హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 19 జూన్
ఆర్థడాక్స్ కాలెండర్ · జూన్ 6 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 19 జూన్, 2027
శనివారం · పాస్కా ఏడవ వారం · స్వరం 6
పండుగలు మరియు పరిశుద్ధులు
స్మరణ శనివారం
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక (దివంగతుల కోసం)
13సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు. 14యేసు చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడని మనం నమ్ముతున్నాం కదా. అలానే యేసులో చనిపోయిన వారిని దేవుడు ఆయనతో కూడా తీసుకుని వస్తాడు. 15మేము ప్రభువు మాట ప్రకారం మీకు చెప్పేదేమిటంటే ప్రభువు తిరిగి వచ్చేంత వరకూ బ్రతికి ఉండే మనం కన్నుమూసిన వారి కంటే ముందే ఆయనను చేరుకోము. 16ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు. 17ఆ తరవాత బతికి ఉండే మనలను కూడా వారితోబాటు ఆకాశమండలంలో ప్రభువును ఎదుర్కోడానికి మేఘాలపై తీసుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ తరువాత మనం నిరంతరం ప్రభువుతో కూడా ఉంటాం.
పత్రిక
1మేము తప్పించుకొన్న తరువాత ఆ ద్వీపం మెలితే అని మాకు తెలిసింది. 2అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన సపర్య అంతా ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు. 3అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. 4ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు. 5కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు. 6వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు. 7పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. 8ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. 9ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు. 10వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు. 11కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి 12సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం. 13అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు పట్టణం వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీ పట్టణం వచ్చాం. 14అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం. 15అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకూ, మూడు సత్రాల పేట వరకూ ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. 16మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు. 17మూడు రోజుల తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరికి పిలిపించాడు. వారు వచ్చినప్పుడు అతడు, “సోదరులారా, నేను మన ప్రజలకూ, పూర్వీకుల ఆచారాలకూ వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా, యెరూషలేములో నన్ను రోమీయుల చేతికి అప్పగించారు. 18వారు నన్ను విచారించి నాలో మరణానికి తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని 19యూదులు అభ్యంతరం చెప్పడం వలన నేను ‘సీజరు ఎదుట చెప్పుకొంటాను’ అనవలసి వచ్చింది. నా స్వజనం మీద నేరం మోపాలని నా అభిప్రాయం కాదు. 20ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు” అని వారితో చెప్పాడు. 21అందుకు వారు, “యూదయ నుండి మీ గురించి మాకేమీ ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదరుల్లో ఒక్కడైనా మీ గురించి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలుపలేదు. ఎవరూ చెప్పుకోలేదు కూడా. 22అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు. 23అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకూ అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్షమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తల్లో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు. 24అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. 25వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే 26వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి. 27ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే. 28కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు. 29వారు దాన్ని అంగీకరిస్తారు.” ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు. 30పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ 31ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.
పత్రిక (దివంగతుల కోసం (మరో పఠనం))
47మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. 48మొదట మట్టి నుండి వచ్చినవాడు ఎలాటివాడో ఆ తరువాత మట్టి నుండి పుట్టిన వారంతా అలాంటివారే. పరలోక సంబంధి ఎలాటివాడో తరువాత వచ్చిన పరలోక సంబంధులు కూడా అలాటి వారే. 49మనం మట్టి మనిషి పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను కూడా ధరిస్తాం. 50సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, రక్త మాంసాలు దేవుని రాజ్య వారసత్వం పొందలేవు. నశించి పోయేవి నశించని దానికి వారసత్వం పొందలేవు. 51ఇదిగో వినండి, మీకు ఒక రహస్యం చెబుతున్నాను, మనమంతా నిద్రించం. నిమిషంలో రెప్ప పాటున, చివరి బాకా మోగగానే మనమంతా మారిపోతాం. 52బాకా మోగుతుంది, అప్పుడు చనిపోయిన వారు నాశనం లేనివారుగా లేస్తారు. మనం మారిపోతాం. 53నశించిపోయే ఈ శరీరం నాశనం లేని శరీరాన్ని ధరించుకోవాలి. మరణించే ఈ శరీరం మరణం లేని శరీరాన్ని ధరించుకోవాలి. 54ఈ విధంగా నశించేది నశించని దానినీ, మరణించేది మరణం లేని దానినీ ధరించుకొన్నప్పుడు, “విజయం మరణాన్ని మింగివేసింది” అని రాసి ఉన్న మాటలు నెరవేరుతాయి. 55“మరణమా, నీ విజయమేది? మరణమా, నీ ముల్లేది?” 56మరణపు ముల్లు పాపం. పాపానికి ఉన్న బలం ధర్మశాస్త్రమే. 57అయితే మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా మనకు విజయమిస్తున్న దేవునికి స్తుతి.
సువార్త (దివంగతుల కోసం)
24కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. 25మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు. 26తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు. 27అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు. 28“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది. 29అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు. 30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
సువార్త
15వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, “యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” అని ప్రశ్నించాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలను మేపు” అని అతనితో చెప్పాడు. 16మరోసారి ఆయన, “యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?” అని అతణ్ణి అడిగాడు. అతడు, “అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు” అన్నాడు. దానికి యేసు, “నా గొర్రెలకు కాపరిగా ఉండు” అన్నాడు. 17ఆయన మూడోసారి, “యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?” అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, “ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు” అన్నాడు. అప్పుడు యేసు, “నా గొర్రెలను మేపు. 18నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు” అని అతనితో చెప్పాడు. 19దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, “నన్ను అనుసరించు” అని అతనితో అన్నాడు. 20పేతురు వెనక్కి తిరిగి యేసు ప్రేమించిన వాడూ, పస్కా పండగ సందర్భంలో భోజన సమయంలో ఆయన పక్కనే కూర్చుని ఆయన ఛాతీని ఆనుకుంటూ, “ప్రభూ నిన్ను పట్టిచ్చేది ఎవరు” అని అడిగిన శిష్యుడు తమ వెనకే రావడం చూశాడు. 21పేతురు అతణ్ణి చూసి, “ప్రభూ, మరి ఇతడి విషయం ఏమవుతుంది?” అని ఆయనను అడిగాడు. 22దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు. 23దాంతో ఆ శిష్యుడు మరణించడు అనే మాట శిష్యుల్లో పాకి పోయింది. అయితే అతడు మరణించడు అని యేసు చెప్పలేదు గానీ నేను వచ్చే వరకూ అతడు ఉండడం నాకిష్టమైతే నీకేంటి, అని మాత్రమే అన్నాడు. 24ఈ సంగతులను గురించి సాక్షమిస్తూ ఇవన్నీ రాసింది ఈ శిష్యుడే. ఇతని సాక్ష్యం సత్యమని మనకు తెలుసు. 25యేసు చేసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ వివరించి రాసే గ్రంథాలకు ఈ భూలోకం సరిపోదని నాకు అనిపిస్తుంది.
సువార్త (దివంగతుల కోసం (మరో పఠనం))
35దానికి జవాబుగా యేసు, “జీవాన్నిచ్చే ఆహారాన్ని నేనే. నా దగ్గరికి వచ్చే వాడికి ఆకలి వేయదు. నాపై విశ్వాసముంచే వాడికి దాహం వేయదు. 36కాని నేను మీతో చెప్పినట్టు, నన్ను చూసి కూడా మీరు నమ్మలేదు. 37తండ్రి నాకు ఇచ్చే వారంతా నా దగ్గరికి వస్తారు. ఇక నా దగ్గరికి వచ్చేవారిని నేను ఎంత మాత్రం నా దగ్గర నుండి తోలివేయను. 38ఎందుకంటే నేను నా స్వంత ఇష్టాన్ని జరిగించడానికి రాలేదు. నన్ను పంపించిన వాని ఇష్టాన్ని జరిగించడానికే పరలోకం నుండి వచ్చాను. 39ఆయన నాకు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ పోగొట్టుకోకుండా ఉండడమూ, వారందరినీ అంత్యదినాన లేపడమూ నన్ను పంపిన వాడి ఇష్టం.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 6 జూన్ పౌర కాలెండర్లో 19 జూన్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు