Bible Explorer యాప్ పొందండి

అన్వేషించండి › సువార్తలు పక్కపక్కనే › గలిలయలో

సువార్తలు పక్కపక్కనే · గలిలయలో

యేసు తుఫానును నిమ్మళింపజేస్తాడు

మత్తయి 8:23–27 · మార్కు 4:35–41 · లూకా 8:22–25

మత్తయి

మత్తయి 8:23–27

23ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.

24అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.

25శిష్యులు ఆయనను నిద్ర లేపి, “ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి” అంటూ కేకలు వేశారు.

26యేసు వారితో, “అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుతున్నారు?” అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.

27శిష్యులు ఆశ్చర్యపడి, “ఈయన ఎలాంటివాడో! గాలీ సముద్రం ఈయన మాట వింటున్నాయే” అని చెప్పుకున్నారు.

మార్కు

మార్కు 4:35–41

35ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో, “సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి” అన్నాడు.

36శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మరి కొన్ని పడవలు కూడా వారివెంట వచ్చాయి.

37అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపేశాయి.

38పడవ వెనుక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకా! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అన్నారు.

39ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

40అప్పుడాయన శిష్యులతో, “మీరెందుకు భయపడుతున్నారు? మీలో ఇంకా విశ్వాసం కలగలేదా?” అని అన్నాడు.

41వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

లూకా

లూకా 8:22–25

22మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, “సరస్సు అవతలి వైపుకు వెళ్దాం” అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు.

23వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.

24కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.

25అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.

గుర్తించబడినవి: మీరు చదివే అనువాదంలో ప్రతి వృత్తాంతంలో ఉన్న పదాలు. అత్యంత తరచుగా వచ్చే పదాలు (“మరియు”, “అతడు”) గుర్తించబడవు; వేరే రూపంలోని పదం గుర్తించబడకపోవచ్చు.

మూలాలు: OpenBible.info, CC BY 4.0 · ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు · © 2017, 2019 Bridge Connectivity Solutions, CC BY-SA 4.0; changed: footnotes, headings, the editors' parts and stage directions in the Song of Songs and the letters over Psalm 119 left out, verses in the app's numbering. · మూలాలు మరియు హక్కులు