Bible Explorer యాప్ పొందండి

బైబిల్ › కీర్తనలు › 30

IRV · అధ్యాయం 30 / 150

కీర్తనలు 30

1ఒక కీర్తన. ఆలయ ప్రతిష్ట గీతం. దావీదు కీర్తన. యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు.

2యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు.

3యెహోవా, పాతాళం నుండి నా ప్రాణాన్ని లేవనెత్తావు. నేను సమాధికి వెళ్ళకుండా నన్ను బతికించావు.

4యెహోవా భక్తులారా, ఆయన్ని కీర్తించండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

5ఆయన కోపం ఒక్క నిమిషమే ఉంటుంది. అయితే ఆయన దయ జీవిత కాలమంతా ఉంటుంది. రాత్రంతా దుఃఖం ఉన్నప్పటికీ ఉదయానికి సంతోషం కలుగుతుంది.

6నేను భద్రంగా ఉన్నప్పుడు నన్నెవరూ కదిలించలేరు అనుకున్నాను.

7యెహోవా, నీ దయతో నన్ను ఒక పర్వతంలాగా స్థిరంగా నిలబెట్టావు. అయితే నువ్వు నీ ముఖాన్ని దాచుకున్నప్పుడు నాలో కలవరం మొదలైంది.

8యెహోవా, నీకే నేను మొరపెట్టాను, నా ప్రభువును బతిమాలుకున్నాను.

9నేను చనిపోయి సమాధిలోకి దిగిపోతే ప్రయోజనం ఏముంది? మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ నమ్మకత్వాన్ని అది వివరిస్తుందా?

10యెహోవా, ఆలకించి నన్ను కరుణించు. యెహోవా, నాకు సహాయం చెయ్యి.

11నువ్వు నా దుఃఖాన్ని నాట్యంగా మార్చావు. నా గోనెపట్ట తీసివేసి, సంతోషాన్ని నాకు వస్త్రంగా ధరింపజేశావు.

12అందుకే నా ప్రాణం మౌనంగా ఉండక, నీకు స్తుతులు పాడుతుంది. యెహోవా, నా దేవా, నేను నిన్ను ఎల్లకాలం స్తుతిస్తాను.

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు (IRV, 2019) · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. (పాఠం మార్చలేదు; అధోజ్ఞాపికలు మరియు శీర్షికలు వదిలివేయబడ్డాయి) · eBible.org