హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 8 మార్చి
ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 23 (పాత శైలి)
ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 8 మార్చి, 2027
సోమవారం · జున్ను విరమణ వారం · స్వరం 7
పండుగలు మరియు పరిశుద్ధులు
జున్ను విరమణ వారపు సోమవారం
జున్ను వారం
మాంసం లేదు; పాలు, గుడ్లు మరియు చేపలు అనుమతి
ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.
ఈరోజు పఠనాలు
పత్రిక
1ప్రియమైన గాయికి, పెద్దనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది. 2ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను. 3నీవు ఎప్పుడూ నడుస్తున్నట్టే సత్యమార్గంలో నడచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు వచ్చి చెప్పగా విని చాలా సంతోషించాను. 4నా పిల్లలు సత్యమార్గంలో నడుచుకుంటున్నారని తెలుసుకోవడం కన్నా నాకు గొప్ప సంతోషం మరేదీ లేదు. 5ప్రియ సోదరా, నీవు సోదరుల కోసం అపరిచితుల కోసం చేస్తున్నది నమ్మకంగా చేస్తున్నావు. 6వారు సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. దేవునికి తగినట్టుగా వారి ముందున్న ప్రయాణానికి తోడ్పాటు ఇచ్చి పంపించు. 7వారు దేవుని నామం కోసం వెళ్తున్నారు. యూదేతరుల నుండి వారు ఏమీ తీసుకోవడం లేదు. 8కాబట్టి మనం సత్యం విషయంలో జత పనివారమయ్యేలా వారిని స్వీకరించాలి. 9అక్కడి సంఘానికి నేను రాశాను గాని, వారిలో గొప్పవాడుగా ఉండాలని కోరుకొనే దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించడం లేదు. 10కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులు, మా విషయంలో మాట్లాడిన చెడ్డ మాటలు గుర్తు చేసుకుంటాను. అంతే కాదు, తాను స్వయంగా సోదరులను ఆహ్వానించడు, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, సంఘంలో నుండి వెళ్ళగొడుతున్నాడు. 11ప్రియ సోదరా, చెడునుగాక మంచినే అనుకరించు. మంచి జరిగించేవాడు దైవ సంబంధి. చెడు జరిగించేవాడు దేవుణ్ణి చూడలేదు. 12దేమేత్రి గురించి అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం విషయంలో అతడు మంచి సాక్ష్యం పొందాడు. మేము కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం సత్యం అని నీకు తెలుసు. 13ఇంకా చాలా సంగతులు నీకు రాయాలనుకున్నాను గాని కలంతో, సిరాతో రాయడం నాకు ఇష్టం లేదు. 14కానీ నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం. 15నీకు శాంతి కలుగు గాక. స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి స్నేహితులకు పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి.
సువార్త
29ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే, బేతనీ అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు. 30“మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాని మీద ఇంతవరకూ ఎవ్వరూ కూర్చోలేదు. దాన్ని విప్పి తోలుకు రండి. 31ఎవరైనా ‘దీన్ని ఎందుకు విప్పుతున్నారు’ అని మిమ్మల్ని అడిగితే ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి” అని చెప్పి వారిని పంపించాడు. 32ఆయన పంపిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే దాన్ని చూశారు. 33ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు, “మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?” అని వారినడిగారు. 34దానికి వారు, “ఇది ప్రభువుకు కావాలి” అన్నారు. 35తరువాత యేసు దగ్గరికి దాన్ని తోలుకు వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయనను దానిపై కూర్చోబెట్టారు. 36ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు. 37ఒలీవ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు. 38“ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు. 39ఆ జనసమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, “బోధకా, నీ శిష్యులను గద్దించు” అని ఆయనతో అన్నారు. 40ఆయన, “వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. 22:7పొంగని రొట్టెల పండగ సందర్భంగా పస్కా పశువును వధించాల్సిన రోజు వచ్చింది. 8యేసు పేతురు యోహానులతో, “మీరు వెళ్ళి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి” అన్నాడు. 9వారు, “మేము దాన్ని ఎక్కడ సిద్ధం చేయాలి?” అని అడిగారు. 10ఆయన, “మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి. 11మా గురువు, ‘నేను నా శిష్యులతో కలసి పస్కా భోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?’ అని అడుగుతున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి. 12అతడు అన్ని సదుపాయాలూ ఉన్న ఒక పెద్ద మేడ గది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి” అని వారితో చెప్పాడు. 13సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధపరిచారు. 14సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు. 15అప్పుడాయన, “నేను హింస పొందక ముందు మీతో కలిసి ఈ పస్కా విందు ఆరగించాలని ఎంతో ఆశించాను. 16ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దాన్ని తిననని మీతో చెబుతున్నాను.” 17తరువాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, “మీరు దీన్ని తీసుకుని పంచుకోండి. 18ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెబుతున్నాను” అన్నాడు. 19ఆ తరవాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దాన్ని విరిచి వారికిచ్చి, “ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీన్ని చేయండి” అని చెప్పాడు. 20అలాగే భోజనమైన తరువాత ఆయన ఆ పాత్రను తీసుకుని, “ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన. 21“వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడు నాతో కూడా ఈ బల్ల దగ్గరే ఉన్నాడు. 22దేవుని నిర్ణయం ప్రకారం మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి మాత్రం యాతన తప్పదు” అన్నాడు, 23ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు. 24తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది. 25అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, “ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. ప్రజల మీద అధికారం చెలాయించే వారు ‘ధర్మదాతలు’ అని పిలిపించుకుంటారు. 26మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు తక్కువవాడుగా, నాయకుడు సేవకుడిలా ఉండాలి. 27అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను. 28“నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు. 29నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి, 30సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను. 31“సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోదుమల్లా జల్లించడానికి కోరుకున్నాడు. 32నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తరువాత నీ సోదరులను స్థిరపరచు.” 33కానీ పేతురు, “ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్ళడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయనతో అన్నాడు. 34అప్పుడు ఆయన, “ఈ రోజు నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు బొంకిన తరువాతనే కోడి కూస్తుందని నీకు చెబుతున్నాను” అన్నాడు. 35ఇంకా ఆయన “నేను డబ్బు సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా?” అని అడిగాడు. దానికి వారు, “ఏమీ తక్కువ కాలేదు” అన్నారు. 36ఆయన, “కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేని వాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి. 37‘ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు’ అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నెరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెబుతున్నాను” అన్నాడు. 38శిష్యులు, “ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి” అన్నారు. ఆయన, “చాలు” అన్నాడు. 39భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్లోని 23 ఫిబ్రవరి పౌర కాలెండర్లో 8 మార్చి. కొత్త కాలెండర్ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు