హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 28 ఏప్రిల్
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 15 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 28 ఏప్రిల్, 2027
బుధవారం · పవిత్ర వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా పవిత్ర బుధవారం
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సువార్త (పెండ్లికుమారుని ఉదయ ప్రార్థన)
17ఆయన లాజరును సమాధిలో నుంచి పిలిచి, చావు నుండి తిరిగి బతికించినప్పుడు యేసుతో ఉన్న ప్రజలు ఆయన గురించి ఇతరులకు సాక్ష్యం ఇచ్చారు. 18ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న కారణంగా జన సమూహం ఆయనను కలుసుకోడానికి వెళ్ళారు. 19దీని గురించి పరిసయ్యులు, “చూడండి, మనం ఏమీ చెయ్యలేం. లోకం ఆయన వెంట వెళ్ళింది.” అని తమలో తాము చెప్పుకున్నారు. 20ఆ పండగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో కొంతమంది గ్రీకులు ఉన్నారు. 21వారు, గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పు దగ్గరికి వచ్చి, “అయ్యా, మాకు యేసును చూడాలని ఉంది” అన్నారు. 22ఫిలిప్పు వెళ్ళి అంద్రెయతో చెప్పాడు. అంద్రెయ ఫిలిప్పుతో కలిసి వెళ్ళి యేసుతో చెప్పారు. 23యేసు వారికి జవాబిస్తూ, “మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చింది. 24మీతో కచ్చితంగా చెబుతున్నాను, గోదుమ గింజ భూమిలో పడి చావకపోతే, అది ఒకటిగానే ఉండిపోతుంది. అది చస్తే అధికంగా ఫలం ఇస్తుంది. 25తన ప్రాణాన్ని ప్రేమించుకొనే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కాని, ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవం కోసం దాన్ని భద్రం చేసుకుంటాడు. 26నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు. 27ఇప్పుడు నా ప్రాణం ఆందోళన చెందుతూ ఉంది. నేనేం చెప్పను? ‘తండ్రీ, ఈ గడియ నుంచి నన్ను తప్పించు’ అని చెప్పనా? కాని, దీని కోసమే నేను ఈ గడియకు చేరుకున్నాను. 28తండ్రీ, నీ పేరుకు మహిమ కలిగించుకో” అన్నాడు. అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వచ్చి ఇలా అంది, “నేను దానికి మహిమ కలిగించాను. మళ్ళీ మహిమ కలిగిస్తాను.” 29అప్పుడు, అక్కడ నిలుచుని దాన్ని విన్న జనసమూహం, “ఉరిమింది” అన్నారు. మిగతా వారు, “ఒక దేవదూత ఆయనతో మాట్లాడాడు” అన్నారు. 30అందుకు యేసు జవాబిస్తూ ఇలా అన్నాడు, “ఈ స్వరం నా కోసం కాదు. మీ కోసమే వచ్చింది. 31ఇప్పుడు ఈ లోకానికి తీర్పు సమయం. ఇది ఈ లోకపాలకుణ్ణి తరిమివేసే సమయం. 32నన్ను భూమిమీద నుంచి పైకి ఎత్తినప్పుడు, మనుషులందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటాను.” 33ఆయన ఎలాంటి మరణం పొందుతాడో, దానికి సూచనగా ఆయన ఈ మాట చెప్పాడు. 34ఆ జనసమూహం ఆయనతో, “క్రీస్తు ఎల్లకాలం ఉంటాడని ధర్మశాస్త్రంలో ఉందని విన్నాం. ‘మనుష్య కుమారుణ్ణి పైకెత్తడం జరగాలి’ అని నువ్వెలా చెబుతావు? ఈ మనుష్య కుమారుడు ఎవరు?” అన్నారు. 35అప్పుడు యేసు వారితో, “వెలుగు మీ మధ్య ఉండేది ఇంకా కొంత కాలం మాత్రమే. చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే, ఇంకా వెలుగు ఉండగానే, నడవండి. చీకట్లో నడిచే వాడికి, తాను ఎక్కడికి వెళ్తున్నాడో అతనికే తెలియదు. 36మీకు వెలుగుండగానే, ఆ వెలుగులో నమ్మకముంచి వెలుగు సంబంధులు కండి” అన్నాడు. యేసు ఈ సంగతులు చెప్పి, అక్కడ నుంచి వెళ్ళి వారికి కనబడకుండా రహస్యంగా ఉన్నాడు. 37యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు. 38ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది. 39ఈ కారణంగా వారు నమ్మలేకపోయారు, ఎందుకంటే యెషయా మరొక చోట ఇలా అన్నాడు, 40“ఆయన వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు. ఆయన వారి హృదయాలను కఠినం చేశాడు. అలా చెయ్యకపోతే వారు తమ కళ్ళతో చూసి, హృదయాలతో గ్రహించి, నా వైపు తిరిగేవారు. అప్పుడు నేను వారిని బాగు చేసేవాణ్ణి.” 41యెషయా యేసు మహిమను చూశాడు కాబట్టి ఆయన గురించి ఈ మాటలు చెప్పాడు. 42అయినా, పాలకవర్గం వారిలో కూడా చాలామంది యేసులో నమ్మకం ఉంచారు, కాని పరిసయ్యులు సమాజ మందిరంలో నుంచి తమను వెలివేస్తారని భయపడి, ఆ విషయం ఒప్పుకోలేదు. 43వారు దేవుని నుంచి వచ్చే మెప్పుకంటే, మనుషుల నుంచి వచ్చే మెప్పునే ఇష్టపడ్డారు. 44అప్పుడు యేసు పెద్ద స్వరంతో, “నాలో నమ్మకం ఉంచినవాడు నాలో మాత్రమే కాక నన్ను పంపినవాడిలో కూడా నమ్మకం ఉంచుతాడు. 45నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు. 46నాలో నమ్మకం ఉంచేవాడు చీకట్లో ఉండిపోకూడదని, ఈ లోకంలోకి నేను వెలుగుగా వచ్చాను. 47ఎవరైనా నా మాటలు విని, వాటిని పాటించకపోతే నేను అతనికి తీర్పు తీర్చను. ఎందుకంటే నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను, తీర్పు తీర్చడానికి కాదు. 48నన్ను తోసిపుచ్చి, నా మాటలు అంగీకరించని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడున్నాడు. నేను పలికిన వాక్కే చివరి రోజున అతనికి తీర్పు తీరుస్తుంది. 49ఎందుకంటే, నా అంతట నేనే మాట్లాడడం లేదు. నేనేం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపిన తండ్రి నాకు ఆదేశించాడు. 50ఆయన ఆదేశం శాశ్వత జీవం అని నాకు తెలుసు. అందుకే నేను ఏ మాట చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వారితో చెబుతున్నాను” అన్నాడు.
ఆరవ ఘడియ
3ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనాల దగ్గరకీ, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకీ నిన్ను పంపిస్తున్నాను. వాళ్ళ పితరులూ, వాళ్ళూ ఈ రోజు వరకూ నాకు వ్యతిరేకంగా పాపం చేస్తూనే ఉన్నారు. 4వాళ్ళ వారసులు ఒట్టి మూర్ఖులు. వాళ్ళ హృదయాలు కఠినం. వాళ్ళ దగ్గరకి నిన్ను పంపిస్తున్నాను. నువ్వు ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు’ అని వాళ్ళకి చెప్పాలి. 5వాళ్ళు తిరగబడే జనం. అలా ప్రకటిస్తే వాళ్ళు విన్నా, వినకున్నా కనీసం వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని తెలుసుకుంటారు. 6నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు. 7వాళ్ళు ఎంతో తిరగబడే జనం. అయితే వాళ్ళు విన్నా, వినకున్నా నా మాటలు వాళ్లకి చెప్పు. 8నరపుత్రుడా, నువ్వు అయితే నేను చెప్తున్నది విను. ఆ తిరగబడే జాతిలా నువ్వూ తిరుగుబాటు చేయకు. నేను నీకు ఇవ్వబోతున్న దాన్ని నోరు తెరచి తిను.” 9అప్పుడు నేను ఒక హస్తం నా దగ్గరికి రావడం చూశాను. ఆ చేతిలో చుట్టి ఉన్న ఒక పత్రం ఉంది. 10ఆయన ఆ చుట్ట నా ఎదుట విప్పి పరిచాడు. దానికి రెండు వైపులా రాసి ఉంది. దాని పైన గొప్ప విలాపం, రోదన, వ్యాకులంతో నిండిన మాటలు రాసి ఉన్నాయి. 3:1ఆయన నాతో ఇలా చెప్పాడు. “నరపుత్రుడా, నీకు కనిపించిన దాన్ని తిను! ఈ పత్రాన్ని తిను. ఆ తరువాత ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడు” 2దాంతో నేను నోరు తెరిచాను. ఆయన నాకు ఆ పత్రాన్ని తినిపించాడు. 3తరువాత ఆయన నాతో “నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ పత్రాన్ని ఆహారంగా తీసుకో. దాంతో నీ కడుపు నింపుకో” అన్నాడు. కాబట్టి నేను ఆ పత్రాన్ని తిన్నాను. అది నా నోటిలో తేనెలా తియ్యగా ఉంది.
సాయంకాల ప్రార్థన: పఠనం
11మోషే పెద్దవాడైన తరువాత తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. వారు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూశాడు. ఆ సమయంలో తన సొంత జాతి వాడైన హెబ్రీయుల్లో ఒకణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టడం చూశాడు. 12అటూ ఇటూ చూసి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టాడు. 13తరువాతి రోజు మోషే అటుగా వెళ్తుంటే అక్కడ ఇద్దరు హెబ్రీయులు గొడవ పడుతున్నారు. 14అప్పుడు మోషే తప్పు చేసిన వ్యక్తితో “నువ్వెందుకు నీ సోదరుణ్ణి కొడుతున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు “మా మీద నిన్ను అధికారిగా, తీర్పు తీర్చేవాడిగా ఎవరు నియమించారు? నువ్వు ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపుదామనుకుంటున్నావా?” అన్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిపోయిందని మోషే భయపడ్డాడు. 15ఆ సంగతి విన్న ఫరో మోషేను చంపించాలని చూశాడు. మోషే ఫరో దగ్గరనుండి నుండి మిద్యాను దేశానికి పారిపోయాడు. అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడు. 16మిద్యాను దేశంలో ఉన్న యాజకునికి ఏడుగురు కూతుళ్ళు. వాళ్ళు తమ తండ్రి మందలకు నీళ్లు తోడి నీళ్ళ తొట్టెలు నింపుతున్నారు. 17అప్పుడు వేరే మంద కాపరులు వచ్చి వాళ్ళను అక్కడి నుండి తోలివేశారు. మోషే లేచి ఆ అమ్మాయిలకు సహాయం చేసి, వాళ్ళ మందకు నీళ్లు తోడిపెట్టాడు. 18వాళ్ళు తిరిగి తమ ఇంటికి తిరిగి వచ్చాక వారి తండ్రి రగూయేలు “మీరు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. 19అందుకు వాళ్ళు “ఒక ఐగుప్తీయుడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని కాపాడి, నీళ్లు తోడి మన మందకు పోశాడు” అన్నారు. 20అతడు తన కూతుళ్ళతో “అతడు ఏడీ? ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతణ్ణి భోజనానికి పిలుచుకు రండి” అని చెప్పాడు. 21మోషే ఆ కుటుంబంతో కలిసి నివసించడానికి అంగీకరించాడు. రగూయేలు తన కూతురు సిప్పోరాను మోషేకిచ్చి పెళ్లి చేశాడు. 22వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. అప్పుడు మోషే “నేను పరాయి దేశంలో పరాయి వ్యక్తిగా ఉన్నాను” అనుకుని తన కొడుక్కి “గెర్షోము” అని పేరు పెట్టాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
1మరో రోజు దేవదూతలు యెహోవా సముఖంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. 2యెహోవా “నువ్వు ఎక్కడ నుండి వచ్చావు?” అని అపవాదిని అడిగాడు. అందుకు అతడు “భూమి మీద సంచారం చేసి అటూ ఇటూ తిరుగుతూ వచ్చాను” అని యెహోవాకు జవాబిచ్చాడు. 3అందుకు యెహోవా “నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడు, నీతిపరుడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహ్యించుకునేవాడు. అతనిలాంటి వ్యక్తి భూమిపై ఎవ్వరూ లేడు. కారణం లేకుండాా అతణ్ణి నాశనం చెయ్యాలని నువ్వు నన్ను పురికొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్ధిరంగా నిలబడ్డాడు” అని అన్నాడు. 4అప్పుడు సాతాను “మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు గదా. 5మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీదా, దేహం మీదా దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు” అన్నాడు. 6అప్పుడు యెహోవా “అతణ్ణి నీకు స్వాధీనం చేస్తున్నాను. అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు” అని చెప్పాడు. 7సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. 8అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. 9అతని భార్య వచ్చి అతనితో “నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో” అంది. 10అప్పుడు యోబు “నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేళ్ళు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి గదా” అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు తన నోటిమాటతో ఎలాంటి పాపమూ చేయలేదు.
సువార్త (ముందుగా పవిత్రపరచిన కానుకల ఆరాధన)
6యేసు బేతనీలో కుష్టురోగి సీమోను ఇంట్లో ఉన్నాడు. 7ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసాలో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది. 8అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, “ఎంత నష్టం! 9దీన్ని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును పేదలకు దానం చెయ్యవచ్చు కదా?” అన్నారు. 10యేసు ఆ సంగతి గ్రహించి, “ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయంలో ఒక మంచి పని చేసింది. 11బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను. 12ఈమె ఈ అత్తరు నా శరీరంపై పోసి నా భూస్థాపన కోసం సిద్ధం చేసింది. 13నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసుకుని ప్రశంసిస్తారు.” 14అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. 15“యేసును మీకు పట్టిస్తే నాకేమిస్తారు?” అని అతడు వారినడిగాడు. వారు ముప్ఫై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు. 16అతడు అప్పటి నుండి ఆయనను వారికి పట్టివ్వడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 15 ఏప్రిల్ పౌర కాలెండర్లో 28 ఏప్రిల్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు