Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 29 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 16 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 29 మార్చి, 2027

సోమవారం · మహా ఉపవాస కాలం మూడవ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Martyr Sabinus of Egypt († 287)

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 8:13–9:7

13సేనల ప్రభువైన యెహోవాయే పరిశుద్ధుడని ఎంచాలి. మీరు భయపడవలసిన వాడు, భీతి చెందవలసిన వాడు ఆయనే. 14అప్పుడాయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అయితే ఆయన ఇశ్రాయేలు రెండు కుటుంబాలకు తొట్రుపడజేసే రాయిగా తూలి పడేసే బండగా ఉంటాడు. యెరూషలేము నివాసులకు బోనుగా చిక్కుకునే వలగా ఉంటాడు. 15చాలా మంది వాటికి తగిలి తొట్రుపడి కాళ్లు చేతులు విరిగి వలలో చిక్కి పట్టుబడతారు. 16ఈ సాక్ష్య వాక్యాన్ని కట్టు. ఈ అధికారిక వార్తను సీలు వేసి నా శిష్యులకు అప్పగించు. 17యాకోబు వంశానికి తన ముఖం దాచుకున్న యెహోవా కోసం నేను ఎదురు చూస్తాను. ఆయన కోసం నేను ఎదురు చూస్తాను. 18ఇదిగో, నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు. సీయోను కొండ మీద నివసించే సేనల ప్రభువు యెహోవా మూలంగా సూచనలుగా, మహత్కార్యాలుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. 19వారు మాతో “శకునాలు చెప్పే వారి దగ్గరికి, గొణుగుతూ గుసగుసలాడుతూ ఉండే మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్లి విచారణ చెయ్యండి” అని చెబుతారు. కానీ ప్రజలు విచారించవలసింది తమ దేవుడి దగ్గరనే గదా? బతికి ఉన్న వారి కోసం చచ్చిన వారి దగ్గరికి వెళ్లడం ఏమిటి? 20ధర్మశాస్త్రం పైనా సాక్ష్యం పైనా దృష్టి నిలపండి. వారు ఇలా చెప్పక పోతే అందుకు కారణం వారికి సూర్యోదయం కలగలేదు. 21అలాటి వారు ఇబ్బంది పడుతూ ఆకలితో దేశమంతా తిరుగులాడుతారు. ఆకలేసి కోపపడతారు. తమ ముఖాలు ఆకాశం వైపుకు ఎత్తి తమ రాజును, తమ దేవుణ్ణి దూషిస్తారు. 22భూమి వైపు తేరి చూసి, దురవస్థ, అంధకారం, భరించరాని వేదన అనుభవిస్తారు. ఇతరులు వారిని వారు గాఢాంధకార దేశంలోకి తోలివేస్తారు. 9:1యాతనలో ఉన్న దానిపై అలుముకున్న మబ్బు తేలిపోతుంది. పూర్వకాలంలో ఆయన జెబూలూను దేశాన్ని, నఫ్తాలి దేశాన్ని అవమాన పరిచాడు. కాని చివరి కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని, అంటే యొర్దాను అవతలి ప్రదేశాన్ని, అన్యప్రజల గలిలయ ప్రదేశాన్నీ మహిమగల దానిగా చేస్తాడు. 2చీకటిలో నడిచిన ప్రజలు గొప్ప వెలుగును చూశారు. చావు నీడ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించింది. 3నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు. 4మిద్యాను దినాన జరిగినట్టు అతని బరువైన కాడిని నువ్వు విరిచావు. అతని మెడ మీద ఉన్న దుంగను, అతణ్ణి తోలే వాడి కొరడాలను విరగగొట్టావు. 5యుద్ధ శబ్దం చేసే పాద రక్షలు, రక్తంలో పొర్లించిన వస్త్రాలు అగ్నిలో కాలి, ఆ అగ్నికి ఇంధనం ఔతాయి. 6ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు. 7ఇకపై పరిమితి లేకుండా దానికి వృద్ధి, విస్తీర్ణం కలిగేలా దావీదు సింహాసనాన్ని, రాజ్యాన్ని నియమిస్తాడు. న్యాయం మూలంగా, నీతి మూలంగా రాజ్యాన్ని స్థిరపరచడానికి శాశ్వతంగా అతడు దావీదు సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తాడు. సేనల ప్రభువైన యెహోవా ఆసక్తితో దీన్ని నెరవేరుస్తాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 6:9–22

9నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. 10షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు. 11దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. 12దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. 13దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. 14కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి. 15నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి. 16ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి. 17విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి. 18కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. 19నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి. 20అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి. 21తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు. 22దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 8:1–21

1జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది. 2రహదారుల్లో, ప్రధాన వీధుల్లో, పట్టణ దారులు కలిసే కూడలిలో అది నిలబడి ఉంది. 3నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది. 4“మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను. 5జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి. 6వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి. 7నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం. 8న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు. 9నా మాటలన్నీ వివేకం గలవాడికి తేటగా అర్థం అవుతాయి. తెలివి గలవాడు న్యాయం గ్రహిస్తాడు. 10వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి. 11విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు. 12నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను. 13దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం. 14అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే. 15నా మూలంగా రాజులు పరిపాలిస్తారు. అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు. 16నా మూలంగా ఘనత వహించిన న్యాయాధిపతులంతా న్యాయం జరిగిస్తారు. లోకంలోని అధికారులు పాలన సాగిస్తారు. 17నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు. 18ఐశ్వర్యం, ప్రతిష్ఠ, నీతి న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి. 19నా వల్ల కలిగే ఫలం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది. 20నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి. 21నన్ను ప్రేమించే వాళ్ళను నేను సంపన్నులుగా చేస్తాను. వారికి ధన సమృద్ధి కలిగిస్తాను.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 16 మార్చి పౌర కాలెండర్‌లో 29 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు