Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే › సౌలు, దావీదు

రాజులు మరియు దినవృత్తాంతాలు పక్కపక్కనే · సౌలు, దావీదు

దావీదుకు యెహోవా వాగ్దానం

2 సమూ 7:1–17 · 1 దిన 17:1–15

2 సమూయేలు

2 సమూ 7:1–17

1యెహోవా దావీదుకు నాలుగు దిక్కులా అతని శత్రువుల మీద విజయాలు అనుగ్రహించి, నెమ్మది కలుగజేసిన తరువాత అతడు తన పట్టణంలో నివాసమున్నాడు. దావీదు నాతాను అనే ప్రవక్తను పిలిపించి,

2“నేను దేవదారు చెక్కలతో కట్టిన పట్టణంలో నివసిస్తున్నాను. అయితే దేవుని మందసం గుడారంలో ఉంటున్నది” అన్నాడు.

3అప్పుడు నాతాను “యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి” అన్నాడు.

4అయితే ఆ రాత్రి యెహోవా స్వరం నాతానుకు ఇలా వినిపించింది,

5“నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా?

6ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను బయటకు రప్పించినప్పటి నుండి నేటి వరకూ మందిరంలో నివసించకుండా డేరాలో, గుడారంలో నివసిస్తూ సంచరించాను.

7ఇశ్రాయేలీయులతో కలసి నేను సంచరించిన కాలమంతా నా ప్రజలను సంరక్షించమని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రా నాయకుల్లో ఎవ్వరితోనైనా దేవదారు కలపతో నాకొక మందిరం కట్టించలేకపోయారే అని ఎవ్వరితోనైనా అన్నానా?

8కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నీకు చెబుతున్నదేమిటంటే, గొర్రెల మందలు కాచుకొంటూ గొర్రెలశాల్లో ఉంటున్న నిన్ను నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై రాజుగా నియమించాను.

9నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను.

10నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఎక్కడికీ కదలనక్కర లేకుండ తమ సొంత స్థలాల్లో శాశ్వతంగా వాటిల్లో నివసించేలా వారిని స్థిరపరిచాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై గతంలో నేను న్యాయాధిపతులను నియమించిన కాలంలో జరిగినట్టు దుష్టులైన ప్రజలు ఇకపై వారిని కష్టపెట్టకుండా ఉండేలా చేసి,

11నీ శత్రువులపై నీకు విజయమిచ్చి నీకు నెమ్మది కలిగేలా చేశాను. యెహోవానైన నేను నీకు చెబుతున్నదేమిటంటే, నేను నీకు సంతానం అనుగ్రహిస్తాను వారు శాశ్వతంగా పాలన చేస్తారు.

12నువ్వు బతికే రోజులు ముగిసినప్పుడు నిన్ను నీ పితరులతో కలిపి పాతిపెట్టిన తరువాత నీకు జన్మించిన నీ సంతానాన్ని ఘనపరచి, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను.

13అతడు నా పేరును ఘనపరిచేలా ఒక మందిరం నిర్మిస్తాడు. అతని సింహాసనాన్ని నేను నిత్యమైనదిగా స్థిరపరుస్తాను.

14అతనికి తండ్రిలా ఉండి కాపాడుకుంటాను. అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. అతడు తప్పు చేస్తే మనుషుల దండంతో, వారిని కొట్టే దెబ్బలతో అతణ్ణి శిక్షిస్తాను.

15అంతే గాని నిన్ను రాజుగా చేయడానికి నేను తోసిపుచ్చిన సౌలుకు నా కనికరం దూరం చేసినట్టు అతనికి నా కనికరాన్ని దూరం చేయను.

16నీకైతే నీ సంతానం, నీ రాజ్యం కలకాలం స్థిరంగా ఉంటుంది. నీ సింహాసనం అన్నివేళలా స్థిరంగా ఉంటుంది.”

17తనకు కలిగిన దర్శనంలోని ఈ మాటలన్నిటినీ నాతాను దావీదుకు తెలియజేశాడు.

1 దినవృత్తాంతాలు

1 దిన 17:1–15

1దావీదు తన ఇంటికి వెళ్లి సేదదీరిన తరువాత ప్రవక్త అయిన నాతానును పిలిపించి అతనితో “నేను దేవదారుకలపతో కట్టిన భవనంలో నివసిస్తున్నాను. కాని, యెహోవా నిబంధన మందసం మాత్రం ఒక గుడారంలో ఉంది” అని చెప్పాడు.

2అప్పుడు నాతాను “దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నదంతా చెయ్యి” అని దావీదుతో అన్నాడు.

3ఆ రాత్రి దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఇలా అన్నాడు,

4“నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు. యెహోవా చెప్పేదేమంటే, నా నివాసం కోసం ఒక ఆలయాన్ని నువ్వు కట్టించకూడదు.

5ఇశ్రాయేలీయులను రప్పించిన రోజు నుంచి ఈ రోజు వరకూ నేను ఒక ఇంట్లో నివాసం చెయ్యకుండా, డేరాలో, ప్రత్యక్ష గుడారంలో నివాసం చేశాను.

6నేను ఇశ్రాయేలీయులందరి మధ్యలో సంచారం చేసిన కాలంలో, మీరు నాకోసం దేవదారు మానులతో ఆలయం ఎందుకు కట్టలేదు? అని నా ప్రజలను కాయడానికి నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల్లో ఎవరితోనైనా నేను ఒక్క మాటైనా అన్నానా?

7కాబట్టి నువ్వు నా సేవకుడైన దావీదుతో ఏం చెప్పాలంటే, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఇలా చెబుతున్నాడు, గొర్రెల వెంట తిరుగుతున్న నిన్ను గొర్రెల మంద నుంచి తీసుకు, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా చేశాను.

8నువ్వు వెళ్లిన ప్రతిచోటా నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవాళ్ళను నీ ముందు నిలవకుండా నిర్మూలం చేశాను. లోకంలో ఘనులకు ఉన్న పేరులాంటి పేరు నీకు ఉండేలా చేస్తాను.

9ఇంకా నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం ఒక స్థలం ఏర్పాటు చేసి, వాళ్ళను అక్కడ నాటుతాను. వాళ్ళు ఇంక తిరుగులాడకుండా తమ స్థానంలో కాపురం ఉంటారు. పూర్వం జరిగినట్టూ, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలం మొదలుకుని జరుగుతూ వచ్చినట్టూ, దుష్టులు వాళ్ళను ఇక బాధ పెట్టరు.

10నీ పగవాళ్ళందరినీ నేను అణచివేస్తాను. అంతమాత్రమే కాదు, యెహోవానైన నేను నీ తరువాత నీ సంతానమే పరిపాలిస్తుందని నీకు తెలియజేశాను.

11నీ జీవితకాలం ముగిసి నీ పూర్వీకుల దగ్గరికి నువ్వు చేరే సమయానికి, నీ తరువాత నీ కొడుకుల వల్ల కలిగే నీ సంతానాన్ని లేపుతాను. వాళ్ళల్లో ఒకరి ద్వారా నేను రాజ్య స్థాపనచేసి అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను.

12అతడు నాకు ఒక మందిరం కట్టిస్తాడు. అతని సింహాసనాన్ని నేను శాశ్వతమైనదిగా చేస్తాను.

13నేను అతనికి తండ్రిగా ఉంటాను. అతడు నాకు కొడుకుగా ఉంటాడు. నీ మీద పరిపాలించిన సౌలు దగ్గరనుండి తీసి వేసినట్టుగా అతని దగ్గరనుండి నా నిబంధన విశ్వాస్యత తీసివేయను.

14నా మందిరంలో, నా రాజ్యంలో, నేను నిత్యం అతన్ని స్థిరపరుస్తాను, అతని సింహాసనం ఎన్నటికీ స్థిరంగా ఉంటుంది అని అతనికి తెలియచెయ్యి.”

15నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు