Bible Explorer యాప్ పొందండి

హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › మార్చి 2027 › 9 మార్చి

ఆర్థడాక్స్ కాలెండర్ · ఫిబ్రవరి 24 (పాత శైలి)

ఆర్థడాక్స్ రోజువారీ పఠనాలు — 9 మార్చి, 2027

మంగళవారం · జున్ను విరమణ వారం · స్వరం 7

పండుగలు మరియు పరిశుద్ధులు

జున్ను విరమణ వారపు మంగళవారం

జున్ను వారం

మాంసం లేదు; పాలు, గుడ్లు మరియు చేపలు అనుమతి

ఇది సన్యాస నియమాన్ని అనుసరిస్తుంది. సంఘంలో ఉపవాస పరిమాణాన్ని ఆరోగ్యం, వయస్సు మరియు పరిస్థితుల ప్రకారం తమ ఆత్మీయ గురువుతో కలిసి నిర్ణయిస్తారు.

ఈరోజు పఠనాలు

సాయంకాల ప్రార్థన: పఠనం (ముందుగా వచ్చినవాని కోసం)

యెష 40; యెష 41; యెష 45; యెష 48; యెష 54 (ఎంచుకున్న వచనాలు)

సాయంకాల ప్రార్థన: పఠనం (ముందుగా వచ్చినవాని కోసం)

మలా 3; మలా 4 (ఎంచుకున్న వచనాలు)

సాయంకాల ప్రార్థన: పఠనం (ముందుగా వచ్చినవాని కోసం)

ఈ అనువాదంలో లేదు

ఉదయ ప్రార్థన: సువార్త (ముందుగా వచ్చినవాని కోసం)

లూకా 7:17–30

17ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ప్రాంతాల్లో వ్యాపించింది. 18యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియజేశారు. 19అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, “రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేము ఎదురు చూడాలా?” అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరికి పంపించాడు. 20వారు ఆయన దగ్గరికి వచ్చి, “‘రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా?’ అని అడగమని మమ్మల్ని బాప్తిసమిచ్చే యోహాను నీ దగ్గరికి పంపాడు” అని చెప్పారు. 21అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు. 22అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది. 23నా విషయంలో అభ్యంతరాలేమీ లేని వాడు ధన్యుడు.” 24యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తరువాత యేసు యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు, “మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్ళారు? గాలికి ఊగే రెల్లునా? 25అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వారు రాజ మందిరాల్లో ఉంటారు. 26అది కాకపోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెబుతున్నాను. 27‘చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధపరుస్తాడు’ అని ఎవరిని గురించి రాశారో అతడే ఈ యోహాను. 28స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను.” 29ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు. 30కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిసం పొందకుండా వారి జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.

పత్రిక

యూదా 1:1–10

1తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది. 2దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక. 3ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది. 4ఎందుకంటే కొంతమంది దొంగచాటుగా వచ్చి దేవుని కృపను లైంగిక అవినీతికి వీలుగా మార్చి, మన ఏకైక యజమాని, ప్రభువైన క్రీస్తును నిరాకరిస్తున్నారు. వీళ్ళు భక్తిహీనులు, శిక్షకు పాత్రులని ముందే రాసి ఉంది. 5ఈ సంగతులు మీకు ముందే తెలుసు. అయినా కొన్ని సంగతులు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. ప్రభువు ఐగుప్తు నుండి ఒక జనాంగాన్ని రక్షించాడు. కానీ నమ్మనివారిని ఆయన ఆ తరువాత నాశనం చేశాడు. 6తమ స్థానం నిలుపుకోని దూతలు, తమకు ఏర్పరచిన నివాస స్థలాలను విడిచిపెట్టారు. దేవుడు వారిని చీకటిలో నిత్య సంకెళ్ళతో బంధించి మహా తీర్పు రోజు కోసం ఉంచాడు. 7అదే విధంగా, సొదొమ గొమొర్రా, వాటి చుట్టూ ఉన్న పట్టణాలవారు జారత్వానికీ, అసహజమైన లైంగిక కోరికలకూ తమను తాము అప్పగించుకున్నారు. వారు శాశ్వత అగ్నికి గురై శిక్ష అనుభవించి, ఉదాహరణగా నిలిచారు. 8అదే విధంగా, కలలు కనే వీరు ఒక వైపు తమ శరీరాలను అపవిత్రం చేసుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ దేవుని మహిమ రూపులను గురించి చెడుగా చెబుతున్నారు. 9అయితే, ప్రధాన దూత మిఖాయేలు సైతానుతో వ్యతిరేకించి మోషే శరీరాన్ని గూర్చి వాదిస్తూ ఉన్నప్పుడు, అవమానకరంగా మాట్లాడలేదు, వాడిమీద నేరం మోపడానికి తెగించలేదు. “ప్రభువు నిన్ను గద్దించు గాక” అన్నాడు. 10కాని వీరు, తమకు అర్థం కాని వాటిని దూషిస్తారు. తెలివిలేని జంతువుల్లాగా ప్రకృతి సిద్ధంగా తెలుసుకోగలిగే వాటివల్లే తమను తాము నాశనం చేసుకుంటున్నారు.

పత్రిక (ముందుగా వచ్చినవాని కోసం)

2 కొరింతీ 4:6–15

6“చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. ఆ వెలుగు యేసు క్రీస్తు ముఖంలో ప్రకాశిస్తోంది. 7అయితే ఈ సంపద మాకు మట్టి కుండల్లో ఉంది కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. 8అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు. 9చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు. 10యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము. 11యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాము. 12ఈ విధంగా మాలో చావూ, మీలో జీవమూ పని చేస్తున్నాయి. 13కాగా, “నమ్మాను కాబట్టి మాట్లాడాను” అని రాసినట్టుగా అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము. 14ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి, మీతో తన ఎదుట నిలబెడతాడని మాకు తెలుసు. 15కృప చాలామందికి విస్తరించినట్టుగా దేవుని మహిమ కోసం కృతజ్ఞత విస్తరించేలా అన్నీ మీ కోసమే జరిగాయి.

సువార్త

లూకా 22:39–42, 45–23:1

39భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఒలీవ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు. 40వారు అక్కడికి చేరుకున్న తరువాత ఆయన వారితో, “మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి” అన్నాడు. 41వారి దగ్గర నుండి ఆయన రాతివేత దూరం వెళ్ళి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేశాడు. 42“తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి.” 45ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. వారు దుఃఖంచేత నిద్రపోవడం చూశాడు. 46వారితో, “మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి” అన్నాడు. 47ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు. 48అప్పుడు యేసు, “యూదా, ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?” అన్నాడు. 49ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించి, “ప్రభూ, కత్తితో నరకమంటావా?” అని అడిగారు. 50ఈలోగా వారిలో ఒకడు ప్రధాన యాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు. 51దానికి యేసు, “అంతటితో ఆగండి” అని అతని చెవిని తాకి బాగుచేశాడు. 52తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో, “ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా? 53నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ఆధిపత్యం” అన్నాడు. 54వారు ఆయనను పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు. 55అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని ఉన్నారు. పేతురు కూడా వెళ్ళి వారితో కూర్చున్నాడు. 56అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి, “ఈ మనిషి కూడా అతనితో ఉన్నవాడే” అంది. 57దానికి పేతురు, “అమ్మాయీ, అతనెవరో నాకు తెలియదు” అన్నాడు. 58కాసేపటికి మరొకడు పేతురును చూసి, “నువ్వు కూడా వారిలో ఒకడివే” అన్నాడు. దానికి పేతురు, “నేను కాదయ్యా” అన్నాడు. 59మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి, “ఇతడు కచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయ వాడే” అని నొక్కి చెప్పాడు. 60అందుకు పేతురు, “నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు” అన్నాడు. అతడు ఇలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది. 61అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. “నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తరువాత కోడి కూస్తుందని” ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది. 62దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. 63యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు. 64ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి “నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు” అన్నారు. 65ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు. 66ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ముఖ్య యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు. 67“నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు” అన్నారు. అందుకాయన, “నేను మీతో చెప్పినా మీరు నమ్మరు. 68అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు. 69అయితే ఇకపై మనుష్య కుమారుడు బల ప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు” అన్నాడు. 70“అయితే నువ్వు దేవుని కుమారుడివా?” అన్నారు. ఆయన వారితో, “మీరన్నట్టు ఆయనను నేనే” అన్నాడు. 71అందుకు వారు, “మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటి మాట మనమే విన్నాం కదా” అన్నారు. 23:1అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు.

సువార్త (ముందుగా వచ్చినవాని కోసం)

మత్తయి 11:2–15

2క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని, “రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా?” అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు. 4యేసు, “మీరు వెళ్ళి, విన్న వాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియజేయండి. 5గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది. 6నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు” అని జవాబిచ్చాడు. 7వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు, “మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా? 8అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు? నాజూకు బట్టలు వేసుకొన్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసికొనే వారు రాజ భవనాల్లో ఉంటారు. 9మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? సరే గాని, ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను. 10‘నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు’ అని రాసి ఉన్నది ఇతని గురించే. 11స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో కచ్చితంగా చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అత్యల్పమైన వాడు అతని కంటే గొప్పవాడు. 12బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకూ పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు. 13ఎందుకంటే యోహాను కాలం వరకూ ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ ప్రవచిస్తూ వచ్చారు. 14ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలీయా ఇతడే. 15వినే చెవులున్నవాడు విను గాక.

తేదీలు రష్యన్ సంఘపు జూలియన్ కాలెండర్‌ను అనుసరిస్తాయి (సెర్బియన్, జార్జియన్ సంఘాలు, ఆథోస్ పర్వతం లాగే): సంఘ కాలెండర్‌లోని 24 ఫిబ్రవరి పౌర కాలెండర్‌లో 9 మార్చి. కొత్త కాలెండర్‌ను అనుసరించే సంఘాలు (గ్రీసు, రొమేనియా, బల్గేరియా, ఉక్రెయిన్…) స్థిర పండుగలనూ పరిశుద్ధులనూ పౌర తేదీనే, 13 రోజులు ముందుగా జరుపుకుంటాయి, వాటి కొన్ని పఠనాలు వేరుగా ఉంటాయి; ఈస్టర్, దానిపై ఆధారపడిన రోజులు ఒకటే.

మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు