Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 7 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 22 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 7 మార్చి, 2027

ఆదివారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

మాంస విరమణ ఆదివారం

అంతిమ తీర్పు ఆదివారం

ఉపవాసం

ఉపవాసం లేదు

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

ఉదయ ప్రార్థన ఏడవ సువార్త

యోహా 20:1–10

1ఆదివారం ఉదయాన్నే ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిపై ఉంచిన రాయి తీసి ఉండడం చూసింది. 2కాబట్టి ఆమె సీమోను పేతురు దగ్గరకూ, యేసు ప్రేమించిన మరో శిష్యుడి దగ్గరకూ పరుగెత్తుకుని వెళ్ళింది. వారితో, “ప్రభువును ఎవరో సమాధిలో నుండి తీసుకు పోయారు. ఆయనను ఎక్కడ ఉంచారో తెలియడం లేదు” అని చెప్పింది. 3కాబట్టి పేతురూ, ఆ మరో శిష్యుడూ వెంటనే బయలుదేరి సమాధి దగ్గరికి వచ్చారు. 4వారిద్దరూ కలసి వెళుతుండగా ఆ మరో శిష్యుడు పేతురు కంటే వేగంగా పరుగెత్తి మొదటగా సమాధి దగ్గరికి వచ్చాడు. 5అతడు ఆ సమాధిలోకి తొంగి చూశాడు. నార బట్టలు అతనికి కనిపించాయి. కానీ అతడు సమాధిలోకి ప్రవేశించలేదు. 6ఆ తరువాత సీమోను పేతురు అతని వెనకాలే వచ్చి నేరుగా సమాధిలోకి ప్రవేశించాడు. 7అక్కడ నారబట్టలు పడి ఉండడమూ, ఆయన తలకు కట్టిన రుమాలు నార బట్టలతో కాకుండా వేరే చోట చక్కగా చుట్టి పెట్టి ఉండడమూ చూశాడు. 8ఆ తరువాత మొదట సమాధిని చేరుకున్న శిష్యుడు కూడా లోపలి వెళ్ళి చూసి విశ్వసించాడు. 9అయితే ‘ఆయన చనిపోయిన వారి నుండి బతికి లేవడం తప్పనిసరి’ అన్న లేఖనం వారింకా గ్రహించలేదు. 10అప్పుడు ఆ శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.

పత్రిక

1 కొరింతీ 8:8–9:2

8భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు. 9అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి. 10ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా? 11తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు. 12ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. 13కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను. 9:1నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుణ్ణి కాదా? మన ప్రభు యేసును నేను చూడలేదా? మీరు ప్రభువులో నా పనితనానికి ఫలితం కారా? 2నేను ఇతరులకి అపొస్తలుణ్ణి కాకపోయినా కనీసం మీకైనా అపొస్తలుడినే కదా. ప్రభువులో నా అపొస్తలత్వానికి మీరే రుజువు.

సువార్త

మత్తయి 25:31–46

31“మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. 32మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు 33ఆయన తన కుడి వైపున ‘గొర్రెలు’ (నీతిపరులు), ఎడమవైపున ‘మేకలు’ (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు. 34తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి. 35ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు. 36బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు. 37అందుకు నీతిపరులు ‘ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం? 38ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం? 39ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండడం చూసి నీ దగ్గరికి వచ్చి పరామర్శించాం?’ అని ఆయనను అడుగుతారు. 40అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరుల్లో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే’ అని వారికి జవాబిస్తాడు. 41“తరవాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, ‘శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి దూతలకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి. 42ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. 43పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు. 44అందుకు వారు కూడా, ‘ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దాహంతో ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండడం చూసి నీకు సహాయం చేయలేదు?’ అని అడుగుతారు. 45అందుకు రాజు, ‘మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే’ అని వారికి జవాబిస్తాడు. 46వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 22 ఫిబ్రవరి పౌర కాలెండర్‌లో 7 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు