హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 29 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 16 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 29 ఏప్రిల్, 2027
గురువారం · పవిత్ర వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా పవిత్ర గురువారం
మహా ఉపవాస కాలం
ఉపవాసం: నూనెతో
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సువార్త (పెండ్లికుమారుని ఉదయ ప్రార్థన)
1పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది. 2ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వారు ప్రజలకి భయపడుతున్నారు. 3అప్పుడు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. 4దాంతో యూదా వెళ్ళి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధాన యాజకులతో, అధికారులతో మాట్లాడాడు. 5దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు. 6అతడు దానికి అంగీకరించి జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు. 7పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. 8యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు. 9వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు. 10ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి. 11మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి. 12అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు. 13సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు. 14సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు. 15అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. 16ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.” 17తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. 18ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. 19ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు. 20అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన. 21“వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు. 22దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు, 23ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. 24తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. 25అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. 28“నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు. 29నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి, 30సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను. 31“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” 33కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. 34అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు. 35ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు. 36ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. 37‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. 38శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు. 39భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
మొదటి ఘడియ
యిర్మీ 11:18–12:5, 9–11, 14–15
18దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు. 19అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు. 20సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు. యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను. 21“నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, 22“నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు. 23వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.” 12:1యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు? 2వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు. వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే. 3యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు. వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు. 4దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి. వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు. 5యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు? నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు? 9నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి. రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి. 10అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు. నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు. 11వారు దాన్ని పాడు చేయడం చూసి నేను దుఃఖిస్తున్నాను. దేశమంతా పాడైపోయింది. దాని గూర్చి బాధపడే వాడు ఒక్కడూ లేడు. 14యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను. 15ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.”
సాయంకాల ప్రార్థన: పఠనం
10అప్పుడు యెహోవా మోషేతో “నీవు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ రోజూ రేపూ వాళ్ళను పవిత్రపరచు. నా రాక కోసం వాళ్ళు సిద్ధం చెయ్యి. వాళ్ళు తమ బట్టలు ఉతుక్కుని 11మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండాలి. మూడవ రోజు యెహోవా అనే నేను ప్రజలందరి కళ్ళెదుట సీనాయి కొండ పైకి దిగివస్తాను. 12నువ్వు కొండ చుట్టూ హద్దు ఏర్పాటు చెయ్యి. ప్రజలతో, ‘మీరు ఈ కొండ ఎక్కకూడదు. దాని అంచును కూడా ముట్టుకోకూడదు. జాగ్రత్త. ఈ కొండను ముట్టుకున్న ప్రతివాడూ మరణశిక్షకు లోనవుతాడు. 13ఎవ్వరూ తమ చేతులతో ముట్టుకున్న వాణ్ణి తాకకూడదు. రాళ్ళతో గానీ బాణాలతో గానీ కచ్చితంగా అతణ్ణి చంపెయ్యాలి. మనిషైనా జంతువైనా మరణ శిక్ష విధించాల్సిందే. సుదీర్ఘమైన బూర శబ్దం వినినప్పుడు వాళ్ళు కొండ పాదానికి చేరుకోవాలి’ అని చెప్పు” అన్నాడు. 14అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు. 15అప్పుడు మోషే “మూడవ రోజుకల్లా సిద్ధంగా ఉండండి. మీ భార్యల దగ్గరికి వెళ్లొద్దు.” అని చెప్పాడు. 16మూడవ రోజు తెల్లవారగానే ఆ కొండ మీద దట్టమైన మేఘాలు కమ్మి ఉరుములు, మెరుపులు వచ్చాయి. భీకరమైన బూర శబ్దం వినిపించినప్పుడు శిబిరంలోని ప్రజలంతా భయంతో వణకిపోయారు. 17దేవుణ్ణి ఎదుర్కొనడానికి మోషే శిబిరంలో నుండి ప్రజలను బయటకు రప్పించాడు. ప్రజలంతా కొండ పాదం దగ్గర నిలబడ్డారు. 18మండుతున్న మంటలతో యెహోవా సీనాయి కొండపైకి దిగి వచ్చాడు. ఆ కొండ అంతా పొగ కమ్మింది. అది కొలిమి పొగలాగా పైకి లేస్తూ ఉంది. ఆ కొండంతా తీవ్రంగా కంపించింది. 19ఆ బూర శబ్దం మరింత పెరుగుతూ ఉండగా మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఉరుములాంటి కంఠ స్వరంతో అతనికి జవాబిస్తున్నాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు. 2జ్ఞానం లేని మాటలు చెప్పి నా పథకాలను చెడగొడుతున్న వీడెవడు? 3పౌరుషంగా నీ నడుము బిగించుకో. నేను నీకు ప్రశ్న వేస్తాను. నాకు జవాబియ్యాలి. 4నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు. 5నీకు తెలిస్తే చెప్పు, దాని పరిమాణం ఎవరు నిర్ణయించారు? దానికి కొలతలు వేసిన దెవరు? 6దాని పునాదులు దేనిపై ఉన్నాయి? ఉదయ నక్షత్రాలు కలిసి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందంగా జయజయధ్వానాలు చేస్తుండగా దాని మూలరాయి నిలబెట్టింది ఎవరు? 8సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు? 9నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? 10సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు, 11“నువ్వు ఇంతవరకే మరి దగ్గరికి రాకూడదు, ఇక్కడే నీ తరంగాల గర్వం అణిగిపోవాలి” అని నేను సముద్రానికి చెప్పినప్పుడు నువ్వు ఉన్నావా? 12నీ జీవితకాలమంతటిలో ఎప్పుడైనా ప్రాతఃకాలాన్ని రమ్మని ఆజ్ఞాపించావా? తెల్లవారి సూర్యోదయానికి దాని స్థానాన్ని నియమించావా? 13దుష్టులు దానిలో ఉండకుండా దులిపివేసేలా భూమి అంచులను అది ఒడిసి పట్టేలా ఉదయాన్ని పంపించావా? 14ముద్ర బంకమట్టి రూపాన్ని మార్చినట్టు భూతలం రూపాంతరం చెందుతూ ఉంటుంది. దానిపై ఉన్నవన్నీ వస్త్రం మీది మడతల్లాగా స్పష్టంగా కనబడతాయి. 15దుష్టుల వెలుగు వారి నుండి తొలిగిపోతుంది. వారు ఎత్తిన చెయ్యి విరగ్గొట్టబడుతుంది. 16సముద్రపు ఊటల్లోకి నువ్వు చొరబడ్డావా? సముద్రం అడుగున తిరుగులాడావా? 17మరణద్వారాలు నీకు తెరుచుకున్నాయా? మరణాంధకార ద్వారాలను నువ్వు చూశావా? 18భూమి వైశాల్యం ఎంతో నువ్వు గ్రహించావా? ఇదంతా నీకేమైనా తెలిస్తే చెప్పు. 19వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది? 20వెలుగును, చీకటిని అవి ఉద్యోగాలు చేసే చోటులకు నువ్వు తీసుకుపోగలవా? వాటి పని అయిపోయాక వాటిని మళ్లీ వాటి ఇళ్ళకు తీసుకుపోగలవా? 21ఇవన్నీ నీకు తెలుసు కదా! నువ్వు అప్పటికే పుట్టావట గదా. నువ్వు బహు వృద్ధుడివి మరి. 22నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను. 42:1అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు. 2నువ్వు సమస్త క్రియలను చేయగలవనీ నువ్వు ఉద్దేశించినది ఏదీ నిష్ఫలం కానేరదనీ నేనిప్పుడు తెలుసుకున్నాను. 3“జ్ఞానం లేని మాటలతో ఆలోచనను నిరర్థకం చేసే వీడెవడు?” అలా వివేచన లేక ఏమీ తెలియక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను. 4నువ్వు అన్నావు. “నేను మాట్లాడాలనుకుంటున్నాను. దయచేసి నా మాట ఆలకించు. ఒక సంగతి నిన్ను అడుగుతాను. దాన్ని నాకు తెలియజెప్పు.” 5నిన్ను గూర్చిన విషయాలు నేను విన్నాను. అయితే ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను.
సాయంకాల ప్రార్థన: పఠనం
4అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు. శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు. 5ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు. 6నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు. 7ప్రభువైన యెహోవా నాకు సాయం చేస్తాడు కాబట్టి నేనేమీ సిగ్గుపడలేదు. నాకు సిగ్గు కలగదని తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా చేసుకున్నాను. 8నన్ను నీతిమంతునిగా ఎంచే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నన్ను వ్యతిరేకించే వాడెవడు? మనం కలిసి వాదించుకుందాం. నా ప్రతివాది ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానివ్వండి. 9ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నా మీద ఎవరు నేరం మోపుతారు? వారంతా బట్టలాగా పాతబడిపోతారు. వారిని చిమ్మెట తినివేస్తుంది. 10మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి. 11ఇదిగో, నిప్పులు వెలిగించి మీ చుట్టూ మంటలను పెట్టుకొనే వారంతా మీ అగ్ని వెలుగులో, మీరు వెలిగించిన మంటల్లో నడవండి. ఇది మీకు నా చేతినుండే కలుగుతున్నది. మీరు వేదనతో పండుకుంటారు.
పత్రిక
23నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువే నాకు ఇచ్చాడు. ప్రభు యేసు అప్పగించబడిన రాత్రి, ఆయన ఒక రొట్టె చేత పట్టుకున్నాడు. 24స్తుతులు చెల్లించిన తరువాత దాన్ని విరిచి, “ఇది మీ కోసమైన నా శరీరం. తీసుకుని తినండి. నా జ్ఞాపకార్థం దీన్ని చేయండి” అని చెప్పాడు. 25భోజనం చేసిన తరువాత ఆ విధంగానే ఆయన పాత్రను చేత పట్టుకుని, “ఈ పాత్ర నా రక్తం మూలంగా చేసిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగిన ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అన్నాడు. 26మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోది తాగిన ప్రతిసారీ ప్రభువు వచ్చేవరకూ ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు. 27కాబట్టి ఎవరైతే అయోగ్యమైన విధానంలో ప్రభువు రొట్టెను తిని ఆయన పాత్రలోది తాగుతారో వారు ప్రభువు శరీరం, ఆయన రక్తం విషయంలో అపరాధులు అవుతారు. 28కాబట్టి ప్రతి ఒక్కడూ తనను తాను పరీక్షించుకుని ఆ రొట్టె తిని, ఆ పాత్రలోది తాగాలి. 29ఎందుకంటే ప్రభువు శరీరం గురించి సరైన అవగాహన లేకుండా దాన్ని తిని, తాగేవాడు తన మీదికి శిక్ష కొని తెచ్చుకుంటున్నాడు. 30ఈ కారణం చేతనే మీలో చాలామంది నీరసంగా, అనారోగ్యంగా ఉన్నారు. చాలామంది చనిపోయారు కూడా. 31అయితే మనలను మనం పరిశీలించుకుంటూ ఉంటే మన పైకి తీర్పు రాదు. 32మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.
సువార్త (కలిపిన పఠనం)
మత్తయి 26:1–20 · యోహా 13:3–17 · మత్తయి 26:21–39 · లూకా 22:43–45 · మత్తయి 26:40–27:2
1యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో, 2“రెండు రోజుల తరువాత పస్కా పండగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు” అని చెప్పాడు. 3ఆ సమయంలోనే ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుడి నివాసంలో సమావేశమయ్యారు. 4వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకుని, చంపాలని కుయుక్తులు పన్నారు. 5అయితే ప్రజల్లో అల్లరి జరుగుతుందేమో అని “పండగ సమయంలో వద్దు” అని చెప్పుకున్నారు. 6యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. 7ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది. 8అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! 9దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు. 10యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది. 11బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. 12ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది. 13నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.” 14అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. 15“యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు. 16అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. 17పొంగని రొట్టెల పండగలో మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, “మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?” అని అడిగారు. 18అందుకాయన, “మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను, అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి” అన్నాడు. 19యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు. 20సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు. 13:3తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు. 6ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. 7యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. 8పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు. 9సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు” అన్నాడు. 10యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. 11ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. 12యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? 13మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను. 16నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు. 26:21వారు భోజనం చేస్తుండగా ఆయన, “మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 22అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, “ప్రభూ, అది నేనా?” అని ఆయనను అడగడం ప్రారంభించారు. 23ఆయన, “నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు. 24మనుష్య కుమారుణ్ణి గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండకపోతే అతనికి మంచిది” అని వారితో చెప్పాడు. 25ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు. 26వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకుని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీన్ని మీరు తీసుకుని తినండి. ఇది నా శరీరం” అని చెప్పాడు. 27తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, “దీనిలోనిది మీరంతా తాగండి. 28ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం. 29నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షరసం మళ్ళీ తాగే రోజు వరకూ నేనిక దాన్ని తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. 30అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు. 31అప్పుడు యేసు వారితో, “ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, ‘కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి’ అని రాసి ఉంది కదా! 32కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్తాను” అన్నాడు. 33అందుకు పేతురు, “నీ విషయంలో అందరూ వెనుకంజ వేసినా సరే నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను” అని యేసుతో చెప్పాడు. 34యేసు అతణ్ణి చూసి, “నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెబుతావు” అన్నాడు. 35పేతురు ఆయనతో, “నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను” అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు. 36ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. ఆయన, “నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకూ మీరు ఇక్కడే కూర్చోండి” అని వారితో చెప్పాడు. 37పేతురును, జెబెదయి ఇద్దరు కొడుకులను తన వెంట తీసుకు వెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు. 38అప్పుడు ఆయన వారితో, “నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి” అని చెప్పాడు. 39ఆయన కొంత దూరం వెళ్ళి, సాగిలపడి, “నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గర నుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు” అని ప్రార్థన చేశాడు. 22:43అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు. 44ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది. 45ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు. 26:40శిష్యుల దగ్గరికి వచ్చి, వారు నిద్ర పోతుండడం చూసి, “నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? 41మీరు పరీక్షలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమేగానీ శరీరం బలహీనం” అని పేతురుతో అన్నాడు. 42యేసు రెండవ సారి దూరంగా వెళ్ళి, “నా తండ్రీ, నేను దీన్ని తాగితేనే తప్ప నా నుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!” అని ప్రార్థన చేశాడు. 43ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండడం చూశాడు. వారి కళ్ళు నిద్రాభారంతో మూతలు పడుతున్నాయి. 44ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్ళి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు. 45అప్పుడాయన తన శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు, “మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది. 46ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు.” 47ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల దగ్గర నుంచీ, ప్రజల పెద్దల నుంచీ వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు, గదలు ఉన్నాయి. 48ఆయనను పట్టి ఇచ్చేవాడు, “నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయనను మీరు పట్టుకోండి” అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు. 49అతడు యేసు దగ్గరికి వచ్చి, “బోధకా, నీకు శుభం!” అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు. 50యేసు, “మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చెయ్యి” అని అతనితో చెప్పగానే వారు దగ్గరికి వచ్చి ఆయనను ఒడిసి పట్టుకున్నారు. 51వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి, అతని చెవి నరికేశాడు. 52అప్పుడు యేసు, “నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తితోనే నాశనం అవుతారు. 53ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటే ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడనుకుంటున్నావా? 54నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?” అని అతనితో అన్నాడు. 55తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, “ఒక దోపిడీ దొంగ మీదికి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే, 56ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది” అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. 57యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు. 58పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు. 59ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. 60అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. 61చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. 62అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు. 63అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. 64అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. 65వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? 66మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు. 67అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. 68కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు. 69పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. 70అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు. 71అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. 72పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు. 73కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. 74దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది. 75“ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు. 27:1తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు. 2ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు.
సువార్త (పాదాలు కడిగే సమయంలో)
1అది పస్కా పండగకు ముందు సమయం. తాను ఈ లోకం విడిచి తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చిందని యేసు గ్రహించాడు. ఈ లోకంలో ఉన్న తన సొంత వారిని ఆయన ప్రేమించాడు. చివరి వరకూ ఆయన వారిని ప్రేమించాడు. 2యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయడానికి కూర్చున్నారు. అప్పటికే సాతాను సీమోను కొడుకు ఇస్కరియోతు యూదా హృదయంలో యేసును అప్పగించాలనే ఉద్దేశం పెట్టాడు. 3తండ్రి సమస్తం తన చేతుల్లో పెట్టాడనీ, తాను దేవుని దగ్గర నుంచి వచ్చాడనీ, తిరిగి దేవుని దగ్గరకే వెళ్తున్నాడనీ యేసుకు తెలుసు. 4ఆయన భోజనం దగ్గర నుంచి లేచి, తన పైవస్త్రం పక్కన పెట్టి, తువాలు తీసుకుని దాన్ని నడుముకు చుట్టుకున్నాడు. 5అప్పుడు పళ్ళెంలో నీళ్ళు పోసి, శిష్యుల పాదాలు కడిగి, తన నడుముకు చుట్టుకున్న తువాలుతో తుడవడం ప్రారంభించాడు. 6ఆయన సీమోను పేతురు దగ్గరికి వచ్చాడు. అప్పుడు పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?” అన్నాడు. 7యేసు అతనికి జవాబిస్తూ, “నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. కాని, నువ్వు తరవాత అర్థం చేసుకుంటావు” అన్నాడు. 8పేతురు ఆయనతో, “నువ్వు నా పాదాలు ఎన్నడూ కడగకూడదు” అన్నాడు. యేసు అతనికి జవాబిస్తూ, “నేను నిన్ను కడగకపోతే, నాతో నీకు సంబంధం ఉండదు” అన్నాడు. 9సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు. నా చేతులు, నా తల కూడా కడుగు” అన్నాడు. 10యేసు అతనితో, “స్నానం చేసినవాడు తన పాదాలు తప్ప ఇంకేమీ కడుక్కోవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా శుద్ధుడే. మీరూ శుద్ధులే గాని, మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు. 11ఎందుకంటే, తనకు ద్రోహం చేసేది ఎవరో ఆయనకు తెలుసు. అందుకే ఆయన, “మీలో అందరూ శుద్ధులు కాదు” అన్నాడు.
సువార్త (పాదాలు కడిగిన తర్వాత)
12యేసు వారి కాళ్ళు కడిగి, తన వస్త్రాలు తీసుకుని, యథాప్రకారం కూర్చుని, వారితో, “నేను మీ కోసం ఏం చేశానో మీకు తెలుసా? 13మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని సరిగానే పిలుస్తున్నారు. 14బోధకుడు, ప్రభువు అయిన నేను మీ కాళ్ళు కడిగితే, మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి. 15నేను మీకోసం చేసినట్టే మీరు కూడా చెయ్యడానికి మీకు ఒక ఆదర్శం చూపించాను. 16నేను మీకు కచ్చితంగా చెబుతున్నాను, దాసుడు తన యజమానికన్నా గొప్పవాడు కాదు. వెళ్ళినవాడు వాణ్ణి పంపినవానికన్నా గొప్పవాడు కాదు. 17ఈ సంగతులు మీకు తెలుసు కాబట్టి, వీటి ప్రకారం చేస్తే మీరు ధన్యులు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 16 ఏప్రిల్ పౌర కాలెండర్లో 29 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు