Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 24 ఏప్రిల్

ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 11 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 24 ఏప్రిల్, 2027

శనివారం · మహా ఉపవాస కాలం ఆరవ వారం

పండుగలు మరియు పరిశుద్ధులు

లాజరు శనివారం

మహా ఉపవాస కాలం

చేప గుడ్లు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

హెబ్రీ 12:28–13:8

28కాబట్టి మనం నిశ్చలమైన రాజ్యాన్ని పొంది దేవునికి కృతజ్ఞులమై ఉందాం. దేవునికి అంగీకారమైన విధంగా భక్తితో, విస్మయంతో ఆయనను ఆరాధించుదాం. 29ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని. 13:1సోదర ప్రేమను కొనసాగనియ్యండి. 2అపరిచితులను ఆహ్వానించడం మర్చిపోవద్దు. ఇలా చేస్తూ కొందరు తమకు తెలియకుండానే దేవదూతలను ఆహ్వానించారు. 3మీరు కూడా వారితో చెరసాల్లో ఉన్నట్టు చెరసాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు గనక కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. 4వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు. 5డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్న దానితో తృప్తి చెంది ఉండండి. “నిన్ను ఎన్నటికీ విడిచి పెట్టను. నిన్ను పరిత్యజించను” అని దేవుడే చెప్పాడు. 6కాబట్టి, “ప్రభువు నాకు సహాయం చేసేవాడు. నేను భయపడను. నన్ను ఎవరేం చేయగలరు?” అని ధైర్యంగా చెప్పగలిగేలా తృప్తి కలిగి ఉందాం. 7మీకు దేవుని మాటలు చెప్పిన వారిని మిమ్మల్ని నడిపించిన వారిని తలపోస్తూ వారి ప్రవర్తన ఫలితాన్ని గురించి ఆలోచించండి. వారి విశ్వాసాన్ని అనుకరించండి. 8యేసు క్రీస్తు నిన్న, నేడు ఒకే విధంగా ఉన్నాడు. ఎప్పటికీ ఒకేలా ఉంటాడు.

సువార్త

యోహా 11:1–45

1బేతనియ గ్రామానికి చెందిన లాజరుకు జబ్బు చేసింది. మరియ, మార్త అతని సోదరీలు. 2ఈ మరియే ప్రభువు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో తుడిచిన మరియ. 3అప్పుడు ఆ అక్క చెల్లెళ్ళు, “ప్రభూ, నువ్వు ప్రేమించే వాడికి జబ్బు చేసింది” అని యేసుకు కబురు పంపించారు. 4యేసు అది విని, “ఈ జబ్బు చావు కోసం రాలేదు. దీని ద్వారా దేవుని కుమారుడికి మహిమ కలిగేలా దేవుని మహిమ కోసమే వచ్చింది” అన్నాడు. 5మార్తను, ఆమె సోదరిని లాజరును యేసు ప్రేమించాడు. 6లాజరు జబ్బు పడ్డాడని యేసు విని కూడా తాను ఉన్న చోటనే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు. 7దాని తరువాత ఆయన తన శిష్యులతో, “మనం మళ్ళీ యూదయకు వెళ్దాం పదండి” అన్నాడు. 8ఆయన శిష్యులు ఆయనతో, “రబ్బీ, ఇంతకు ముందే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు కదా, అక్కడికి మళ్ళీ వెళ్తావా?” అని అన్నారు. 9అందుకు యేసు జవాబిస్తూ, “పగలు పన్నెండు గంటల వెలుగు ఉండదా? ఒకడు పగటి వేళ నడిస్తే తడబడడు. ఎందుకంటే అతడు వెలుగులో అన్నీ చూస్తాడు. 10అయితే ఒకడు రాత్రివేళ నడిస్తే అతనిలో వెలుగు లేదు కాబట్టి తడబడతాడు” అని చెప్పాడు. 11యేసు ఈ సంగతులు చెప్పిన తరువాత వారితో ఇలా అన్నాడు, “మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు. అతన్ని నిద్ర లేపడానికి వెళ్తున్నాను.” 12అందుకు శిష్యులు ఆయనతో, “ప్రభూ, అతడు నిద్రపోతూ ఉంటే బాగుపడతాడు” అన్నారు. 13యేసు అతని చావు గురించి మాట్లాడాడు గాని వారు నిద్రలో విశ్రాంతి తీసుకోవడం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. 14అప్పుడు యేసు వారితో స్పష్టంగా, “లాజరు చనిపోయాడు. 15నేను అక్కడ లేకపోవడాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఇది మీ కోసమే. మీకు నమ్మకం కలగడానికే. అతని దగ్గరకి వెళ్దాం పదండి” అన్నాడు. 16దిదుమ అనే మారుపేరున్న తోమా, “యేసుతో చనిపోవడానికి మనం కూడా వెళ్దాం పదండి” అని తన తోటి శిష్యులతో అన్నాడు. 17యేసు అక్కడికి చేరుకుని, అప్పటికే నాలుగు రోజులుగా లాజరు సమాధిలో ఉన్నాడని తెలుసుకున్నాడు. 18బేతనియ యెరూషలేముకు దగ్గరే. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. 19చాలామంది యూదులు మార్త, మరియలను వారి సోదరుని విషయం ఓదార్చడానికి వచ్చి, అక్కడ ఉన్నారు. 20అప్పుడు మార్త, యేసు వస్తున్నాడని విని ఆయనను ఎదుర్కోడానికి వెళ్ళింది గాని మరియ ఇంట్లోనే ఉండిపోయింది. 21అప్పుడు మార్త యేసుతో, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు, 22ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు ఇస్తాడని నాకు తెలుసు” అంది. 23యేసు ఆమెతో, “నీ సోదరుడు మళ్ళీ బతికి లేస్తాడు” అన్నాడు. 24మార్త ఆయనతో, “చివరి రోజున పునరుత్థానంలో బతికి లేస్తాడని నాకు తెలుసు” అంది. 25అందుకు యేసు, “పునరుత్థానం, జీవం నేనే. నన్ను నమ్మినవాడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు, 26బతికి ఉండి నన్ను నమ్మిన వారు ఎప్పుడూ చనిపోరు. ఇది నువ్వు నమ్ముతున్నావా?” అన్నాడు. 27ఆమె, “అవును ప్రభూ, నువ్వు లోకానికి రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువి అని నమ్ముతున్నాను” అని ఆయనతో చెప్పింది. 28ఈ మాట చెప్పిన తరువాత ఆమె వెళ్ళి ఎవరికీ తెలియకుండా తన సోదరి మరియను పిలిచి, “బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను పిలుస్తున్నాడు” అంది. 29మరియ అది విన్నప్పుడు, త్వరగా లేచి యేసు దగ్గరికి వెళ్ళింది. 30యేసు ఇంకా గ్రామంలోకి రాలేదు. మార్తను కలుసుకున్న చోటే ఉన్నాడు. 31మరియతో ఇంట్లో ఉండి ఆమెను ఓదారుస్తున్న యూదులు ఆమె త్వరగా లేచి బయటకు వెళ్ళడం చూసి ఆమె వెంట వెళ్ళారు. ఆమె ఏడవడానికి సమాధి దగ్గరికి వెళ్తూ ఉందని వారు అనుకున్నారు. 32అప్పుడు మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూసి ఆయన కాళ్ళ మీద పడి, “ప్రభూ, నువ్వు ఇక్కడ ఉండి ఉంటే, నా సోదరుడు చనిపోయేవాడు కాదు” అంది. 33ఆమె ఏడవడం, ఆమెతో వచ్చిన యూదులు కూడా ఏడవడం యేసు చూసినప్పుడు, ఆయన కలవరంతో ఆత్మలో మూలుగుతూ, “అతణ్ణి ఎక్కడ పెట్టారు?” అన్నాడు. 34వారు, “ప్రభూ, వచ్చి చూడు” అన్నారు. 35యేసు ఏడ్చాడు. 36అప్పుడు యూదులు, “ఆయన లాజరును ఎంతగా ప్రేమించాడో చూడండి” అని చెప్పుకున్నారు. 37వారిలో కొంతమంది, “ఆయన గుడ్డివారి కళ్ళు తెరిచాడు కదా, ఇతను చనిపోకుండా చెయ్యలేడా?” అన్నారు. 38యేసు తనలో తాను మూలుగుతూ ఆ సమాధి గుహ దగ్గరికి వెళ్ళాడు. ఒక రాయి దానికి అడ్డంగా నిలబెట్టి ఉంది. 39యేసు, “ఆ రాయి తీసి వెయ్యండి” అన్నాడు. చనిపోయిన లాజరు సోదరి మార్త యేసుతో, “ప్రభూ, ఇప్పటికి నాలుగు రోజులయ్యింది. శరీరం కుళ్ళిపోతూ ఉంటుంది” అంది. 40యేసు ఆమెతో, “నువ్వు నమ్మితే, దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా?” అన్నాడు. 41కాబట్టి వారు ఆ రాయి తీసి వేశారు. యేసు పైకి చూస్తూ, “తండ్రీ, నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. 42నువ్వు నా ప్రార్థన ఎప్పుడూ వింటావని నాకు తెలుసు. కాని, నా చుట్టూ నిలుచుని ఉన్న ఈ ప్రజలు నువ్వు నన్ను పంపించావని నమ్మాలని ఈ మాట పలికాను” అన్నాడు. 43ఆయన ఈ మాట చెప్పిన తరువాత పెద్ద స్వరంతో కేక వేసి, “లాజరూ, బయటికి రా!” అన్నాడు. 44అప్పుడు చనిపోయినవాడు కాళ్ళు చేతులు సమాధి బట్టలతో చుట్టి ఉండగా బయటికి వచ్చాడు. అతని ముఖానికి ఒక బట్ట చుట్టి ఉంది. అప్పుడు యేసు వారితో, “అతని కట్లు విప్పి, అతణ్ణి వెళ్ళనివ్వండి” అన్నాడు. 45అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 11 ఏప్రిల్ పౌర కాలెండర్‌లో 24 ఏప్రిల్. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు