12యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు.
13వారితో ఇలా అన్నాడు, “‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు.”
14అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరికి వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.
15ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. వారు “దావీదు కుమారుడికి జయం” అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసి కోపంతో మండిపడ్డారు.
16“వీరేమని కేకలు వేస్తున్నారో వింటున్నావా?” అని ఆయనను అడిగారు. అందుకు యేసు, “వింటున్నాను, ‘చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు’ అనే మాట మీరెప్పుడూ చదవలేదా?” అని వారితో చెప్పి
17ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.