Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 27 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 14 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 27 మార్చి, 2027

శనివారం · మహా ఉపవాస కాలం రెండవ వారం · స్వరం 1

పండుగలు మరియు పరిశుద్ధులు

స్మరణ శనివారం

మహా ఉపవాస కాలం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక (దివంగతుల కోసం)

1 తెస్స 4:13–17

13సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు. 15మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.

పత్రిక

హెబ్రీ 3:12–16

12సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి. 13పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. 14ఎందుకంటే ప్రారంభం నుండి చివరి వరకూ ఆయనపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం క్రీస్తులో భాగస్వాములం అయ్యాం. 15దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.” 16దేవుని మాట విని కూడా తిరుగుబాటు చేసిందెవరు? మోషే ఐగుప్తులో నుండి బయటకు నడిపించిన వారే కదా!

సువార్త (దివంగతుల కోసం)

యోహా 5:24–30

24కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు. 26తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు. 28“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు. 30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.

సువార్త

మార్కు 1:35–44

35ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. 37ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. 38ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. 39ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. 40ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు” అని ఆయనను బతిమాలాడు. 41యేసు అతనిపై జాలిపడి, తన చెయ్యి చాపి అతన్ని తాకి “నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు. 42వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు శుద్ధి అయ్యాడు. 43ఆయన అతన్ని పంపివేస్తూ, “ఈ విషయం ఎవ్వరితో చెప్పవద్దు సుమా,” అని అతన్ని హెచ్చరించి, 44“నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి కనిపించి మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు” అన్నాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 14 మార్చి పౌర కాలెండర్‌లో 27 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు