Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 26 మార్చి

కాథలిక్ కాలెండర్

రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 26 మార్చి, 2027

శుక్రవారం · పాస్కా త్రిదినాలు

పండుగలు మరియు పరిశుద్ధులు

శుభ శుక్రవారం

పాస్కా త్రిదినాలు · ఆరాధన రంగు: ఎరుపు

ఉపవాసం మరియు పశ్చాత్తాపం

ఉపవాసం మరియు మాంసం నుండి విరమణ

ప్రతి శుక్రవారం పశ్చాత్తాప దినం; దాన్ని ఎలా పాటించాలో ప్రతి బిషప్‌ల సమావేశం నిర్ణయిస్తుంది: మాంసం మానడం లేదా మరో పశ్చాత్తాప క్రియ. ఉపవాసం 18 నుండి 59 ఏళ్ల వరకు, మాంస విరమణ 14 ఏళ్ల నుండి వర్తిస్తుంది.

ఈరోజు పఠనాలు

మొదటి పఠనం

యెష 52:13–53:12

13వినండి. నా సేవకుడు తెలివిగా ప్రవర్తిస్తాడు. అన్నీ చక్కగా జరిగిస్తాడు. ఆయన్ని హెచ్చించడం, ఉన్నత స్థితికి తేవడం అధికంగా ఘనపరచడం జరుగుతుంది. 14అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు. 15అయితే ఆయన అనేక రాజ్యాలను ఆశ్చర్యపరుస్తాడు. రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు. ఎందుకంటే తమకు చెప్పని విషయాలు వారు చూస్తారు. అంతకు మునుపు వాళ్ళు వినని విషయాలు వాళ్ళు గ్రహిస్తారు. 53:1మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది? 2ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు. 3ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు. 4అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు. అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం. 5కానీ ఆయన మన తిరుగుబాటు చేష్టల వలన గాయపడ్డాడు. మన పాపాలను బట్టి ఆయన్ని నలగగొట్టడం జరిగింది. మనకు శాంతి కలిగించే శిక్ష ఆయనమీద పడింది. ఆయన పొందిన గాయాల వలన మనం బాగుపడ్దాం. 6మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు. 7ఆయన దుర్మార్గానికి గురి అయ్యాడు. బాధల పాలైనా అతడు నోరు తెరవలేదు. గొర్రెపిల్లలాగా ఆయన్ని వధకు తీసుకుపోయారు. బొచ్చు కత్తిరించే వారి ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. 8అన్యాయపు తీర్పుతో ఆయన్ని శిక్షించారు. ఆ తరంలో ఆయన గురించి ఎవరు పట్టించుకున్నారు? నా ప్రజల దుర్మార్గానికి ఆయనకు శిక్ష పడింది. సజీవుల భూమిలోనుంచి అతడు హతమయ్యాడు. 9అతడు చనిపోయినప్పుడు నేరస్థులతో అతన్ని సమాధి చేశారు. ధనవంతుని దగ్గర అతన్ని ఉంచారు. అతడు ఏ నేరమూ చేయలేదు. అతని నోట మోసం ఎప్పుడూ లేదు. 10అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. 11తన వేదన వలన కలిగిన ఫలితం చూసి ఆయన సంతృప్తి పొందుతాడు. నీతిమంతుడైన నా సేవకుడు అనేకమంది దోషాలను భరించి తన జ్ఞానంతో వారిని నిర్దోషులుగా ఎంచుతాడు. 12కాబట్టి గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెడతాను. అనేకమందితో కలిసి అతడు కొల్లసొమ్ము పంచుకుంటాడు. ఎందుకంటే ఆయన తన ప్రాణం ధారపోసి చనిపోయాడు. అక్రమకారుల్లో ఒకడిగా ఆయన్ని ఎంచడం జరిగింది. ఆయన చాలామంది పాపాన్ని భరిస్తూ అపరాధుల కోసం విజ్ఞాపన చేశాడు.

ప్రతిస్పందన కీర్తన

కీర్త 31:1, 5, 11–12, 14–16, 24

1ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. యెహోవా, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నన్ను ఎన్నటికీ అవమానం పొందనీయకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. 5నా ఆత్మను నీ చేతికప్పగిస్తున్నాను. యెహోవా, నమ్మదగిన దేవా, నువ్వు నన్ను విమోచిస్తావు. 11నా శత్రువులంతా నన్ను హేళన చేస్తున్నారు. నా పొరుగువారు నన్ను చూసి నివ్వెరబోతున్నారు. నా స్నేహితులు భయపడుతున్నారు. వీధిలో నన్ను చూసేవారు నా దగ్గర నుండి పారిపోతున్నారు. 12చనిపోయి ఎవరూ జ్ఞాపకం చేసుకోని వ్యక్తిలాగా అందరూ నన్ను మర్చిపోయారు. నేను ఓటికుండలాగా తయారయ్యాను. 14అయితే, యెహోవా, నేను నీలో నమ్మకం పెట్టుకున్నాను. నువ్వే నా దేవుడివి అనుకుంటున్నాను. 15నా భవిష్యత్తు అంతా నీ చేతిలో ఉంది. నా శత్రువుల చేతి నుండీ నా వెంటబడి తరుముతున్న వారినుండీ నన్ను రక్షించు. 16నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రసరింపనీ. నీ కృపతో నన్ను రక్షించు. 24యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి.

రెండవ పఠనం

హెబ్రీ 4:14–16; 5:7–9

14ఆకాశాలగుండా వెళ్ళిన దేవుని కుమారుడు యేసు అనే ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించినదాన్ని గట్టిగా పట్టుకుందాం. 15మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు. 16కాబట్టి మన అవసరాల్లో ఆయన కృపా కనికరాలకై ధైర్యంతో కృపా సింహాసనం దగ్గరికి వెళ్దాం. 5:7ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు. 8ఆయన కుమారుడై ఉండి కూడా తాను అనుభవించిన బాధల వల్ల విధేయత అంటే ఏమిటో నేర్చుకున్నాడు. 9మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు.

సువార్త

యోహా 18:1–19:42

1యేసు ఇలా మాట్లాడిన తరువాత తన శిష్యులతో కలిసి కెద్రోను లోయ దాటి, అక్కడ ఉన్న తోటలో ప్రవేశించాడు. 2యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ఆ ప్రదేశం తెలుసు. 3అతడు సైనికుల గుంపును, ముఖ్య యాజకులు, పరిసయ్యులు తనకు ఇచ్చిన దేవాలయ అధికారులను వెంట తీసుకుని, కాగడాలతో, దీపాలతో ఆయుధాలతో అక్కడికి వచ్చాడు. 4అప్పుడు యేసు, తనకు జరుగుతున్నవన్నీ తెలిసినవాడే కాబట్టి, ముందుకు వచ్చి వారితో, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. 5వారు “నజరేతు వాడైన యేసు” అని జవాబిచ్చారు. యేసు వారితో, “నేనే ఆయన్ని” అన్నాడు. ద్రోహంతో యేసును పట్టించిన యూదా కూడా ఆ సైనికులతో నిలుచుని ఉన్నాడు. 6ఆయన వారితో, “నేనే” అని చెప్పినప్పుడు వారు వెనక్కి తూలి నేల మీద పడ్డారు. 7ఆయన మళ్ళీ, “మీరు ఎవరి కోసం చూస్తున్నారు?” అని అడిగాడు. వారు మళ్ళీ, “నజరేతు వాడైన యేసు కోసం” అన్నారు. 8యేసు వారితో, “ఆయన్ని నేనే అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే, మిగిలిన వారిని వెళ్ళిపోనివ్వండి” అన్నాడు. 9“నువ్వు నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు” అనే ఆయన వాక్కు నెరవేరేలా ఆయన ఈ మాట అన్నాడు. 10అప్పుడు సీమోను పేతురు, తన దగ్గర ఉన్న కత్తి దూసి, ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి తెగ నరికాడు. ఆ సేవకుడి పేరు మల్కు. 11యేసు పేతురుతో, “కత్తిని దాని ఒరలో పెట్టు, తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా?” అన్నాడు. 12అప్పుడు సైనికుల గుంపు, వారి అధిపతీ, యూదుల అధికారులు, యేసును పట్టుకుని బంధించారు. 13మొదట ఆయనను అన్న దగ్గరికి తీసుకువెళ్ళారు. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకునిగా ఉన్న కయపకు మామ. 14ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం అవశ్యం అని యూదులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప. 15సీమోను పేతురూ, ఇంకొక శిష్యుడూ, యేసును దూరం నుంచి వెంబడించారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోకి యేసుతో కూడా వెళ్ళాడు. 16కాని, పేతురు గుమ్మం దగ్గర బయటే నిలబడి ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్న శిష్యుడు బయటకు వచ్చి గుమ్మానికి కాపలా ఉన్న దాసీతో మాట్లాడి పేతురును లోపలికి తీసుకొచ్చాడు. 17గుమ్మం దగ్గర కాపలా ఉన్న దాసి పేతురుతో, “నువ్వు ఆతని శిష్యుల్లో ఒకడివి కదూ?” అంది. అతడు, “కాదు” అన్నాడు. 18చలిగా ఉన్న కారణంగా అక్కడ ఉన్న సేవకులు, అధికారులు చలి మంట వేసుకుని దాని చుట్టూ నిలుచుని చలి కాచుకొంటున్నారు. పేతురు కూడా వారితో నిలుచుని చలి కాచుకొంటున్నాడు. 19ప్రధాన యాజకుడు ఆయన శిష్యుల గురించీ, ఆయన ఉపదేశం గురించీ యేసును అడిగాడు. 20యేసు జవాబిస్తూ, “నేను బహిరంగంగానే ఈ లోకంతో మాట్లాడాను. నేను ఎప్పుడూ యూదులు సమావేశమయ్యే సమాజ మందిరాల్లో, దేవాలయంలో ఉపదేశం చేశాను. చాటుగా ఏమీ మాట్లాడలేదు. 21నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? నేనేం మాట్లాడానో, నా మాటలు విన్న వారిని అడుగు. నేను మాట్లాడిన సంగతులు ఈ ప్రజలకు తెలుసు” అన్నాడు. 22యేసు ఇలా అన్నప్పుడు, అక్కడ నిలుచుని ఉన్న అధికారుల్లో ఒకడు, యేసును తన అరచేతితో చెంప మీద కొట్టి, “ప్రధాన యాజకుడికి నువ్వు జవాబిచ్చే విధానం ఇదేనా?” అన్నాడు. 23యేసు అతనికి జవాబిస్తూ, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే, ఆ తప్పు ఏమిటో చెప్పు. కాని, నేను సరిగానే చెప్పి ఉంటే, నన్ను ఎందుకు కొడతావు?” అన్నాడు. 24తరువాత అన్న బంధితుడైన యేసును ప్రధాన యాజకుడు కయప దగ్గరికి పంపాడు. 25అప్పుడు సీమోను పేతురు నిలుచుని చలి కాచుకొంటూ ఉన్నాడు. అక్కడున్న వారు అతనితో, “నువ్వు కూడా అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అన్నారు. పేతురు ఒప్పుకోలేదు. “కాదు” అన్నాడు. 26పేతురు ఎవరి చెవి నరికాడో వాడి బంధువు ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడు. వాడు పేతురుతో, “నువ్వు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా?” అన్నాడు. 27పేతురు మళ్ళీ ఒప్పుకోలేదు. వెంటనే కోడి కూసింది. 28వారు యేసును కయప దగ్గరనుంచి రోమా రాజ్యాధికార భవనానికి తీసుకు వచ్చారు. అది తెల్లవారుతూ ఉన్న సమయం. పస్కా భోజనం తినడానికి ముందు మైల పడకుండా ఉండడానికి వారు ఆ రోమా రాజ్యాధికార భవనంలో ప్రవేశించలేదు. 29కాబట్టి పిలాతు బయట ఉన్న వారి దగ్గరికి వచ్చి, “ఈ మనిషి మీద మీరు ఏ నేరం మోపుతున్నారు?” అన్నాడు. 30వారు అతనితో, “ఇతను దుర్మార్గుడు కాకపోతే ఇతన్ని నీకు అప్పగించే వారం కాదు” అన్నారు. 31అందుకు పిలాతు వారితో, “అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చుకోండి” అన్నాడు. యూదులు, “ఎవరికైనా మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు” అన్నారు. 32తాను ఎలాంటి మరణం పొందుతాడో, దాని గురించి ఆయన ముందుగానే చెప్పిన మాట నెరవేరేలా వారు ఈ మాట పలికారు. 33అప్పుడు పిలాతు మళ్ళీ రోమా రాజ్యాధికార భవనంలోకి వెళ్ళి, యేసును పిలిచి, ఆయనతో, “నువ్వు యూదులకు రాజువా?” అన్నాడు. 34యేసు జవాబిస్తూ, “ఈ మాట నీ అంతట నువ్వే అంటున్నావా, లేక ఎవరైనా నా గురించి నీతో చెప్పారా?” అన్నాడు. 35అందుకు పిలాతు, “నేను యూదుణ్ణి కాదు. అవునా? నీ సొంత ప్రజలు, ముఖ్య యాజకులు, నిన్ను నాకు అప్పగించారు. నువ్వేం చేశావు?” అని అడిగాడు. 36యేసు, “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే, నేను యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాటం చేసేవాళ్ళే. నిజానికి నా రాజ్యం ఇక్కడిది కాదు” అని జవాబిచ్చాడు. 37అప్పుడు పిలాతు, “అయితే నువ్వు రాజువా??” అని యేసుతో అన్నాడు. యేసు, “నేను రాజునని నువ్వు అంటున్నావు. సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. సత్యానికి సంబంధించిన వారందరూ నా మాట వింటారు” అని జవాబిచ్చాడు. 38పిలాతు ఆయనతో, “సత్యం అంటే ఏమిటి?” అన్నాడు. అతడు ఇలా అన్న తరువాత మళ్ళీ బయటకు వెళ్ళి యూదులతో, “ఈ మనిషిలో నాకు ఏ అపరాధం కనిపించ లేదు, 39పస్కా సమయంలో నేను ఒకణ్ణి విడుదల చేసే ఆనవాయితీ ఉంది కదా? కాబట్టి యూదుల రాజును మీకు విడుదల చెయ్యమంటారా?” అన్నాడు. 40అప్పుడు వారు మళ్ళీ పెద్దగా కేకలు పెడుతూ, “ఈ మనిషిని కాదు. బరబ్బాను విడుదల చెయ్యండి!” అన్నారు. బరబ్బా బందిపోటు దొంగ. 19:1ఆ తరువాత పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడు. 2సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు. 4పిలాతు మళ్ళీ బయటకు వెళ్ళి ప్రజలతో, “ఈ మనిషిలో ఏ అపరాధం నాకు కనిపించలేదని మీకు తెలిసేలా ఇతణ్ణి మీ దగ్గరికి బయటకి తీసుకుని వస్తున్నాను” అని వారితో అన్నాడు. 5కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు. 6ముఖ్య యాజకులు, యూదుల అధికారులు యేసును చూసి, “సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి!” అని, కేకలు వేశారు. పిలాతు వారితో, “ఈయనలో నాకు ఏ అపరాధం కనిపించడం లేదు కాబట్టి మీరే తీసుకువెళ్ళి ఇతన్ని సిలువ వెయ్యండి” అన్నాడు. 7యూదులు పిలాతుతో, “మాకొక చట్టం ఉంది, అతడు తనను తాను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు కాబట్టి, ఆ చట్టాన్ని బట్టి అతడు చావ వలసిందే,” అన్నారు. 8పిలాతు ఆ మాట విని ఇంకా ఎక్కువగా భయపడి, మళ్ళీ న్యాయ సభలో ప్రవేశించి, “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని యేసును అడిగాడు. అయితే అతనికి ఏ జవాబూ చెప్పలేదు. 10అప్పుడు పిలాతు ఆయనతో, “నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చెయ్యడానికీ, సిలువ వెయ్యడానికీ, నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు. 11యేసు జవాబిస్తూ, “నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది” అన్నాడు. 12అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, “నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే” అన్నారు. 13పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు. 14అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు. 15వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. 16అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు. 17తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు. 18అక్కడ వారు యేసును, ఇరువైపులా ఇద్దరు మనుషుల మధ్య సిలువ వేశారు. 19పిలాతు, ఒక పలక మీద ‘నజరేతు వాడైన యేసు, యూదుల రాజు’ అని రాయించి సిలువకు తగిలించాడు. 20యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. పలక మీద రాసిన ప్రకటన హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషల్లో రాసి ఉంది కాబట్టి చాలా మంది యూదులు దాన్ని చదివారు. 21యూదుల ముఖ్య యాజకులు పిలాతుతో, “‘యూదుల రాజు’ అని కాకుండా, అతడు ‘నేను యూదుల రాజును అని చెప్పుకున్నాడు’ అని రాయించండి” అన్నాడు. 22పిలాతు, “నేను రాసిందేదో రాశాను” అని జవాబిచ్చాడు. 23సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రాలు తీసుకుని నాలుగు భాగాలు చేసి తలొక భాగం పంచుకున్నారు. ఆయన పైవస్త్రం కూడా తీసుకున్నారు. ఆ పైవస్త్రం కుట్టు లేకుండా, అంతా ఒకే నేతగా ఉంది కాబట్టి, 24వారు ఒకరితో ఒకరు, “దీన్ని మనం చింపకుండా, ఇది ఎవరిది అవుతుందో చూడడానికి చీట్లు వేద్దాం” అన్నారు. “నా వస్త్రాలు తమలో తాము పంచుకున్నారు, నా దుస్తుల కోసం చీట్లు వేశారు,” అన్న లేఖనం నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు. 25యేసు తల్లి, ఆయన తల్లి సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, యేసు సిలువ దగ్గర నిలుచుని ఉన్నారు. 26ఆయన తల్లి, ఆయన ప్రేమించిన శిష్యుడు దగ్గరలో నిలుచుని ఉండడం చూసి, యేసు తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కొడుకు” అన్నాడు. 27తరువాత ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అన్నాడు. ఆ సమయంనుంచి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. 28దాని తరువాత, అన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి, లేఖనం నెరవేర్చడానికి, “నాకు దాహంగా ఉంది,” అన్నాడు. 29అక్కడే ఉన్న పులిసిన ద్రాక్షారసం కుండలో స్పాంజిని ముంచి, దాన్ని హిస్సోపు కొమ్మకు చుట్టి ఆయన నోటికి అందించారు. 30యేసు, ఆ పులిసిన ద్రాక్షారసం పుచ్చుకుని, “సమాప్తం అయ్యింది” అని, తల వంచి తన ఆత్మను అప్పగించాడు. 31అది పండగ సిద్ధపాటు రోజు. సబ్బాతు రోజున దేహాలు సిలువ మీదే ఉండిపోకూడదు (ఎందుకంటే సబ్బాతు చాలా ప్రాముఖ్యమైన రోజు) కాబట్టి, వారి దేహాలు అక్కడ వేలాడకుండా, వారి కాళ్ళు విరగగొట్టి, వారిని కిందకి దింపమని యూదులు పిలాతును అడిగారు. 32కాబట్టి సైనికులు వచ్చి, యేసుతో కూడా సిలువ వేసిన మొదటి వాడి కాళ్ళు, రెండవవాడి కాళ్ళు విరగగొట్టారు. 33వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అప్పటికే చనిపోయాడని గమనించి, ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. 34అయితే, సైనికుల్లో ఒకడు ఈటెతో ఆయన డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. 35ఇదంతా చూసినవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యం సత్యం. అతడు చెప్పింది సత్యం అని అతనికి తెలుసు. ఇది మీరు కూడా నమ్మడానికే. 36“అతని ఎముకల్లో ఒక్కటైనా విరగదు” అన్న లేఖనం నెరవేరేలా ఇవి జరిగాయి. 37“వారు తాము పొడిచిన వాని వైపు చూస్తారు,” అని మరొక లేఖనం చెబుతూ ఉంది. 38ఆ తరువాత, యూదులకు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు, యేసు దేహాన్ని తాను తీసుకుని వెళ్తానని పిలాతును అడిగాడు. పిలాతు అందుకు ఒప్పుకున్నాడు. కాబట్టి యోసేపు వచ్చి యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళాడు. 39మొదట్లో రాత్రి సమయంలో ఆయన దగ్గరికి వచ్చిన నికోదేము కూడా ఇంచుమించు ముప్ఫై ఐదు కిలోల బోళం, అగరుల మిశ్రమాన్ని తనతో తీసుకు వచ్చాడు. 40వారు యేసు దేహాన్ని తీసుకు వచ్చి సుగంధ ద్రవ్యాలతో, నార బట్టలో చుట్టారు. ఇది యూదులు దేహాలను సమాధి చేసే సాంప్రదాయం. 41ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది. 42ఆ సమాధి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ రోజు యూదులు సిద్ధపడే రోజు కాబట్టి, వారు యేసును అందులో పెట్టారు.

సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు