హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 27 మార్చి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 27 మార్చి, 2027
శనివారం · పాస్కా త్రిదినాలు
పండుగలు మరియు పరిశుద్ధులు
పవిత్ర శనివారం — పాస్కా జాగరణ
పాస్కా త్రిదినాలు · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. 3దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు. 6దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు. 9దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. 11దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు. 14దేవుడు “రాత్రి నుంచి పగలును వేరు చెయ్యడానికి ఆకాశ విశాలంలో జ్యోతులు ఉండాలి. కాలాలకు, రోజులకు, సంవత్సరాలకు అవి సూచనలుగా ఉండాలి. 15భూమికి వెలుగు ఇవ్వడానికి ఆకాశ విశాలంలో జ్యోతులుగా అవి ఉండాలి” అన్నాడు. అలాగే జరిగింది. 16దేవుడు రెండు గొప్ప జ్యోతులు చేశాడు. పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని పాలించడానికి చిన్న జ్యోతిని చేశాడు. ఆయన నక్షత్రాలను కూడా చేశాడు. 17భూమికి వెలుగు ఇవ్వడానికీ, 18పగటినీ రాత్రినీ పాలించడానికీ, వెలుగునూ చీకటినీ వేరు చెయ్యడానికీ, దేవుడు ఆకాశ విశాలంలో వాటిని అమర్చాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 19రాత్రి అయింది. ఉదయం వచ్చింది-నాలుగో రోజు. 20దేవుడు “చలించే ప్రాణులు జలాల్లో కుప్పలు తెప్పలుగా నిండిపోవాలి. భూమిపై ఉన్న ఆకాశవిశాలంలో పక్షులు ఎగరాలి” అన్నాడు. 21దేవుడు బ్రహ్మాండమైన జలచరాలనూ, చలించే ప్రాణులన్నిటినీ వాటి వాటి జాతుల ప్రకారం పుష్కలంగా జలాలను నింపి వేసేలా సృష్టించాడు. ఇంకా వాటి వాటి జాతి ప్రకారం రెక్కలున్న ప్రతి పక్షినీ సృష్టించాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 22దేవుడు “మీరు ఫలించి వృద్ధి పొందండి. సముద్ర జలాలను నింపండి. పక్షులు భూమి మీద విస్తరించాలి” అని వాటిని దీవించాడు. 23రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఐదో రోజు. 24దేవుడు “వాటి వాటి జాతుల ప్రకారం ప్రాణం గలవాటిని, అంటే వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 25దేవుడు, వాటి వాటి జాతుల ప్రకారం అడవి జంతువులనూ వాటి వాటి జాతుల ప్రకారం పశువులనూ, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగునూ చేశాడు. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 26దేవుడు ఇలా అన్నాడు. “మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం. సముద్రంలో చేపల మీదా ఆకాశంలో పక్షుల మీదా పశువుల మీదా భూమి మీద పాకే ప్రతి జంతువు మీదా భూమి అంతటి మీదా వారికి ఆధిపత్యం ఉండాలి” అన్నాడు. 27దేవుడు తన స్వరూపంలో మనిషిని సృష్టించాడు. దేవుని స్వరూపంలో అతణ్ణి సృష్టించాడు. పురుషుడిగా స్త్రీగా వాళ్ళను సృష్టించాడు. 28దేవుడు వాళ్ళను దీవించి “మీరు ఫలించి, సంఖ్యలో వృద్ధి చెందండి. భూమి అంతటా విస్తరించి, భూమిని నింపి దాన్ని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపలనూ ఆకాశంలో పక్షులనూ మీదా భూమి మీద పాకే ప్రతి ప్రాణినీ పరిపాలించండి” అని చెప్పాడు. 29దేవుడు ఇంకా ఇలా అన్నాడు. “చూడండి, భూమిమీద ఉన్న విత్తనాలిచ్చే ప్రతి చెట్టును, విత్తనాలున్న ఫలాలు ఇచ్చే ప్రతి చెట్టును మీకు ఇచ్చాను. అవి మీకు ఆహారం అవుతాయి. 30భూమిమీద ఉండే జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ భూమి మీద పాకే జీవాలన్నిటికీ పచ్చని చెట్లన్నీ ఆహారం అవుతాయి” అన్నాడు. అలాగే జరిగింది. 31దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు. 2:1ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్నవన్నీపూర్తి అయ్యాయి. 2ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచీ ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు.
కీర్తన
కీర్త 104:1–2, 5–6, 10, 12–14, 24, 35
1నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవా, నా దేవా, నీవు మహా ఘనత వహించిన వాడివి. నీవు మహాత్మ్యాన్ని, ప్రభావాన్ని ధరించుకున్నావు. 2ఉత్తరీయం లాగా నీవు వెలుగును కప్పుకున్నావు. తెరను పరచినట్టు ఆకాశ విశాలాన్ని నీవు పరిచావు. 5భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. 6దాని మీద అగాధ జలాలను నీవు వస్త్రం లాగా కప్పావు. కొండలకు పైగా నీళ్లు నిలిచాయి. 10ఆయన కొండలోయల్లో నీటిఊటలు పుట్టిస్తాడు. అవి కొండల్లో ప్రవహిస్తాయి. 12వాటి ఒడ్డున ఆకాశపక్షులు గూడు కట్టుకుంటాయి. కొమ్మల మధ్య అవి కిలకిలారావాలు చేస్తాయి. 13తన మేడ గదుల్లోనుండి ఆయన కొండలకు జలధారలనిస్తాడు. నీ క్రియల ఫలం చేత భూమి తృప్తి పొందుతున్నది. 14పశువులకు గడ్డిని, మనుషుల వాడకానికి కాయగూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు 24యెహోవా, నీ కార్యాలు ఎన్నెన్ని రీతులుగా ఉన్నాయో! జ్ఞానం చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. 35పాపులు భూమిపై లేకుండా పోవాలి. భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించు. యెహోవాను స్తుతించండి.
రెండవ పఠనం
1ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 2అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు. 3కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. 4మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు. 5తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు. 6అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు. 7ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు. 8దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు. 9దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. 10తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. 11అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 12అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు. 13అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 14అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది. 15యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు 16“నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. 17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. 18నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”
కీర్తన
5యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. 8అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను! 9అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను. 10ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. 11జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.
మూడవ పఠనం
15యెహోవా మోషేతో “నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? ‘ముందుకు కొనసాగండి’ అని ప్రజలతో చెప్పు. 16నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. 17చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. 18నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” 19అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. 20అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. 21మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. 22సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. 23ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. 24తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. 25ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు “రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. 26యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. 27మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. 28నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. 29అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. 30ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. 31తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు. 15:1అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు.
కీర్తన
1అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు. 2యెహోవాయే నా బలం, నా గానం, నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను. ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను. 3యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా. 4ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. 5రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు. 6యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది. 17నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు. 18యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.”
నాల్గవ పఠనం
5నిన్ను సృష్టించినవాడు నీకు భర్త. ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. లోమంతటికీ దేవుడు అని ఆయన్ని పిలుస్తారు. 6భర్త వదిలి వేయగా ఎంతో విచారంతో ఉన్న భార్యను భర్త తిరిగి రప్పించినట్టు, పడుచుతనంలో పెళ్ళిచేసుకుని తృణీకారానికి గురి అయిన భార్యను తిరిగి రప్పించినట్టుగా యెహోవా నిన్ను తిరిగి రప్పించాడని, నీ దేవుడు చెబుతున్నాడు. 7కొంతసేపే నేను నిన్ను వదిలేశాను. అయితే ఎంతో జాలితో నేను నిన్ను చేరదీస్తాను. 8కాసేపే నీమీద కోపంతో నా ముఖం దాచాను. నీ మీద జాలి చూపిస్తాను. నిన్నెప్పటికీ నమ్మకంగా ప్రేమిస్తానని నిన్ను విమోచించే యెహోవా చెబుతున్నాడు. 9“ఇది నాకు నోవహు రోజుల్లోని జలప్రళయంలాగా ఉంది. భూమి మీదికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదని నేను ప్రమాణం చేశాను. అలాగే, నీ మీద కోపంగా ఉండననీ నిన్ను గద్దించననీ ప్రమాణం చేశాను. 10పర్వతాలు కూలిపోయినా కొండలు కదిలినా నా కృప నీనుంచి తొలగిపోదు. నా శాంతి ఒడంబడిక, నిన్ను విడిచిపోదు” అని నీ మీద జాలిపడే యెహోవా చెబుతున్నాడు. 11బాధపడుతున్న దానా! తుఫాను బాధితురాలా, ఆదరణలేనిదానా! నేను నీ కాలిబాట వైడూర్యాలతో చేస్తాను. నీలమణులతో నీ పునాదులు వేస్తాను. 12కెంపులతో నీ కోట బురుజులను, మెరిసే రాళ్ళతో నీ గుమ్మాలను, విలువైన రత్నాలతో నీ గోడలను నిర్మిస్తాను. 13యెహోవా నీ పిల్లలందరికీ బోధిస్తాడు. నీ పిల్లలకు పరిపూర్ణమైన నెమ్మది ఉంటుంది. 14నీతితో నిన్ను తిరిగి స్థాపిస్తాను. నువ్వు ఇంకెన్నటికీ హింస అనుభవించవు. నువ్వు భయపడనక్కరలేదు. నిన్ను భయపెట్టేది నీ దగ్గరికి రాదు.
కీర్తన
1ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన. యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు. 3యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు. 4యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి. 5ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది. 10యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి. 11నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు. 12అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.
ఐదవ పఠనం
1“దప్పికతో ఉన్న మీరంతా, నీళ్ల దగ్గరికి రండి! డబ్బు లేని మీరంతా వచ్చి, కొని, తినండి. రండి, డబ్బు లేకపోయినా ఖర్చు లేకుండా ద్రాక్షారసం, పాలు కొనండి. 2తిండి కాని దాని కోసం మీరెందుకు వెండి తూస్తారు? తృప్తినివ్వని దానికోసం మీరెందుకు కష్టపడతారు? నా మాట జాగ్రత్తగా విని మంచివాటిని తినండి. కొవ్విన వాటితో సుఖించండి. 3శ్రద్ధగా విని నా దగ్గరికి రండి! మీరు వింటే బతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపించిన శాశ్వతకృపను మీకు చూపిస్తాను. 4ఇదిగో, రాజ్యాలకు సాక్షిగా నేనతన్ని నియమించాను. ప్రజలకు నాయకునిగా అధికారిగా అతన్ని నియమించాను.” 5నీకు తెలియని రాజ్యాన్ని నువ్వు పిలుస్తావు. నిన్నెరుగని రాజ్యం నీదగ్గరికి పరుగెత్తుకుంటూ వస్తుంది. ఎందుకంటే, నీ యెహోవా దేవుడు నిన్ను ఘనపరచాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజల పవిత్రుడు. 6యెహోవా మీకు దొరికే సమయంలో ఆయన్ని వెదకండి. ఆయన దగ్గరగా ఉండగానే ఆయన్ని వేడుకోండి. 7భక్తిహీనులు తమ మార్గం విడిచిపెట్టాలి. చెడ్డవాళ్ళు తమ తలంపులు మార్చుకోవాలి. వాళ్ళు యెహోవా వైపు తిరగాలి. అప్పుడు ఆయన వారి మీద జాలిపడతాడు. వారు మన దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు. 8“నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. మీ విధానాలు నా విధానాల వంటివి కావు.” ఇదే యెహోవా వాక్కు. 9“ఆకాశాలు భూమి కంటే ఎత్తుగా ఉన్నాయి. అలాగే నా విధానాలు మీ విధానాల కంటే, నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతంగా ఉన్నాయి. 10వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు. 11ఆలాగే నా నోట నుంచి వచ్చే మాట ఉంటుంది. నిష్ఫలంగా నా దగ్గరికి తిరిగి రాదు. అది నా సంకల్పాన్ని నెరవేరుస్తుంది. నేను పంపించిన ఉద్దేశాన్ని సాధిస్తుంది.
కీర్తన
2చూడు, దేవుడే నా రక్షణ. భయం లేకుండా నేను ఆయన్ని నమ్ముతాను. యెహోవా, అవును, యెహోవాయే నాకు బలం. ఆయనే నా కీర్తన. ఆయనే నాకు రక్షణ అయ్యాడు.” 3ఆనందంతో రక్షణ బావుల్లోనుంచి మీరు నీళ్లు చేదుకుంటారు. ఆ రోజున మీరు ఇలా అంటారు, 4“యెహోవాను స్తుతించండి. ఆయన పేరు పెట్టి పిలవండి. జనాల్లో ఆయన క్రియలు చాటించండి. ఆయన పేరు ఘనమైనదని ప్రకటించండి. 5యెహోవాను గూర్చి పాటలు పాడండి. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ సంగతి భూమంతా తెలియనివ్వండి. 6గొప్పవాడైన ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీ మధ్య ఉన్నాడు గనుక, సీయోను నివాసీ, అరిచి సంతోషంతో కేకలు పెట్టు.”
ఆరవ పఠనం
ఈ అనువాదంలో లేదు
కీర్తన
7యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. 8యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి. 9యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. 10అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
ఏడవ పఠనం
16యెహోవా నాకీ విషయం తెలియచేశాడు. 17“నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించినప్పుడు వారి పద్ధతులతో పనులతో దాన్ని అపవిత్రపరచారు. వారి ప్రవర్తన, నా దృష్టిలో రుతుస్రావంలో ఉన్న స్త్రీ అపవిత్రతలాగా ఉంది. 18కాబట్టి దేశంలో వారు చేసిన హత్యలకూ వారి విగ్రహాలతో దేశాన్ని అపవిత్రపరచినందుకు నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరించాను. 19వారి పద్ధతులను బట్టి వారి పనులను బట్టి వారిని శిక్షించి, నేను వేరే రాజ్యాల్లోకి వారిని వెళ్లగొట్టాను. 20వారు తాము వెళ్లిన ప్రదేశాల్లో ప్రతి చోటా వారి మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది. వీళ్ళు నిజంగా యెహోవా ప్రజలేనా? ఆయన తన దేశంలో నుంచి ఆయన వాళ్ళను తోసేశాడు అని వారి గురించి చెప్పారు. 21అయితే ఇశ్రాయేలీయులు వెళ్ళిన ప్రాంతాల్లో నా పవిత్ర నామం దూషణకు గురి అవుతూ ఉంటే నా పేరు గురించి నేను చింతించాను.” 22కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ విషయం చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇశ్రాయేలీయులారా, నేను మీకోసం దీన్ని చేయడం లేదు. మీరు వెళ్ళిన ప్రజల మధ్య మీ మూలంగా దూషణకు గురి అయిన నా పవిత్రమైన పేరు కోసమే చేస్తాను. 23మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవా ప్రభువునని వారు తెలుసుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం. 24“ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను. 25మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను. 26కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. 28నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
కీర్తన
2నా ప్రాణం దేవుని కోసం, సజీవుడైన దేవుని కోసం తీవ్రమైన దాహంతో ఉంది. దేవుని సమక్షంలోకి నేను ఎప్పుడు వస్తాను? ఆయన సమక్షంలో నేను ఎప్పుడు కనిపిస్తాను? 4జన సమూహంతో కలసి వాళ్ళని దేవుని మందిరానికి తీసుకు వెళ్ళిన సంగతినీ, వాళ్ళతో కలసి సంతోష గానంతో, స్తుతులతో పండగ చేసుకున్న సంగతినీ జ్ఞాపకం చేసుకుంటుంటే నా ప్రాణం కరిగి నీరైపోతున్నది. 43:3నీ వెలుగునూ, నీ సత్యాన్నీ పంపించు. అవి నాకు దారి చూపనీ. అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతానికీ, నీ నివాసాలకూ నన్ను తీసుకు వెళ్ళనీ. 4అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరకూ, నాకు అత్యధిక సంతోష కారణమైన నా దేవుని దగ్గరకూ వెళ్తాను. సితారా వాయిస్తూ నా దేవుణ్ణి స్తుతిస్తాను.
పత్రిక
3క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా? 4తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. 7చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. 8మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. 9చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. 10ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు. 11ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.
కీర్తన
1యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 2ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక. 16యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది. 17నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను. 22ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది. 23ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం.
సువార్త
1విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ, 3“మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. 4వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది. 5వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు. 6అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే. 7మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు