24:18సిద్కియా పరిపాలన ఆరంభించినప్పుడు అతనికి 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏలాడు.
24:19అతని తల్లి లిబ్నా ఊరివాడు యిర్మీయా కూతురు హమూటలు. యెహోయాకీము చేసినట్టే సిద్కియా చేసి, యెహోవా దృష్టిలో చెడునడత నడిచాడు.
24:20సిద్కియా బబులోనురాజు మీద తిరుగబాటు చేశాడు. యూదావాళ్ళ మీద, యెరూషలేమువాళ్ళ మీద యెహోవాకు ఉన్న కోపం కారణంగా ఆయన తన సముఖంలోనుంచి వాళ్ళను తోలివేయడానికి ఇది దోహదం చేసింది.
25:1సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో పదో నెల, పదో రోజు బబులోను రాజు నెబుకద్నెజరు, అతని సైన్యం, యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా శిబిరాల్లో నివాసం చేసి, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టారు.
25:2ఈ విధంగా సిద్కియా రాజు పరిపాలనలో 11 వ సంవత్సరం వరకూ పట్టణం ముట్టడిలో ఉన్నప్పుడు,
25:3నాలుగో నెల తొమ్మిదో రోజు అదే సంవత్సరం పట్టణంలో ఘోరమైన కరువు వచ్చింది. దేశ ప్రజలకు ఆహారం లేదు.
25:4కల్దీయులు పట్టణ ప్రాకారాన్ని పడగొట్టినప్పుడు, సైనికులు రాత్రిపూట రాజు తోట దగ్గర రెండు గోడల మధ్యలో ఉన్న ద్వారం మార్గంలో పారిపోయారు.
25:5అయితే కల్దీయులు పట్టణం చుట్టూ ఉన్నారు. రాజు మైదానానికి వెళ్ళే మార్గంలో వెళ్లిపోయాడు. కల్దీయుల సైన్యం రాజును తరిమి, అతని సైన్యం అతనికి దూరంగా చెదరిపోయిన కారణంగా యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు.
25:6వారు రాజును పట్టుకుని రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజు అతనికి శిక్ష విధించాడు.
25:7సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.
25:8ఇంకా బబులోను రాజు నెబుకద్నెజరు పరిపాలనలో 19 వ సంవత్సరంలో ఐదో నెల ఏడో రోజున రాజ దేహసంరక్షకుల అధిపతీ, బబులోనురాజు సేవకుడూ అయిన నెబూజరదాను యెరూషలేముకు వచ్చి
25:9యెహోవా మందిరాన్నీ, రాజనగరునూ, యెరూషలేములో ఉన్న ఇళ్ళన్నీ, గొప్పవాళ్ళ ఇళ్ళన్నీ అగ్నితో తగల బెట్టించాడు.
25:10ఇంకా నెబూజరదాను దగ్గరున్న కల్దీయుల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టారు.
25:11పట్టణంలో మిగిలి ఉన్న వాళ్ళనూ, బబులోనురాజు పక్షం చేరిన వాళ్ళనూ, సామాన్య ప్రజల్లో మిగిలిన వాళ్ళనూ నెబూజరదాను బందీలుగా తీసుకెళ్ళాడు గాని,
25:12పొలాల్లో, ద్రాక్షతోటల్లో పనిచెయ్యడానికి అందరికన్నా పేదవాళ్లను అక్కడే ఉంచాడు.
25:13ఇంకా యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి స్తంభాలను, పీటలను, యెహోవా మందిరంలో ఉన్న ఇత్తడి సరస్సును, కల్దీయులు ముక్కలుగా కొట్టి, ఆ ఇత్తడిని బబులోను పట్టణానికి తీసుకెళ్ళిపోయారు.
25:14సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకారణాలన్నీ వారు తీసుకుపోయారు.
25:15అగ్నిపాత్రలు, గిన్నెలు, మొదలైన వెండి వస్తువులనూ, బంగారు వస్తువులనూ నెబూజరదాను తీసుకెళ్ళిపోయారు.
25:16ఇంకా అతడు యెహోవా మందిరానికి సొలొమోను చేయించిన రెండు స్తంభాలనూ, సముద్రాన్నీ, పీటలనూ తీసుకెళ్లిపోయాడు. ఈ ఇత్తడి వస్తువుల ఎత్తు లెక్కకు మించి ఉంది.
25:17ఒక్కొక స్తంభం ఎత్తు 18 మూరలు. దాని పైపీట ఇత్తడిది, పైపీట ఎత్తు మూడు మూరలు. ఇంకా ఆ పైపీట చుట్టూ ఉన్న అల్లికలూ, దానిమ్మ పళ్ళూ ఇత్తడివి. రెండో స్తంభం కూడా మొదటి దాని లాంటిదే.
25:18నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.
25:19ఇంకా, సైన్యం మీద అధికారిగా ఉన్న వాణ్ణి, పట్టణంలో ఇంకా ఉంటూ రాజుకు సలహాలు ఇచ్చే ఐదుగురినీ, అతడు పట్టుకున్నాడు. రాజు అధికారుల్లో సైన్యాన్ని నియమించే అధికారినీ, ఆ పట్టణంలో ఉన్న ప్రముఖులైన 60 మందినీ బందీలుగా పట్టుకున్నాడు.
25:20నెబూజరదాను వీళ్ళను రిబ్లా పట్టణంలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తెచ్చాడు.
25:21బబులోను రాజు హమాతు దేశంలో ఉన్న రిబ్లా పట్టణంలో వాళ్ళను చంపించాడు. ఈ విధంగా శత్రువులు యూదా వాళ్ళను వారి దేశంలోనుంచి తీసుకెళ్ళిపోయారు.