Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 19 ఆగస్టు

ఆర్థడాక్స్ కాలెండర్ · ఆగస్టు 6 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 19 ఆగస్టు, 2027

గురువారం · పెంతెకొస్తు తర్వాత 9వ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

The Holy Transfiguration of Our Lord God and Saviour Jesus Christ

మరియ నిద్ర ఉపవాసం

చేపలు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం

నిర్గ 24:12–18

12అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చి అక్కడ ఉండు. నేను రాతి పలకలపై రాసిన ఆజ్ఞలనూ, ధర్మశాస్త్రాన్నీ నీకు ఇస్తాను. నువ్వు వాటిని ప్రజలకు బోధించాలి.” 13మోషే తన సహాయకుడు యెహోషువను తీసుకుని దేవుని పర్వతం ఎక్కాడు. 14మోషే ఇశ్రాయేలు పెద్దలతో “మేము తిరిగి మీ దగ్గరికి వచ్చేంత వరకూ ఇక్కడే ఉండండి. ఇక్కడ అహరోను, హూరు మీతోనే ఉన్నారు. మీలో ఏవైనా తగాదాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి పరిష్కరించుకోండి” అని చెప్పి దేవుని కొండ ఎక్కాడు. 15మోషే కొండ ఎక్కినప్పుడు దేవుని మేఘం ఆ కొండంతా కమ్మివేసింది. 16యెహోవా మహిమా ప్రకాశం సీనాయి కొండపై కమ్ముకుంది. ఆరు రోజులపాటు మేఘం కమ్ముకుని ఉంది. ఏడవ రోజున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచాడు. 17యెహోవా మహిమా ప్రకాశం ఆ కొండ శిఖరంపై దహించే మంటల్లాగా ఇశ్రాయేలు ప్రజలకు కనబడింది. 18అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే ఆ కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

నిర్గ 33:11–23; 34:4–6, 8

11ఒక వ్యక్తి తన స్నేహితునితో మాట్లాడుతున్నట్టు యెహోవా మోషేతో ముఖాముఖీగా మాట్లాడేవాడు. తరువాత అతడు శిబిరంలోకి తిరిగి వచ్చేవాడు. అయితే మోషే సేవకుడు, నూను కొడుకు అయిన యెహోషువ అనే యువకుడు గుడారం నుండి బయటకు వచ్చేవాడు కాదు. 12మోషే యెహోవాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజలను వెంటబెట్టుకుని వెళ్ళమని నాకు చెబుతున్నావు గానీ నాతో ఎవరిని పంపుతున్నావో అది నాకు చెప్పలేదు. అదీగాక ‘నిన్ను నీ పేరుతో ఎరుగుదును. నిన్ను నేను కరుణించాను’ అని నాతో చెప్పావు కదా. 13అందువల్ల నాపై నీ దయ ఉంటే నీ విధానాలు నేను గ్రహించగలిగేలా దయచేసి నీ మార్గాలు నాకు చూపించు. అప్పుడు నేను నీ గురించి తెలుసుకుంటాను. అయ్యా, చూడు, ఈ జనమంతా నీ ప్రజలే గదా.” 14అందుకు ఆయన “నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నేను నీకు నెమ్మది కలుగజేస్తాను” అన్నాడు. 15మోషే “నీ సన్నిధి మాతో రాని పక్షంలో ఇక్కడ నుండి మమ్మల్ని తీసుకు వెళ్ళకు. 16నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు. 17అప్పుడు యెహోవా “నీవు చెప్పినట్టు చేస్తాను. నీ మీద నాకు దయ కలిగింది. నీ పేరును బట్టి నిన్ను తెలుసుకున్నాను” అని మోషేతో చెప్పాడు. 18మోషే “దయచేసి నీ మహిమను నాకు చూపించు” అన్నాడు. 19ఆయన “నా మంచితనమంతా నీ ఎదుట నుండి దాటిపోయేలా చేస్తాను. యెహోవా అనే నా పేరును నీ ఎదుట ప్రకటిస్తాను. నాకు ఎవరిమీద కరుణ చూపాలని ఉందో వాళ్ళను కరుణిస్తాను, ఎవరి మీద జాలిపడాలో వారిపట్ల జాలి చూపిస్తాను” అన్నాడు. 20ఆయన ఇంకా “నువ్వు నా ముఖాన్ని చూడలేవు. నన్ను చూసిన ఏ మనిషీ బతకడు” అన్నాడు. 21యెహోవా “ఇదిగో నాకు దగ్గరలో ఒక చోటు ఉంది. నువ్వు ఆ బండ మీద నిలబడు. 22నా మహిమ నిన్ను దాటి వెళ్ళే సమయంలో ఆ బండ సందులో నిన్ను దాచి ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకూ నా చేత్తో నిన్ను కప్పుతాను. 23నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వీపును మాత్రం నువ్వు చూడగలవు గానీ నా ముఖ దర్శనం నీకు కలగదు” అని మోషేతో చెప్పాడు. 34:4కాబట్టి మోషే మొదటి పలకల్లాంటి రెండు రాతి పలకలు చెక్కాడు. తనకు యెహోవా ఆజ్ఞాపించినట్టు ఉదయాన్నే తొందరగా లేచి ఆ రెండు రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కాడు. 5యెహోవా మేఘం నుండి దిగి అక్కడ మోషే దగ్గర నిలిచి యెహోవా తనను వెల్లడి చేసుకున్నాడు. 6యెహోవా అతని ఎదురుగా అతణ్ణి దాటి వెళ్తూ “యెహోవా కనికరం, దయ, దీర్ఘశాంతం, అమితమైన కృప, సత్యం గల దేవుడు. 8మోషే వెంటనే నేలకు తల వంచి సాష్టాంగపడి నమస్కరించాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

1 రాజులు 19:3–9, 11–13, 15–16

3ఏలీయా ఈ విషయం తెలుసుకుని, లేచి తన ప్రాణం కాపాడుకోడానికి, యూదాలోని బెయేర్షెబాకు వచ్చి, తన సేవకుణ్ణి అక్కడ ఉంచాడు. 4అతడు ఒక రోజంతా ఎడారిలోకి ప్రయాణించి ఒక రేగు చెట్టు కింద కూర్చున్నాడు. చచ్చిపోదామని ఆశించాడు. “యెహోవా, ఇంతవరకూ చాలు, చనిపోయిన నా పూర్వీకుల కంటే నేనేమంత గొప్పవాణ్ణి కాదు. నా ప్రాణం తీసుకో” అని ప్రార్థన చేశాడు. 5అతడు రేగు చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు. ఉన్నట్టుండి ఒక దేవదూత వచ్చి అతన్ని తాకి “నీవు లేచి భోజనం చెయ్యి” అన్నాడు. 6ఏలీయా లేచి చూస్తే, అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చిన రొట్టె, నీళ్ల సీసా కనిపించాయి. కాబట్టి అతడు భోజనం చేసి మళ్ళీ పడుకున్నాడు. 7యెహోవా దూత రెండవసారి మళ్ళీ వచ్చి అతన్ని లేపి “నీవు చాలా దూరం ప్రయాణం చెయ్యాలి, లేచి భోజనం చెయ్యి” అని చెప్పాడు. 8అతడు లేచి తిని, తాగి ఆ భోజనం బలంతో నలభై రాత్రింబగళ్లు ప్రయాణించి దేవుని పర్వతమనే పేరున్న హోరేబుకు వచ్చాడు. 9అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు. 11యెహోవా అతనితో “నీవు వెళ్లి పర్వతం మీద నా ఎదుట నిలబడు” అన్నాడు. అప్పుడు యెహోవా అటుగా వెళ్ళగానే ప్రచండమైన గాలి లేచింది. పర్వతాలు బద్దలై బండరాళ్ళు ముక్కలైపోయాయి గాని యెహోవా ఆ గాలిలో లేడు. గాలి వెళ్లిపోయిన తరువాత భూకంపం వచ్చింది గాని ఆ భూకంపంలో యెహోవా లేడు. 12ఆ భూకంపం వెళ్ళిపోయిన తరువాత అగ్ని జ్వాలలు కన్పించాయి గాని ఆ అగ్నిలో యెహోవా లేడు. అగ్ని ఆగిపోగానే చాలా నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరం వినిపించింది. 13ఏలీయా ఆ స్వరం విని, తన దుప్పటితో ముఖం కప్పుకుని బయలుదేరి గుహ ఎదుట నిలబడ్డాడు. అప్పుడు “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?” అనే మాట వినిపించింది. 15అప్పుడు యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “ఎడారి గుండా నీవు వచ్చిన దారిలో దమస్కు వెళ్ళు. అక్కడ సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చెయ్యి. 16ఇశ్రాయేలు వారి మీద నింషీ కొడుకు యెహూకు పట్టాభిషేకం చెయ్యి. నీకు బదులు ప్రవక్తగా ఉండడానికి అబేల్మెహోలా వాడు షాపాతు కొడుకు ఎలీషాకు అభిషేకం చెయ్యి.

ఉదయ ప్రార్థన: సువార్త

లూకా 9:28–36

28ఈ మాటలు పలికిన తరువాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు. 29ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగధగా మెరిసాయి. 30ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే ఏలీయాలు. 31వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. 32పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారికి మెలకువ రాగానే ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు. 33ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతుండగా పేతురు, “ప్రభూ, మనం ఇక్కడ ఉండడం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేము కడతాం” అంటూ తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు. 34అతడు ఈ విధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు చాలా భయపడ్డారు. 35తరువాత, “ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి” అని ఒక శబ్దం ఆ మేఘంలో నుంచి వచ్చింది. 36ఆ శబ్దం వచ్చిన తరువాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. ఆ రోజుల్లో వీరు తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.

పత్రిక (ప్రభువు రూపాంతరం కోసం)

2 పేతు 1:10–19

10కాబట్టి సోదరులారా, మీ పిలుపును, మీ ఎన్నికను స్థిరం చేసుకోడానికి పూర్తి శ్రద్ధ కలిగి ఉండండి. అప్పుడు మీరు ఎన్నడూ తడబడరు. 11దీని ద్వారా మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు రాజ్యంలోకి ఘనమైన ప్రవేశం మీకు దొరుకుతుంది. 12వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను. 13నేను ఈ శరీరం అనే గుడారంలో ఉన్నంత వరకూ ఇవి మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను. 14మన ప్రభు యేసు క్రీస్తు ముందుగానే నాకు వెల్లడి చేసిన ప్రకారం నేను త్వరలోనే ఈ శరీరం వదిలేస్తానని నాకు తెలుసు. 15నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను. 16ఎందుకంటే, మన ప్రభు యేసు క్రీస్తు శక్తిని, ఆయన రాకడను గురించి చాకచక్యంగా అల్లిన కల్పనా కథలను మేము మీకు చెప్పలేదు, ఆయన గొప్పదనాన్ని కళ్ళారా చూసిన వారుగా చెప్పాం. 17ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి ఘనత, మహిమ పొందగా, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను” అనే గొప్ప మహిమగల దైవస్వరం వచ్చినప్పుడు, 18ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండి పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని స్వయంగా విన్నాం. 19ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకు ఉంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ ఆ వాక్కు చీకట్లో వెలుగు ఇచ్చే దీపంలా ఉంది. ఆ వెలుగును మీరు లక్ష్యపెడితే మీకు మేలు.

సువార్త (ప్రభువు రూపాంతరం కోసం)

మత్తయి 17:1–9

1ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసుకుని ఎత్తయిన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. 2వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి. 3అదే క్షణంలో మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు. 4అప్పుడు పేతురు యేసుతో, “ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు మూడు పాకలు వేస్తాను” అన్నాడు. 5అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి ఒక స్వరం వారితో, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే నాకు చాలా సంతోషం. మీరు ఈయన చెప్పేది వినండి” అని పలికింది. 6శిష్యులు ఈ మాటలు విని భయంతో బోర్లాపడిపోయారు. 7యేసు వారి దగ్గరికి వచ్చి, వారిని తాకి, “భయపడకండి, ఇక లేవండి” అన్నాడు. 8వారు కళ్ళు తెరచి చూస్తే, యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు. 9వారు కొండ దిగి వచ్చేటప్పుడు, “మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు” అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 6 ఆగస్టు పౌర కాలెండర్‌లో 19 ఆగస్టు. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు