హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మే 2027 › 1 మే
ఆర్థడాక్స్ కాలెండర్ · ఏప్రిల్ 18 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 1 మే, 2027
శనివారం · పవిత్ర వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
మహా పవిత్ర శనివారం
మహా ఉపవాస కాలం
కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
ఉదయ ప్రార్థన (ప్రవచనం)
1యెహోవా తన చెయ్యి నా మీద ఉంచాడు. యెహోవా ఆత్మతో ఆయన నన్ను తీసుకుపోయి ఒక లోయలో దింపాడు. అది ఎముకలతో నిండి ఉంది. ఆయన వాటి మధ్య నన్ను ఇటూ అటూ నడిపించాడు. 2ఆ లోయలో చాలా ఎముకలు కనిపించాయి. అవి బాగా ఎండిపోయినవి. 3ఆయన “నరపుత్రుడా, ఎండిపోయిన యీ ఎముకలు బతుకుతాయా?” అని నన్నడిగితే “ప్రభూ, యెహోవా, అది నీకే తెలుసు” అన్నాను. 4అందుకాయన ప్రవచనాత్మకంగా ఎండిపోయిన ఈ ఎముకలతో ఇలా చెప్పు. “ఎండిపోయిన ఎముకలారా! యెహోవా మాట వినండి. 5ఈ ఎముకలకు యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, మీరు బతికేలా నేను మీలోనికి జీవాత్మ రప్పిస్తున్నాను. 6మీకు నరాలిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం కప్పుతాను. మీలో ఊపిరి పోస్తే మీరు బతుకుతారు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.” 7ఆయన నాకిచ్చిన ఆజ్ఞప్రకారం నేను ప్రవచిస్తూ ఉంటే గలగలమనే శబ్దం వచ్చింది. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి. 8నేను చూస్తూ ఉంటే నరాలూ మాంసం వాటిమీదికి వచ్చాయి. వాటిమీద చర్మం కప్పుకుంది. అయితే వాటిలో ప్రాణం లేదు. 9అప్పడు యెహోవా నాతో “నరపుత్రుడా! ప్రాణం వచ్చేలా ప్రవచించి ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఊపిరీ! నలుదిక్కుల నుంచి వచ్చి, చచ్చిన వీళ్ళు బతికేలా వీరి మీదికి ఊపిరీ రా” 10ఆయన నాకు ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచిస్తే, వాళ్ళకి ప్రాణం వచ్చింది. వాళ్ళు సజీవులై గొప్ప సేనగా నిలబడ్డారు. 11అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు. 12కాబట్టి ప్రవచనాత్మకంగా వాళ్ళతో ఇలా చెప్పు, యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నా ప్రజలారా, మీ సమాధులను నేను తెరుస్తాను. సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశానికి తీసుకు వస్తాను. 13నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పిస్తే 14నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు బతికేలా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. యెహోవానైన నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుస్తానని మీరు తెలుసుకుంటారు. ఇదే యెహోవా ప్రభువు సందేశం.
ఉదయ ప్రార్థన: పత్రిక
1 కొరింతీ 5:6–8 · గలతీ 3:13–14
6మీరు గర్వంతో మిడిసిపడడం మంచిది కాదు. పులిపిండి కొంచెమే అయినా, అది పిండి ముద్దనంతటినీ పులిసేలా చేస్తుందని మీకు తెలుసు కదా! 7మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది. 8కాబట్టి, చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండితో కాక, నిజాయితీ, సత్యం అనే పొంగని రొట్టెతో పండగ జరుపుకుందాం. 3:13ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను ధర్మశాస్త్ర శిక్ష నుంచి విమోచించాడు. 14అందుకే, “మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.
ఉదయ ప్రార్థన: సువార్త
62ఆ తరువాతి రోజు, అంటే విశ్రాంతి దినానికి సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ముఖ్య యాజకులు, పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, 63“అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది. 64కాబట్టి మూడవ రోజు వరకూ సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి ‘ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేచాడు’ అని ప్రజల్లో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచన కంటే చివరి వంచన మరింత చెడ్డదౌతుంది” అన్నారు. 65అందుకు పిలాతు, “కావలి వారున్నారు గదా, మీరు వెళ్ళి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి” అని వారితో చెప్పాడు. 66వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.
సాయంకాల ప్రార్థన: పఠనం (మొదటి పఠనం)
1ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. 2భూమి నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు. 3దేవుడు “వెలుగు కలుగు గాక” అన్నాడు. వెలుగు కలిగింది. 4ఆ వెలుగు దేవునికి మంచిదిగా అనిపించింది. దేవుడు వెలుగునూ చీకటినీ వేరు చేశాడు. 5దేవుడు వెలుగుకు పగలు అనీ చీకటికి రాత్రి అని పేర్లు పెట్టాడు. సాయంత్రం అయింది, ఉదయం వచ్చింది, మొదటి రోజు. 6దేవుడు “మహా జలరాశి మధ్యలో ఒక విశాల ప్రదేశం కలుగు గాక. అది నీళ్ళనుండి నీళ్ళను వేరు చేయు గాక” అన్నాడు. 7దేవుడు ఆ విశాలమైన ప్రదేశాన్ని చేసి, దాని పైన ఉన్న జలాలను, కింద ఉన్న జలాలను వేరు చేసాడు. అది అలాగే జరిగింది. 8దేవుడు ఆ విశాల ప్రదేశానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. రాత్రి అయింది, ఉదయం వచ్చింది, రెండవ రోజు. 9దేవుడు “ఆకాశం కింద ఉన్న జలాలు ఒకే చోట సమకూడి ఆరిన నేల కనబడాలి” అన్నాడు. అలాగే జరిగింది. 10దేవుడు ఆరిన నేలకు “భూమి” అని పేరు పెట్టాడు. కూర్చి ఉన్న జలాలకు “సముద్రాలు” అని పేరు పెట్టాడు. అది ఆయనకు మంచిదిగా అనిపించింది. 11దేవుడు “వృక్ష జాలాన్ని, విత్తనాలుండే చెట్లను, భూమిపై తమ తమ జాతి ప్రకారం విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించాలి” అన్నాడు. అలాగే జరిగింది. 12వృక్ష జాతిని, విత్తనాలుండే చెట్లను, భూమిమీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనాలు ఉండి ఫలం ఇచ్చే పండ్ల చెట్లను భూమి మొలిపించింది. అది ఆయనకు మంచిదిగా కనబడింది. 13రాత్రి అయింది, ఉదయం వచ్చింది-మూడవ రోజు.
సాయంకాల ప్రార్థన: పఠనం (రెండవ పఠనం)
1లే, ప్రకాశించు! నీకు వెలుగు వచ్చింది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. 2భూమిని చీకటి కమ్మినా కటిక చీకటి రాజ్యాలను కమ్మినా యెహోవా నీ మీద ఉదయిస్తాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. 3రాజ్యాలు నీ వెలుగుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. 4తలెత్తి చుట్టూ చూడు. వీళ్ళంతా మూకుమ్మడిగా నీ దగ్గరికి వస్తున్నారు. నీ కొడుకులు దూరంనుంచి వస్తారు. నీ కూతుళ్ళు చంకనెక్కి వస్తున్నారు. 5నువ్వు చూసి ప్రకాశిస్తావు. నీ హృదయం ఆనందిస్తూ ఉప్పొంగుతుంది. సముద్ర సమృద్ధి నీ మీద కుమ్మరించడం జరుగుతుంది. రాజ్యాల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది. 6ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు. 7నీ కోసం కేదారు గొర్రెమందలన్నీ సమకూడతాయి. నెబాయోతు పొట్లేళ్లు నీ సేవలో ఉపయోగపడతాయి. అవి నా బలిపీఠం మీద బలులుగా అంగీకారమవుతాయి. నా గొప్ప మందిరాన్ని నేను అందంగా అలంకరిస్తాను. 8మబ్బులాగా గువ్వలలాగా తమ గూటికి ఎగిరి వచ్చే వీళ్ళెవరు? 9నీ దేవుడు యెహోవా పేరునుబట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని పేరును బట్టి ఆయన నిన్ను ఘనపర్చాడు, కాబట్టి నీ కొడుకులను, తమ వెండి బంగారాలను తీసుకురావడానికి, ద్వీపవాసులు నా కోసం చూస్తారు. తర్షీషు ఓడలు మొదట వస్తాయి. 10విదేశీయులు నీ గోడలు కడతారు. వారి రాజులు నీకు సేవ చేస్తారు. ఎందుకంటే నేను ఆగ్రహంతో నిన్ను కొట్టినా అనుగ్రహంతో నీ మీద జాలిపడతాను. 11రాజ్యాల సంపద నీదగ్గరికి తెచ్చేలా నీ ద్వారం తలుపులు రాత్రింబగళ్లు మూసివేయడం జరగదు. ఆ ప్రజల ఊరేగింపులో వారి రాజులు ఉంటారు. 12నిన్ను సేవించడానికి నిరాకరించే ప్రజలు గానీ రాజ్యం గానీ నాశనం అవుతుంది. ఆ రాజ్యాలు తప్పకుండా నాశనం అవుతాయి. 13నా పరిశుద్ధాలయపు అలంకారం కోసం లెబానోను శ్రేష్ఠమైన దేవదారు వృక్షాలూ సరళవృక్షాలూ గొంజిచెట్లూ నీ దగ్గరికి తెస్తారు. నేను నా పాదాలు పెట్టుకునే స్థలాన్ని ఘనంగా చేస్తాను. 14నిన్ను బాధించినవారి కొడుకులు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించినవారంతా వచ్చి నీ పాదాల మీద పడతారు. యెహోవా పట్టణం అనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను అనీ నీకు పేరు పెడతారు. 15నిన్ను విడిచి పెట్టకుండా ఎవరూ నిన్ను ద్వేషించకుండా నీ ద్వారా ఎవరూ వెళ్ళకుండా ఉండడానికి బదులు నిన్ను ఎప్పటికీ హుందాగా ఉండేలా తరతరాలకు సంతోష కారణంగా చేస్తాను. 16రాజ్యాల పాలుకూడా నువ్వు తాగుతావు. రాజుల చనుపాలు తాగుతావు. యెహోవానైన నేను నీ రక్షకుడిననీ యాకోబు బలవంతుడైన దేవుడిననీ నీ విమోచకుడిననీ నువ్వు తెలుసుకుంటావు.
సాయంకాల ప్రార్థన: పఠనం (మూడవ పఠనం)
1మోషే అహరోనులతో ఐగుప్తు దేశంలో యెహోవా ఇలా చెప్పాడు. 2“నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరానికి మొదటి నెలన్న మాట. 3ఇశ్రాయేలు సమాజంతో ఇలా చెప్పు. మీరు ఇశ్రాయేలు ప్రజల సమాజమంతటితో కలసి ఈ నెల పదవ రోజున తమ కుటుంబాల ప్రకారం ప్రతి ఒక్కడూ, అంటే ప్రతి ఇంటి లెక్క చొప్పున ఒక గొర్రెపిల్లను గానీ, మేకపిల్లను గానీ తీసుకోవాలి. 4ఒక కుటుంబం ఆ గొర్రెపిల్లను తినడానికి చిన్నదైతే ఆ కుటుంబ పెద్ద ఒక గొర్రె పిల్ల, లేక మేక పిల్ల సరిగ్గా సరిపోయే విధంగా తన పొరుగింటి కుటుంబ సభ్యులను కలుపుకుని ఆ ప్రకారం వారిని లెక్కగట్టాలి. 5మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి. 6ఈ నెల 14 వ రోజు వరకూ దాన్ని ఉంచాలి. తరువాత ఇశ్రాయేలు ప్రజలంతా సాయంకాల సమయంలో దాన్ని చంపాలి. 7కొంచెం రక్తం తీసుకుని ఆ మాంసం ఏ ఇంట్లో తింటారో ఈ ఇంటి గుమ్మం రెండు నిలువు కమ్ముల మీద, పై కమ్మీ మీద చల్లాలి. 8ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి. 9దాన్ని పచ్చిగా గానీ ఉడికించిగానీ తినకూడదు. దాని తల, కాళ్ళు, లోపలి భాగాలను నిప్పుతో కాల్చి తినాలి. 10తెల్లవారే పాటికి దానిలో ఏమీ మిగల్చకూడదు. ఒకవేళ ఏమైనా మిగిలితే దాన్ని పూర్తిగా కాల్చివెయ్యాలి. 11మీరు దాన్ని తినవలసిన విధానం ఇది. మీ నడుముకు నడికట్టు కట్టుకుని, కాళ్ళకు చెప్పులు వేసుకుని, మీ కర్రలు చేతబట్టుకుని త్వరత్వరగా తినాలి. ఎందుకంటే అది యెహోవాకు పస్కా బలి.
సాయంకాల ప్రార్థన: పఠనం (నాల్గవ పఠనం)
1యెహోవా వాక్కు అమిత్తయి కొడుకు యోనాకు ప్రత్యక్షమై ఇలా తెలియజేశాడు. 2“నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.” 3కానీ యోనా యెహోవా సన్నిధినుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి వెళ్ళాలనుకున్నాడు. యొప్పేకు వెళ్లి తర్షీషుకు వెళ్ళే ఒక ఓడ చూశాడు. ప్రయాణానికి డబ్బులిచ్చి, యెహోవా సన్నిధినుంచి దూరంగా తర్షీషు వెళ్లి పోవడానికి ఆ ఓడ ఎక్కాడు. 4అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి వీచేలా చేశాడు. అది సముద్రంలో గొప్ప తుఫానుగా మారింది. ఓడ బద్దలైపోయేలా ఉంది. 5అప్పుడు ఆ ఓడ నావికులు చాలా భయపడ్డారు. ప్రతి ఒక్కడూ తన దేవునికి మొర్రపెట్టాడు. ఓడ తేలిక చేయడానికి అందులో ఉన్న సరకులను సముద్రంలో పారేశారు. అయితే యోనా ఓడ లోపలి భాగానికి వెళ్లి పడుకుని గాఢ నిద్రపోతున్నాడు. 6అప్పుడు ఓడ నాయకుడు అతని దగ్గరికి వచ్చి “నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు! ఒకవేళ నీ దేవుడు మనలను గమనించి మనం నాశనం కాకుండా చూస్తాడేమో” అన్నాడు. 7అంతలో నావికులు “ఎవర్ని బట్టి ఇంత కీడు మనకు వచ్చిందో తెలుసుకోడానికి మనం చీట్లు వేద్దాం రండి” అని ఒకరితో ఒకరు చెప్పుకుని, చీట్లు వేశారు. చీటీ యోనా పేరున వచ్చింది. 8కాబట్టి వాళ్ళు “ఎవరి కారణంగా ఈ కీడు మనకు వచ్చిందో మాకు చెప్పు. నీ ఉద్యోగం ఏంటి? నువ్వెక్కడనుంచి వచ్చావు? నీది ఏ దేశం? ఏ జనం నుంచి వచ్చావు?” అని యోనాని అడిగారు. 9అతడు వాళ్ళతో ఇలా అన్నాడు. “నేను హెబ్రీయుణ్ణి. సముద్రానికీ భూమికీ సృష్టికర్త, ఆకాశంలో ఉన్న దేవుడు అయిన యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాణ్ణి.” 10వాళ్ళు మరింత భయపడి అతనితో “నువ్వు చేసిన పని ఏమిటి?” అన్నారు. ఎందుకంటే తాను యెహోవా సన్నిధినుంచి పారిపోతున్నట్టు అతడు వాళ్లకు చెప్పాడు. 11అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది. 12యోనా “నా కారణంగానే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిందని నాకు తెలుసు. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మళిస్తుంది” అని వాళ్లకు జవాబిచ్చాడు. 13అయినా వాళ్ళు ఓడను సముద్రం ఒడ్డుకు చేర్చడానికి తెడ్లు చాలా బలంగా వేశారు. సముద్రం ఇంకా చెలరేగుతూ ఉండడం వలన అలా చెయ్య లేకపోయారు. 14కాబట్టి వాళ్ళు యెహోవాకు ఇలా మొర్రపెట్టారు. “ఈ మనిషిని బట్టి మమ్మల్ని నాశనం చెయ్యవద్దు. అతని చావుకు మా మీద దోషం మోప వద్దు. ఎందుకంటే యెహోవా, నువ్వే నీ ఇష్టప్రకారం ఇలా జరిగించావు.” 15ఇలా అని వాళ్ళు యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. పడేయగానే సముద్రం పొంగకుండా ఆగిపోయింది. 16అప్పుడు వాళ్ళు యెహోవాకు ఎంతో భయపడి, ఆయనకు బలులు అర్పించి మొక్కుబళ్లు చేశారు. 17ఒక పెద్ద చేప యోనాను మింగడానికి యెహోవా నియమించాడు. యోనా మూడు రోజులు, మూడు రాత్రులు ఆ చేప కడుపులో ఉన్నాడు. 2:1ఆ చేప కడుపులోనుంచి యోనా యెహోవాకు ఇలా ప్రార్థించాడు, 2“నా ఆపదలో నేను యెహోవాకు మొర్రపెట్టాను. ఆయన నాకు జవాబిచ్చాడు. మృత్యులోకం నుంచి నేను కేకలు వేస్తే నువ్వు నా స్వరం విన్నావు. 3నువ్వు నన్ను అగాధంలో, సముద్రగర్భంలో పడవేశావు. ప్రవాహాలు నన్ను చుట్టుకున్నాయి. నీ అలలూ తరంగాలూ నా మీదుగా వెళ్తున్నాయి. 4నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా, నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను. 5నీళ్ళు నన్ను చుట్టుకోవడంతో నేను కొనప్రాణంతో ఉన్నాను. సముద్రాగాధం నన్ను ఆవరించి ఉంది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుంది. 6నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు నన్ను మూసివేశాయి. పర్వతాల పునాదుల్లోకి నేను దిగిపోయాను. నా దేవా, యెహోవా, నువ్వు నా జీవాన్ని అగాధంలో నుంచి పైకి రప్పించావు. 7నా ప్రాణం నాలో కృశిస్తూ ఉంటే నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. నీ పరిశుద్ధాలయంలోకి నీదగ్గరికి నా ప్రార్థన చేరింది. 8వ్యర్థమైన విగ్రహ దేవుళ్ళ మీద లక్ష్యం ఉంచేవాళ్ళు తమ కొరకైన నీ విశ్వాస్యతను నిరాకరిస్తున్నారు. 9నా మట్టుకు నేను కృతజ్ఞతాస్తుతులతో నీకు బలి సమర్పిస్తాను. నేను మొక్కుకున్న దాన్ని తప్పక నెరవేరుస్తాను. యెహోవా దగ్గరే రక్షణ దొరుకుతుంది.” 10అప్పుడు యెహోవా చేపకు ఆజ్ఞాపించగానే అది యోనాను పొడి నేల మీద కక్కి వేసింది. 3:1యెహోవా వాక్కు రెండో సారి యోనాకు ప్రత్యక్షమై చెప్పినదేమిటంటే 2“నువ్వు లేచి, నీనెవె మహాపట్టణానికి వెళ్లి నేను నీకు ఆజ్ఞాపించిన సందేశాన్ని దానికి చాటించు.” 3కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవె పట్టణానికి నడచుకుంటూ వెళ్ళాడు. నీనెవె నగరం చాలా పెద్దది. అది మూడు రోజుల ప్రయాణమంత పెద్దది. 4యోనా ఆ పట్టణంలో ఒక రోజు ప్రయాణమంత దూరం వెళ్లి, యింకా 40 రోజుల్లో నీనెవె పట్టణం నాశనమవుతుందని ప్రకటన చేశాడు. 5నీనెవె పట్టణం వాళ్ళు దేవునిలో విశ్వాసం ఉంచి ఉపవాసం ప్రకటించారు. గొప్పవాళ్ళూ, సామాన్యులూ అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. 6ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు. 7అతడు ఇలా ప్రకటన చేయించాడు “రాజూ ఆయన మంత్రులూ ఆజ్ఞాపించేదేమంటే, మనుషులు ఏమీ తినకూడదు. పశువులు మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు.” 8“మనుషులు, పశువులు గోనెపట్ట కట్టుకుని దేవునికి బిగ్గరగా మొర్రపెట్టాలి. అందరూ తమ దుర్మార్గాన్ని విడిచిపెట్టి తాము చేస్తున్న దౌర్జన్యం మానాలి. 9ఒకవేళ దేవుడు తన మనస్సు మార్చుకుని తన కోపాగ్ని చల్లార్చుకుని మనం నాశనం కాకుండా చేస్తాడేమో ఎవరికి తెలుసు?” 10నీనెవె వాళ్ళు తమ చెడు ప్రవర్తన వదిలిపెట్టడం దేవుడు చూసి తన మనస్సు మార్చుకుని వాళ్లకు వేస్తానన్న శిక్ష వెయ్యలేదు. 4:1కాని, ఇది యోనా దృష్టిలో చాలా తప్పుగా అనిపించింది. అతడు కోపంతో మండిపడ్డాడు. 2కాబట్టి యోనా యెహోవాను ఇలా ప్రార్ధించాడు. “నేను నా దేశంలో ఉన్నప్పుడు ఇలానే జరుగుతుందని చెప్పాను గదా! అందుకే నేనే మొదట తర్షీషుకు పారిపోడానికి ప్రయత్నించాను. ఎందుకంటే, నువ్వు కృపగల దేవుడివనీ, జాలిగల వాడివనీ, త్వరగా కోపగించే వాడివి కాదనీ, పూర్తిగా నమ్మదగిన వాడివనీ, నశింపజేయడానికి వెనుకంజ వేసేవాడివనీ నాకు తెలుసు. 3కాబట్టి, యెహోవా, ఇప్పుడు నా ప్రాణం తీసెయ్యమని బతిమాలుతున్నాను. ఎందుకంటే నేను బతకడం కంటే చావే మేలు.” 4అందుకు యెహోవా “నువ్వు అంతగా కోపించడం న్యాయమా?” అని అడిగాడు. 5అప్పుడు యోనా ఆ పట్టణం నుంచి వెళ్లి దానికి తూర్పుగా ఒకచోట కూర్చున్నాడు. అక్కడ ఒక పందిరి వేసుకుని, పట్టణానికి ఏమి సంభవిస్తుందో చూద్దామని, ఆ పందిరి నీడలో కూర్చున్నాడు. 6యెహోవా దేవుడు ఒక మొక్కను సిద్ధం చేసి, అతనికి కలిగిన బాధ పోగొట్టడానికి, అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చేలా చేశాడు. ఆ మొక్కను బట్టి యోనా చాలా సంతోషించాడు. 7మరుసటి ఉదయం దేవుడు ఒక పురుగును సిద్ధంచేసి ఉంచాడు. అది ఆ మొక్కను పాడు చేయగా అది వాడిపోయింది. 8ఆ తరువాత రోజు సూర్యోదయం అయినప్పుడు, దేవుడు తూర్పునుండి వీచే వడగాలిని సిద్ధం చేశాడు. యోనాకు ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. “బతకడం కంటే చావడమే నాకు మేలు” అని తనలో తాను అనుకున్నాడు. 9అప్పుడు దేవుడు యోనాతో “ఈ మొక్క గురించి నువ్వు అంతగా కోపపడడం భావ్యమేనా?” అన్నాడు. యోనా “చచ్చి పోయేటంతగా కోపపడడం భావ్యమే” అన్నాడు. 10అందుకు యెహోవా “నువ్వేమాత్రం కష్టపడకుండా, పెంచకుండా దానికదే పెరిగిన మొక్క మీద నువ్వు జాలిపడుతున్నావే. అది ఒక రాత్రిలోనే పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయింది. 11అయితే నీనెవె మహా పట్టణంలో కుడి ఎడమలు తెలియని లక్షా ఇరవై వేల కంటే ఎక్కువమంది ప్రజలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. దాని గురించి నేను జాలిపడవద్దా?” అని అతనితో అన్నాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం (ఐదవ పఠనం)
10ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగో రోజు సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండగ ఆచరించారు. 11పస్కా పండగ అయిన ఉదయమే వారు ఆ దేశపు పంటను తిన్నారు. ఆ రోజే వారు పొంగని రొట్టెలనూ, వేయించిన ధాన్యాలనూ తిన్నారు. 12ఆ రోజు వారు ఆ దేశపు పంటను తిన్న తరువాత మన్నా ఆగిపోయింది, అప్పటినుండి ఇశ్రాయేలీయులకు ఇక మన్నా దొరకలేదు. ఆ సంవత్సరం వారు కనాను దేశపు పంటను తిన్నారు. 13యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు. 14అతడు “కాదు, యెహోవా సైన్యానికి సేనాధిపతిగా నేను వచ్చాను” అన్నాడు. యెహోషువ నేలకు సాగిలపడి నమస్కారం చేసి “నా యేలినవాడు తన దాసునికి ఏమి సెలవిస్తాడు” అని అడిగాడు. 15అందుకు యెహోవా సేనాధిపతి “నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు తీసేయి” అని చెప్పగానే యెహోషువ అలా చేశాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం (ఆరవ పఠనం)
20వాళ్ళు సుక్కోతు నుండి ప్రయాణం చేసి ఎడారి దగ్గర ఉన్న ఏతాములో బస చేశారు. 21పగలు, రాత్రి ప్రయాణాల్లో యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. పగటి వేళ స్తంభాకార మేఘంలో రాత్రి వేళ వెలుగు ఇవ్వడానికి స్తంభాకార మంటల్లో ఉండి ఆయన వారికి ముందుగా నడిచాడు. 22దేవుడు ప్రజల కోసం ఉంచిన పగటి మేఘస్తంభాన్ని, రాత్రి వేళ వెలుగిచ్చే అగ్నిస్తంభాన్ని తొలగించకుండా ప్రయాణం కొనసాగేలా చేశాడు. 14:1యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, 2“ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి పీహహీరోతు ఎదుట, అంటే మిగ్దోలుకూ, సముద్రానికీ మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గర విడిది చేయమని వారితో చెప్పు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు 3ఫరో, ‘ఆ ప్రజలు ఈ దేశంలో ఎడారి మధ్యలో చిక్కుబడిపోయారు’ అనుకుంటాడు. 4నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా, మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” 5ఇశ్రాయేలు ప్రజలు దేశం విడిచి వెళ్ళిపోయిన విషయం ఐగుప్తు రాజుకు చెప్పినప్పుడు ఫరో హృదయం, అతని సేవకుల హృదయాలు ఇశ్రాయేలు ప్రజపై కక్షతో నిండి పోయాయి. “మనం చేసిందేమిటి? మన కోసం పనులు చేయకుండా వాళ్ళను ఎందుకు వెళ్ళనిచ్చాం?” అని చెప్పుకున్నారు. 6అప్పుడు ఫరో తన రథాలు సిద్ధం చేయించి తన సైన్యాన్ని వెంట బెట్టుకుని బయలుదేరాడు. 7అతడు తన ఐగుప్తులోని శ్రేష్ఠమైన 600 రథాలను, ప్రతి రథంలోనూ సైన్యాధిపతులను తీసుకు పోయాడు. 8యెహోవా ఐగుప్తు రాజు ఫరో హృదయాన్ని కఠినం చేసినందువల్ల అతడు ఇశ్రాయేలు ప్రజలను తరిమాడు. ఇశ్రాయేలు ప్రజలు తమ బలగం అంతటితో తరలి వెళ్తున్నారు. 9బయల్సెఫోను ఎదురుగా ఉన్న పీహహీరోతుకు దగ్గరలో సముద్రం దగ్గర వాళ్ళు విడిది చేసి ఉన్న సమయంలో ఫరో రథాలు, గుర్రాలు, గుర్రాల రౌతులు, ఐగుప్తు సైన్యం ఇశ్రాయేలు ప్రజలను తరుముతూ వాళ్ళను సమీపించారు. 10ఫరో, అతని సైన్యం తమను తరుముతూ రావడం చూసిన ఇశ్రాయేలు ప్రజలు హడలిపోయారు. కేకలు వేస్తూ యెహోవాకు మొరపెట్టారు. 11అప్పుడు వాళ్ళు మోషేతో “ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఈ ఎడారిలో చనిపోవడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటికి తీసుకువచ్చి ఈ విధంగా చేస్తావా? 12మేము ఐగుప్తీయులకు బానిసలుగానే ఉంటాం, మా జోలికి రావద్దు అని ఐగుప్తులో ఉన్నప్పుడే చెప్పింది ఇందుకే గదా. మేము ఈ ఎడారిలో చనిపోవడం కంటే ఐగుప్తులో బానిసలుగా బతకడమే మంచిది” అని నిష్టూరంగా మాట్లాడారు. 13అందుకు మోషే “భయపడకండి, ఈ రోజు యెహోవా మీకు కలిగించే రక్షణను అలా నిలబడి చూడండి. మీరు ఈ రోజు చూసిన ఐగుప్తీయులను ఇకపై ఎన్నడూ చూడరు. 14మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు. 15యెహోవా మోషేతో “నువ్వెందుకు నాకు మొర పెడుతున్నావు? ‘ముందుకు కొనసాగండి’ అని ప్రజలతో చెప్పు. 16నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు. 17చూడు, నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినం చేస్తాను. వాళ్ళు మీ వెంటబడి తరుముతారు. నేను ఫరో ద్వారా, అతని సైన్యం అంతటి ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత తెచ్చుకొంటాను. 18నేను ఫరో ద్వారా, సైన్యం ద్వారా, అతని రథాల, గుర్రపు రౌతుల ద్వారా ఘనత పొందడం వల్ల నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.” 19అప్పటి వరకూ ఇశ్రాయేలు ప్రజల ముందు నడిచిన దేవదూత వాళ్ళ వెనక్కి వెళ్ళాడు. మేఘస్తంభం కూడా వాళ్ళ వెనక్కి వచ్చి నిలిచింది. 20అది ఐగుప్తు సేనలకూ ఇశ్రాయేలు ప్రజల సమూహనికీ మధ్య నిలిచింది. ఆ మేఘం ఆ రాత్రంతా ఐగుప్తు సైన్యానికి చీకటి కమ్మేలా, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు ఉండేలా చేసింది. 21మోషే సముద్రంపై తన చెయ్యి చాపాడు. యెహోవా ఆ రాత్రి అంతా బలమైన తూర్పు గాలి వీచేలా చేసి, సముద్రం పాయలుగా చీలి మధ్యలో ఆరిపోయి పొడి నేల ఏర్పడేలా చేశాడు. 22సముద్రం నీళ్లు రెండుగా విడిపోగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచి వెళ్ళారు. ఆ నీళ్లు వారి కుడి పక్కన, ఎడమ పక్కన గోడల్లాగా నిలబడ్డాయి. 23ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు. 24తెల్లవారుతుండగా యెహోవా ఆ అగ్ని స్తంభం నుండీ మేఘ స్తంభం నుండీ ఐగుప్తు సైన్యాన్ని చూసి వాళ్ళను కలవరానికి గురి చేశాడు. 25ఆయన వాళ్ళ రథచక్రాలు ఊడిపోయేలా చేసినప్పుడు వాళ్ళు అతి కష్టంగా రథాలు తోలవలసి వచ్చింది. అప్పుడు ఐగుప్తువాళ్ళు “రండి, మనం ఇశ్రాయేలు ప్రజల ఎదుట నుండి పారిపోదాం. యెహోవా వారికి తోడుగా ఉండి వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు. 26యెహోవా మోషేతో “ఐగుప్తు సైన్యం మీదికి, వాళ్ళ రథాల, రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చేలా సముద్రం పైకి నీ చెయ్యి చాపు” అని చెప్పాడు. 27మోషే సముద్రం పైకి తన చెయ్యి చాపాడు. సాయంత్రం అయ్యేటప్పటికి సముద్రం వడిగా మళ్ళీ కలిసిపోయింది. అది చూసిన ఐగుప్తు సైన్యం వెనక్కి పారిపోవాలని చూశారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నాశనమయ్యేలా చేశాడు. 28నీళ్లు వేగంగా ప్రవహించి ఆ రథాలను, రౌతులను, వారి వెనుక సముద్రంలోకి వచ్చిన ఫరో సైన్యం మొత్తాన్నీ ముంచివేశాయి. వాళ్ళలో ఒక్కడు కూడా మిగలకుండా అంతా తుడిచిపెట్టుకు పోయారు. 29అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచినప్పుడు ఆ నీళ్లు వారికి కుడి, ఎడమ పక్కల గోడల్లాగా నిలబడ్డాయి. 30ఆ రోజున యెహోవా ఐగుప్తు సైన్యం నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. చనిపోయి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఐగుప్తు వాళ్ళను ఇశ్రాయేలు ప్రజలు చూశారు. 31తమ కోసం యెహోవా ఐగుప్తు వాళ్ల పట్ల చేసిన ఈ గొప్ప కార్యం చూసిన ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా అంటే భయభక్తులు కలిగాయి. ఆ ప్రజలు యెహోవా మీదా, ఆయన సేవకుడు మోషే మీదా నమ్మకముంచారు. 15:1అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు. 2యెహోవాయే నా బలం, నా గానం, నా రక్షణకర్త. ఆయన నా దేవుడు, ఆయనను స్తుతిస్తాను. ఆయన నా పూర్వీకుల దేవుడు, ఆయనను ఘనపరుస్తాను. 3యెహోవా యుద్ధశూరుడు, ఆయన పేరు యెహోవా. 4ఆయన ఫరో రథాలను, సైన్యాన్ని సముద్రంలో ముంచివేశాడు. సైన్యాధిపతుల్లో ప్రముఖులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. 5రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు. 6యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది. 7నీకు విరోధంగా నీపై లేచేవాళ్లను నీ మహిమా ప్రకాశంతో అణచి వేస్తావు. నీ కోపాగ్ని రగిలినప్పుడు వాళ్ళు చెత్తలాగా కాలిపోతారు. 8నీ ముక్కుపుటాల నుండి వెలువడిన పెనుగాలికి నీళ్లు కుప్పగా నిలబడిపోయాయి. ప్రవాహాలు గోడలాగా నిలబడి పోయాయి. సముద్రం లోతుల్లో నీళ్ళు గడ్డకట్టిపోయాయి. 9‘వాళ్ళను తరిమి నా కత్తి దూసి నాశనం చేసి దోచుకున్న సొమ్ముతో నా కోరిక తీర్చుకుంటాను’ అని శత్రువు అనుకున్నాడు. 10నువ్వు నీ గాలి విసిరి లోతైన నీళ్ళలో సీసం లాగా వాళ్ళను మునిగి పోయేలా చేశావు. 11పూజింపదగ్గ వాళ్ళలో యెహోవాలాంటివాడు ఎవడు? పవిత్రత వైభవంలో నీ వంటి వాడెవడు? స్తుతికీర్తనలతో ఘనపరచదగిన వాడు, అద్భుతాలు చేసే నీవంటి వాడెవడు? 12నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది. 13నీ కనికరం వల్ల ఈ ప్రజలను విడిపించి నీ శక్తి ద్వారా నీ సన్నిధికి తీసుకువచ్చావు. 14ఈ సంగతి ఇతర ప్రజలకు తెలుస్తుంది. వాళ్ళు భయపడతారు. అది ఫిలిష్తీయులకు భయం కలిగిస్తుంది. 15ఎదోము అధిపతులు భయపడతారు. మోయాబులో బలిష్ఠులు వణికిపోతారు. కనానులో నివసించే వారు భయంతో నీరసించి పోతారు, 16భయ భీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు. 17నువ్వు నీ ప్రజలకు స్థిర నివాసంగా ఏర్పాటు చేసిన వారసత్వ పర్వతానికి తెస్తావు. అక్కడ వారిని నాటుతావు. యెహోవా, నీ చేతులు నిర్మించిన మందిరానికి వారిని తెస్తావు. 18యెహోవా, శాశ్వతంగా రాజ్యం చేస్తాడు.” 19ఫరో గుర్రాలు, రథాలు, రౌతులు సముద్రంలోకి అడుగుపెట్టగానే యెహోవా వాళ్ళ మీదికి సముద్రపు నీళ్ళు పొంగిపొరలేలా చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచారు.
సాయంకాల ప్రార్థన: పఠనం (ఏడవ పఠనం)
8కాబట్టి యెహోవా సెలవిచ్చేవాక్కు ఏమంటే, “నా కోసం ఎదురు చూడండి. నేను లేచి ఎర పట్టుకునే దినం కోసం కనిపెట్టి ఉండండి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారిపై కుమ్మరించడానికి, అన్యజనులను పోగు చేయడానికి, గుంపులు గుంపులుగా రాజ్యాలను సమకూర్చడానికి, నేను నిశ్చయించుకున్నాను. నా రోషాగ్ని చేత భూమంతా కాలిపోతుంది. 9అప్పుడు మనుషులంతా యెహోవా నామాన్ని బట్టి ఏకమనస్కులై ఆయన్ను సేవించేలా నేను వారికి పవిత్రమైన పెదవులనిస్తాను. 10చెదరి పోయి నాకు ప్రార్థన చేసే నా ప్రజలను కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యంగా తీసుకు వస్తారు. 11ఆ దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను. కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు. 12దుఃఖితులైన దీనులను యెహోవా నామాన్ని ఆశ్రయించే జనశేషంగా నీమధ్య ఉండనిస్తాను. 13ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారు పాపం చేయరు. అబద్ధమాడరు. కపటాలు పలికే నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండ విశ్రాంతిగా అన్నపానాలు పుచ్చుకుంటారు.” 14సీయోను నివాసులారా, ఉత్సాహ ధ్వని చేయండి. ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయండి. యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయండి. 15మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేశాడు. మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయం సంభవించదు.
సాయంకాల ప్రార్థన: పఠనం (ఎనిమిదవ పఠనం)
8యెహోవా అతనితో ఇలా చెప్పాడు. “నీవు సీదోను ప్రాంతంలోని సారెపతు అనే ఊరికి వెళ్లి అక్కడ ఉండు. 9నిన్ను పోషించడానికి అక్కడ ఉన్న ఒక విధవరాలికి నేను ఆజ్ఞాపించాను.” 10కాబట్టి అతడు సారెపతు పట్టణ ద్వారం దగ్గరికి వెళ్ళి ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకోవడం చూసి ఆమెను పిలిచాడు. “తాగడానికి గిన్నెలో కొంచెం మంచినీళ్ళు తెస్తావా?” అని అడిగాడు. 11ఆమె నీళ్లు తేబోతుంటే అతడామెను మళ్ళీ పిలిచి “నీ చేత్తో నాకొక రొట్టె ముక్క తీసుకు రా” అన్నాడు. 12అందుకామె “నీ దేవుడు యెహోవా జీవం తోడు. గిన్నెలో కొద్దిగా పిండి, సీసాలో కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉన్నాయి. ఒక్క రొట్టె కూడా లేదు. చావబోయే ముందు నేను ఇంటికి వెళ్లి నాకూ నా కొడుక్కీ ఒక రొట్టె తయారు చేసుకుని తిని ఆపైన ఆకలితో చచ్చి పోవాలని, కొన్ని కట్టెపుల్లలు ఏరుకోడానికి వచ్చాను” అంది. 13అప్పుడు ఏలీయా ఆమెతో అన్నాడు. “భయపడవద్దు, వెళ్లి నీవు చెప్పినట్టే చెయ్యి. అయితే అందులో ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి, నా దగ్గరికి తీసుకురా. తరువాత నీకూ నీ కొడుక్కీ రొట్టెలు చేసుకో. 14భూమి మీద యెహోవా వాన కురిపించే వరకూ ఆ గిన్నెలో ఉన్న పిండి తగ్గదు, సీసాలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా చెప్పాడు.” 15అప్పుడు ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేసింది. అతడూ, ఆమె, ఆమె కొడుకు చాలా రోజులు భోజనం చేస్తూ వచ్చారు. 16యెహోవా ఏలీయా ద్వారా చెప్పినట్టు, గిన్నెలోని పిండి తక్కువ కాలేదు, సీసాలోని నూనె అయిపోలేదు. 17కొంతకాలం తరువాత ఆ వితంతువు కొడుక్కి జబ్బు చేసింది. జబ్బు ముదిరి, అతడు చనిపోయాడు. 18ఆమె ఏలీయాతో “దేవుని మనిషీ, మీరు నా దగ్గరికి రావడం దేనికి? నా పాపాన్ని నాకు గుర్తు చేసి నా కొడుకుని చంపడానికా?” అంది. 19అతడు “నీ కొడుకును ఇలా తీసుకురా” అని చెప్పాడు. ఆమె చేతుల్లో నుంచి వాణ్ణి తీసుకు తానున్న పై అంతస్తు గదిలోకి వెళ్లి తన మంచం మీద వాణ్ణి పడుకోబెట్టాడు. 20“యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కొడుకుని చనిపోయేలా చేసి నీవు కూడా ఆమె మీదికి కీడు తెచ్చావా?” అని యెహోవాకు మొర్రపెట్టాడు. 21ఆ బాలుడి మీద మూడుసార్లు బోర్లా పండుకుని “యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ బాలుడికి మళ్ళీ ప్రాణం ఇవ్వు” అని యెహోవాకు ప్రార్థించాడు. 22యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. వాడు బతికాడు. 23ఏలీయా ఆ అబ్బాయిని ఎత్తుకుని గదిలోనుంచి దిగి ఇంట్లోకి తీసుకు వచ్చి వాడి తల్లికి అప్పగించి “చూడు, నీ కొడుకు బతికే ఉన్నాడు” అని చెప్పాడు. 24ఆ స్త్రీ ఏలీయాతో “నీవు దైవసేవకుడివని, నీవు పలుకుతున్న యెహోవా మాట వాస్తవమని దీని వల్ల నాకు తెలిసింది” అంది.
సాయంకాల ప్రార్థన: పఠనం (9వ పఠనం)
10పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు. యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది. 11భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు. 62:1సీయోను నీతి, సూర్యకాంతిలా కనబడే వరకూ దాని రక్షణ, దీపాలుగా వెలిగే వరకూ సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము కోసం నేను ఊరుకోను. 2రాజ్యాలు నీ నీతి చూస్తారు. రాజులంతా నీ మహిమను చూస్తారు. యెహోవా కోరే కొత్త పేరు నీకు పెడతారు. 3నువ్వు యెహోవా చేతిలో అందమైన కిరీటంగా నీ దేవుని చేతిలో రాజ్యకిరీటంగా ఉంటావు. 4నిన్ను ఇంకెప్పుడూ “విడువబడిన దానివి” అనీ, నీ దేశాన్ని “పాడైపోయినది” అనీ ఇక అనరు. దాని బదులు నిన్ను “ప్రియమైనది” అనీ, నీ దేశాన్ని “కళ్యాణి” అనీ అంటారు. ఎందుకంటే యెహోవా నిన్నుబట్టి ఆనందిస్తున్నాడు. నీ దేశానికి వివాహం జరుగుతుంది. 5యువకుడు ఒక యువతిని పెళ్లిచేసుకున్నట్టు నీ కొడుకులు నిన్ను పెళ్లి చేసుకుంటారు. పెళ్ళికొడుకు తన పెళ్ళికూతురుతో సంతోషించేలా నీ దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు.
సాయంకాల ప్రార్థన: పఠనం (10వ పఠనం)
1ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఆయన “అబ్రాహామూ” అని పిలిచినప్పుడు అతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 2అప్పుడు ఆయన అబ్రాహాముతో “నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద అతణ్ణి దహనబలిగా అర్పించు” అన్నాడు. 3కనుక అబ్రాహాము తెల్లవారగానే లేచి తన గాడిదకు జీను కట్టి సిద్ధం చేసి, దహనబలి కోసం కట్టెలు కొట్టి, తన కొడుకు ఇస్సాకుతో పాటు ఇద్దరు పనివాళ్ళనూ వెంటబెట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. 4మూడవ రోజు అబ్రాహాము తలెత్తి దూరంగా ఉన్న ఆ స్థలాన్ని చూశాడు. 5తన పనివాళ్ళతో “మీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనూ అబ్బాయీ అక్కడికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించి తిరిగి మీ దగ్గరికి వస్తాం” అని చెప్పాడు. 6అప్పుడు అబ్రాహాము దహనబలి కోసం తెచ్చిన కట్టెలు తీసుకుని తన కొడుకు ఇస్సాకు తలపై పెట్టాడు. తన చేతిలో నిప్పు, కత్తి పట్టుకున్నాడు. ఇక వాళ్ళిద్దరూ కలసి కొండపైకి ఎక్కుతున్నారు. 7ఇస్సాకు తన తండ్రి అబ్రాహామును “నాన్నా” అని పిలిచాడు. దానికి అబ్రాహాము “ఏం నాయనా” అన్నాడు. అప్పుడతడు “చూడండి, మన దగ్గర నిప్పూ కట్టెలూ ఉన్నాయి గానీ దహనబలికి గొర్రె పిల్ల ఏది?” అని అడిగాడు. 8దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు. 9దేవుడు అబ్రాహాముకు చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రాహాము ఒక బలిపీఠం నిర్మించి దానిపై కట్టెలు పేర్చాడు. ఇస్సాకును తాళ్ళతో బంధించాడు. ఆ బలిపీఠంపై పేర్చిన కట్టెలపై అతణ్ణి పడుకోబెట్టాడు. 10తరువాత అబ్రాహాము తన కుమారుణ్ణి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడు. 11అప్పుడు ఆకాశం నుండి యెహోవా దూత “అబ్రాహామూ, అబ్రాహామూ” అని పిలిచాడు. దానికతడు “చిత్తం ప్రభూ” అన్నాడు. 12అప్పుడు ఆయన “ఆ బాలునిపై చెయ్యి వేయకు. అతనికి ఏ హానీ తలపెట్టవద్దు. నీకున్న ఒక్కగానొక్క కొడుకుని నాకివ్వడానికి వెనుకంజ వేయలేదు. అది చూశాక నీకు దేవునిపట్ల భయభక్తులు ఉన్నాయని నాకు తెలిసింది” అన్నాడు. 13అప్పుడు అబ్రాహాము తలెత్తి చూశాడు. ఆశ్చర్యం కలిగించేలా అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న ఒక పొట్టేలు అతనికి కనిపించింది. అబ్రాహాము వెళ్ళి ఆ పోట్టేలుని పట్టుకుని తన కొడుక్కి బదులుగా దాన్ని దహనబలిగా అర్పించాడు. 14అబ్రాహాము ఆ చోటును “యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది. 15యెహోవా దూత రెండవసారి ఆకాశం నుండి అబ్రాహామును పిలిచి ఇలా అన్నాడు 16“నువ్వు నీ ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెనుకంజ వేయకుండా ఇదంతా చేశావు. అందుకే ప్రమాణం చేస్తున్నాను. 17నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు. 18నువ్వు నా మాట విన్నావు కనుక నీ సంతానం వల్ల భూమి పైన ఉన్న జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.”
సాయంకాల ప్రార్థన: పఠనం (11వ పఠనం)
1ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నాడు. అణగారిన వారికి శుభవార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు. గుండె పగిలిన వారిని బాగుచేయడానికి బందీలుగా ఉన్నవారికి విడుదల, ఖైదీలకు విముక్తి ప్రకటించడానికి, 2యెహోవా దయావత్సరాన్నీ మన దేవుని ప్రతిదండన దినాన్నీ ప్రకటించడానికి, దుఃఖించే వారందరినీ ఓదార్చడానికి ఆయన నన్ను పంపాడు. 3సీయోనులో దుఃఖించేవారిని చక్కపెట్టడానికి, బూడిదకు బదులు అందమైన తలపాగా, దుఃఖానికి బదులు ఆనందతైలం, కుంగిన మనసు బదులు స్తుతి వస్త్రం వారికివ్వడానికి ఆయన నన్ను పంపాడు. నీతి విషయంలో మస్తకి వృక్షాలనీ యెహోవా ఘనతకోసం నాటిన చెట్లు అనీ వారిని పిలుస్తారు. 4పురాతన శిథిలాలను వాళ్ళు కడతారు. గతంలో పాడైపోయిన స్థలాలను తిరిగి కడతారు. తరతరాలనుంచి శిథిలమైపోయిన పట్టణాలను మళ్ళీ నిర్మిస్తారు. 5విదేశీయులు నిలబడి మీ మందలను మేపుతారు. విదేశీయుల పిల్లలు మీ పొలాల్లో ద్రాక్షతోటల్లో పనిచేస్తారు. 6మిమ్మల్ని యెహోవా యాజకులని పిలుస్తారు. మా దేవుని సేవకులని మిమ్మల్ని పిలుస్తారు. రాజ్యాల ఐశ్వర్యాన్ని మీరు అనుభవిస్తారు. వాటి సమృద్ధిలో మీరు అతిశయిస్తారు. 7మీ అవమానానికి బదులు మీకు రెట్టింపు దీవెనలు వస్తాయి. నిందకు బదులు తమకు లభించిన భాగాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తారు. తమ దేశంలో రెట్టింపు భాగం వారి స్వాధీనం అవుతుంది. నిత్యానందం వారిది అవుతుంది. 8ఎందుకంటే న్యాయం చేయడం యెహోవా అనే నాకు ఇష్టం. దోచుకోవడం, అన్యాయంగా ఒకడి సొత్తు తీసుకోవడం అంటే నాకు అసహ్యం. నమ్మకంగా నేను వారికి తిరిగి ఇచ్చేస్తాను. వారితో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను. 9రాజ్యాల్లో వారి సంతతివారు, జాతుల్లో వారి సంతానం పేరు పొందుతారు. వారిని చూసే వారంతా వారు యెహోవా దీవించినవారని ఒప్పుకుంటారు.
సాయంకాల ప్రార్థన: పఠనం (12వ పఠనం)
8ఒకసారి ఎలీషా షూనేము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ అతణ్ణి భోజనానికి రమ్మని ప్రాధేయపడిన ఒప్పించింది. కాబట్టి ఎలీషా ఆ దారి గుండా వెళ్ళినప్పుడల్లా ఆమె దగ్గర భోజనం చేస్తూ ఉండేవాడు. ఆమె ఆ పట్టణంలో చాలా ప్రముఖురాలు. 9ఆమె ఒకసారి తన భర్తతో ఇలా అంది. “ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఈ వ్యక్తి పవిత్రుడూ, దేవుని మనిషీ అని నాకు తెలుసు. 10కాబట్టి మనం మిద్దె మీద ఒక చిన్న గది కడదాం. అందులో ఒక మంచం, బల్ల, కుర్చీ, ఒక లాంతరూ ఏర్పాటు చేద్దాం. ఆయన మన దగ్గరికి వచ్చిన ప్రతిసారీ అందులో ఉంటాడు.” 11కాబట్టి తరువాత ఎలీషా ఆ గదిలో ఉండి విశ్రాంతి తీసుకునే రోజు వచ్చింది. 12అప్పుడు ఎలీషా తన సేవకుడు గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలువు” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె వచ్చి అతని ముందు నిలబడింది. 13అప్పుడు ఎలీషా గేహజీకి ఇలా ఆదేశించాడు. “నీవు ఆమెతో చెప్పు. నీవు మా కోసం ఇంత బాధ తీసుకున్నావు. నీ కోసం ఏం చేయాలి? నీ గురించి రాజుతో గానీ సైన్యాధిపతితో గానీ మాట్లాడమంటావా?” దానికి జవాబుగా ఆమె “నేను నా చుట్టాల మధ్యనే నివసిస్తున్నాను” అంది. 14తరువాత ఎలీషా “ఈమెకు మనం ఏ ఉపకారం చేయగలం?” అని గేహజీని అడిగాడు. గేహజీ “ఆమెకి కొడుకు లేడు. భర్తేమో ముసలివాడు” అన్నాడు. 15కాబట్టి ఎలీషా “ఆమెను పిలువు” అన్నాడు. అతడు వెళ్లి ఆమెను తీసుకు వచ్చాడు. ఆమె వచ్చి గుమ్మం దగ్గర నిలుచుంది. 16ఎలీషా ఆమెతో “వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ ఒడిలో కొడుకు ఉంటాడు” అన్నాడు. అప్పుడు ఆమె “నా ప్రభూ, వద్దు. దేవుని మనిషివైన నీవు నీ సేవకురాలినైన నాతో అబద్ధం చెప్పొద్దు” అంది. 17కానీ ఆ స్త్రీ గర్భం ధరించింది. ఆ తరువాత సంవత్సరం సరిగ్గా ఎలీషా చెప్పిన సమయానికి ఒక కొడుకుని కన్నది. 18ఆ పిల్లవాడు పెరిగిన తరువాత ఒక రోజు పొలంలో కోత కోస్తున్న వాళ్ళ దగ్గర ఉన్న తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వాడు తన తండ్రితో “నా తల! నా తల!” అన్నాడు. 19వాడి తండ్రి తన సేవకుడితో “పిల్లాణ్ణి ఎత్తుకుని వాళ్ళమ్మ దగ్గరికి తీసుకు వెళ్ళు” అన్నాడు. 20వాడు ఆ పిల్లవాణ్ణి తీసుకుని తల్లి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. వాడు మధ్యాహ్నం వరకూ తల్లి ఒడిలో పడుకుని తరువాత చనిపోయాడు. 21అప్పుడు ఆమె వాణ్ని దేవుని మనిషి కోసం వేయించిన మంచం పై పడుకోబెట్టి తలుపు వేసి బయటకు వెళ్ళింది. 22తన భర్తను పిలిచి “నేను దేవుని మనిషి దగ్గరికి త్వరగా వెళ్ళి రావాలి. ఒక పనివాణ్ణీ, ఒక గాడిదనీ పంపించు” అని చెప్పింది. 23దానికి ఆమె భర్త “ఆయన దగ్గరికి ఈ రోజు ఎందుకు వెళ్ళడం? ఈ రోజు అమావాస్యా కాదు, విశ్రాంతి దినమూ కాదు గదా” అన్నాడు. దానికామె “నేను వెళ్ళడం వల్ల అంతా మంచే జరుగుతుంది” అంది. 24ఆమె ఆ గాడిదకు జీను కట్టించి దానిపై కూర్చుని పనివాడితో “వేగంగా పోనీ, నేను చెబితే తప్ప నిదానంగా తోలకు” అంది. 25ఆ విధంగా ఆమె ప్రయాణం చేసి కర్మెలు పర్వతంపై ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చింది. ఆమె దూరంలో ఉండగానే దేవుని మనిషి ఆమెను చూశాడు. తన సేవకుడైన గేహజీని పిలిచి “చూడు, ఆ షూనేమీ స్త్రీ ఇక్కడికి వస్తుంది. 26నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళి ‘నువ్వూ, నీ భర్తా, నీ కొడుకూ క్షేమంగా ఉన్నారా?’ అని అడుగు” అని చెప్పి పంపించాడు. దానికామె “క్షేమంగానే ఉన్నాం” అని జవాబిచ్చింది. 27తరువాత ఆమె పర్వతం మీద ఉన్న దేవుని మనిషి దగ్గరికి వచ్చి అతని కాళ్ళు పట్టుకుంది. గేహజీ ఆమెను తోలివేయడానికి దగ్గరికి గా వచ్చాడు. అప్పుడు దేవుని మనిషి “ఆమె చాలా నిస్పృహలో ఉంది. యెహోవా ఈ సమస్యను నాకు దాచి ఉంచాడు. నీవు ఆమె జోలికి పోకు” అని ఆదేశించాడు. 28అప్పుడు ఆమె “ప్రభూ, కొడుకు కావాలని నేను నిన్ను అడిగానా? నాతో అసత్యం పలుక వద్దు అనలేదా?” అంది. 29అప్పుడు ఎలీషా గేహజీతో “నీవు ప్రయాణానికి సిద్ధపడు. నా కర్ర చేత్తో పట్టుకో. ఆమె ఇంటికి వెళ్ళు. దారిలో నీకెవరైనా ఎదురైతే వాళ్ళను పలకరించ వద్దు. ఎవరైనా నిన్ను పలకరిస్తే వాళ్ళకు జవాబివ్వవద్దు. అక్కడికి వెళ్ళి నా కర్ర పిల్లవాడి ముఖంపై పెట్టు” అని చెప్పాడు. 30కానీ ఆ పిల్లవాడి తల్లి “యెహోవా ప్రాణం మీదా, నీ ప్రాణం మీదా ఒట్టేసి చెప్తున్నా, నేను మాత్రం నిన్ను వదలను” అంది. కాబట్టి ఎలీషా లేచి ఆమెతో కూడా వెళ్ళాడు. 31వాళ్ళ కంటే ముందుగా చేరుకున్న గేహజీ ఆ పిల్లవాడి ముఖంపై కర్ర ఉంచాడు కానీ పిల్లవాడు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు. కాబట్టి గేహజీ వెనక్కు వచ్చి దారిలో ఎలీషాను కలుసుకున్నాడు. ఎలీషాతో “పిల్లవాడు కళ్ళు తెరవలేదు” అని చెప్పాడు. 32ఎలీషా ఆ ఇల్లు చేరుకుని చనిపోయిన పిల్లవాడు తన మంచంపై పడి ఉండటం చూశాడు. 33కాబట్టి ఎలీషా లోపలికి వెళ్ళి తలుపులు వేశాడు. తానూ, ఆ పిల్లవాడూ మాత్రమే లోపల ఉండగా యెహోవాకు విజ్ఞాపన చేశాడు. 34అతడు మంచం ఎక్కి పిల్లవాడి మీద పడుకున్నాడు. తన నోటిని వాడి నోటి మీదా, తన కళ్ళు వాడి కళ్ళ మీదా తన చేతులు వాడి చేతుల మీదా ఉంచి వాడిపై పడుకున్నాడు. అప్పుడు పిల్లవాడి ఒంట్లో వేడి పుట్టింది. 35తరువాత ఎలీషా లేచి ఆ గదిలో చుట్టూ తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడి పైన పడుకున్నాడు. పిల్లవాడు ఏడుసార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. 36అప్పుడు ఎలీషా గేహజీని పిలిచి “ఆ షూనేమీ స్త్రీని పిలుచుకురా” అన్నాడు. అతడు ఆమెను పిలుచుకు వచ్చాడు. ఆమె గది లోపలికి వచ్చింది. ఎలీషా ఆమెతో “నీ కొడుకుని ఎత్తుకో” అన్నాడు. 37అప్పుడు ఆమె అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కొడుకుని ఎత్తుకుని వెళ్ళింది.
సాయంకాల ప్రార్థన: పఠనం (13వ పఠనం)
11ఆయన ప్రజలు పూర్వదినాల్లోని మోషేను గుర్తుకు తెచ్చుకున్నారు. వారిలా అన్నారు, తన మందకాపరులతోబాటు సముద్రంలో నుంచి ప్రజలను తీసుకు వచ్చినవాడేడి? వారి మధ్య తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? 12మోషే కుడిచేతి వైపున తన ఘనమైన బలాన్ని పంపించిన వాడేడి? 13తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగాలని వారిముందు నీళ్లను విభజించినవాడేడి? లోతైన నీళ్ళగుండా వారిని నడిపించిన వాడేడి? మైదానంలో గుర్రం లాగా వాళ్ళు తొట్రుపడలేదు. 14లోయలో దిగే పశువుల్లాగా యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలగచేశాడు. నీకు ఘనమైన పేరు కలగాలని నువ్వు నీ ప్రజలను నడిపించావు. 15పరలోకం నుంచి చూడు. నీ దివ్యమైన పవిత్ర నివాసం నుంచి చూడు. నీ ఆసక్తి, నీ గొప్పపనులు ఎక్కడున్నాయి? మా పట్ల నీ కనికరం, నీ వాత్సల్యం, ఆగిపోయాయేమిటి. 16అయితే మా తండ్రివి నువ్వే. అబ్రాహాముకు మేము తెలియక పోయినా ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినా, యెహోవా, నువ్వే మా తండ్రివి. అనాదికాలం నుంచి “మా విమోచకుడు” అని నీకు పేరు గదా. 17యెహోవా, నీ విధానాలనుంచి మమ్మల్ని తప్పిస్తున్నావెందుకు? మాకు నీ పట్ల భయభక్తులు ఉండకుండా మా హృదయాలను ఎందుకు కఠినపరుస్తున్నావు? నీ సేవకుల కోసం నీ సొత్తుగా ఉన్న గోత్రాలకోసం తిరిగి రా. 18నీ పవిత్ర ఆలయం నీ ప్రజల ఆధీనంలో కొద్దికాలమే ఉంది. అయితే మా శత్రువులు దాన్ని తొక్కివేశారు. 19నువ్వెన్నడూ పాలించని వాళ్ళలాగా అయ్యాం. నీ పేరెన్నడూ ధరించని వాళ్ళలాగా అయ్యాం. 64:1ఆకాశాలను చీల్చుకుని నువ్వు దిగివస్తే ఎంత బాగుండు! నీ సన్నిధిలో పర్వతాలు కంపించి పోతాయి. 2మంటలు గచ్చ పొదలను తగలబెట్టేలా నీళ్ళు పొంగేలాగా చేసినట్టు నీ పేరు నీ శత్రువులకు తెలియజేయడానికి నువ్వు దిగి రా! 3మేము ఊహించని ఆశ్చర్యకరమైన విషయాలు నువ్వు మునుపు చేసినప్పుడు, నువ్వు దిగివచ్చావు. పర్వతాలు నీ ఎదుట వణికాయి. 4నీ కోసం ఎదురు చూసేవారి పక్షంగా నువ్వు పనులు చేసే వాడివి. నిన్ను తప్ప తన పని ఇలా జరిగించే వేరే దేవుణ్ణి అనాది కాలం నుంచి ఎవరూ చూడలేదు, వినలేదు, గ్రహించలేదు. 5నీ పద్ధతులను గుర్తుంచుకుని వాటి ప్రకారం చేసే వారికి, సంతోషంతో నీతి ననుసరించే వారికి, నువ్వు సాయం చేయడానికి వస్తావు. మేము పాపం చేసినప్పుడు నువ్వు కోపపడ్డావు. నీ పద్ధతుల్లో మాకు ఎప్పుడూ విడుదల కలుగుతుంది.
సాయంకాల ప్రార్థన: పఠనం (14వ పఠనం)
31చూడు, నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో, ఒక కొత్త ఒప్పందం స్థిరం చేసే రోజులు వస్తున్నాయి,” ఇది యెహోవా వాక్కు. 32“అది ఐగుప్తులోనుంచి నేను వాళ్ళ చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొచ్చిన రోజుల్లో వాళ్ళ పితరులతో నేను చేసిన ఒప్పందం లాంటిది కాదు. నేను వాళ్ళకు ఒక భర్తగా ఉన్నా, ఆ రోజుల్లో వాళ్ళు ఆ ఒప్పందం ఉల్లంఘించారు.” ఇది యెహోవా వాక్కు. 33“కానీ, ఈ రోజుల తరువాత నేను ఇశ్రాయేలు వాళ్ళతో, యూదా వాళ్ళతో స్థిరం చేసే ఒప్పందం ఇదే, వాళ్ళల్లో నా ధర్మశాస్త్రం ఉంచుతాను. వాళ్ళ హృదయం మీద దాన్ని రాస్తాను. నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను, వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు,” ఇది యెహోవా వాక్కు. 34“అప్పుడు ప్రతివాడూ తన పొరుగువాడికి, తన సహోదరునికి బోధిస్తూ, ‘యెహోవాను తెలుసుకో!’ అని ఇక చెప్పడు. ఎందుకంటే, వాళ్ళల్లో చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు. నేను వాళ్ళ దోషాలు క్షమించి, వాళ్ళ పాపాలు ఇంక ఎన్నడూ మనసులో పెట్టుకోను.” ఇది యెహోవా వాక్కు.
సాయంకాల ప్రార్థన: పఠనం (15వ పఠనం)
పత్రిక
3క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన మనమంతా ఆయన మరణంలోకి కూడా బాప్తిసం పొందామని మీకు తెలియదా? 4తండ్రి మహిమ వలన క్రీస్తు చనిపోయిన వారిలోనుండి ఏ విధంగా లేచాడో, అదే విధంగా మనం కూడా నూతన జీవం పొంది నడుచుకొనేలా, మనం బాప్తిసం ద్వారా మరణించి, ఆయనతో కూడా సమాధి అయ్యాము. 5ఆయన చావు పోలికలో ఆయనతో ఐక్యం గలవారమైతే, ఆయన పునరుత్థానంలో కూడా ఆయనతో ఐక్యం కలిగి ఉంటాం. 6ఎందుకంటే, మనకు తెలుసు, మనం ఇకమీదట పాపానికి దాసులుగా ఉండకుండాా పాపశరీరం నాశనం అయ్యేలా, మన పాత స్వభావం క్రీస్తుతో కలిసి సిలువ మరణం పాలైంది. 7చనిపోయిన వ్యక్తి పాపం విషయంలో నీతిమంతుడని తీర్పు పొందాడు. 8మనం క్రీస్తుతో కూడా చనిపోతే, ఆయనతో కూడా జీవిస్తామని నమ్ముతున్నాము. 9చనిపోయిన వారిలో నుండి లేచిన క్రీస్తు ఇంక చనిపోడనీ, చావుకి ఆయన మీద అధికారం లేదనీ మనకు తెలుసు. 10ఎందుకంటే ఆయన చనిపోవడం పాపం విషయంలో ఒక్కసారే చనిపోయాడు గాని, ఆయన జీవించడం మాత్రం దేవుని విషయమై జీవిస్తున్నాడు. 11ఇదే మీకూ వర్తిస్తుంది. మీరు పాపం విషయంలో చనిపోయిన వారిగా, దేవుని విషయంలో క్రీస్తు యేసులో మిమ్మల్ని సజీవులుగా ఎంచుకోండి.
సువార్త
1విశ్రాంతిదినం గడిచిన తరవాత ఆదివారం నాడు తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, మరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు. 2ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని దొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది. 3ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది. 4అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు. 5ఆ దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. 6ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకున్న చోటు చూసి, 7త్వరగా వెళ్ళి, ‘ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడు’ అని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలిలయకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయనను అక్కడ చూస్తారు. ఇదిగో, నేను మీతో చెప్పాను గదా” అన్నాడు. 8వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గర నుండి త్వరగా వెళ్ళి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా 9యేసు వారికి ఎదురు వచ్చి, “మీకు శుభం!” అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు. 10అప్పుడు యేసు, “భయపడకండి. మీరు వెళ్ళి, నా సోదరులను గలిలయకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారితో చెప్పాడు. 11వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు. 12కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి, 13“మీరు ‘మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు’ అని చెప్పండి. 14ఇది గవర్నరుకు తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం.” అన్నారు. 15సైనికులు ఆ డబ్బు తీసుకుని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదుల్లో ఇప్పటి వరకూ వ్యాపించి ఉంది. 16పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలిలయలోని కొండకు వెళ్ళారు. 17అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు. 18అయితే యేసు వారి దగ్గరికి వచ్చి, “పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది. 19కాబట్టి మీరు వెళ్ళి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ 20నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 18 ఏప్రిల్ పౌర కాలెండర్లో 1 మే. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు