హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఏప్రిల్ 2027 › 25 ఏప్రిల్
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 25 ఏప్రిల్, 2027
ఆదివారం · పాస్కా కాలం ఐదవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
పాస్కా కాలం ఐదవ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: తెలుపు
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
26అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. 27అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు. 28అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ, 29ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు. 30సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు. 31కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.
ప్రతిస్పందన కీర్తన
25మహా సమాజంలో నీ నుండి నా స్తుతి వస్తుంది. ఆయనపట్ల భయభక్తులు కలిగిన వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. 26బాధితులు భోజనం చేసి తృప్తి పొందుతారు. యెహోవాను వెదికేవాళ్ళు ఆయనను స్తుతిస్తారు. వారి హృదయాలు శాశ్వతకాలం జీవిస్తాయి గాక. 27భూనివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా వైపు తిరుగుతారు. జాతుల కుటుంబాలన్నీ ఆయన ఎదుట వంగి నమస్కారం చేస్తాయి. 29భూమి మీద వర్ధిల్లుతున్న వాళ్ళందరూ ఆరాధిస్తారు. తమ సొంత ప్రాణాలు కాపాడుకోలేని వాళ్ళు, మట్టిలోకి దిగిపోతున్న వాళ్ళందరూ ఆయన ఎదుట వంగి నమస్కరిస్తారు. 30రానున్న ఒక తరం వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. తమ తరవాతి తరానికి ప్రభువును గురించి చెబుతారు. 31వాళ్ళు వచ్చి ఆయన న్యాయ విధానం గురించి చెబుతారు. ఆయన క్రియలను ఇంకా పుట్టని వారికి చెబుతారు!
రెండవ పఠనం
18నా ప్రియమైన పిల్లలూ, నాలుకతో మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, చేతలతో సత్యంతో ప్రేమిద్దాం. 19దీనివలన మనం సత్య సంబంధులమని తెలుస్తుంది. అప్పుడు మన హృదయాలు ఆయన ఎదుట నిబ్బరంగా ఉంటాయి. 20మన హృదయం మనపై నింద మోపితే, దేవుడు మన హృదయం కన్నా గొప్పవాడు, ఆయనకు అన్నీ తెలుసు. 21ప్రియులారా, మన హృదయం మనపై నింద మోపకపోతే, దేవుని దగ్గర ధైర్యంగా ఉంటాం. 22అప్పుడు, ఆయన ఆజ్ఞలు పాటిస్తూ, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ ఉండడం వల్ల, మనం ఏది అడిగినా, అది ఆయన దగ్గర నుండి పొందుతాం. 23ఇదే ఆయన ఆజ్ఞ: ఆయన కుమారుడు యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచాలి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. 24దేవుని ఆజ్ఞలు పాటించే వాడు ఆయనలో నిలిచి ఉంటాడు. దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు. ఆయన మనకిచ్చిన ఆత్మ ద్వారా ఆయన మనలో నిలిచి ఉన్నాడని మనకు తెలుసు.
సువార్త
1“నేను నిజమైన ద్రాక్ష తీగని. నా తండ్రి ద్రాక్ష రైతు. 2నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు. 3నేను మీతో చెప్పిన సందేశం కారణంగా మీరు ఇప్పటికే శుద్ధులు. 4నాలో మీరు ఉండండి. మీలో నేను ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగలో ఉంటేనే తప్ప తనంతట తాను ఏ విధంగా ఫలించలేదో, మీరు కూడా నాలో ఉంటేనే తప్ప ఫలించలేరు. 5నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. 6ఎవరైనా నాలో ఉండకపోతే, అతడు తీసి పారేసిన కొమ్మలా ఎండిపోతారు. వారు ఆ కొమ్మలను పోగుచేసి మంటలో వేస్తారు. అవి కాలిపోతాయి. 7మీరు నాలో, నా మాటలు మీలో ఉంటే, ఎలాంటి కోరికైనా అడగండి. అది మీకు జరుగుతుంది. 8మీరు అధికంగా ఫలించి, నా శిష్యులుగా ఉంటే, నా తండ్రికి మహిమ కలుగుతుంది.
ఈరోజు పరిశుద్ధులు
- సువార్తికుడైన పునీత మార్కు
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు