Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 30 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · మార్చి 17 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 30 మార్చి, 2027

మంగళవారం · మహా ఉపవాస కాలం మూడవ వారం · స్వరం 2

పండుగలు మరియు పరిశుద్ధులు

Venerable Alexis the Man of God († 411)

మహా ఉపవాస కాలం

కఠిన ఉపవాసం (పొడి ఆహారం: రొట్టె, కూరగాయలు, పండ్లు)

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఆరవ ఘడియ

యెష 9:9–10:4

9“వాళ్ళు ఇటుకలతో కట్టింది పడిపోయింది. కాని మేము చెక్కిన రాళ్లతో కడతాం. అత్తి కర్రతో కట్టింది నరికేశారు, కాని వాటికి బదులుగా దేవదారు కర్రను వాడదాం” అని అతిశయపడి గర్వంతో చెప్పుకునే ఎఫ్రాయిముకూ, షోమ్రోను నివాసులకూ, ప్రజలందరికీ ఈ విషయం తెలుస్తుంది. 11కాబట్టి యెహోవా అతని మీదకి రెజీనును, అతని విరోధిని లేపుతాడు. అతని శత్రువులను రేపుతాడు. 12తూర్పున సిరియా, పడమట ఫిలిష్తీయులు నోరు తెరచి ఇశ్రాయేలును మింగేస్తారు. ఇంత జరిగినా కోపంలో ఉన్న యెహోవా ఆగడు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంది. 13అయినా ప్రజలు తమను కొట్టిన దేవుని వైపు తిరగరు. సేనల ప్రభువైన యెహోవాను వెదకరు. 14కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుంచి తల, తోక, తాటి మట్ట, రెల్లు అన్నిటినీ ఒకే రోజు నరికేస్తాడు. 15పెద్దలూ, ఘనులూ తల. అసత్యాలు ఉపదేశించే ప్రవక్తలు తోక. 16ఈ ప్రజలను నడిపించే వాళ్ళు ప్రజలను దారి తప్పిస్తున్నారు. వాళ్ళ వెంట నడుస్తున్న వాళ్ళు నాశనమౌతారు. 17వాళ్ళందరూ భక్తిహీనులు, దుర్మార్గులు. ప్రతి నోరు మూర్ఖపు మాటలు మాట్లాడుతుంది. కాబట్టి ప్రభువు వాళ్ళ యువకులను చూసి సంతోషించడు, వాళ్ళల్లో తల్లిదండ్రులు లేని వారి పట్ల అయినా, వాళ్ళ వితంతువుల పట్ల అయినా కరుణ చూపించడు. దీనంతటి బట్టి ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది. 18దుర్మార్గత అగ్నిలా మండుతుంది. అది గచ్చ పొదలను, బ్రహ్మ జెముడు చెట్లను కాల్చి, అడవి పొదల్లో రాజుకుని, దట్టమైన పొగస్థంభంలా పైకి లేస్తుంది. 19సేనల ప్రభువు అయిన యెహోవా ఉగ్రత వల్ల దేశం కాలి భస్మం అయిపోయింది. ప్రజలు ఆ అగ్నికి ఇంధనంలా ఉన్నారు. ఏ మనిషీ తన సహోదరుణ్ణి కరుణించడు. 20కుడిచేతి మాంసం కోసుకుని తింటారు గాని ఇంకా ఆకలిగానే ఉంటారు. ఎడమచేతి మాంసం కోసుకు తింటారు గాని ఇంకా తృప్తి చెందరు. ప్రతివాడూ తన సొంత చేతి మాంసం కూడా తింటాడు. 21మనష్షే ఎఫ్రాయిమునీ, ఎఫ్రాయిము మనష్షేనీ తినేస్తారు. వీరిద్దరు కలిసి యూదా మీద పడతారు. ఇలా జరిగినా ఆయన కోపం చల్లారదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది. 10:1వితంతువులు తమకు కొల్లసొమ్ముగా ఉండాలనీ, 2తల్లిదండ్రులు లేని వాళ్ళను దోచుకోవాలనీ కోరి, అవసరతలో ఉన్న వాళ్లకు న్యాయం జరిగించకుండా చేసి, నా ప్రజల్లో ఉన్న పేదలకు హక్కులు లేకుండా చేసి, అన్యాయ నియమాలు విధించే వారికీ, బాధ కలిగించే శాసనాలు చేసే వారికీ బాధ. 3తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు? 4నువ్వు బందీలైన వాళ్ళ కింద ముడుచుకుని దాక్కున్నావు. హతమైన వాళ్ళతోపాటు పడి ఉన్నావు. అయినా యెహోవా కోపం చల్లారలేదు. ఎత్తిన ఆయన చెయ్యి దెబ్బ కొట్టేందుకు ఇంకా ఎత్తే ఉంటుంది.

సాయంకాల ప్రార్థన: పఠనం

ఆది 7:1–5

1యెహోవా “ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి. 2శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు, 3ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి. 4ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు. 5తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు.

సాయంకాల ప్రార్థన: పఠనం

సామె 8:32–9:11

32కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు. 33నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి. 34నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు. 35నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. 36నన్ను తృణీకరించేవాడు తనకు తానే హాని కలిగించుకుంటాడు. నన్ను అసహ్యించుకొనే వాళ్ళు మరణానికి స్నేహితులౌతారు.” 9:1జ్ఞానం ఏడు స్తంభాలు చెక్కుకుని దానిపై తన నివాసం కట్టుకున్నది. 2పశువులను వధించి మాంసం, ద్రాక్షారసం, భోజన పదార్థాలు సిద్ధం చేసింది. 3తన దాసీల చేత మనుషులకు కబురంపింది. పట్టణంలోని ఉన్నత స్థలంపై నిలబడింది. 4“జ్ఞానం లేని వాళ్ళంతా ఇక్కడికి రండి” అని పిలుస్తున్నది. 5తెలివితక్కువ వాళ్ళతో ఇలా చెబుతుంది “రండి, వచ్చి నేను సిద్దం చేసిన ఆహారం తినండి. నేను కలిపి ఉంచిన ద్రాక్షారసం తాగండి. 6ఇకనుంచి జ్ఞానం కలిగి జీవించండి. తెలివి కలిగించే బాటలో సవ్యంగా నడవండి.” 7ఎగతాళి చేసేవాళ్ళకు బుద్ధి చెప్పేవాడు తన మీదకే నింద తెచ్చుకుంటాడు. దుష్టులను గద్దించే వాడికి అవమానం కలుగుతుంది. 8ఎగతాళి చేసేవాణ్ణి గద్దించవద్దు. వాణ్ణి గద్దిస్తే ఒకవేళ వాడు నీపై ద్వేషం పెంచుకుంటాడేమో. జ్ఞానం గలవాడికి హితవాక్కులు బోధిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. 9జ్ఞానం గలవాడికి బుద్ధి చెప్పినప్పుడు మరింత జ్ఞానం పొందుతాడు. న్యాయం జరిగించే వాడికి నీతి వాక్కులు బోధిస్తే వాడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటాడు. 10జ్ఞానం కలిగి ఉండడానికి మూలాధారం యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. వివేకానికి ఆధారం పరిశుద్ధుడైన దేవుణ్ణి గూర్చిన తెలివి కలిగి ఉండడమే. 11నా మూలంగానే నువ్వు జీవించే కాలం పెరుగుతుంది. నువ్వు బతికే సంవత్సరాలు ఎక్కువ అవుతాయి.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 17 మార్చి పౌర కాలెండర్‌లో 30 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు