని ఆమెతో చెప్పాడు. 11:27ఆయన ఈ మాటలు చెబుతూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం” అని కేకలు వేసి చెప్పింది. 28దానికి ఆయన, “అది నిజమే కానీ దేవుని మాట విని దాని ప్రకారం జీవించేవారు ఇంకా ధన్యులు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 12 సెప్టెంబర్ పౌర కాలెండర్‌లో 25 సెప్టెంబర్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు