Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఆగస్టు 2027 › 18 ఆగస్టు

ఆర్థడాక్స్ కాలెండర్ · ఆగస్టు 5 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 18 ఆగస్టు, 2027

బుధవారం · పెంతెకొస్తు తర్వాత 9వ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

Forefeast of the Transfiguration of the Lord

మరియ నిద్ర ఉపవాసం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

పత్రిక

1 కొరింతీ 13:4–14:5

4ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. అది దయ చూపుతుంది. ప్రేమలో అసూయ ఉండదు. అది గొప్పలు చెప్పుకోదు, గర్వంతో మిడిసిపడదు. 5అమర్యాదగా ప్రవర్తించదు. ప్రేమలో స్వార్ధం ఉండదు. అది త్వరగా కోపం తెచ్చుకోదు, ఎవరైనా అపకారం తలపెడితే మనసులో ఉంచుకోదు. 6ఈ ప్రేమ దుర్నీతి విషయంలో సంతోషించదు, సత్యం విషయంలో సంతోషిస్తుంది. 7అది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశతో ఎదురు చూస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. 8ప్రేమకు అంతం లేదు. ప్రవచనాలు వృథా అవుతాయి, భాషలు అంతరిస్తాయి, జ్ఞానం గతించిపోతుంది. 9ఎందుకంటే మనకు కొంతవరకే తెలుసు. కొంతవరకే ప్రవచిస్తున్నాము. 10అయితే పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పరిపూర్ణం కానివి అంతమైపోతాయి. 11నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు చిన్నవాడిలాగానే మాట్లాడాను, చిన్నవాడిలాగానే తర్కించాను. ఇప్పుడు పెద్దవాడినయ్యాక పిల్లచేష్టలు మానేశాను. 12అలాగే ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు మసకగా చూస్తున్నాం. అప్పుడైతే ముఖాముఖిగా చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసింది కొంత మాత్రమే. అప్పుడు దేవుడు నన్ను పూర్తిగా ఎరిగినంత మట్టుకు నేను కూడా పూర్తిగా తెలుసుకుంటాను. 13ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే. 14:1ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో కోరుకోండి. ముఖ్యంగా దైవసందేశం ప్రకటించగలిగే వరం కోరుకోండి. 2ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. అతడు పలికేది ఎవరికీ అర్థం కాదు. అతడు ఆత్మ ద్వారా రహస్య సత్యాలను పలుకుతున్నాడు. 3అయితే దైవసందేశం ప్రకటించేవాడు వినేవారికి క్షేమాభివృద్ధి, ఆదరణ, ఓదార్పు కలిగే విధంగా మనుషులతో మాట్లాడుతున్నాడు. 4భాషతో మాట్లాడేవాడు తనకు మాత్రం మేలు చేసుకుంటాడు గాని దైవసందేశం ప్రకటించేవాడు ఆదరణ, ఓదార్పు కలిగిస్తూ సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. 5మీరంతా తెలియని భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను గాని, మీరు దైవసందేశం ప్రకటించేవారుగా ఉండాలని మరెక్కువగా కోరుతున్నాను. సంఘం అభివృద్ధి చెందడానికి భాషలతో మాట్లాడే వాడి కంటే (అర్థం చెబితే తప్ప) దేవుని పక్షంగా దేవుడు తెలియ చేసిన సందేశాన్ని ప్రకటించే వాడే గొప్పవాడు.

పత్రిక (గురువారం కోసం)

1 కొరింతీ 14:6–19

6సోదరులారా, ఆలోచించండి. నేను మీ దగ్గరికి భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. నా మాటలు మీకు అర్థం కాక, వాటిలో దేవుడు బయలు పరచిన విషయాలను గానీ, జ్ఞానం గానీ, దేవుడు చెప్పమన్న సందేశం గానీ, లేక ఎదైనా ఉపదేశం గానీ లేకుండా ఉంటే నా వలన మీకు ప్రయోజనమేమిటి? 7నిర్జీవమైన వస్తువులైన వేణువు ఊదినా, వీణ వాయించినా, అవి వేరు వేరు స్వరాలు పలకకపోతే, వాడిన వాయిద్యమేదో ఎలా తెలుస్తుంది? 8బాకా స్పష్టంగా వినిపించకపోతే యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? 9అలాగే మీ నాలుకతో స్పష్టమైన మాటలు పలకకపోతే వినేవారికి ఏం అర్థమౌతుంది? అది మీరు గాలితో మాట్లాడుతున్నట్టే ఉంటుంది కదా! 10లోకంలో ఎన్నో భాషలున్నా, వాటన్నిటికీ స్పష్టమైన అర్థాలు ఉంటాయి. 11మాటల అర్థం నాకు తెలియకపోతే మాట్లాడేవాడు నాకూ, నాకు అతడూ పరాయివారంగా ఉంటాం. 12మీరు ఆత్మ సంబంధమైన వరాల విషయంలో ఆసక్తిగలవారు గనుక సంఘాన్ని అభివృద్ధి పరిచే వరాలను కోరుకుని వాటిలో అమితంగా అభివృద్ధి చెందండి. 13కాబట్టి తెలియని భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పే సామర్ధ్యం కోసం ప్రార్థన చేయాలి. 14నేను తెలియని భాషతో ప్రార్థన చేసినపుడు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది గాని నా మనసు చురుకుగా ఉండదు. 15కాబట్టి నేనేం చెయ్యాలి? నా ఆత్మతో ప్రార్ధిస్తాను, మనసుతో కూడా ప్రార్ధిస్తాను. ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను. 16అలా కాకుండా, నీవు ఆత్మతో మాత్రమే స్తుతులు చెల్లిస్తే నీవు పలికిన దాన్ని గ్రహించలేని వ్యక్తి నీవు చెప్పిన కృతజ్ఞతలకు, “ఆమేన్‌” అని చెప్పలేడు కదా! 17నీకై నీవు బాగానే స్తుతులు చెల్లిస్తావు గానీ ఎదుటి వ్యక్తికి మేలు కలగదు. 18దేవునికి స్తుతులు! నేను మీ అందరికంటే ఎక్కువగా తెలియని భాషలతో మాట్లాడతాను. 19అయినా సంఘంలో తెలియని భాషతో పదివేల మాటలు పలకడం కంటే, ఇతరులకు ఉపదేశం దొరికేలా నా మనసుతో ఐదు మాటలు చెప్పడం మంచిది.

సువార్త

మత్తయి 20:1–16

1“ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు. 2రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకుని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు. 3తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి, 4‘మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి. ఏది న్యాయమో ఆ జీతం మీకిస్తాను’ అని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు. 5దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్ళి, ఆ విధంగా చేశాడు. 6మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్ళి, ఇంకా కొందరు ఊరికే నిలబడి ఉండడం చూసి, ‘మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు. 7వారు ‘ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు’ అన్నారు. అతడు, ‘అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి’ అన్నాడు. 8“సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, ‘పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారి వరకూ అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు. 9దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది. 10అది చూసి ముందుగా పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు. 11వారు దాన్ని తీసుకుని ‘చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పని చేశారు. మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేశాం. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?’ అని ఆ యజమాని మీద సణుక్కున్నారు. 13అప్పుడా యజమాని వారిలో ఒకడితో, “మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? 14నీ కూలి సొమ్ము తీసుకుని వెళ్ళు. నీకిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం. 15నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకునే అధికారం నాకు లేదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపు మంటగా ఉందా?” అని అన్నాడు. 16ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.”

సువార్త (గురువారం కోసం)

మత్తయి 20:17–28

17యేసు యెరూషలేముకు వెళ్ళబోయే ముందు తన పన్నెండు మంది శిష్యులనూ ఏకాంతంగా తీసుకుపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు. 18“ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి. 19ఆయనను అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు. అయితే మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు.” 20అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో కలిసి ఆయన దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. 21“నీకేమి కావాలి?” అని యేసు ఆమెను అడిగాడు. అందుకామె, “నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులను ఒకణ్ణి నీ కుడి వైపున, మరొకణ్ణి నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు” అంది. 22అందుకు యేసు, “మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?” అని వారిని అడగగా వారు “తాగగలం” అన్నారు. 23ఆయన, “నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి” అని చెప్పాడు. 24మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు. 25కాబట్టి యేసు వారిని పిలిచి, “ఇతర జాతుల్లో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు. 26కానీ మీరు అలా ప్రవర్తించకూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి. 27మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి. 28అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు” అని చెప్పాడు.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 5 ఆగస్టు పౌర కాలెండర్‌లో 18 ఆగస్టు. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు