హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › జూన్ 2027 › 20 జూన్
ఆర్థడాక్స్ కాలెండర్ · జూన్ 7 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 20 జూన్, 2027
ఆదివారం · స్వరం 7
పండుగలు మరియు పరిశుద్ధులు
పరిశుద్ధ పెంతెకొస్తు. పరిశుద్ధ త్రిత్వ పండుగ
ఉపవాసం
ఉపవాసం లేదు
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
సాయంకాల ప్రార్థన: పఠనం
16అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇశ్రాయేలు ప్రజల్లో పెద్దలు 70 మందిని నాదగ్గరికి తీసుకురా. వారు ప్రజల్లో పెద్దలనీ అధిపతులనీ స్పష్టంగా గుర్తించి తీసుకురా. వారిని సన్నిధి గుడారం దగ్గరికి తీసుకుని రా. వారిని నీతో కూడా నిలబెట్టు. 17అక్కడ నేను దిగి నీతో మాట్లాడతాను. తరువాత నీ మీద ఉన్న ఆత్మలో కొంత వారి పైన ఉంచుతాను. వారు నీతో కలసి ప్రజల భారాన్ని మోస్తారు. నువ్వు ఒంటరిగా ఈ భారం మోయాల్సిన అవసరం లేదు. 24మోషే బయటికి వచ్చి యెహోవా మాటలు ప్రజలకు చెప్పాడు. ప్రజల్లోనుండి 70 మంది పెద్దలను గుడారం చుట్టూ నిలబెట్టాడు. 25అప్పుడు యెహోవా మేఘంలో దిగాడు. అతనితో మాట్లాడాడు. అతని పైన ఉన్న ఆత్మలో ఒక భాగాన్ని పెద్దల పైన ఉంచాడు. ఆత్మ వారిపై ఉన్నప్పుడు వారు ప్రవచనం చెప్పారు. వారంతా ఆ సందర్భంలోనే ప్రవచించారు, ఆ తరువాత ఎప్పుడూ ప్రవచనం చెప్పలేదు. 26ఆ మనుషుల్లో ఇద్దరు శిబిరంలో ఉండిపోయారు. వారి పేర్లు ఎల్దాదు, మేదాదు. ఆత్మ వారిపై కూడా నిలిచాడు. వారి పేర్లు పెద్దల జాబితాలో ఉన్నాయి కానీ వారు గుడారం దగ్గరకి వెళ్ళలేదు. అయినా వారి శిబిరంలోనే వారు ప్రవచించారు. 27అప్పుడు శిబిరంలో ఒక యువకుడు మోషే దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి “ఎల్దాదు, మేదాదులు శిబిరంలో ప్రవచిస్తున్నారు” అని చెప్పాడు. 28మోషే సహాయకుడూ, తాను ఎన్నుకున్న వారిలో ఒకడూ, నూను కొడుకూ అయిన యెహోషువ “మోషే, నా యజమానీ, వారిని ఆపు” అన్నాడు. 29దానికి మోషే “నా కోసం నీకు రోషం వచ్చిందా? అసలు యెహోవా ప్రజలందరూ ప్రవక్తలు కావాలని కోరుకుంటున్నాను. దాని కోసం యెహోవా తన ఆత్మని అందరి పైనా ఉంచుతాడు గాక” అని అతనితో చెప్పాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం
23సీయోను ప్రజలారా, ఆనందించండి. మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు. 24కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి. 25“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను. 26మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 27అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, నేనే మీ యెహోవా దేవుడిననీ, నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 28తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి. 29ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. 30ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను. 31యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి. 32యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”
సాయంకాల ప్రార్థన: పఠనం
24“ఇతర రాజ్యాల్లో నుంచి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ యా దేశాల్లో నుంచి సమకూర్చి, మీ సొంత దేశంలోకి మిమ్మల్ని రప్పిస్తాను. 25మీ అపవిత్రత అంతా పోయేలా నేను మీ మీద పవిత్ర జలం చల్లుతాను. మీ విగ్రహాల వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేస్తాను. 26కొత్త హృదయం మీకిస్తాను. కొత్త స్వభావం మీకు కలగచేస్తాను. రాతిగుండె మీలోనుంచి తీసి వేసి మాంసపు గుండె మీకిస్తాను. 27నా ఆత్మ మీలో ఉంచి, నా చట్టాలను అనుసరించే వారిగా నా విధులను పాటించే వారిగా మిమ్మల్ని చేస్తాను. 28నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసిస్తారు. మీరు నా ప్రజగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
ఉదయ ప్రార్థన: సువార్త
19ఆదివారం సాయంకాలం యూదులకు భయపడి శిష్యులు తామున్న ఇంటి తలుపులు మూసుకుని ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి వారి మధ్యలో నిలబడి, వారితో, “మీకు శాంతి కలుగు గాక” అన్నాడు. 20ఆయన అలా చెప్పిన తరువాత వారికి తన పక్కనూ చేతులనూ చూపించాడు. వారు ప్రభువును చూసి ఎంతో సంతోషించారు. 21అప్పుడు యేసు తిరిగి, “మీకు శాంతి కలుగు గాక! తండ్రి నన్ను పంపించిన విధంగానే నేనూ మిమ్మల్ని పంపుతున్నాను” అని వారితో చెప్పాడు. 22ఈ మాట చెప్పిన తరువాత ఆయన వారి మీద ఊది, “పరిశుద్ధాత్మను పొందండి. 23మీరు ఎవరి పాపాలను క్షమిస్తారో వారి పాపాలకు క్షమాపణ ఉంటుంది. ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి” అని చెప్పాడు.
పత్రిక
1పెంతెకొస్తు అనే పండగరోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట సమావేశమయ్యారు. 2అప్పుడు వేగంగా వీచే బలమైన గాలి వంటి శబ్దం ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. 3అగ్నిజ్వాలలు నాలుకలుగా చీలినట్టుగా వారికి కనబడి, వారిలో ప్రతి ఒక్కరి మీదా వాలాయి. 4అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడసాగారు. 5ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు. 6ఈ శబ్దం విన్న జన సందోహం కూడి వచ్చి, ప్రతి వాడూ తన సొంత భాషలో మాట్లాడడం విని కలవరపడ్డారు. 7వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా. 8మనలో ప్రతివాడి మాతృభాషలో వీరు మాట్లాడడం మనం వింటున్నామేంటి? 9పార్తీయులూ మాదీయులూ ఏలామీయులూ, మెసపటేమియా యూదయ కప్పదొకియ పొంతు ఆసియ 10ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అనే దేశాల వారూ, కురేనేలో భాగంగా ఉన్న లిబియ ప్రాంతాలవారూ, రోమ్ నుండి సందర్శకులుగా వచ్చిన 11యూదులూ, యూదామతంలోకి మారినవారూ, క్రేతీయులూ అరబీయులూ మొదలైన మనమంతా వీరు మన భాషల్లో దేవుని గొప్ప కార్యాలను చెబుతుంటే వింటున్నాము” అనుకున్నారు.
సువార్త
37ఆ పండగలో మహాదినమైన చివరి దినాన యేసు నిలబడి, “ఎవరికైనా దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకోవాలి. 38లేఖనాలు చెబుతున్నాయి, నాపై విశ్వాసముంచే వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పాడు. 39తనపై నమ్మకం ఉంచేవారు పొందబోయే దేవుని ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. యేసు అప్పటికి తన మహిమా స్థితి పొందలేదు కనుక దేవుని ఆత్మ దిగి రావడం జరగలేదు. 40ప్రజల్లో కొందరు ఆ మాట విని, “ఈయన నిజంగా ప్రవక్తే” అన్నారు. 41మరికొందరు, “ఈయన క్రీస్తే” అన్నారు. దానికి జవాబుగా ఇంకా కొందరు, “ఏమిటీ, క్రీస్తు గలిలయ నుండి వస్తాడా? 42క్రీస్తు దావీదు వంశంలో పుడతాడనీ, దావీదు ఊరు బేత్లెహేము అనే గ్రామంలో నుండి వస్తాడనీ లేఖనాల్లో రాసి లేదా?” అన్నారు. 43ఈ విధంగా ప్రజల్లో ఆయనను గురించి భేదాభిప్రాయం కలిగింది. 44వారిలో కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు కానీ ఎవరూ ఆయనను పట్టుకోలేదు. 45పరిసయ్యులు పంపిన సైనికులు తిరిగి వచ్చారు. ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ, “మీరు ఆయనను ఎందుకు తీసుకురాలేదు?” అని అడిగారు. 46దానికి ఆ సైనికులు, “ఆ వ్యక్తి మాట్లాడినట్టు ఇంతకు ముందు ఎవరూ మాట్లాడలేదు” అని జవాబిచ్చారు. 47దానికి పరిసయ్యులు, “మీరు కూడా మోసపోయారా? 48అధికారుల్లో గానీ పరిసయ్యుల్లో గానీ ఎవరైనా ఆయనను నమ్మారా? 49ధర్మశాస్త్రం తెలియని ఈ ప్రజల పైన శాపం ఉంది” అని సైనికులతో అన్నారు. 50అంతకు ముందు యేసు దగ్గరికి వచ్చిన నికోదేము అనే పరిసయ్యుడు, 51“ఒక వ్యక్తి చెప్పే మాట వినకుండా అతడేం చేశాడో తెలుసుకోకుండా మన ధర్మశాస్త్రం అతడికి తీర్పు తీరుస్తుందా?” అన్నాడు. 52దానికి వారు, “నువ్వు కూడా గలిలయుడవేనా? ఆలోచించు, గలిలయలో ఎలాంటి ప్రవక్తా పుట్టడు” అన్నారు. 8:12మళ్ళీ యేసు ఇలా అన్నాడు, “నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. జీవపు వెలుగు కలిగి ఉంటాడు.”
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 7 జూన్ పౌర కాలెండర్లో 20 జూన్. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు