Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 28 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 15 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 28 మార్చి, 2027

ఆదివారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

మహా ఉపవాస కాలం రెండవ ఆదివారం

మహా ఉపవాస కాలం

ఉపవాసం: నూనెతో

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన 10వ సువార్త

యోహా 21:1–14

1ఆ తరువాత తిబెరియ సముద్రం ఒడ్డున యేసు తనను మరోసారి కనపరచుకున్నాడు. ఎలాగంటే 2సీమోను పేతురు, దిదుమ అనే పేరున్న తోమా, గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ, ఇంకా ఆయన శిష్యుల్లో మరో ఇద్దరూ కలిసి ఉన్నారు. 3సీమోను పేతురు, “నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా” అన్నాడు. మిగిలిన వారు, “మేము కూడా నీతో వస్తాం” అన్నారు. వారంతా పడవ ఎక్కి వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా వారు ఏమీ పట్టలేదు. 4తెల్లవారింది. యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ ఆయన యేసు అని శిష్యులు గుర్తు పట్టలేదు. 5యేసు, “పిల్లలూ, చేపలు ఏమైనా దొరికాయా?” అని అడిగాడు. “లేదు” అని వాళ్ళన్నారు.” 6అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు. 7అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు, “ఆయన ప్రభువు!” అని పేతురుతో చెప్పాడు. ఆయన ప్రభువని సీమోను పేతురు వినగానే ఇంతకు ముందు తీసివేసిన తన పైబట్ట మళ్ళీ తనపై వేసుకుని సముద్రంలో దూకాడు. 8ఒడ్డుకి ఇంకా రెండు వందల మూరల దూరం మాత్రమే ఉంది. కాబట్టి మిగిలిన శిష్యులు చేపలు ఉన్న వలని లాగుతూ ఆ చిన్న పడవలో వచ్చారు. 9ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి. 10అప్పుడు యేసు, “ఇప్పుడు మీరు పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రండి” అని వారికి చెప్పాడు. 11సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దాంట్లో 153 పెద్ద చేపలున్నాయి. అన్ని చేపలు పడినా వల మాత్రం పిగిలి పోలేదు. 12అప్పుడు యేసు, “రండి, భోజనం చేయండి” అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు. 13యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచి పెట్టాడు. అలాగే చేపలు కూడా ఇచ్చాడు. 14యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.

పత్రిక

హెబ్రీ 1:10–2:3

10ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు. 11అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి. 12వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు. బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. కానీ నువ్వు ఒకేలా ఉంటావు. నీ సంవత్సరాలు ముగిసిపోవు.” 13“నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? 14ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా? 2:1అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. 2ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే, 3ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది.

పత్రిక (పరిశుద్ధ గ్రెగొరీ కోసం)

హెబ్రీ 7:26–8:2

26ఆయన కల్మషం అంటని వాడు, నిందా రహితుడు, పవిత్రుడు, పాపులకు వేరుగా ఉన్నవాడు, ఆకాశాల కంటే ఉన్నతంగా ఉన్నాడు. ఇలాటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 27ఇతర ప్రధాన యాజకుల్లాగా ప్రతిదినం ముందుగా తన సొంత పాపాల కోసం అర్పణలు అర్పించి తరువాత ప్రజల కోసం అర్పించాల్సిన అవసరం ఈయనకు లేదు. ఈయన తనను తానే అర్పణగా ఒక్కసారే అర్పించి ముగించాడు. 28ధర్మశాస్త్రం బలహీనతలున్న వారిని ముఖ్య యాజకులుగా నియమిస్తుంది. కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన ప్రమాణ వాక్కు కుమారుణ్ణి ప్రధాన యాజకుడిగా నియమించింది. ఈయన శాశ్వతకాలం నిలిచే పరిపూర్ణత పొందినవాడు. 8:1ఇప్పుడు మేం చెబుతున్న విషయంలో ముఖ్యాంశం ఇది. మనకు ఒక ప్రధాన యాజకుడున్నాడు. ఆయన పరలోకంలో మహా ఘనత వహించిన దేవుని సింహాసనానికి కుడివైపున ఆసీనుడై ఉన్నాడు. 2మానవ నిర్మితం కాకుండా ప్రభువే నెలకొల్పిన ప్రత్యక్ష గుడారం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన సేవకుడుగా ఉన్నాడు.

సువార్త

మార్కు 2:1–12

1కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. 2ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు. 3నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. 4ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు. 5యేసు వారి విశ్వాసం చూసి, “కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది” అన్నాడు. 6అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు తమలో తాము ఇలా ఆలోచించారు, 7“అతడీ విధంగా ఎలా మాట్లాడగలడు? దైవదూషణ చేస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?” 8వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, “మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? ఏది తేలిక? 9ఈ పక్షవాత రోగితో, ‘నీ పాపాలకు క్షమాపణ దొరికింది’ అనడమా? లేక ‘లేచి నీ పడక ఎత్తుకుని నడువు’ అనడమా? 10భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి” అని చెప్పి 11ఆ పక్షవాత రోగిని చూసి, “నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను” అన్నాడు. 12వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.

సువార్త (పరిశుద్ధ గ్రెగొరీ కోసం)

యోహా 10:9–16

9నేనే ప్రవేశ ద్వారం, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశిస్తే వాడికి రక్షణ దొరుకుతుంది. వాడు లోపలికి వస్తూ బయటకి వెళ్తూ పచ్చికను కనుగొంటాడు. 10దొంగ కేవలం దొంగతనం, హత్య, నాశనం చెయ్యడానికి మాత్రమే వస్తాడు. గొర్రెలకు జీవం కలగాలని, ఆ జీవం సమృద్ధిగా కలగాలని నేను వచ్చాను. 11నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణం ఇస్తాడు. 12జీతం కోసం పని చేసేవాడు కాపరిలాంటి వాడు కాదు. గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు. తోడేలు ఆ గొర్రెలను పట్టుకుని చెదరగొడుతుంది. 13జీతగాడు జీతం మాత్రమే కోరుకుంటాడు కాబట్టి గొర్రెలను పట్టించుకోకుండా పారిపోతాడు. 14నేను గొర్రెలకు మంచి కాపరిని. నా గొర్రెలు నాకు తెలుసు. నా సొంత గొర్రెలకు నేను తెలుసు. 15నా తండ్రికి నేను తెలుసు. నాకు నా తండ్రి తెలుసు. నా గొర్రెల కోసం ప్రాణం పెడతాను. 16ఈ గొర్రెలశాలకు చెందని ఇతర గొర్రెలు నాకు ఉన్నాయి. వాటిని కూడా నేను తీసుకురావాలి. అవి నా స్వరం వింటాయి. అప్పుడు ఉండేది ఒక్క మంద, ఒక్క కాపరి.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 15 మార్చి పౌర కాలెండర్‌లో 28 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు