హోమ్ › రోజువారీ బైబిల్ పఠనాలు › ఫిబ్రవరి 2027 › 7 ఫిబ్రవరి
కాథలిక్ కాలెండర్
రోజువారీ బైబిల్ పఠనాలు (కాథలిక్) — 7 ఫిబ్రవరి, 2027
ఆదివారం · సామాన్య కాలం ఐదవ వారం
పండుగలు మరియు పరిశుద్ధులు
సామాన్య కాలం ఐదవ ఆదివారం
ఆదివారం · ఆరాధన రంగు: ఆకుపచ్చ
ఈరోజు పఠనాలు
మొదటి పఠనం
1భూమి మీద మనుషులు జీవించే కాలం కాయకష్టం వంటిది కాదా? వాళ్ళ దినాలు కూలి పని చేసే వాడి జీవనం వంటిది కాదా? 2బానిసత్వంలో ఉన్నవాడు గూడు కోరుకున్నట్టు, కూలి కోసం పనివాడు ఎదురు చూస్తున్నట్టు నేను ఉన్నాను. 3నా ఆశలు నెరవేరక నెలల తరబడి గడపవలసి వచ్చింది. నా కోసం ఆయాసంతో కూడిన రాత్రులు నియమితమై ఉన్నాయి. 4నేను పండుకున్నప్పుడల్లా ఆ రాత్రి ఎప్పుడు గడుస్తుందా, ఎప్పుడు నిద్ర నుండి లేస్తానా అనుకుంటాను. తెల్లవారే వరకూ ఇటూ అటూ దొర్లుతూ మధనపడతాను. 6నేత పనివాడి చేతిలోని నాడెలాగా నా రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఎలాంటి నిరీక్షణ లేకుండా అవి గతించిపోతున్నాయి. 7నా ప్రాణం కేవలం ఊపిరి వంటిదని జ్ఞాపకం చేసుకోండి. ఇకపై నా కళ్ళకు ఎలాంటి మంచీ కనబడదు.
ప్రతిస్పందన కీర్తన
1యెహోవాను స్తుతించండి. మన దేవుడైన యెహోవాను కీర్తిస్తూ గానం చేయడం మంచిది. అది మనోహరం. స్తోత్రగానం చేయడం ఎంతైనా తగినది. 2యెరూషలేమును కట్టేవాడు యెహోవాయే. చెదరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి సమకూర్చేవాడు ఆయనే. 3గుండె చెదరిన వారిని బాగు చేసేవాడు, వాళ్ళ గాయాలు నయం చేసేవాడు ఆయనే. 4ఆకాశంలో నక్షత్రాలను వాటి స్థానంలో ఆయనే నియమించాడు. వాటిన్నిటికీ పేర్లు పెట్టింది ఆయనే. 5మన ప్రభువు గొప్పవాడు. ఆయన గొప్ప శక్తి సామర్ధ్యాలు గలవాడు. ఆయన జ్ఞానం అమితమైనది. 6యెహోవా దీన స్థితిలో ఉన్నవారిని ఆదరిస్తాడు. ఆయన దుష్టులను నేలమట్టం చేస్తాడు.
రెండవ పఠనం
16నేను సువార్త ప్రకటించడంలో గర్వించడానికి నాకు కారణం ఏమీ లేదు. ఎందుకంటే అది నాకు తప్పనిసరి బాధ్యత. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు యాతన. 17దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు ఆ బాధ్యతను నాకు అప్పగించాడు. 18అలాటప్పుడు నాకు బహుమానం ఏమిటి? నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు దానిలో నాకున్న హక్కులను పూర్తిగా వాడుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడమే నా బహుమానం. 19నేను స్వేచ్ఛాజీవిని, ఎవరికీ బానిసను కాను. అయితే నేను ఎక్కువమందిని సంపాదించుకోడానికి అందరికీ నన్ను నేనే సేవకునిగా చేసుకున్నాను. 22బలహీనులను సంపాదించుకోడానికి వారికి బలహీనుడినయ్యాను. ఏ విధంగా నైనా కొందరిని రక్షించాలని అందరికీ అన్నివిధాలుగా ఉన్నాను. 23సువార్త కోసం నేను ఏమైనా చేస్తాను. తద్వారా దాని ఫలంలో పాలివాణ్ణి కావాలని నా వాంఛ.
సువార్త
29సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే వారు సీమోను, అంద్రెయల ఇంట్లో ప్రవేశించారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు. 30సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే వారు ఆమె గురించి ఆయనతో చెప్పారు. 31ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం ఆమెను వదిలిపోయి, ఆమె అందరికీ సపర్యలు చేయసాగింది. 32సాయంకాలం, సూర్యుడు అస్తమించిన తరువాత ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. 33ఆ పట్టణమంతా ఆ ఇంటి దగ్గర గుమిగూడారు. 34రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను ఎవరో ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు. 35ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు. 36సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు. 37ఆయన కనబడినప్పుడు, “అందరూ నీ కోసం వెదుకుతున్నారు” అని ఆయనతో అన్నారు. 38ఆయన వారితో, “చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే” అన్నాడు. 39ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
సాధారణ రోమన్ కాలెండర్; ఒక బిషప్‌ల సమావేశం కొన్ని పండుగలను (దివ్యదర్శనం, పరలోకారోహణం, క్రీస్తు శరీర రక్తాల పండుగ) ఒక ఆదివారానికి మార్చవచ్చు లేదా తన సొంత పండుగలను జోడించవచ్చు. పఠన గ్రంథం: ఆదివారపు చక్రం B, వారపు రోజుల సంవత్సరం I.
మూలాలు: ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు