హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 30 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 17 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 30 ఏప్రిల్, 2027
శుక్రవారం · పవిత్ర వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా పవిత్ర శుక్రవారం
మహా ఉపవాస కాలం · కఠిన ఉపవాసం
ఆహారం నుండి పూర్తి విరమణ
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
శ్రమల మొదటి సువార్త
31యూదా వెళ్ళిపోయిన తరువాత, యేసు, “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పొందాడు. దేవుడు ఆయనలో మహిమ పొందుతున్నాడు” అన్నాడు. 32దేవుడు ఆయనలో మహిమ పరచబడినట్టయితే, తనలో ఆయనను మహిమ పరుస్తాడు. వెంటనే ఆయనను మహిమ పరుస్తాడు. 33పిల్లలూ, ఇంకా కొంత కాలం నేను మీతో ఉంటాను. మీరు నా కోసం వెదుకుతారు. కాని, నేను యూదులకు చెప్పినట్టు మీతో కూడా చెబుతున్నాను, ‘నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు.’ 34మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలన్న కొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించాలి. 35మీరు ఒకడి పట్ల ఒకడు ప్రేమగలవారైతే, దాన్నిబట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు” అన్నాడు. 36సీమోను పేతురు ఆయనతో, “ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?” అన్నాడు. యేసు జవాబిస్తూ, “నేను వెళ్ళే స్థలానికి ఇప్పుడు నువ్వు నా వెంట రాలేవు, కాని తరవాత వస్తావు” అన్నాడు. 37అందుకు పేతురు, “ప్రభూ, నేను ఇప్పుడే నీ వెంట ఎందుకు రాలేను? నీకోసం నా ప్రాణం పెడతాను” అన్నాడు. 38యేసు జవాబిస్తూ, “నా కోసం ప్రాణం పెడతావా? నేను నీతో కచ్చితంగా చెబుతున్నాను, నేనెవరో తెలియదని నువ్వు మూడు సార్లు చెప్పక ముందు కోడి కూయదు” అన్నాడు. 14:1“మీ హృదయం కలవర పడనీయవద్దు. మీరు దేవుణ్ణి నమ్మండి. నన్నూ నమ్మండి. 2నా తండ్రి లోగిలిలో ఎన్నో నివాస స్థలాలు ఉన్నాయి. అవి లేకపోతే మీతో చెప్పేవాణ్ణి. మీకు స్థలం సిద్ధం చెయ్యడానికి వెళ్తున్నాను. 3నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధం చేస్తే, నేను మళ్ళీ వచ్చి, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేలా, నా దగ్గరికి మిమ్మల్ని తీసుకు వెళ్తాను. 4నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు, ఆ దారి కూడా తెలుసు” అన్నాడు. 5తోమా యేసుతో, “ప్రభూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు. మాకు దారి ఎలా తెలుస్తుంది?” అన్నాడు. 6యేసు అతనితో, “నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గరికి రారు. 7మీరు నన్ను తెలుసుకుని ఉంటే, నా తండ్రిని కూడా తెలుసుకుని ఉండేవాళ్ళే. ఇప్పటినుంచి మీకు ఆయన తెలుసు. ఆయనను మీరు చూశారు” అన్నాడు. 8ఫిలిప్పు యేసుతో, “ప్రభూ, తండ్రిని మాకు చూపించు. అది మాకు చాలు” అన్నాడు. 9యేసు అతనితో, “ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ‘తండ్రిని చూపించు’ అని నువ్వు ఎలా అంటున్నావు? 10నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాం అని నువ్వు నమ్మడం లేదా? నేను మాట్లాడే మాటలు నా సొంత మాటలు కాదు. నాలో నివాసం ఉంటున్న తండ్రి తన పని చేస్తున్నాడు. 11తండ్రిలో నేను, నాలో తండ్రి ఉన్నాం అని నమ్మండి. అదీ కాకపోతే, ఈ క్రియల గురించి అయినా నన్ను నమ్మండి. 12నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, నా మీద నమ్మకం ఉంచినవాడు, నేను చేసే క్రియలు కూడా చేస్తాడు. అంతమాత్రమే కాదు, ఇంతకన్నా గొప్ప క్రియలు చేస్తాడు. ఎందుకంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. 13“మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. తద్వారా తండ్రికి తన కుమారుడిలో మహిమ కలుగుతుంది. 14మీరు నా పేరిట ఏం అడిగినా, అది నేను చేస్తాను. 15మీరు నన్ను ప్రేమిస్తే, నా ఆజ్ఞలు పాటిస్తారు. 16“నేను తండ్రిని అడుగుతాను. మీతో ఎల్లప్పుడూ ఉండేలా ఇంకొక ఆదరణకర్తను ఆయన మీకు ఇస్తాడు. 17ఆయన సత్యం అయిన ఆత్మ. లోకం ఆయనను చూడదు, తెలుసుకోదు కాబట్టి ఆయనను స్వీకరించదు. అయితే మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు. 18నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీకోసం నేను మళ్ళీ వస్తాను. 19కొద్దికాలం తరువాత ఇంక ఈ లోకం నన్ను చూడదు. కాని, మీరు నన్ను చూస్తారు. నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు. 20నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నాం అని ఆ రోజు మీరు తెలుసుకుంటారు. 21నా ఆజ్ఞలను కలిగిఉండి, వాటిని పాటించేవాడే నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించేవాణ్ణి నా తండ్రి ప్రేమిస్తాడు. నేను అతన్ని ప్రేమించి, నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను” అన్నాడు. 22యూదా (ఇస్కరియోతు కాక వేరొక యూదా) యేసుతో, “ప్రభూ, నీవు లోకానికి కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?” అన్నాడు. 23యేసు జవాబిస్తూ, “ఎవడైనా నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ప్రకారం చేస్తాడు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. మేము అతని దగ్గరికి వచ్చి అతనితో నివాసం చేస్తాము. 24నన్ను ప్రేమించని వాడు నా మాట ప్రకారం చెయ్యడు. మీరు వినే ఈ మాట నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. 25మీ మధ్య నేను బతికి ఉండగానే ఈ సంగతులు మీతో చెప్పాను. 26నా తండ్రి నా పేరిట పంపే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులు బోధించి, నేను మీతో చెప్పినవన్నీ మీకు గుర్తు చేస్తాడు. 27శాంతి మీకిచ్చి వెళ్తున్నాను. నా శాంతి మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు. మీ హృదయం కలవరం చెందనివ్వకండి, భయపడకండి. 28‘నేను వెళ్ళిపోతున్నాను గాని మీ దగ్గరికి తిరిగి వస్తాను’ అని నేను చెప్పడం మీరు విన్నారు. మీరు నన్ను ప్రేమిస్తే, మీరు సంతోషిస్తారు. ఎందుకంటే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి నాకన్నా గొప్పవాడు. 29ఈ సంగతి జరగక ముందే నేను మీతో చెప్పాను. ఎందుకంటే, ఇది నిజంగా జరిగినప్పుడు మీరు నమ్మాలని నా ఉద్దేశం. 30ఇంతకన్నా ఎక్కువ మీతో మాట్లాడను. ఈ లోకాధికారి వస్తున్నాడు. అతనికి నా మీద అధికారం లేదు. 31నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని ఈ లోకానికి తెలిసేలా, నా తండ్రి నాకు ఆజ్ఞాపించింది ఉన్నది ఉన్నట్టు నేను చేస్తాను. లేవండి, ఇక్కడి నుంచి వెళ్దాం.” 15:1“నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు. 2నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు. 3నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు. 4నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది. 9తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ప్రేమలో నిలకడగా ఉండండి. 10నేను నా తండ్రి ఆజ్ఞలు పాటించి ఆయన ప్రేమలో నిలకడగా ఉన్నట్టే, మీరు కూడా నా ఆజ్ఞలు పాటిస్తే నా ప్రేమలో నిలకడగా ఉంటారు. 11మీలో నా ఆనందం ఉండాలని, మీ ఆనందం పరిపూర్ణం కావాలని, ఈ సంగతులు మీతో మాట్లాడాను. 12నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇది నా ఆజ్ఞ. 13స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టిన వాడి ప్రేమకన్నా గొప్ప ప్రేమ లేదు. 14నేను మీకు ఆజ్ఞాపించినట్టు చేస్తే మీరు నాకు స్నేహితులు. 15“నేను ఇక మిమ్మల్ని దాసులు అని పిలవను. ఎందుకంటే దాసుడికి యజమాని చేసేది తెలియదు. నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకంటే, నా తండ్రి నుంచి నేను విన్నవన్నీ మీకు తెలియజేశాను. 16మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను. 17మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపిస్తున్నాను. 18“ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించిందని తెలుసుకోండి. 19మీరు ఈ లోకానికి చెందిన వారైతే ఈ లోకం దాని సొంతవాళ్ళలా మిమ్మల్ని ప్రేమిస్తుంది. కాని, మీరు లోకానికి చెందిన వారు కాదు. ఎందుకంటే, నేను మిమ్మల్ని ఈ లోకంలోనుంచి వేరు చేశాను. అందుకే ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. 20“‘దాసుడు తన యజమానికంటే గొప్పవాడు కాదు’ అని నేను మీతో చెప్పిన మాట గుర్తు చేసుకోండి. వారు నన్ను హింసిస్తే, మిమ్మల్ని కూడా హింసిస్తారు. వారు నా మాట ప్రకారం చేస్తే, మీ మాట ప్రకారం కూడా చేస్తారు. 21వారికి నన్ను పంపిన వాడు తెలియదు కాబట్టి, నా పేరిట ఇవన్నీ మీకు చేస్తారు. 22నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే, వారికి పాపం ఉండేది కాదు. కాని, ఇప్పుడు వారి పాపం నుండి తప్పించుకునే అవకాశం వారికి లేదు. 23“నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు. 24ఎవ్వరూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చేయకపోతే వారికి పాపం ఉండేది కాదు. కాని, వారు నా కార్యాలు చూసినా నన్నూ, నా తండ్రినీ ద్వేషిస్తున్నారు. 25‘కారణం లేకుండా నన్ను ద్వేషించారు’ అని వారి ధర్మశాస్త్రంలో ఉన్న వాక్కు నెరవేరేలా ఇది జరుగుతూ ఉంది. 26“తండ్రి దగ్గర నుంచి మీ దగ్గరికి నేను పంపబోయే ఆదరణకర్త, సత్యమైన ఆత్మ వచ్చినపుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. 27మీరు మొదటి నుంచి నాతో ఉన్నవాళ్ళే కాబట్టి మీరు కూడా సాక్షులుగా ఉంటారు. 16:1“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను. 2వారు మిమ్మల్ని సమాజ మందిరాల్లో నుండి బహిష్కరిస్తారు. మిమ్మల్ని చంపినవారు, దేవుని కోసం మంచి పని చేస్తున్నామని అనుకునే సమయం వస్తుంది. 3నేను గాని, తండ్రి గాని వారికి తెలియదు కాబట్టి అలా చేస్తారు. 4అవి జరిగే సమయం వచ్చినప్పుడు, వాటిని గురించి నేను మీతో చెప్పినవి గుర్తు చేసుకోవాలని ఈ సంగతులు మీతో చెబుతున్నాను. నేను మీతో ఉన్నాను కాబట్టి మొదట్లో ఈ సంగతులు మీతో చెప్పలేదు. 5అయితే ఇప్పుడు నన్ను పంపినవాడి దగ్గరికి వెళ్తున్నాను. అయినా, ‘నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?’ అని మీలో ఎవ్వరూ నన్ను అడగడం లేదు. 6నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయం నిండా దుఃఖం ఉంది. 7“అయినప్పటికీ, నేను మీతో సత్యం చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం మీకు మంచిదే. నేను వెళ్ళకపోతే, ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. కాని నేను వెళ్తే, ఆయనను మీ దగ్గరికి పంపిస్తాను. 8ఆదరణకర్త వచ్చినప్పుడు, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి లోకాన్ని ఒప్పిస్తాడు. 9ప్రజలు నాలో నమ్మకం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. 10నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీరు ఇంక నన్ను ఎన్నడూ చూడరు గనక నీతిని గురించి ఒప్పిస్తాడు. 11ఈ లోకపాలకుడు తీర్పు పొందాడు గనక తీర్పును గురించి ఒప్పిస్తాడు. 12“నేను మీతో చెప్పే సంగతులు ఇంకా చాలా ఉన్నాయి గాని ఇప్పుడు మీరు వాటిని అర్థం చేసుకోలేరు. 13అయితే ఆయన, సత్య ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ మాట్లాడడు. ఏం వింటాడో అదే మాట్లాడతాడు. జరగబోయే వాటిని మీకు ప్రకటిస్తాడు. 14ఆయన నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడు కాబట్టి నాకు మహిమ కలిగిస్తాడు. 15నా తండ్రికి ఉన్నవన్నీ నావే, అందుచేత ఆ ఆత్మ నా వాటిని తీసుకుని మీకు ప్రకటిస్తాడని నేను చెప్పాను. 16“కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.” 17ఆయన శిష్యుల్లో కొంతమంది “ఆయన కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అంటున్నాడు. ఇది ఏమిటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, 18కాబట్టి వారు, కొద్ది కాలం అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఏం చెబుతున్నాడో మనకు తెలియడం లేదు” అనుకున్నారు. 19వారు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వారితో, “‘కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు’ అని నేను అన్నదానికి అర్థం ఏమిటని ఆలోచిస్తున్నారా? 20నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. 21స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు. 22“అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు. 23ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు. 24ఇంతవరకూ నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు. 25ఈ సంగతులు ఇంతవరకూ తేలికగా అర్థం కాని భాషలో మీకు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది అప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను. 26ఆ రోజున మీరు నా పేరట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడం లేదు. 27ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. 28నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు. 29ఆయన శిష్యులు, “చూడు, ఇప్పుడు నువ్వు అర్థం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు. 30నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేము తెలుసుకున్నాం. దీని వలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు. 31యేసు జవాబిస్తూ, “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? 32మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు. 33నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు. 17:1యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు చూసి, ఇలా అన్నాడు, “తండ్రీ, సమయం వచ్చింది. నీ కుమారుడు నీకు మహిమ కలిగించేలా, నీ కుమారుడికి మహిమ కలిగించు. 2నువ్వు నీ కుమారుడికి అప్పగించిన వారందరికీ ఆయన శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు. 3ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం. 4నువ్వు నాకు అప్పగించిన పని పూర్తి చేసి, భూమి మీద నీకు మహిమ కలిగించాను. 5తండ్రీ, ఈ ప్రపంచం ఆరంభానికి ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో, ఇప్పుడు నీ సముఖంలో ఆ మహిమ మళ్లీ నాకు కలిగించు. 6లోకంలోనుంచి నువ్వు నాకు అప్పగించిన వారికి నిన్ను వెల్లడి చేశాను. వారు నీ వారు. నువ్వు వారిని నాకు అప్పగించావు. వారు నీ వాక్కు పాటించారు. 7నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ దగ్గర నుంచి వచ్చినవే అని ఇప్పుడు వారికి తెలుసు. 8ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన వాక్కులు నేను వారికి ఇచ్చాను. వారు వాటిని స్వీకరించి, నిజంగా నేను నీ దగ్గర నుండి వచ్చాననీ, నీవే నన్ను పంపావనీ నమ్మారు. 9“నేను వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ లోకం కోసం కాదు గాని, నువ్వు నాకు అప్పగించిన వారు నీ వారు కాబట్టి, వారి కోసమే ప్రార్థన చేస్తున్నాను. 10నావన్నీ నీవి, నీవన్నీ నావి. వారిలో నాకు మహిమ కలిగింది. 11నేనింక ఈ లోకంలో ఉండను గాని ఈ ప్రజలు లోకంలో ఉన్నారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, నువ్వు నాకిచ్చిన నీ నామాన్ని బట్టి, మనం ఏకంగా ఉన్నట్టే వారూ ఏకంగా ఉండేలా వారిని కాపాడు. 12నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చిన నీ నామాన్ని బట్టి వారిని కాపాడాను. లేఖనం నెరవేరేలా, నాశనానికి తగినవాడు తప్ప ఏ ఒక్కరూ నశించకుండా, వారిని సంరక్షించాను. 13ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెబుతున్నాను. 14వారికి నీ వాక్కు ఇచ్చాను. నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే, వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు కాబట్టి ఈ లోకం వారిని ద్వేషించింది. 15నువ్వు ఈ లోకంలో నుంచి వారిని తీసుకు వెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు గాని, దుర్మార్గుని నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. 16నేను ఈ లోకానికి చెందినవాణ్ణి కానట్టే వారు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు. 17సత్యం ద్వారా వారిని పవిత్రం చెయ్యి. నీ వాక్యమే సత్యం. 18“నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టే, నేను వారిని ఈ లోకంలోకి పంపించాను. 19వారు సత్యం ద్వారా పవిత్రులు కావాలని వారి కోసం నన్ను నేను పవిత్రం చేసుకుంటున్నాను. 20నువ్వు నన్ను పంపావని లోకం నమ్మేలా, తండ్రీ, నాలో నువ్వు, నీలో నేను ఉన్నట్టే, 21వారు మనలో ఏకమై ఉండాలని వారి కోసం మాత్రమే నేను ప్రార్థన చేయడం లేదు. వారి మాటవల్ల నాలో నమ్మకం ఉంచే వారంతా ఏకమై ఉండాలని వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. 22మనం ఏకమై ఉన్నట్టే, వారు కూడా ఏకమై ఉండాలని నువ్వు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చాను. 23వారిలో నేను, నాలో నువ్వు ఉన్న కారణంగా వారు పరిపూర్ణులుగా ఏకంగా ఉన్న దాన్ని బట్టి, నువ్వు నన్ను పంపావని, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావని, లోకం తెలుసుకొనేలా నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చాను. 24“తండ్రీ, నేను ఎక్కడ ఉంటానో, నువ్వు నాకిచ్చిన వారు నాతో కూడా అక్కడ ఉండాలని, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వారు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందు నుంచే నువ్వు నన్ను ప్రేమించావు. 25నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు. 26నువ్వు నా పట్ల చూపించిన ప్రేమ వారిలో ఉండాలనీ, నేను వారిలో ఉండాలనీ, నీ నామాన్ని వారికి తెలియజేశాను. ఇంకా తెలియజేస్తాను.” 18:1యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు.
శ్రమల రెండవ సువార్త
1యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు. 2యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు. 3అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. 4అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వారితో, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. 5వారు “నజరేతు వాడైన యేసు” అని జవాబిచ్చారు. యేసు వారితో, “నేనే ఆయన్ని” అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు. 6ఆయన వారితో, “నేనే” అని చెప్పినప్పుడు వారు వెనక్కి తూలి నేల మీద పడ్డారు. 7ఆయన మళ్ళీ, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు మళ్ళీ, “నజరేతు వాడైన యేసు కోసం” అన్నారు. 8యేసు వారితో, “ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వారిని వెళ్ళిపోనివ్వండి” అన్నాడు. 9“నువ్వు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు” అనే ఆయన వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు. 10అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. ఆ సేవకుడి పేరు మల్కు. 11యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు. 12అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు. 13మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ. 14ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప. 15సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు. 16కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు. 17గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసి పేతురుతో, “నువ్వు ఆతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అంది. అతడు, “కాదు” అన్నాడు. 18చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలి కాచుకొంటున్నారు. పేతురు కూడా వారితో నిలుచుని చలి కాచుకొంటున్నాడు. 19ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు. 20యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు. 21నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు. 22యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు. 23యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు. 24తరువాత అన్న బంధితుడైన యేసును ప్రధాన యాజకుడు కయప దగ్గరికి పంపాడు. 25అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. అక్కడున్న వారు అతనితో, “నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. “కాదు” అన్నాడు. 26పేతురు ఎవరి చెవి నరికాడో వాడి బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, “నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది. 28వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు.
శ్రమల మూడవ సువార్త
57యేసును పట్టుకున్న వారు ఆయనను ప్రధాన యాజకుడు కయప దగ్గరికి తీసుకుపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు. 58పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుడి ఇంటి గుమ్మం వరకూ వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు. 59ముఖ్య యాజకులు, మహాసభ సభ్యులంతా యేసును చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా దొంగసాక్ష్యం కోసం వెదికారు. 60అబద్ధ సాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్ష్యం నిలబడలేదు. 61చివరికి ఇద్దరు మనుషులు వచ్చి, “ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దాన్ని తిరిగి కడతానని చెప్పాడు” అన్నారు. 62అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, “నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?” అని అడిగాడు. యేసు మౌనం వహించాడు. 63అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, “సజీవుడైన దేవుని నామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడు క్రీస్తువా? మాతో చెప్పు!” అన్నాడు. 64అందుకు యేసు, “నీకై నీవే ఆ మాట చెప్పావు కదా. నేను చెప్పేదేమంటే, ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు” అన్నాడు. 65వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకున్నాడు. “వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది? 66మీరేమంటారు?” అని సభవారిని అడిగాడు. అందుకు వారు, “వీడు చావుకు తగినవాడు!” అన్నారు. 67అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు. 68కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, “క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!” అన్నారు. 69పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, “నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?” అని అడిగింది. 70అందుకు అతడు, “నీవు చెప్పే సంగతి నాకు తెలియదు” అని అందరి ముందూ అన్నాడు. 71అతడు నడవలోకి వెళ్ళినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, “ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు” అని అక్కడున్న వారితో చెప్పింది. 72పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు. 73కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరికి వచ్చి, “నిజమే, నువ్వు కూడా వారిలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది” అన్నారు. 74దానితో పేతురు, “ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను” అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది. 75“ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు” అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.
శ్రమల నాల్గవ సువార్త
28వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. 29కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు. 30వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. 31అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. 32తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. 33అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు. 34యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. 35అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు. 36యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. 37అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు. 38పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు, 39పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు. 40అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ. 19:1ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు. 2సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు. 4పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు. 5కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు. 6ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు. 7యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు. 8పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు. 10అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు. 11యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. 12అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు. 13పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు. 14అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు. 15వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. 16అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.
శ్రమల ఐదవ సువార్త
3అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4“నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. 5అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. 6ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు. 7వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. 8ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు. 9దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు. 10వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది. 11యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు. 12ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు. 13కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు. 14అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. 15ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. 16ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. 17కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” 18ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు. 19అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది. 20ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు. 21పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు. 22అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు. 23పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. 24అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. 25అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు. 26అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. 27అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. 28వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. 29ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. 30ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. 31అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 32వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.
శ్రమల ఆరవ సువార్త
16సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు. 17వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. 18ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. 19రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. 20ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 21కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. 22వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం. 23అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. 24ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. 25ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. 26“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. 27ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు. 28‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది. 29ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా! 30ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు. 31ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 32‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు.
శ్రమల ఏడవ సువార్త
33వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. 34అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. 35వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. 36అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. 37“ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. 38ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. 39ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, 40“దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. 41అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, 42“ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. 43ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. 44ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. 45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 46సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. 47అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 48వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. 49మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. 50యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. 51అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. 53వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు. 54రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు.
శ్రమల ఎనిమిదవ సువార్త
32ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు. 33వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు. 34అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు. 35ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. 36ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ 37“నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. 38“ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. 39వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు. 40కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు. 42తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 44అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. 45సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది. 46అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. 47శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. 48ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. 49ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
శ్రమల 9వ సువార్త
25యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. 26ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. 27తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. 28దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు. 29అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు. 30యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. 31అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. 32కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. 33వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. 34అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. 35ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. 36“అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. 37“వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది.
శ్రమల 10వ సువార్త
43యూదుల మహా సభలో పేరు పొందిన ఒక సభ్యుడు, అరిమతయి వాడైన యోసేపు అక్కడికి వచ్చాడు. అతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాడు. అతడు ధైర్యంగా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. 44యేసు అంత త్వరగా చనిపోయాడని పిలాతు ఆశ్చర్యపోయి, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చనిపోయాడా?” అని అడిగాడు. 45ఆయన చనిపోయాడని శతాధిపతి ద్వారా తెలుసుకుని ఆయన దేహాన్ని యోసేపుకు అప్పగించాడు. 46యోసేపు సన్న నారబట్ట కొని యేసును కిందికి దింపి ఆ బట్టలో చుట్టాడు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధిలో ఆయనను పెట్టాడు. ఒక రాయిని అడ్డంగా దొర్లించి ఆ సమాధిని మూసివేశాడు. 47మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ ఆయనను ఉంచిన చోటును చూశారు.
శ్రమల 11వ సువార్త
38ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. 39మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు. 40వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం. 41ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది. 42ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.
శ్రమల 12వ సువార్త
62ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, 63“అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. 64కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు. 65అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు. 66వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.
మొదటి ఘడియ
10ప్రజలందరితో నేను చేసిన ఒడంబడిక రద్దు చేసిన దానికి సూచనగా “అనుగ్రహం” అనే కర్రను తీసుకుని దాన్ని విరిచివేశాను. 11దాన్ని విరిచిన రోజున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బాధలు అనుభవిస్తూ, నన్ను కనిపెట్టి చూస్తూ ఉన్నవారికి తెలిసింది. 12నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు. 13అప్పుడు యెహోవా తిరస్కారంగా “వాళ్ళు నాకు అపురూపంగా ఇచ్చిన దాన్ని కుమ్మరికి పారవెయ్యి” అని నాకు ఆజ్ఞ ఇవ్వగా నేను ఆ 30 వెండి నాణేలను యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేశాను.
మొదటి ఘడియ (పత్రిక)
14అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ గొప్పలు చెప్పుకోవడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నాకు లోకం సిలువ మరణం చెందాను. 15కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు. 16ఈ పద్ధతి ప్రకారం నడుచుకునే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగు గాక. 17నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు. 18సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండుగాక. ఆమేన్.
మొదటి ఘడియ (సువార్త)
1తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు. 2ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు. 3అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4“నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. 5అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. 6ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు. 7వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. 8ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు. 9దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు. 10వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది. 11యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు. 12ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు. 13కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు. 14అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. 15ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. 16ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. 17కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” 18ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు. 19అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది. 20ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు. 21పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు. 22అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు. 23పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. 24అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. 25అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు. 26అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. 27అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. 28వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. 29ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. 30ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. 31అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 32వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు. 33వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. 34అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. 35వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. 36అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. 37“ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. 38ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. 39ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, 40“దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. 41అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, 42“ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. 43ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. 44ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. 45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 46సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. 47అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 48వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. 49మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. 50యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. 51అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. 53వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు. 54రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు. 55యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు. 56వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
మూడవ ఘడియ
4అలసినవాణ్ణి నా మాటలతో ఆదరించే జ్ఞానం నాకు కలిగేలా శిష్యునికి ఉండాల్సిన నాలుక యెహోవా నాకిచ్చాడు. శిష్యునిలాగా నేను వినడానికి ఆయన ప్రతి ఉదయాన నన్ను మేల్కొలుపుతాడు. 5ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు. 6నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు. 7ప్రభువైన యెహోవా నాకు సాయం చేస్తాడు కాబట్టి నేనేమీ సిగ్గుపడలేదు. నాకు సిగ్గు కలగదని తెలుసు కాబట్టి నా ముఖాన్ని చెకుముకి రాయిలాగా చేసుకున్నాను. 8నన్ను నీతిమంతునిగా ఎంచే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నన్ను వ్యతిరేకించే వాడెవడు? మనం కలిసి వాదించుకుందాం. నా ప్రతివాది ఎవడు? అతణ్ణి నా దగ్గరికి రానివ్వండి. 9ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. నా మీద ఎవరు నేరం మోపుతారు? వారంతా బట్టలాగా పాతబడిపోతారు. వారిని చిమ్మెట తినివేస్తుంది. 10మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి. 11ఇదిగో, నిప్పులు వెలిగించి మీ చుట్టూ మంటలను పెట్టుకొనే వారంతా మీ అగ్ని వెలుగులో, మీరు వెలిగించిన మంటల్లో నడవండి. ఇది మీకు నా చేతినుండే కలుగుతున్నది. మీరు వేదనతో పండుకుంటారు.
మూడవ ఘడియ (పత్రిక)
6ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.
మూడవ ఘడియ (సువార్త)
16సైనికులు యేసును అధికార భవనంలోకి తీసుకు వెళ్ళి మిగిలిన సైనికులందర్నీ అక్కడికి పిలిచారు. 17వారాయనకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలపై పెట్టారు. 18ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అంటూ ఆయనకు వందనం చేయసాగారు. 19రెల్లు కర్రతో తలపై కొట్టి ఆయన మీద ఉమ్మి వేశారు. ఆయన ముందు మోకరించి నమస్కరించారు. 20ఈ విధంగా ఆయనను అవహేళన చేసిన తరువాత ఆ ఊదా రంగు అంగీ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగి సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 21కురేనే ప్రాంతానికి చెందిన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అనే వారి తండ్రి) ఆ దారిలో నడిచి వస్తూ ఉండగా చూసి, సైనికులు అతనితో బలవంతంగా యేసు సిలువను మోయించారు. 22వారు యేసును, “గొల్గొతా” అనే చోటికి తీసుకు వచ్చారు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అని అర్థం. 23అప్పుడు వారు ద్రాక్షారసంలో బోళం కలిపి ఆయనకు తాగడానికి ఇచ్చారు. కాని యేసు తాగలేదు. 24ఆ తరువాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన బట్టలు పంచుకోవడానికి చీట్లు వేసి, ఎవరికి వచ్చినవి వారు తీసుకున్నారు. 25ఆయనను సిలువ వేసిన సమయం ఉదయం తొమ్మిది గంటలు. 26“యూదుల రాజు” అని ఆయన మీద మోపిన నేరం ఒక పలక మీద రాసి తగిలించారు. 27ఆయనతో ఇద్దరు బందిపోటు దొంగలను ఒకణ్ణి కుడి వైపు, మరొకణ్ణి ఎడమవైపు సిలువ వేశారు. 28‘ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది. 29ఆ దారిన వెళ్ళే వారు ఆయనను దూషిస్తూ తలలాడిస్తూ, “దేవాలయాన్ని కూలదోసి మూడు రోజుల్లో మళ్ళీ కట్టిస్తానన్నావు కదా! 30ముందు సిలువ నుండి కిందికి దిగి నిన్ను నువ్వే రక్షించుకో!” అన్నారు. 31ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా ఆయనను హేళన చేస్తూ, “వీడు ఇతరులను రక్షించాడు. తనను తాను రక్షించుకోలేడు! 32‘క్రీస్తు’ అనే ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మీద నుండి కిందికి దిగి వస్తే అప్పుడు నమ్ముతాం!” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసుతో పాటు సిలువ వేసినవారు కూడా ఆయనను నిందించారు. 33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 34మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అని గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నా చెయ్యి విడిచిపెట్టావెందుకు?” అని అర్థం. 35దగ్గర నిలుచున్న కొందరు అది విని, “ఇదిగో, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 36ఒకడు పరుగెత్తుకుంటూ వెళ్ళి స్పాంజ్ ని పులిసిన ద్రాక్షారసంలో ముంచి రెల్లు కర్రకు తగిలించి యేసుకు తాగడానికి అందించాడు. “ఏలీయా వచ్చి ఇతన్ని కిందికి దించుతాడేమో చూద్దాం” అని అతడు అన్నాడు. 37అప్పుడు యేసు పెద్ద కేక వేసి ప్రాణం విడిచాడు. 38ఆ వెంటనే దేవాలయంలో తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగిపోయింది. 39యేసు ఎదుట నిలబడి ఉన్న శతాధిపతి ఆయన చనిపోయిన విధానం అంతా గమనించి, “నిజంగా ఈయన దేవుని కుమారుడు” అన్నాడు. 40కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఉన్నారు. 41యేసు గలిలయలో ఉన్నపుడు వీరు ఆయనను వెంబడిస్తూ ఆయనకు సేవ చేసేవారు. వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు.
ఆరవ ఘడియ
13వినండి. నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు. అన్నీ చక్కగా జరిగిస్తాడు. ఆయన్ని హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం అధికంగా ఘనపరచడం జరుగుతుంది. 14అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు. 15అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు. 53:1మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది? 2ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు. 3ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు. 4అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు. అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం. 5కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం. 6మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు. 7ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. 8అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు? నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు. 9అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు. అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు. 10అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. 11తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు. 12కాబట్టి గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను. అనేకమందితో కలిసి అతడు కొల్లసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన్ని ఎంచడం జరిగింది. ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ అపరాధుల కోసం విజ్ఞాపన చేశాడు. 54:1“గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు.
ఆరవ ఘడియ (మరో పఠనం)
9యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఆ రోజు నేను మధ్యాహ్నమే పొద్దు గుంకేలా చేస్తాను. పట్టపగలే భూమికి చీకటి కమ్ముతుంది. 10మీ పండగలను దుఃఖదినాలుగా మీ పాటలన్నిటినీ విషాద గీతాలుగా మారుస్తాను. మీరంతా గోనెపట్ట కట్టుకొనేలా చేస్తాను. మీ అందరి తలలు బోడిచేస్తాను. ఒక్కడే కొడుకు చనిపోతే శోకించినట్టుగా నేను చేస్తాను. దాని ముగింపు ఘోరమైన రోజుగా ఉంటుంది. 11యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది. 12యెహోవా మాట వినడానికి ఒక సముద్రం నుంచి మరొక సముద్రం వరకూ, ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకూ తిరుగుతారు కానీ అది వారికి దొరకదు.
ఆరవ ఘడియ (పత్రిక)
11పరిశుద్ధులుగా అయ్యేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు. 12ఆయన, “నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు. 13ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు. ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు. 14కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు. 15మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు. 16ఆయన కచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. అబ్రాహాము సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. 17దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది. 18ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.
ఆరవ ఘడియ (సువార్త)
32ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు. 33వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు. 34అప్పుడు యేసు, “తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు” అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు. 35ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు, “వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి” అంటూ ఎగతాళి చేశారు. 36ఇక సైనికులు కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ 37“నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో” అని ఆయనను వెక్కిరించారు. 38“ఇతడు యూదుల రాజు” అని ఒక చెక్కపై రాసి ఆయనకు పైగా ఉంచారు. 39వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు. 40కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు. 42తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 44అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలముకుంది. 45సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది. 46అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి, “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను.” అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి ప్రాణం విడిచాడు. 47శతాధిపతి జరిగిందంతా చూసి, “ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే” అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు. 48ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్ళారు. 49ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనను అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
9వ ఘడియ
యిర్మీ 11:18–12:5, 9–11, 14–15
18దీనంతటినీ యెహోవా నాకు వెల్లడి చేసినప్పుడు నేను గ్రహించాను. ఆయన వారి పనులను నాకు కనపరిచాడు. 19అయితే నేను వధకు తీసుకుపోయే గొర్రెపిల్లలాగా ఉన్నాను. వారు నాకు వ్యతిరేకంగా చేసిన ఆలోచనలు నేను గ్రహించలేదు. “మనం చెట్టును దాని ఫలంతో సహా కొట్టివేద్దాం రండి, అతని పేరు ఇకపై ఎవరూ జ్ఞాపకం చేసుకోకుండా అతనిని సజీవుల్లో నుండి నిర్మూలం చేద్దాం రండి” అని వారు చెప్పుకున్నారు. 20సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు. యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను. 21“నువ్వు యెహోవా పేరున ప్రవచిస్తే, మా చేతిలో చనిపోతావు” అని చెప్పే అనాతోతు ప్రజల గురించి సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, 22“నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు. 23వారిలో ఎవరూ మిగలరు. ఎందుకంటే నేను వారికి తీర్పు తీర్చిన సంవత్సరం వారి పైకి మహా విపత్తును పంపిస్తాను.” 12:1యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు? 2వారిని నువ్వే నాటావు, వారు వేరు పారి పెరిగి ఫలిస్తున్నారు. వారి మాటలు చూస్తే నువ్వు వారికి దగ్గరగా ఉన్నావు గానీ వారి హృదయాలకు దూరమే. 3యెహోవా, నీకు నేను బాగా తెలుసు. నన్ను చూస్తూ ఉన్నావు. నా హృదయాన్ని పరిశోధిస్తున్నావు. వధ కోసం ఏర్పాటు చేసిన గొర్రెల్లాగా వారిని తీసుకుపో. వధ రోజు కోసం వారిని ప్రత్యేక పరచు. 4దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి. వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు. 5యిర్మీయా, నువ్వు పాదచారులతో పరిగెత్తినప్పుడే నీవు అలసిపోయావు కదా, నువ్వు గుర్రపు రౌతులతో ఏ విధంగా పోటీ పడతావు? నెమ్మదిగా ఉన్న ప్రాంతంలోనే నువ్వు నిశ్చింతగా ఉండగలవు. మరి యొర్దాను పరవళ్ళు తొక్కుతూ వస్తే నీవేం చేస్తావు? 9నా వారసత్వం నాకు ఒక హైనా జంతువులాగా అయ్యింది. క్రూరపక్షులు దాని చుట్టూ గుమిగూడి ఉంటున్నాయి. రండి, అవి తినడానికి అడవి జంతువులన్నిటినీ పోగు చేయండి. 10అనేకమంది కాపరులు నా ద్రాక్షతోటలను పాడు చేశారు. నా ఆస్తిని తొక్కివేశారు. నాకిష్టమైన పొలాన్ని బీడుగా ఎడారిగా చేశారు. 11వారు దాన్ని పాడు చేయడం చూసి నేను దుఃఖిస్తున్నాను. దేశమంతా పాడైపోయింది. దాని గూర్చి బాధపడే వాడు ఒక్కడూ లేడు. 14యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను. 15ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.”
9వ ఘడియ (పత్రిక)
19కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. 20తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. 21దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, 22విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం. 23వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం. 24అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి. 26సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు. 29ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30“ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. 31సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం.
9వ ఘడియ (సువార్త)
28వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. 29కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు. 30వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. 31అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. 32తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. 33అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు. 34యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. 35అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు. 36యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. 37అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు. 38పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు, 39పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు. 40అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ. 19:1ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు. 2సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు. 4పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు. 5కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు. 6ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు. 7యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు. 8పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు. 10అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు. 11యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. 12అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు. 13పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు. 14అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు. 15వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. 16అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు. 17తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు. 18అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు. 19పిలాతు, ఒక పలక మీద ‘నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు. 20యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు. 21యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో, “‘యూదుల రాజు’ అని కాకుండా, అతడు ‘నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు’ అని రాయించండి” అన్నాడు. 22పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అని జవాబిచ్చాడు. 23సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకున్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి, 24వారు ఒకరితో ఒకరు, “దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం” అన్నారు. “నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు, నా దుస్తుల కోసం చీట్లు వేశారు,” అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు. 25యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. 26ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. 27తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. 28దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు. 29అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు. 30యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. 31అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. 32కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. 33వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. 34అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. 35ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. 36“అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. 37“వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది.
సాయంకాల ప్రార్థన: పఠనం
11ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు. 12మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక ‘నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను’ అని నాతో చెప్పావు కదా. 13అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.” 14అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు. 15మోషే “నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు. 16నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు. 17అప్పుడు యెహోవా “నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను” అని మోషేతో చెప్పాడు. 18మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19ఆయన “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు. 20ఆయన ఇంకా “నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు” అన్నాడు. 21యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు. 22నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను. 23నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు” అని మోషేతో చెప్పాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
12యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. అతనికి పద్నాలుగు వేల గొర్రెలు, ఆరు వేల ఒంటెలు, వెయ్యి జతల ఎడ్లు, వెయ్యి ఆడగాడిదలు ఉన్నాయి. 13అతనికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. 14అతడు పెద్ద కూతురికి ఎమీమా అనీ రెండవ కూతురికి కెజీయా అనీ మూడవ కూతురికి కెరెన్ హపుక్ అనీ పేర్లు పెట్టాడు. 15ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత లావణ్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వాలు ఇచ్చాడు. 16ఆ పైన యోబు నూట నలభై సంవత్సరాలు బతికి, తన కొడుకులను, మనవళ్ళను నాలుగు తరాల వరకూ చూశాడు. 17తరువాత యోబు కాలం నిండిన వృద్ధుడై తనువు చాలించాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
13వినండి. నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు. అన్నీ చక్కగా జరిగిస్తాడు. ఆయన్ని హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం అధికంగా ఘనపరచడం జరుగుతుంది. 14అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు. 15అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు. 53:1మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది? 2ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు. 3ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు. 4అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు. అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం. 5కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం. 6మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు. 7ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. 8అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు? నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు. 9అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు. అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు. 10అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. 11తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు. 12కాబట్టి గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను. అనేకమందితో కలిసి అతడు కొల్లసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన్ని ఎంచడం జరిగింది. ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ అపరాధుల కోసం విజ్ఞాపన చేశాడు. 54:1“గొడ్రాలా, పిల్లలు కననిదానా, పాటలు పాడు. ఎన్నడూ ప్రసవవేదన పడనిదానా, సంతోషంతో గట్టిగా గానం చెయ్యి. పెళ్ళయిన స్త్రీ పిల్లలకంటే భర్త వదిలేసిన స్త్రీకి పుట్టే పిల్లలు ఎక్కువమంది” అని యెహోవా చెబుతున్నాడు.
పత్రిక (సాయంకాల ప్రార్థనలో)
18సిలువ సందేశం, నశించే వారికి వెర్రితనమే గాని రక్షణ పొందుతున్న మనకు దేవుని శక్తి. 19దీని గురించే ‘జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను’ అని రాసి ఉంది. 20జ్ఞాని ఎక్కడున్నాడు? మేధావి ఎక్కడున్నాడు? సమకాలిక తర్కవాది ఎక్కడున్నాడు? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు గదా? 21లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో సంకల్పించాడు. 22యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. 23అయితే మేము సిలువ పాలైన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఒక అడ్డుబండగా, గ్రీసు దేశస్తులకు బుద్ధిహీనతగా ఉన్నాడు. 24అయితే యూదులు గానీ, గ్రీకులు గానీ, ఎవరైతే పిలుపు పొందారో వారికి క్రీస్తు దేవుని శక్తీ దేవుని జ్ఞానమూ అయ్యాడు. 25ఎందుకంటే దేవుని బుద్ధిహీనత మానవుల కంటే తెలివైనది, దేవుని బలహీనత మానవుల కంటే బలమైనది. 26సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీలో లోకం దృష్టిలో తెలివైనవారు, ఘనులు, గొప్ప వంశం వారు ఎంతోమంది లేరు కదా. 27దేవుడు తెలివైన వారిని సిగ్గు పరచడానికి లోకంలో బుద్ధిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతులను సిగ్గు పరచడానికి లోకంలో బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. 28గొప్పవారిని హీనపరచడానికి లోకంలో నీచులనూ, మనుషులు తిరస్కరించిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు. 29ఎందుకంటే తన ముందు ఎవరూ గొప్పలు చెప్పుకోకూడదని దేవుని ఉద్దేశం. 30అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు. 31“అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి” అని రాసి ఉన్నట్టుగా దేవుని మూలంగా క్రీస్తు మనకు జ్ఞానం, నీతి, పవిత్రత, విమోచనం అయ్యాడు. 2:1సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. 2మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను.
సువార్త (కలిపిన పఠనం)
మత్తయి 27:1–38 · లూకా 23:39–43 · మత్తయి 27:39–54 · యోహా 19:31–37 · మత్తయి 27:55–61
1తెల్లవారింది. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు. 2ఆయనను బంధించి, తీసుకెళ్ళి రోమ్ గవర్నర్ పిలాతుకు అప్పగించారు. 3అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, వారు ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్ఫై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, 4“నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను” అని చెప్పాడు. అందుకు వారు, “ఐతే మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో” అని చెప్పారు. 5అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు. 6ముఖ్య యాజకులు ఆ వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు. 7వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశులను పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కున్నారు. 8ఆ పొలాన్ని నేటివరకూ “రక్త పొలం” అని పిలుస్తున్నారు. 9దీనితో, “ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్ఫై వెండి నాణాలు. 10వారు ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాడి పొలం కోసం ఇచ్చారు” అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది. 11యేసు పిలాతు ఎదుట నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, “నీవు యూదుల రాజువా?” అని ఆయనను అడిగాడు. యేసు, “నీవే అంటున్నావు గదా” అన్నాడు. 12ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు. 13కాబట్టి పిలాతు, “నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?” అని ఆయనను అడిగాడు. 14అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది. 15ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం గవర్నరుకు వాడుక. 16ఆ కాలంలో బరబ్బా అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు. 17కాబట్టి ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు వారిని ఇలా అడిగాడు, “నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బనా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?” 18ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయనను అప్పగించారని అతనికి తెలుసు. 19అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది. 20ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బనే విడిపించమనీ యేసును చంపించాలని అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు. 21పిలాతు, “ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడగగా వారు, “బరబ్బనే” అని అరిచారు. 22అందుకు పిలాతు, “మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?” అన్నాడు. వారంతా, “అతణ్ణి సిలువ వేయండి” అని కేకలు వేశారు. 23పిలాతు, “ఎందుకు? ఇతడు ఏం నేరం చేశాడు?” అని అడిగినప్పుడు, వారు, “సిలువ వేయండి” అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు. 24అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్ళు తీసుకుని ఆ జనసమూహం ఎదుట చేతులు కడుక్కుని, “ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీన్ని మీరే చూసుకోవాలి” అని చెప్పాడు. 25అందుకు ప్రజలంతా, “అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉండుగాక” అన్నారు. 26అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు. 27అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు. 28వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు. 29ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, “యూదుల రాజా, నీకు శుభం!” అంటూ ఎగతాళి చేశారు. 30ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు. 31అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్ళారు. 32వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు. 33వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు. 34అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దాన్ని రుచి చూసి తాగలేక నిరాకరించాడు. 35వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు. 36అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు. 37“ఇతడు యూదుల రాజైన యేసు’’ అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు. 38ఆయన కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు. 23:39వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దూషిస్తూ, “నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు” అన్నాడు. 40కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. “నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా? 41మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు. 42తరువాత ఆయనను చూసి, “యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అన్నాడు. 43అందుకాయన వాడితో, “ఈ రోజు నువ్వు నాతో కూడా పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 27:39ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ, 40“దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగిరా!” అంటూ ఆయనను తిట్టారు. 41అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ, 42“ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీద నుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం. 43ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు” అని హేళనగా మాట్లాడారు. 44ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. 45మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మింది. 46సుమారు మూడు గంటలప్పుడు యేసు, “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, “నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?” అని అర్థం. 47అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, “అతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు. 48వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పాంజ్ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు. 49మిగిలిన వారు, “ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం” అన్నారు. 50యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు. 51అప్పుడు దేవాలయంలోని తెర పైనుండి కింది వరకూ రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి. 52సమాధులు తెరుచుకున్నాయి. కన్ను మూసిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి. 53వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు. 54రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలను చూసి చాలా భయపడ్డారు. “ఈయన నిజంగా దేవుని కుమారుడే” అని వారు చెప్పుకున్నారు. 19:31అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. 32కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. 33వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. 34అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. 35ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. 36“అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. 37“వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది. 27:55యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు. 56వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసేపు అనే వారి తల్లి అయిన మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు. 57ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు. 58అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దాన్ని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు. 59యోసేపు ఆ దేహాన్ని తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు. 60తాను రాతిలో తొలిపించుకున్న తన కొత్త సమాధిలో దాన్ని పెట్టాడు. తరువాత పెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్ళిపోయాడు. 61మగ్దలేనే మరియ, వేరొక మరియ అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 17 ఏప్రిల్ పౌర కాలెండర్లో 30 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు